ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మొండి వ్యతిరేకతతో విపక్షం సాధించేదేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించేందుకు ప్రధాని మో దీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని విపక్షాలు మొండిగా వ్యతిరేకించడం సబబు కాదు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం తమ బాధ్యత అన్నట్టుగా విపక్షాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయి. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు నవంబర్ 8న ప్రధాని ప్రకటించినపుడు స్వాగతించిన ప్రతిపక్షాలు ఆ తర్వాత అందుకు భిన్నంగా నిరసన వ్యక్తం చేయడం విడ్డూరం. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. మోదీ నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించకపోయినా ఇది విఫలం కావాలని వామపక్షాలు కోరుకుంటున్నాయి.
కాంగ్రెస్ పార్టీ మొదట మోదీ నిర్ణయాన్ని సమర్థించినా తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకుంది. పలు ప్రాం తీయ పార్టీలు నోట్లరద్దును ఏ రోజు కూడా హృదయ పూర్వకంగా సమర్థించలేదు. జె.డి (యు) పార్టీ నేత, బిహార్ సిఎం నితీష్ కుమార్ మాత్రమే ఈ నిర్ణయాన్ని బహిరంగంగా బలపరిచారు. మోదీ తన నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, సగటు మనిషి ఇబ్బందులకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కాంగ్రెస్, తృణమూల్, సమాజ్‌వాదీ, ఆర్.జె.డి, వామపక్షాలు పెద్దనోట్ల రద్దును బాహాటంగా విమర్శిస్తున్నాయి. ఈ నిర్ణయం మంచిదే కానీ, దీన్ని అమలు చేస్తున్న విధానం సవ్యంగా లేదంటూ ప్రభుత్వంపై బురద చల్లుతున్నాయి. ‘నల్ల ధనాన్ని, అవినీతిని అరికట్టేందుకు పెద్దనోట్లను రద్దు చేయలేదు, ఇది ఆర్థిక దోపిడీ మాత్రమే. ప్రజల డబ్బును బ్యాంకుల్లో బంధించిన మోదీ ప్రభుత్వం దేశంలోని యాభై పెద్ద పారిశ్రామిక కుటుంబాలకు లాభం చేకూర్చిన’ట్టు విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజం ఎంత? అన్నది నిర్ధారించడం కష్టం. దేశంలో యాభై పెద్ద పారిశ్రామిక సంస్థలు కాంగ్రెస్ హయాంలోనే బాగా అభివృద్ది చెందాయనేది పచ్చి నిజం. ఓ బడా పారిశ్రామిక కుటుంబానికి, కాంగ్రెస్ అధినాయకత్వానికి ఉన్న అవినాభావ సంబంధం గురించి అందరికీ తెలిసిందే. యుపిఎ సర్కారు హయాంలోనే ఆ పారిశ్రామిక కుటుంబం కోట్లకు పడగెత్తిందనే వాస్తవాన్ని మిగతా విపక్ష పార్టీలు ఖండించడం లేదు. కాంగ్రెస్ పాలనలో ఎనె్నన్నో అక్రమాలు, స్కాములు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇక, పెద్దనోట్ల రద్దు తరువాత పాత నోట్లను మార్చుకునేందుకు భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇం దులో పలువురు పారిశ్రామికవేత్తలు, అధికారులు,బ్రోకర్లతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల అధికారులు, సి బ్బంది పాలు పంచుకున్నారు. తమిళనాడులో ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి అవినీతి బాగోతం ఇందుకు తాజా ఉదాహరణ. అదే రాష్ట్రానికి చెందిన టి.టి.డి సభ్యుడు, ఢిల్లీకి చెందిన న్యాయవాది, కోల్‌కతకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తదితర ఘరానా వ్యక్తుల అరెస్టులతో వెలుగులోకి వచ్చిన ‘నోట్ల మార్పిడి’ వివరాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. తమిళనాడుకు చెందిన ఒక వ్యాపారి ఇంట్లో వందల కోట్ల పాత, కొత్త నగదు, కిలోల కొద్దీ బంగారం, ఇతర అక్రమ ఆస్తులు బయటపడడం చూస్తుంటే- బ్యాంకు అధికారులు ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారనేది స్పష్టం అవుతోంది. పలువురు బ్యాంకు మేనేజర్లు ప్రజలకు పంపిణీ చేయవలసిన కొత్తనోట్లను బడా వ్యాపారవేత్తలకు, ఉన్నతాధికారులకు మళ్లించటం మన వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి కుళ్లుకు అద్దం పడుతోంది.
రిజర్వు బ్యాంకు అధికారులు సైతం అవినీతికి పాల్పడటం చూస్తుంటే మన అధికార యంత్రాంగం ఏ స్థాయిలో దిగజారిపోయిందనేది తె లుస్తోంది. విజయవాడలో ఒక ఐ.పి.ఎస్ అధికారి తన అక్రమ సంపాదనను కొత్తనోట్లుగా మార్చుకునేందుకు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవటం చూ స్తుంటే అధికార యం త్రాంగం నైతికత ఏ పాటిదనేది స్పష్టమవుతోంది. సీనియర్ పోలీసు అధికారులు సైతం ఇలా బరితెగించి అక్రమాలకు పాల్పడితే ఇక సమాజాన్ని రక్షించేది ఎవరు? అత్యున్నతమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న వ్యక్తి అవినీతిపరులతో చేతులు కలిపితే ఏ సమాజమైనా బాగుపడుతుందా? ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఇ.డి), కేంద్ర నేర పరిశోధన సంస్థ (సిబిఐ), ఇతర గూఢచార విభాగాలు జరుపుతున్న దాడుల్లో బైట పడుతున్న పాత, కొత్త నగదు, బంగారం కడ్డీలు గుట్టలుగా పేరుకున్న అవినీతికి సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. అవినీతిని, నల్లధనాన్ని ఈరోజు కాకపోతే రేపైనా అరికట్టటక తప్పదు. ఈ పరిస్థితి ఇంకా ఇలాగే కొనసాగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా కుప్పకూలుతుంది. ఈ కారణంగానైనా మోదీ నిర్ణయానికి విపక్షాలు మద్దతు పలుకుతూ విపక్షాలు తమ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉంది. దీన్ని గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల ప్రతిపక్షాలకు కొత్తగా వచ్చే బలం ఏదీ ఉండకపోయినా, దేశానికి మాత్రం తీరని నష్టం వాటిల్లుతుంది.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఆచరణలో విఫలమైతే బి.జె.పికి, మోదీకి రాజకీయంగా నష్టం కలగవచ్చు. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దిగజారిపోతుంది. ప్రజలు కూడా తాత్కాలిక ఇబ్బందులను మరచిపోయి ఇందుకు సహకరించాలి. అయితే, ఈ నిర్ణయం వల్ల మొత్తం పేరు ప్రతిష్ఠలన్నీ తనకే దక్కాలని ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడంలో ప్రతిపక్షం కృషి కూడా ఉన్నదనే మాట రావటం మంచిది. పెద్దనోట్ల రద్దుతోనే మోదీ తన సంస్కరణలను నిలిపి వేస్తారని అనుకోవడానికి వీలులేదు. బినామీ ఆస్తుల జప్తు, అక్రమ బంగారం పట్టివేత వంటి చర్యలకు ఆయన ఇక ఉపక్రమిస్తారు. పన్నుల విధానంలో కూడా పెనుమార్పులు చేయవచ్చు. దేశాన్ని పరిశుభ్రం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రతిపక్షం కూడా విధిగా భాగస్వామ్యం కావాలి. అందుకే పెద్దనోట్ల రద్దును మొండిగా వ్యతిరేకించకుండా ఆచరణ యోగ్యమైన సూచనలు, సలహాలు ఇవ్వటం ద్వారా తాము కూడా జనం వైపు ఉన్నామని విపక్షాలు నిరూపించుకోవాల్సిన తరుణం ఇది.
*

కె. కైలాష్