ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అవినీతి.. ఆపై ఎదురుదాడి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల అక్రమాలకు భరతవాక్యం పలికితే తప్ప దేశంలో విలయ తాం డవం చేస్తున్న అవినీతిని అదుపు చేయటం సాధ్యం కాదు. రాజకీయ నాయకులకు అధికారులు తోడు కావటంతో అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. నేటి పాలనావ్యవస్థలో ‘కంచే చేను మేస్తున్న దృశ్యాలు’ అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఆర్‌జెడి పార్టీ అధ్యక్షుడు, బిహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తన పదవిని కాపాడుకునేందుకు శాసనసభ్యులను కొనుగోలు చేయటం వంటి ఉదంతాలు రాజకీయ అవినీతికి పరాకాష్ఠగా నిలిచాయి. ఈ రెండు సంఘటనలను పరిశీలిస్తే మన రాజకీయ వ్యవస్థ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడుతోందనేది స్పష్టం అవుతోంది. అధికారంలో ఉండే నాయకులు తాము ఏం చేసినా- బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామంటూ గొంతు చించుకుని ప్రకటిస్తుంటారు. వాస్తవానికి వీరు తమ కోసం, తమ కుటుంబ సభ్యుల కోసం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు.
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన భారతీయ రైల్వేను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేశానని చెప్పుకున్న అప్పటి రైల్వేశాఖా మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సొంత లాభం కోసం రైల్వే శాఖ ఆస్తులను అడ్డగోలుగా విక్రయించారనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్న విషయం. పశుగ్రాసం కుంభకోణం కేసులో ఇప్పటికే ‘శ్రీకృష్ణ జన్మస్థానాని’కి వెళ్లివచ్చిన ఆర్‌జెడి అధినేత లాలూ మరోసారి ఊచలు లెక్కపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన రైల్వే మంత్రిగా వ్యవహరించినపుడు దేశంలోనే కాదు, విదేశాల్లో సైతం పేరు ప్ర ఖ్యాతులు సాధించటం మనందరికీ గుర్తుండే ఉంటుంది. నష్టాల్లో చిక్కుకున్న భారతీయ రైల్వే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దటం ద్వారా లాలూ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ప్రశంసలు పొందటం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ పాఠశాల విద్యార్థులు ప్రత్యేకంగా దిల్లీకి వచ్చి లాలూ ప్రసాద్ యాదవ్‌తో సమావేశమై భారతీయ రైల్వేను ఆర్థిక సంక్షోభం నుండి రక్షించిన తీరును తెలుసుకోవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే, ఆయన రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ ఆస్తులను కైంకర్యం చేశారన్న విషయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.
లాలూతోపాటు ఆయన భార్య, మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి, కుమార్తె, కుమారుడు తేజస్వి యాదవ్ కూడా కుంభకోణంలో భాగస్వాములనేది స్పష్టమైంది. గత వారం దిల్లీ, పాట్నా, గుర్గావ్ తదితర ప్రాంతాల్లోని లాలూ ప్రసాద్, ఆయన బందువుల నివాసాలతోపాటు అప్పటి ఐ.ఆర్. టి.సి.టి అధ్యక్షుడు గుప్తా, రాజ్యసభ సభ్యుడు, లా లూ ఆప్తుడైన గుప్తా ఇళ్లపై ఏకకాలంలో సిబిఐ అధికారులు దాడులు చేశారు. సిబిఐ సోదాల్లో వెలుగులోకి వచ్చిన లాలూ ప్రసాద్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తనపై సిబిఐ కేసు పెట్టినందుకు సిగ్గు పడవలసిన లాలూ ప్రసాద్ ఎన్‌డిఏ ప్రభుత్వంపై ప్రత్యారోపణలు చేయటం సమంజసం కాదు. సిబిఐ ఆరోపణలకు జవాబు చెప్పకుండా ఆయన మొత్తం వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. పాట్నాలో అత్యంత విలువైన రైల్వే భూమిని ఆక్రమించడం, రాంచీ, పూరి పట్టణాల్లోని రైల్వే హోటళ్లను తన సన్నిహితులకు కేటాయించడం వంటి చర్యలకు పాల్పడిన లాలూ ఇపుడు సిబిఐ దాడులను రాజకీయం చేస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు ధోరణి చూపుతోందని ప్రత్యారోపణలు చేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎంత మాత్రం ఖాతరు చేయకుండా సమగ్ర దర్యాప్తు జరిపించి, లాలూ సహా ఆయన కుటుంబ సభ్యులను, అధికారులను కటకటాల వెనక్కి పంపించవలసిందే.
బిహార్‌లో మకుటం లేని మహారాజుగా వెలిగిన లాలూ ప్రసాద్ తన స్వార్థం కోసం లౌకికవాదం, సమ సమాజ స్థాపన, సామాజిక న్యాయం వంటి నినాదాలను దుర్వినియోగం చేశారు. తన అవినీతి బాగోతం బయటకు వచ్చిన ప్రతిసారీ- ‘బిజెపి మతతత్వానికి పాల్పడుతోంది, సామాజిక న్యాయాన్ని దెబ్బ తీస్తోంది..’ అంటూ తప్పుడు ఆరోపణలు చేయటం ఆయనకు పరిపాటిగా మారింది. ఇప్పుడు రైల్వే ఆస్తులను అక్రమంగా దొడ్డిదారిన సంపాదించుకున్న కేసులో కూడా లాలూ ఇదే ‘ఎదురుదాడి’ విధానాన్ని అవలంబిస్తున్నాడు. ఎన్‌డిఏ ప్రభుత్వం తనను వేధిస్తోందని ఆరోపించడం తప్ప తన తప్పులను ఒప్పుకోవటం లేదు. లౌకికవాదం, సామాజిక న్యాయం నినాదాలను తన కుటుంబానికి ఆస్తులను సంపాదించి పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్న లాలూ అవినీతి రాజకీయాలకు ఇక నూకలు చెల్లినట్లే. పశుగ్రాసం కేసులో జైలుకు పోయి, ఎన్నికల్లో పోటీకి అనర్హత సంపాదించుకున్న లాలూ ఏ మాత్రం ఆత్మ పరిశీలన చేసుకోకుండా తాను సచ్ఛీలుడినన్నట్లు మాట్లాడుతున్నారు. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు మరింత అవినీతికి పాల్పడటం అతడి ధనదాహానికి అద్దం పడుతోంది. ఈ కారణంగానైనా ఇపుడు బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఆర్‌జెడితో తెగతెంపులు చేసుకోవాలి. లాలూ కుమారులైన ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, ఆరోగ్య శాఖ మంత్రి తేజ ప్రసాద్ యాదవ్‌లను వెంటనే బిహార్ మంత్రివర్గం నుండి తొలగించాలి. సిబిఐ దాడులు చేసిన తరువాత కూడా వీరిని మంత్రివర్గంలో కొనసాగించటం ప్రజాస్వామ్యానికే అవమానం. లాలూ లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని సమర్థించే వామపక్షాలు, కాంగ్రెస్, యుపిఏ మిత్రపక్షాలు ఆయన అవినీతిని ఇంతవరకూ ఖండించకపోవటం సిగ్గు చేటు. వామపక్షాలు,కాంగ్రెస్, యుపిఏ మిత్రపక్షాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రజాస్వామ్యం పట్ల, నైతిక విలువల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా లాలూను తప్పు పట్టాలి. నితీష్‌కుమార్ వౌనం వహించే బదులు తన భాగస్వామ్య పార్టీకి అధినాయకుడైన లాలూ ప్రసాద్ తప్పిదాలను ఎత్తి చూపించటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. అధికారం కోసం అవినీతిని వెనకేసుకు రావటం అవినీతికి పాల్పడటంతో సమానమనే వాస్తవాన్ని నితీష్‌కుమార్, వామపక్షాలు గుర్తించటం మంచిది. సామాజిక న్యాయం కోసం ఉద్యమించడమే తన ప్రథమ కర్తవ్యమని చెప్పుకునే లాలూ ప్రసాద్ తన కుటుంబ సభ్యుల కోసం పవిత్ర నినాదాలను దుర్వినియోగం చేయటం ద్వారా దేశంలోని సగటు మనిషికి ద్రో హం చేశాడని చెప్పకతప్పదు.
లాలూ ప్రసాద్ అవినీతి బాగోతం ఇలా ఉంటే, తమిళనాడులో అన్నా డిఎంకె చీలిక వర్గాలు అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని నడిబజారున పెట్టి అమ్మేసుకుంటున్నాయి. శశికళ సమర్థించిన ముఖ్యమంత్రి పళని స్వామి తన కుర్చీని కాపాడుకునేందుకు ఒక్కొక్క శాసనసభ్యుడికి యాభై కోట్లు చెల్లించినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. పళనిస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానాన్ని ఓడించేందుకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం కూడా శాసనసభ్యులకు డబ్బు ఎర చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాల్లో ఏ మేరకు నిజం ఉన్నదనేది నిర్దారించవలసిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఎన్.డి.ఏ ప్రభుత్వంపై ఉన్నది. మన దేశంలో శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయటం పరిపాటిగా మారింది. మంచి ‘్ధర’ పలికితే తమను తాము అమ్ముకునేందుకు ప్రజాప్రతినిధులు ఇలా ‘క్యూ’ కడుతున్నందున ఘటనలతో ఇప్పటికే పలుమార్లు ప్రజాస్వామ్యం పరిహాసం పాలయ్యింది. ప్రజాప్రతినిధుల కొనుగోళ్లను వెలుగులోకి తెచ్చిన పలు ‘స్టింగ్ ఆపరేషన్ల’లో పలువురు ముఖ్యమంత్రుల బండారం బైట పడింది. అయితే, వీరిలో ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు శిక్ష పడకపోవటం కేవలం సిగ్గుచేటు కాదు, మన దేశంలో ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతికి నిదర్శనం అనాలి.
*

కె. కైలాష్