ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కొత్తతరం నేతలకు తప్పని ఇంటిపోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వారసత్వ రాజకీయాలకు ప్రతీకలుగా ఉంటూనే, ఆ రంగంలో తమదైన ముద్ర వేసుకునేందుకు తపన పడుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా జాతీయ స్థాయిలో రాహుల్ తన స్థానాన్ని పదిలం చేసుకొనేందుకు యత్నిస్తుండగా, సమాజ్‌వాదీ పార్టీలో ప్రాబల్యం పెంచుకునేందుకు అఖిలేష్ తన తండ్రిపైనే సమరం ప్రకటించారు. అయితే- ఈ కొత్తతరం నాయకులకు వారి పార్టీల్లోనే వ్యతిరేకత ఎదురవుతోంది. రాహుల్ ఓవైపు తన పార్టీలో అంతర్గతంగా పోరాడుతూనే మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మోదీపై రాహుల్ చేసిన ఆరోపణలు, ప్రస్తావించిన అంశాలు ఆయన రాజకీయ ‘పరిపక్వత’కు అద్దం పట్టాయి. ‘రాహుల్ మాట్లాడటం నేర్చుకున్నాడ’ని సాక్షాత్తూ నరేంద్ర మోదీతో అనిపించుకునే స్థాయికి కాంగ్రెస్ యువనేత ఎదిగిపోయారు. పెద్దనోట్ల రద్దుపైనే కాదు, దేశానికి సంబంధించిన అనేక అంశాలపై రాహుల్ అనుసరిస్తున్న తీరుతెన్నులపై చాలామంది కాంగ్రెస్ నాయకులకే అభ్యంతరాలున్నాయి. అయితే, మోదీని ఎదుర్కొంటున్న తీరు తమ యువనేతకు కలసివస్తుందని కాంగ్రెస్ నాయకులు అంచనాల్లో మునిగి తేలుతున్నారు.
కొంతకాలం క్రితం వరకూ రాజకీయాలకు రాహుల్ పనికిరాడని తీసిపారేసిన వారే ఇప్పుడు ఆయనను ప్రశంసించకతప్పటం లేదు. కాగా, పార్టీని నడిపించేందుకు రాహుల్ అనుసరిస్తున్న వ్యూహం, విధానం మాత్రం కాంగ్రెస్ నేతలకు ఎంత మాత్రం నచ్చటం లేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో పార్టీకి దూరంగా ఉండవలసి రావటంతో ఆ శిబిరంలో ఇపుడు రాహుల్ సర్వస్వంగా మారిపోయారు. సీనియర్లను పక్కన పెట్టి తన విశ్వాసపాత్రులతో పార్టీని నడిపిస్తున్నారు. పార్టీ వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు ఆయనే స్వయంగా నిర్వహిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు రాహుల్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
సీనియర్లకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా కొత్తతరానికి చెందిన రాహుల్‌కు నాయకత్వ బదిలీ సునాయసంగానే జరిగిపోతుంటే యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు నాయకత్వాన్ని అప్పగించేందుకు అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ విముఖత చూపించటంతో సమాజ్‌వాదీ రాజకీయం బజారున పడింది. సమాజ్‌వాదీ పార్టీలో ఆధిపత్యం కోసం తండ్రి, కొడుకుల మధ్య నెలకొన్న విభేదాలు రెండు తరాల మధ్య పోరాటంగా రూపుదాల్చింది. ఇక్కడ పాతతరంపై యువతరం నిరసన జెండాను ఎగురవేసింది. ములాయం , ఆయన సోదరుడు శివపాల్ ఇంకా పార్టీలో అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండేందుకు బదులు కొత్తతరం ప్రతినిధి అయిన అఖిలేష్ నాయకత్వాన్ని ఆమోదించటం ఉత్తమం. దేశం మారుతోంది, పరిస్థితులు మారుతున్నాయి, వీటికి అనుగుణంగా పాతతరం నాయకులు కూడా మారవలసిన అవసరం ఉన్నది. ములాయం , శివపాల్ యాదవ్‌లు సమాజ్‌వాదీలో ఆధిపత్యం కోసం గింజుకోవటం మానివేసి రాజకీయ సన్యాసం తీసుకోవటం మంచిది. యాదవ్ సోదరులు ఇంకా ‘పహిల్వాన్ రాజకీయాల’కు మొగ్గు చూపుతున్నారు. ప్రజలను భయపెట్టి ఓట్లు వేయించుకోవటం, అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనను గాలికి వదిలేసి, పాలనను తమ అనుచరవర్గం ఇష్టారాజ్యానికి వదిలివేయటం ములాయం రాజకీయాలకు మచ్చుతునక. ములాయం సోదరుల రాజకీయాల ఫలితంగా ఉత్తర ప్రదేశ్‌లో పాలనావ్యవస్థ నానాటికీ దిగజారిపోతోంది. అందుకే యుపిని చాలామంది ‘ఉల్టా ప్రదేశ్’ (తలకిందులుగా వ్యవహరించే రాష్ట్రం) అని అవహేళన చేస్తుంటారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ రాష్ట్రం ఇలా భ్రష్టుపట్టటానికి యాదవ్ సోదరుల ‘పహిల్వాన్’ మార్కు రాజకీయాలే కారణం.
ఉత్తర ప్రదేశ్‌లో అభివృద్ధి అంతంత మాత్రమే, శాంతిభద్రతలు మచ్చుకు కూడా కనిపించవు. హత్యలు, మానభంగాలకు రాష్ట్రంలో కొదవ లేదు. కుల రాజకీయం ఇక్కడ పరాకాష్ఠకు చేరుకున్నది. అఖిలేష్ యాదవ్ కొంతలోకొంత అర్థవంతమైన రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తుంటే ములాయం సోదరులు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన పహిల్వాన్ రాజకీయాలు చేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం అఖిలేష్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి పార్టీలో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉన్నది. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అఖిలేష్ కొత్తతరహా రాజకీయాలకు నాంది పలికితే ములాయం, శివపాల్ యాదవ్‌లు పాత విధానాలను వీడకపోగా వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు. ఇరుపక్షాల మధ్య ఐదు సంవత్సరాల నుండి కొనసాగుతున్న పోరు మూలంగా ఉత్తర ప్రదేశ్‌కు తీరని నష్టం వాటిల్లింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవటం, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచార వ్యూహం తదితర అన్ని అంశాలపై తండ్రి,కొడుకుల మధ్య యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకోవాలన్న అఖిలేష్ ప్రతిపాదనను ములాయం కొట్టిపారేశారు. అభ్యర్థుల ఎంపికపై వివాదం మూలంగా అఖిలేష్‌ను ఆరు సంవత్సరాల పాటు పార్టీ నుండి బహిష్కరించిన ములాయం- ఇరవై నాలుగు గంటలు గడవకముందే తన నిర్ణయాన్ని మార్చుకొనకతప్పలేదు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పుడు అఖిలేష్‌ను ముఖ్యమంత్రిగా నియమించి రాజకీయ పరిపక్వతను చాటుకున్న ములాయం ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందుకు భిన్నంగా వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
సోనియా గాంధీ ఇటీవలి కాలంలో పార్టీ అధిపత్యాన్ని రాహుల్‌కు అప్పగించి తాను దాదాపుగా తప్పుకున్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్‌లో కూడా కొందరు పాతతరం నాయకులు రాహుల్ నాయకత్వాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, వారు తమ నిరసనను బహిరంగంగా వ్యక్తం చేసేందుకు సాహసించడం లేదు. అంతర్గతంగా పాత, కొత్తతరాల మధ్య కాంగ్రెస్‌లోనూ పోరాటం కొనసాగుతోంది. పాతతరం నాయకులకు సోనియా మద్దతు లభించటం లేదుకాబట్టే వారేమీ చేయలేకపోతున్నారు. సమాజ్‌వాదీ పార్టీలో స్వయంగా ములాయం పాతతరానికి మద్దతు ఇవ్వటంతో ఆధిపత్య పోరాటం బజారున పడింది. మెజారిటీ శాసన సభ్యుల బలంతో పార్టీ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకుని రాజకీయ చతురతను చాటుకున్న అఖిలేష్‌ను ఎదుర్కొనటం యాదవ సోదరులకు సాధ్యం కాకపోవచ్చు.
*

కె. కైలాష్