ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీకి ‘అయదు రాష్ట్రాల’ అగ్నిపరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవినీతిని, నల్లధనాన్ని అంతం చేసేందుకే పెద్దనోట్లను రద్దు చేశానంటున్న ప్రధాని మోదీకి త్వరలో అయిదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు నిజంగా అగ్నిపరీక్షే. సంచలన విధానాలు, కీలక నిర్ణయాలతో దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేస్తానంటున్న ప్రధానికి ఐదు రాష్ట్రాల ప్రజలు మద్దతు ఇస్తారా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని కుదిపేసిన నేపథ్యంలో జరుగుతున్న ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించకపోతే ఆ పార్టీ ప్రతిష్టతో పాటు మోదీ పరువుకు భంగం కలుగుతుంది. మిగతా నాలుగు రాష్ట్రాల కన్నా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మోదీకి, బిజెపికి జీవన్మరణ సమస్య అని చెప్పక తప్పదు. యుపిలో ‘కమల దళాని’కి ఓటమి ఎదురైతే మోదీ పెత్తనాన్ని ప్రశ్నించేందుకు ఇతరులకు అవకాశం కలిగిస్తుంది. మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తరువాత శాసనసభలకు ఎన్నికలు జరగటం ఇది మూడోసారి. మొదటి సారి మహారాష్ట్ర సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించగా బిజెపి విజయం సాధించింది. రెండోసారి దిల్లీ, బిహార్ శాసనసభలకు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు మూడో విడత అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించడంతో మోదీ ఎంతో సాహసోపేతంగా పెద్దనోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి మోదీ దేశంలో అవినీతి, నల్లధనం నిర్మూలిస్తానని, విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తానని శపథం చేశారు. అవినీతి, బాధ్యతారాహిత్యం, అలసత్వం వంటి అవలక్షణాలను నిర్మూలించేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకోకతప్పదని ఆయన సంకేతాలిచ్చారు. దేశాన్ని సరైన మార్గంలో పెట్టేంత వరకు నిద్రపోనంటూ ఆయన ప్రజలకు ఎన్నో ఆశలు కలిగించారు. ఆయన మాటలపై ప్రజల్లో నమ్మకం కుదరడంతో 2014 అక్టోబర్‌లో మహారాష్ట్ర, ఝార్ఖండ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బిజెపి, దాని మిత్రపక్షాలు ఘన విజయం సాధించాయి. ఇది జరిగిన కొన్నాళ్లకే 2015లో బిహార్, దిల్లీ శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో బిజెపిని విజయలక్ష్మి వరించలేదు.
ఒకప్పుడు బిహార్‌లో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్‌కుమార్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోదీని విభేదించారు. మోదీని ప్రధాని అభ్యర్థిగా బిజెపి ప్రకటించడాన్ని నిరసిస్తూ 2015 ఎన్నికల్లో నితీష్ కుమార్ ఆర్‌జెడి తదితర పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ‘మహాకూటమి’ని ఏర్పాటు చేయడం ద్వారా బిహార్‌లో మోదీ ప్రభంజనానికి నితీష్ అడ్డుకట్ట వేసి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అలాగే, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనుకున్న బిజెపికి ఘోర పరాజయం ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో క్రమశిక్షణను అమలు చేసేందుకు మోదీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టటం వల్లనే దిల్లీ ఎన్నికల్లో రాజధాని ఓటర్లు బిజెపిని ఓడించారు.ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా కార్యాలయాలకు చేరుకోవాలంటూ మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన బయోమెట్రిక్ విధానాన్ని ఉద్యోగులు గట్టిగా వ్యతిరేంచినందుకే దిల్లీ ఎన్నికల్లో బిజెపి పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. గత లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని మొత్తం ఏడు సీట్లనూ బిజెపి గెలుచుకుని ప్రత్యర్థులను మట్టి కరిపించింది. మోదీ పట్ల కలిగిన విశ్వాసం మూలంగానే దేశ రాజధానిలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలో బిజెపి అభ్యర్థులు విజయ పతాకాన్ని ఎగుర వేశారు. అదే ఓటర్లు 2015లో ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఏకపక్షంగా అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించి బిజెపిని ఓడించారు. బయోమెట్రిక్ వ్యవస్థను ప్రవేశ పెట్టినందుకు నిరసనగానే ఉద్యోగవర్గాలు బిజెపి పట్ల ఇలా వ్యతిరేకతను వ్యక్తం చేశాయి.
ఇక, పెద్దనోట్ల రద్దు మూలంగా అష్టకష్టాలు పడిన ప్రజలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయరనే గ్యారంటీ ఏదీ లేదు. నల్లధనాన్ని అదుపుచేసేందుకు తాను తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని మోదీ చెబుతున్నారు. నగదు కోసం బ్యాంకుల వద్ద, ఎటిఎంల ముందు గంటల తరబడి పడిగాపులు పడినప్పటికీ ప్రజలు ఎంతో సహనం పాటించారని, తమ ప్రభుత్వం పట్ల ఎలాంటి కోపాన్ని ప్రదర్శించలేదని ఆయన వాదిస్తున్నారు. పేదల సంక్షేమం కోసమే పెద్దనోట్లను రద్దు చేశానని, దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే కుదుటపడుతుందని ఆయన అంటున్నారు. మోదీ చెబుతున్నట్లు పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తే గనుక- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించాలి. పెద్దనోట్లను రద్దు చేసే ముందు నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు ఆయన కొన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అందుకే 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయకతప్పలేదు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశాన్ని ఆమూలాగ్రం కదిలించి వేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజల జీవితాలు పెద్దఎత్తున ప్రభావితం అయ్యాయి. నగదు కోసం నానాపాట్లు పడిన వీరంతా మద్దతు ఇస్తేనే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మోదీ పరువునిలుస్తుంది.
మరోవైపు నోట్లరద్దును అతి పెద్ద కుంభకోణంగా చిత్రీకరించేందుకు ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రయత్నించాయి. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యవహరించినపుడు మోదీ సహారా,బిర్లా గ్రూపుల నుండి భారీగా ముడుపులు పుచ్చుకున్నారంటూ మమత తీవ్రస్థాయిలో ఆరోపించారు. బిఎస్‌పి అధినేత్రి, యుపి మాజీ సిఎం మాయావతితోపాటు వామపక్షాలు కూడా పెద్దనోట్ల రద్దును తప్పుపట్టాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ హవా తగ్గితే విపక్షాల విమర్శలకు బలం చేకూరినట్టే.
*

కె. కైలాష్