ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విశాల దృక్పథం లేకే సమావేశాలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రజల ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై ఎటువంటి చర్చ లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. దీనికి ప్రతిపక్షంతోపాటు అధికార పక్షం కూడా సిగ్గుపడవలసిందే. ఇరుపక్షాలు అవలంబించిన మొండి వైఖరి మూలంగానే శీతాకాల సమావేశాలు ప్రజలకు సంబంధించిన ఎలాంటి అంశంపై చర్చ జరపకుండానే వాయిదా పడ్డాయి. దేశంలోని నల్లధనం, అవినీతిని తుడిచిపెట్టాలనే చిత్తశుద్ధితో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ విశాల హృదయాన్ని ప్రదర్శించి ఉంటే శీతాకాల సమావేశాలు కొంత వరకైనా సజావుగా జరిగేవి. బాధ్యతారాహిత్యం విషయంలో అధికార, ప్రతిపక్షాలు దొందు దొందే అనే విధంగా వ్యవహరించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరువు, ప్రతిష్టను మంటగలిపాయి. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న పెద్ద నోట్ల రద్దు గురించి, ముఖ్యంగా సామాన్య జనం పడుతున్న అష్టకష్టాల గురించి ఈ శీతాకాల సమావేశాల్లో చర్చించకపోవటం క్షమించరాని నేరం. పెద్ద నోట్ల రద్దు వలన ఉన్నత వర్గాల వారు ఏ మాత్రం కష్టపడ్డారో చెప్పలేము. కానీ సగటు మనిషి, బడుగు బతుకులు బజారు పాలయ్యాయి. ఆయా వర్గాలకు చెందిన వారు వంద రూపాయల కోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాయవలసి వచ్చింది. అలా క్యూల్లో రోజుల తరబడి నిలబడి నీరిసించిపోయి దేశం మొత్తంమీద వంద కంటే ఎక్కువ మంది ప్రాణాలు వదిలారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్ద నోట్ల రద్దు మూలంగా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. సగటు మనిషి డబ్బు లభించక నానాయాతనలు పడుతుంటే బాడా బాబులు అక్రమ పద్ధతుల్లో లక్షలు, కోట్లలో కొత్త నోట్లను తన్నుకుపోయారు. ఇంత జరుగుతున్నా అధికార, ప్రతిపక్షాలు తమ మొండి వైఖరికి ప్రాధాన్యత ఇచ్చాయి తప్ప సగటు మనిషి కష్టాల గురించి చర్చించలేకపోవటం ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృష్టం. చర్చ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అహంకారాన్ని త్యజించకలేకపోవటం ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది. నవంబర్ 18 తేదీ నుండి డిసెంబర్ 16 తేదీ వరకు అధికార, ప్రతిపక్షాలు రాజకీయ దోబూచులాటలాడాయి తప్ప సగటు మనిషి పడుతున్న కష్టాలపై దృష్టి సారించేందుకు ముందుకు రాకపోవటం క్షమించరాని నేరం. అధికార, ప్రతిపక్షాలు చేసిన ఈ నేరానికి ప్రజలు సరైన సమయంలో తమదైన పద్ధతిలో తప్పకుండా శిక్ష విధిస్తారు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేందుకు ప్రతిపక్షం కంటే అధికార పక్షం ఎక్కువ బాధ్యత వహించవలసి ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు సజావుగా కొనసాగేలా చూడటం అధికార పక్షం నైతిక బాధ్యత. ప్రభుత్వం తప్పొప్పులు ప్రజల దృష్టికి తీసుకురావటం ప్రతిపక్షం ప్రధాన బాధ్యత. అందుకోసం ప్రతిపక్షం కొన్ని సందర్భాలలో లోకసభ, రాజ్యసభను స్తంభింపజేస్తూంటాయి. తమ నిరసన తెలిపేందుకు పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇస్తూంటాయి. ప్రతిపక్షానికి నచ్చజెప్పటం, ఒప్పించటం లేదా బుజ్జగించటం ద్వారా పార్లమెంటు సమావేశాలను సజావుగా జరిపించుకోవలసిన బాధ్యత అధికార పక్షంపై ఉంటుంది. శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలను స్తంభింపజేసేందుకు ప్రతిపక్షంతో అధికార పక్షం పోటీ పడినట్లు వ్యవహరించడం సిగ్గు చేటు. నల్లధనం, అవినీతిని అదుపు చేయటంతోపాటు సీమాంతర ఉగ్రవాదాన్ని దెబ్బ తీసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్ద నోట్లను రద్దు చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ప్రశ్నించటం ప్రతిపక్షం ప్రాథమిక అధికారం. అందుకే పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షం ప్రస్తావించింది. పెద్ద నోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి వాటి పరిష్కారానికి మార్గాలను వెతికేందుకు ఈ అంశాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించింది. ప్రతిపక్షం పెద్దనోట్ల రద్దు అంశాన్ని ఉభయ సభల్లో ప్రస్తావించటం వెనక ఉన్న ఉద్దేశ్యాన్ని అనుమానించేందుకు వీలు లేదు. ప్రజల సమస్యలను ప్రశ్నించటం ప్రతిపక్షం హక్కు, అధికారం. ప్రతిపక్షం తన విద్యుక్త ధర్మాని నిర్వహించినట్లే అధికార పక్షం కూడా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తే శీతాకాల సమావేశాలు సజావుగా జరిగిపోయేవి. ప్రతిపక్షం రాజ్యసభలో వాయిదా తీర్మానం కింద పెద్ద నోట్ల రద్దుకు నోటీసు ఇవ్వటం, ప్రభుత్వం అంగీకరించటంతో అక్కడ చర్చ మొదటి రోజే ప్రారంభమైంది. లోకసభలో కూడా వాయిదా తీర్మానం కింద చర్చకు ప్రభుత్వం అంగీకరించి ఉంటే ఉభయ సభల్లో గొడవ జరిగేదే కాదు. రాజ్యసభలో వాయిదా తీర్మానం కింద చర్చకు అంగీకరించిన ప్రభుత్వం లోకసభలో వాయిదా తీర్మానం కింద చర్చ జరిపేందుకు ఒప్పుకోకపోవటం పెద్ద తప్పు. ఉభయ సభల్లో వాయిదా తీర్మానం కింద పెద్ద నోట్లపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం అంగీకరించి ఉంటే శీతాకాల సమావేశాలు సజావుగా జరిగిపోయేవి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించినా శీతాకాల సమావేశాలు సజావుగా జరిగిపోయేవి. పెద్ద నోట్లను రద్దు చేయటం మామూలు విషయం కాదు. నరేంద్ర మోదీ ఎంతో ధైర్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పకతప్పదు. దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసే నిర్ణయం తీసుకున్న మోదీ దీనిపై పార్లమెంటు ఉభయ సభల్లో మొదటి రోజే ఒక ప్రకటన చేస్తే సరిపోయేది. నవంబర్ పదిహేడో తేదీనాడు ఉభయ సభల్లో తనంత తాను పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి ఒక ప్రకటన చేయటంతోపాటు ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ఏర్పాట్ల గురించి పార్లమెంటు ద్వారా దేశ ప్రజలకు తెలియజేస్తే బాగుండేది. ప్రధాన మంత్రి పెద్ద నోట్ల రద్దుపై ఉభయ సభల్లో ప్రకటన చేసి ఉంటే ప్రతిపక్షం కూడా వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుపట్టేది కాదు. ప్రధాని ప్రకటనపై స్పందించటం ద్వారా ప్రతిపక్షం తమ అభిప్రాయాలను వెల్లడించేందుకు వీలుండేది.
ప్రధానమంత్రి ప్రకటన వలన వాయిదా తీర్మానంపై చర్చ అనే ప్రస్తావన వచ్చేది కాదు. ప్రధాన మంత్రి సభలో ఉంటేనే చర్చ జరుపుతామని భీష్మించుకునే పరిస్థితి ఎదురయ్యేది కాదు. నరేంద్ర మోదీ పార్లమెంటును ఆశించిన స్థాయిలో గౌరవించలేదనే అభిప్రాయం కలుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు. పార్లమెంటు లోపల పెద్ద నోట్లపై ఒక్క ప్రకటన కూడా చేయని నరేంద్ర మోదీ వెలుపల మాత్రం పలు ప్రకటనలు చేశారు. సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, అంశాలపై పార్లమెంటు వెలుపల ప్రకటనలు చేయటం సమర్థనీయం కాదు. నరేంద్ర మోదీ పెద్ద నోట్ల రద్దు అంశంపై పార్లమెంటు వెలుపల ప్రకటనలు చేయటంతోపాటు ప్రతిపక్షంపై ఆరోపణలు గుప్పించారు. ప్రతిపక్షంతో మొదటి నుండి ఘర్షణ విధానాన్ని అవలంబిచారు తప్ప కలుపుకుపోయే పద్ధతిని మోదీ పాటించలేదు. శీతాకాల సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోవటానికి ఆయన అవలంబించిన ఘర్షణ విధానం కూడా ఒక కారణం. ప్రతిపక్షం పెద్దనోట్ల రద్దుకు మద్దతు ఇవ్వకుండా అవినీతిపరులకు అండగా నిలుస్తోందంటూ మోదీ చేసిన ఆరోపణ అధికార, ప్రతిపక్షాల మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఒక వైపు ప్రతిపక్షాన్ని నిందిస్తూ మరో వైపు చర్చ జరిపేందుకు ముందుకు రావాలంటూ అధికారపక్షం రాజకీయం చేయటం కూడా శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకుపోవడానికి కారణమైంది.

కె. కైలాష్