ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

శరణార్థులకు సాయంలోనూ రాజకీయాలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ నుండి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు పౌరసత్వం కల్పంచడం భారత ప్రభుత్వం బాధ్యత. ఈ మూడు దేశాల్లో ముస్లిమేతరులు దశాబ్దాల తరబడి హింస, మతమార్పిడులు, అత్యాచారాలతో అష్టకష్టాల పాలవుతున్నారు. వీరిని అక్కున చేర్చుకోవలసిన బాధ్యత భారత దేశంపైనే ఉంది. మూడు ముస్లిం దేశాల నుండి అధికారికంగా, అనధికారికంగా వలస వచ్చిన వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రతిపాదించిన 1955 పౌరసత్వ చట్టం సవరణ బిల్లును సమర్థించవలసిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉంది. పౌరసత్వ చట్టం సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమంటూ కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం వెనక రాజకీయ ప్రయోజనం దాగి ఉంది. ముస్లింలు, ఇతర మైనారిటీల ఓట్లను దండుకునేందుకు కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని ప్రతిపక్షాలు పౌరసత్వ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మన దేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులకు భారతీయ పౌరసత్వం కల్పించవలసిన అవసరం ఉంది.
రెండు వేల సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే మూడు దేశాలలోని ముస్లిమేతరులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారికి భారతీయ పౌరసత్వం కల్పించవలసిన అవసరం స్పష్టంగా అర్థం అవుతుంది. అఫ్ఘానిస్తాన్ విషయం పరిశీలిస్తే అలెగ్జాండర్ భారత దేశంపై దండయాత్రకు బయలుదేరినప్పుడు ఆయన అఫ్ఘానిస్తాన్ మీదుగానే ఇక్కడికి వచ్చాడు. అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో అఫ్ఘానిస్తాన్ భారత్‌లో అంతర్భాగం. అలెగ్జాండర్ మొదట అఫ్ఘానిస్తాన్‌ను వశపరుచుకుని, అటు నుండి జీలం నది వరకు వచ్చాడు. అంటే అలెగ్జాండర్ దండయాత్ర జరిగినప్పటి నుంచే అఫ్ఘాన్‌లో మతమార్పిడులు ప్రారంభమయ్యాయి. అలెగ్జాండర్ తరువాత గ్రెకో-బాకీటరియన్లు, చంద్రగుప్త వౌర్యుడు, కుషానులు, కాబుల్ షాహీలు, సఫ్ఫరిడ్ వర్గం, సమనిడులు, గజనీలు, ఘోరీలు, తైమూరులు, మొఘల్, హోటకి వర్గం, దుర్రానీలు అఫ్ఘాన్‌ను పాలించారు. వీరి పాలనలో స్థానిక హిందువులు, బౌద్ధులు, సిక్కులు బలవంతపు మతమార్పిడులకు గురయ్యారు. ముస్లిం పాలకులు తొలుత హిందువులు, బౌద్ధులను ఆ తరువాత సిక్కులను బలవంతంగా మతమార్పిడికి గురి చేశారు. ఇంత జరిగినా కొందరు హిందువులు,బౌద్ధులు, సిక్కులు తమ మతాన్ని మార్చుకోకుండా ఎదురొడ్డి నిలిచారు. తాలిబన్ అధినాయకుడు ముల్లా మహమ్మద్ ఓమర్ 2001 మార్చ్‌లో అఫ్ఘానిస్తాన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బామ్యాన్ బౌద్ధ విగ్రహాలను శతఘు్నలతో పేల్చివేయించటం తెలిసిందే. పెద్ద పెద్ద కొండల్లో తొలిచిన ఎత్తయిన బౌద్ధ విగ్రహాల చరిత్ర పరిశీలిస్తే అఫ్ఘాన్‌లో బౌద్ధం ఏ స్థాయిలో వ్యాపించి ఉందో అర్థం అవుతుంది. ముస్లిం దండయాత్రికుల మూలంగానే ఒకప్పుడు హిందువులు, బౌద్ధులకు చెందిన అఫ్ఘాన్ ఆ తరువాత ముస్లిం దేశంగా మారింది. అరబ్బుల మూలంగా ‘నహావంద్’ యుద్ధం తరువాత అ ఫ్ఘానిస్తాన్ పూర్తి స్థాయి లో ముస్లిం దేశంగా మారిపోయింది. అప్పటి నుండి అక్కడ మిగిలిపోయిన హిందువులు, బౌ ద్ధులు, జైనులు, పార్సీ లు, సిక్కులు మతపరమైన చిత్రహింసలకు గు రవుతూనే ఉన్నారు.
1947లో దేశ విభజనకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతాలు భారత దేశంలోని అంతర్భాగాలు. మొదట అలెగ్జాండర్ ఆ తరువాత అరబ్బులు, మొఘలు లు, తురుష్కుల దండయాత్రలో ఈ ప్రాంతాలలోని హిందువులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర మతాల వారు బలవంతపు మతమార్పిడులకు లోనయ్యారు. పాకిస్తాన్ అంటే ‘పవిత్ర ప్రాంతం’ అని అర్థం. అయితే దీని అసలు అర్థం పంజాబ్‌లోని పి, అఫ్ఘానిస్తాన్‌లోని ఆ, కశ్మీర్‌లోని క, సింధ్‌లోని స, బలుచిస్తాన్‌లోని స్థాన్ పదంతో ‘పాకిస్తాన్’ పేరును ఖరారు చేశారు. క్రీస్తు తరువాత 711 వరకు కూడా- ప్రస్తుతం పాకిస్తాన్ అని పిలువబడే ప్రాంతంలో హిందూ రాజుల పాలన ఉండేది. 711 సంవత్సరంలో అరబ్ దండయాత్రికుడు మహమ్మద్ బిన్ ఖాసిం సింధ్ ప్రాంతంపై దాడి చేసి స్వాధీనం చేసుకున్పప్పటి నుండి ఇక్కడ ఇస్లాం మతం అమలు కావటం ప్రారంభమైంది. క్రీస్తు శకం 642 నుండి 1219 మధ్య కాలంలో ఇస్లాం కు చెందిన సూఫీ మిషనరీలు స్థానిక హిందూ,బౌద్ధులను ముస్లింలుగా మతమార్పిడి చేయటంలో ప్రధాన పాత్ర నిర్వహించారు. గజనీ సామ్రాజ్యం (975-1187), ఘోరిడ్ సామ్రాజ్యం, ఆ తరువాత ఢిల్లీ సుల్తానులు (1206-1526)వరకు జరిపిన పాలనలో పాకిస్తాన్‌తోపాటు భారత దేశంలోని పలువురు ఇస్లాం మతం పుచ్చుకున్నారు.
దేశ విభజన అనంతరం పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో మతమార్పిడి చేసుకోకుండా మిగిలిపోయిన హిందువులు, బౌ ద్ధులు మతపరమైన హింస కు గురవుతూనే ఉన్నారు. దేశ విభజనకు ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల లో హిందువులు, బౌ ద్ధులు, సిక్కులు, ఇతర ముస్లిమేతరుల సంఖ్య పదిహేను నుండి ఇరవై ఐదు శాతంగా ఉంది. 1998 జనాభా లెక్కల ప్రకారం పాకిస్తాన్‌లో ప్రస్తుతం ఉన్న హిందువుల జనాభా 1.85 శాతం మాత్రమే. బంగ్లాదేశ్ ప్రస్తుత జనాభా 163 మిలియన్లు కాగా ఇందులో హిందువుల జనాభా కేవలం 17 మిలియన్లు, బౌద్ధుల జనాభా కేవలం లక్షా అరవై వేలు, క్రైస్తవుల జనాభా యాభై వేలు మాత్రమే. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌ల్లో ప్రస్తుతం హిందువులు, బౌద్ధులు, సిక్కుల పరిస్థితి అత్యంత దయనీయం. వందలు వేల సంవత్సరాల నుండి మతపరమైన హింస, వేధింపులకు గురవుతున్న ఈ మూడు దేశాలకు చెందిన హిందువులు, బౌద్ధులు, సిక్కులు, ఇతర ముస్లిమేతరులకు మోదీ ప్రభుత్వం భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ముందుకు వస్తే తప్పెలా అవుతుంది? వేల సంవత్సరాల నుండి తమ మతం, సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటున్న వీరిలో కొందరు బాధలు పడలేక భారత దేశానికి వస్తే వారికి పౌరసత్వం కల్పించకుండా ఎంత కాలం వారిని కాందిశీకులుగా ఉంచుతాము? భారత దేశం కూడా వీరికి ఆశ్రయం కల్పించకపోతే ఎవరు కల్పిస్తారు? వీరికి భారత దేశం తప్ప మరో దిక్కులేదు. ఎన్నో ఏళ్ల నుండి మతపరమైన వివక్షకు, వేధింపులకు గురవుతున్న వీరిని స్వాగతించటం ‘ఘర్ వాపసీ’ (సొంత ఇంటికి పునరాగమనం) అంటూ విపక్షాలు ఆరోపణలు కురిపించటం ఎంత వరకు సమంజసం?
బంగ్లాదేశ్‌లో దాదాపు తొంబయి శాతం మంది ప్రజలు ముస్లింలే అయినా వారి మాతృ భాష బెంగాలీ. వారికి ఉర్దూ భాష రానేరాదు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంత ప్రజలు పంజాబీ మాత్రమే మాట్లాడుతారు, సింధ్ ప్రాంత ప్రజలు సింధీ భాషలో మాట్లాడితే, బలుచిస్తాన్ ప్రజలు బలూచీతోపాటు పుశ్తో,బ్రాహు భాషలు మాట్లాడతారు తప్ప ఉర్దూ వారి మాతృభాష ఎంత మాత్రం కాదు. అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని మెజారిటీ ప్రజలు ఒకప్పుడు హిందూ, బౌద్ధ మతాలకు చెందిన వారే. అరబ్‌లు, తురుష్కులు, మంగోలుల దండయాత్రల మూలంగా వారు మతమార్పిడికి గురయ్యారు. ఈ బలవంతపు మతమార్పిడిని ఎదుర్కొని నిలబడిన వారిప్పుడు భారత దేశం వచ్చి స్థిరపడేందుకు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేసే అధికారం ఏ రాజకీయ పార్టీకి లేదు. మన దేశంలోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న మత రాజకీయాన్ని నిశితంగా గమనిస్తున్నారు. వీరు కాంగ్రెస్ తదితర పార్టీలకు ఇప్పటికే ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. పౌరసత్వ చట్టం సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకమని ప్రచారం చేసి, పబ్బం గడుపుకునేందుకు ఎవరు ప్రయత్నించినా దుష్ఫలితాలను ఎదుర్కొనకతప్పదు.
పౌరసత్వ చట్టం సవరణ బిల్లు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్న ముస్లింలతోపాటు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. హిందువులు, బౌద్ధులు తదితర ముస్లిమేతరుల చారిత్రాత్మిక కష్టాలను తీర్చేందుకు ప్రయత్నిస్తున్న మోదీ ప్రభుత్వం ముస్లింలు, ఇతరులకు ఇబ్బందులు ఏదురుకాకుండా చూడాలి. ముస్లింలు కూడా అపోహలను పెంచుకునే బదులు వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని మసులుకోవటం మంచిది. *

-కె.కైలాష్ 98115 73262