ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విమర్శలతో ఎదిగిపోలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అనునిత్యం విమర్శించటం ద్వారా రాజకీయంగా ఎదిగిపోగలుగుతామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన రాజకీయ సలహాదారులు భావిస్తే పప్పులో కాలేసినట్లే. ప్రత్యర్థులను విమర్శించటం, ఆరోపణలను కురిపించటం ద్వారా ఎవ్వరూ ఎదిగిపోలేరు. ఇంతకాలం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెనక ఉంటూ అమ్మచాటు పిల్లవాడిగా వ్యవహరించిన రాహుల్ గాంధీ ఇటీవల మాటలు బాగా నేర్చుకున్నారు. మొన్నటి వరకు రాసుకున్నది చదవి అందరితో ‘పప్పు’ అని పిలిపించుకున్న రాహుల్ గాంధీ రెండు, మూడు వారాల నుండి అనర్గళంగా (ఎక్స్‌టెంపోర్) మాట్లాడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. మాటలు నేర్చిన రాహుల్ గాంధీ తన సత్తానంతా నరేంద్ర మోదీపై చూపిస్తున్నారు. ఆయన అవకాశం లభించిన ప్రతిసారి నరేంద్ర మోదీపై ఆరోపణలు చేస్తు, విమర్శలు గుప్పిస్తూ వ్యంగ్య బాణాలు సంధించేందుకు ఎంతమాత్రం వెనకాడటం లేదు. గత వారం ఢిల్లీలోని టాల్కటోరా స్టేడియంలో పెద్దనోట్ల రద్దు మూలంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ గతవారం ఏర్పాటు చేసిన సంవేదనా సదస్సులో నరేంద్ర మోదీపై మరోసారి రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ప్రతి రోజు యోగా చేస్తానని చెప్పుకునే మోదీకి పద్మాసనం వేయటం రాదంటూ వ్యంగ వ్యాఖ్య చేశారు. మోదీ అంతు చూసేంత వరకు నిద్రపోననే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. పాత ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని రాహుల్ గాంధీ తూర్పారపట్టారు. మొదట్లో పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ ఇది అమలు జరుగుతున్న తీరు బాగా లేదని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అకస్మాత్తుగా తమ విధానాన్ని మార్చుకున్నది. పెద్ద నోట్లను రద్దు చేయటం పెద్ద కుంభకోణం, ఇది అర్థం పర్థం లేని నిర్ణయం, ఈ నిర్ణయం వలన దేశం పదహారు సంవత్సరాలు వెనకబడిపోయిందంటూ ఆయన ఆరోపణలు కురిపిస్తున్నారు. నరేంద్ర మోదీని విమర్శించే సర్వాధికారాలు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ఉన్నాయి. అయితే ఆరోపణలు, విమర్శలు అర్థవంతంగా ఉండాలి తప్ప విమర్శ కోసం విమర్శ, ఆరోపణ కోసం ఆరోపణ చేయటం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తికి ఎంతమాత్రం తగదు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు ప్రజాప్రయోజనం కోసం జరగాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. నరేంద్ర మోదీది సూటు,బూటు ప్రభుత్వం అంటూ వ్యంగ్య బాణాలు విసిరినప్పుడు రాహుల్ గాంధీని అందరు సమర్థించారు. అప్పుడా విమర్శ ప్రజలకు సహేతుకం అనిపించింది. యిప్పుడు నరేంద్ర మోదీకి పద్మాసనం వేయటం రాదన్న రాహుల్ గాంధీ విమర్శలు కొంత వెగటుగా ఉన్నాయి. నరేంద్ర మోదీని ఆయినదానికి, కాని దానికి విమర్శించటం ద్వారా ఆయనకు వ్యక్తిగతంగా బాధ కలిగించాలనే విధంగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతోంది. ప్రధాన మంత్రి, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించటంతోపాటు తప్పొప్పులను ఎత్తి చూపించటం ప్రతిపక్షం ప్రధాన బాధ్యత. రాహుల్ గాంధీ దీనికి కట్టుబడి వ్యవహరించినంత కాలం ఆయన రాజకీయంగా ఎదుగుతారు. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన రోజు రాజకీయంగా దిగజారిపోతారు. నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా విమర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీ ఎదిగిపోలేరు. ప్రధాన మంత్రి ప్రతి నిర్ణయాన్ని విమర్శించినంత మాత్రాన రాహుల్ గాంధీతోపాటు కాంగ్రెస్‌కు రాజకీయంగా కలిసి వస్తుందనుకోవటం అవివేకం అవుతుంది. వారం, పది రోజుల పాటు విదేశాల్లో ఉల్లాసంగా గడిపివచ్చిన రాహుల్ గాంధీ పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంటుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టసుఖాల గురించి వాకబు చేసిన తరువాత పెద్ద నోట్ల రద్దును విమర్శిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ విదేశాల్లో విహార యాత్రకు వెళ్లి వచ్చి విమర్శిస్తే నవ్వుల పాలవుతారనేది గ్రహించటం మంచిది. రాజకీయంగా ఎదగాలంటే ప్రజలకు తన నాయకత్వం, ఆలోచనా విధానం, విధానాలు, వ్యూహాల పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించవలసి ఉంటుంది. రాహుల్ గాంధీని బలపరిస్తే దేశం బాగుపడుతుంది, తమ జీవితాలు బాగు పడతాయనే విశ్వాసం ప్రజలకు కలిగించగలగాలి. నరేంద్ర మోదీ 2014 లోకసభ ఎన్నికలకు ముందు దేశ ప్రజలకు ఈ విశ్వాసం కలిగించారు కాబట్టే వారు భారీ మెజారిటీతో గెలిపించారు. 2019 లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోదీని ఓడించాలంటే ఆయన తన ఐదు సంవత్సరాల పాలనలో విఫలమయ్యారనేది సాక్ష్యాలతో నిరూపించగలిగితేనే ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి గెలిపిస్తారు. రాహుల్ గాంధీ ప్రజలకు విశ్వాసం కలిగించలేకపోతే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సహారా సంస్థలు, బిర్లా సంస్థల నుండి ముడుపులు అందుకున్నారని రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపించారు. నరేంద్ర మోదీ వ్యక్తిగత అవినీతికి సంబంధించిన సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయన్నారు, తాను నోరు విప్పితే భూకంపం వస్తుందంటూ పెద్ద ఎత్తున హడావుడి చేసిన రాహుల్ గాంధీ చివరకు తుస్సుమనిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ అసెంబ్లీలో చేసిన ఆరోపణలను రాహుల్ గాంధీ ఏకరువు పెట్టారు తప్ప కొత్త విషయాలను వెల్లడించలేకపోయారు. నరేంద్ర మోదీకి సహారా, బిర్లా సంస్థల నుండి ముడుపులు ముట్టాయంటూ అడ్వకేట్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మోదీపై భూషణ్ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు ఒక వైపుకొట్టివేస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ అవే అరోపణలను మోదీపై మరోసారి చేయటం విచిత్రం. మోదీపై విచారణకు ఆదేశించవలసిన అవసరం లేదని అత్యున్నత న్యాయ స్థానం తీర్పు ఇస్తుంటే రాహుల్ గాంధీ ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం ద్వారా తన విశ్వసనీయతను కోల్పోయారు. ఒక ఆరోపణను పదే,పదే చేస్తూ పోవటం వలన ప్రజలు దానిని విశ్వసిస్తారనుకోవటం రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోంది. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ శాసన సభలకు జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటనేది అందరికి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుంటే తప్ప కాంగ్రెస్‌కు రాజకీయ మనుగడ లేదు. పంజాబ్‌లో పి.సి.సి అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్‌దే రాజ్యం. ఇక ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది. రాహుల్ గాంధీ నిజంగానే రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే మొదట ఈ ఐదు రాష్ట్రాలల్లో కాంగ్రెస్ పరిస్థితిని మెరుగుపరచటంపై దృష్టి సారించాలి. దీని కోసం రాజకీయ పరిణితితో వ్యవహరించి లక్ష్యాన్ని సాధించగలిగాలి. తన స్వశక్తితో పార్టీని గెలిపించగలిగితేనే రాహుల్ గాంధీ రాజకీయంగా ఎదుగుతారు. తన స్వశక్తితో బి.జె.పిని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన నరేంద్ర మోదీ అంతకు ముందు గుజరాత్‌లోమూడు సార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించటం ద్వారా తన సత్తాను చాటుకున్నారు. అలాంటి నాయకుడిని విమర్శించే స్థాయికి మొదటి ఎదగవలసి రాజకీయ అవసరం, అగత్యం రాహుల్ గాంధీకి ఉన్నది. ప్రజల విశ్వాసాన్ని చూరగొని రాజకీయంగా ఎదగకుండా నరేంద్రమోదీని విమర్శించటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే రాహుల్ గాంధీ ఎన్నటికి ఎదగలేరు.

కె. కైలాష్