ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

యుద్ధానికి దిగితే చైనాకే నష్టం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్ సహా మిగిలిన ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు పెంచుకోకపోతే చైనాకే నష్టం వాటిల్లుతుంది. ‘డోక్‌లామ్’ గొడవ మూలంగా రెండు పెద్ద దేశాలైన భారత్, చైనాల మధ్య యుద్ధం అనివార్యం అయినపుడు- మన దేశం కంటే చైనాకే అధిక నష్టం కలుగుతుంది. దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల జనాభా ఉన్న భారత్, చైనాలు యుద్ధానికి దిగటం ఏ రకంగా చూసినా మంచిది కాదు. మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈమధ్య పార్లమెంటులో మాట్లాడుతూ, చైనాతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకునేందుకు యుద్ధం ఒక్కటే ఏకైక పరిష్కారం కాదు, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చునని సూచించటం శుభ సూచకం. రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికి చర్చలు ఒక్కటే మార్గమని ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. సిక్కిం సెక్టార్‌లోని డోక్‌లామ్ నుండి రెండు దేశాలు తమ తమ సైన్యాలను ఉపసంహరించుకుంటే ఉద్రిక్తత తగ్గిపోతుందని సుష్మా పార్లమెంటులో ప్రసంగిస్తూ సూచించటం తెలిసిందే.
రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్చలు తప్ప యుద్ధం మార్గం కాదని ఆమె ప్రకటించిన కొన్ని గంటలకే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్‌కతలోని చైనా కాన్సులేట్ జనరల్ మా ఝన్వు స్పందిస్తూ భారత, చైనాల పరస్పర ప్రయోజనాలతో పోలిస్తే- విభేదాలకు పెద్దగా ప్రాధాన్యత లేదన్నారు. ఆయన చేసిన ఈ ప్రకటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. డోక్‌లామ్ వివాదంపై గత నాలుగు వారాలుగా- ‘యుద్ధానికి రమ్మం’టూ రంకెలు వేసిన చైనా ఇప్పుడిలా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మా ఝున్వూ ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే చైనా పత్రికలు మరోసారి ‘పరిమిత యుద్ధం’ గురించి హెచ్చరికలు చేశాయి. డోక్‌లామ్‌లో తిష్ట వేసిన భారత సైనికులను తొలగించేందుకు చైనా సైన్యం రానున్న రెండు వారాల్లో పరిమిత యుద్ధం చేస్తుందని ఆ పత్రికలు జోస్యం చెప్పాయి. యుద్ధం తప్పదనే ప్రకటనలు చేస్తూ మనతో చైనా దోబూచులాడుతోంది. 1962 మాదిరిగా మనని తప్పుదారి పట్టించి తనకు అనుకూలంగా ఉండే సమయంలో చైనా పరిమిత యుద్ధం చేయవచ్చు. చైనా ప్రభుత్వం తన స్వాధీనంలో ఉన్న మూడు పత్రికల ద్వారా భారత దేశంపై ఎనలేని ఆరోపణలు చేయించింది, ‘మీ అంతు తేలుస్తామం’టూ బెదిరించింది, 1962లో తాము బుద్ధి చెప్పిన ఉదంతాన్ని మరచిపోరాదంటూ అవమానకరంగా మాట్లాడింది. తమ సైన్యం రంగంలోకి దిగితే భారత్‌కు పుట్టగతులుండవంటూ హీనంగా మాట్లాడింది. చైనా మూడు పత్రికల ద్వారా గత ఏడు వారాల నుండి మనను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. కానీ, కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం ఈ బెదిరింపులకు తిరిగి హెచ్చరికలు చేయకుండా దౌత్య మార్గంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించింది.
చైనా బెదిరింపులకు సౌమ్యమైన పద్ధతిలో, దౌత్యపరమైన భాషలో చర్చలకు ప్రాధాన్యత ఇవ్వటం మన బలహీనతకు నిదర్శనమా? మన ఔన్నత్యానికి ప్రతీకనా? అన్నది ఆలోచించవలసి ఉన్నది. గతంలో మాజీ రక్షణ మంత్రులు జార్జి ఫెర్నాండెజ్, ములాయం సింగ్ యాదవ్‌లు చెప్పినట్లు చైనా మనకు అనునిత్యం ప్రధాన శత్రువు. గతంలో మాదిరిగానే భవిష్యత్తులో కూడా మనకు చైనా నుండే పెను ప్రమాదం పొంచి ఉన్నది. చైనా పాలకులు ఇప్పుడు డోక్‌లామ్ వివాదానికి సైనిక పరమైన చర్య ద్వారా తెర దించేందుకు ప్రయత్నించటం లేదు. ‘లేస్తే మనిషిని కానం’టూ బెదిరిస్తున్నారే తప్ప ప్రతి దాడికి దిగటం లేదు. డోక్‌లామ్‌లో తిష్ట వేసిన భారత సైనికులను తొలగించేందుకు సైనికపరమైన చర్య తీసుకోకుండా అదను కోసం చైనా వేచి చూస్తోంది.
చైనా మనతో సాలీనా 60 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. మన దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. టెలికాం సెక్టార్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటంతోపాటు సెల్ ఫోన్ల ఎగుమతుల ద్వారా వేలాది కోట్లు సంపాదిస్తోంది. చైనా యుద్ధానికి దిగితే జపాన్, ఆస్ట్రేలియాతోపాటు ఆసియాన్ దేశాలు భారత్ పక్షాన నిలిచే అవకాశాలున్నాయి. దీనితోపాటు అమెరికా కూడా భారత దేశం వైపు మొగ్గు చూపుతుంది. యుద్ధం మూలంగా భారత్‌తోపాటు ఇతర దేశాలతో జరుపుతున్న వ్యాపారం కుంటు పడితే చైనా ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం వాటిల్లుతుంది. అసలే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న చైనా ఆర్థిక వ్యవస్థకు ఈ పరిణామం గొడ్డలి పెట్టు అవుతుంది. ఒకవైపు వ్యాపారం దెబ్బతినటం, మరో వైపు అంతర్జాతీయ స్థాయిలో తాను ఏకాకి కావటం చైనాకు నష్టదాయకం. చైనా ఇప్పటికే జపాన్ తదితర ఆసియా దేశాలతో దక్షిణ చైనా సముద్రం విషయంలో గొడవ పడుతోంది. మంగోలియాతో కూడా చైనాకు పెద్దగా సత్సంబంధాలు లేవు. పాకిస్తాన్ మినహా మరే ఇతర పొరుగుదేశంతో చైనాకు సత్సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో డోక్‌లామ్ వివాదంపై భారత దేశంతో యుద్ధానికి దిగితే చైనాకు నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండకపోవచ్చు. చైనా పాలకులు ఈ వాస్తవాలను గ్రహించారా? దేశాల మధ్య సరిహద్దు తగాదాలు ఉండటం అత్యంత సహజం. ఒక దేశం ఆలోచనా విధానం మరో దేశం ఆలోచనా విధానంతో ఏకీభవించకపోవచ్చు. విభేదాలు ఉన్నంత మాత్రాన పొరుగు దేశాలతో యుద్దం చేస్తామనటం ఉచితం కాదు. పొరుగుదేశాలను బెదిరించటం ఎంతమాత్రం సముచితం కాదు.
డోక్‌లామ్ టిబెట్ భూభాగమనేది అందరికీ తెలిసిందే. అయితే చైనా సైన్యం అంగుళం, అంగుళం చొప్పున కాజేసే వ్యూహంలో భాగంగా డోక్‌లామ్‌ను క్రమంగా తన అధీనంలోకి తెచ్చుకున్నది. అక్కడి నుంచి మరింత ముందుకు వెళ్లే ప్రయత్నంలో భాగంగానే రోడ్డు నిర్మాణం చేపట్టింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయితే అటు భూటాన్‌కు, ఇటు భారత దేశం భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. గతంలో టిబెట్‌ను ఆక్రమించుకున్నట్లే మొదట భూటాన్‌ను ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్, సిక్కింను ఆక్రమించటం చైనా వ్యూహం. చైనా తన వ్యాపార ప్రయోజనాల పరిరక్షణ కోసం ఇప్పుడు డోక్‌లామ్ వివాదంపై వెంటనే సైనిక పరంగా చర్య తీసుకోకపోయినా ముందు ముందు సైనిక చర్య ఉండదని ఎవరూ భావించకూడదు. చైనా తనకు అనుకూలంగా ఉండే సమయంలో భారత దేశంపై ఆకస్మికంగా దాడి చేస్తుంది. ఈ దాడిని తిప్పికొట్టేందుకు భారత దేశం తనను తాను సిద్ధం చేసుకోవాలి. కేవలం నీతి వ్యాఖ్యలతో చైనా దారికి వస్తుందనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. పాకిస్తాన్‌ను రెచ్చగొట్టటం ద్వారా మన దేశాన్ని నిర్వీర్యం చేసేందుకు చైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలు కార్యక్రమాలను కొనసాగిస్తోంది. ఆక్రమిత కాశ్మీర్ నుండి గదర్ నౌకాశ్రయం వరకు రోడ్డు నిర్మిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సింధు నదిపై రిజర్వాయర్లు నిర్మించటం ద్వారా మన ప్రయోజనాలను దెబ్బ కొట్టేందుకు ఎత్తులు వేస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో చైనా సైనికులు, పౌరులు అక్కడి పలు ప్రాజెక్టుల్లో పని చేస్తున్నారు. ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా సైనికులు శాశ్వత ప్రాతిపదికపై నివసించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చైనా పాలకులు పలు సందర్భాల్లో భారత దేశం ఉనికిని ప్రశ్నిస్తున్నారు. ‘మీరెంత? మీ బలమెంత?’ అంటూ చిన్నచూపు చూస్తున్నారు.
పాకిస్తాన్‌తోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, నేపాల్ తదితర పొరుగు దేశాలను తమ వైపు తిప్పుకోవటం ద్వారా భారత దేశాన్ని ఏకాకి చేసేందుకు చైనా నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భూటాన్‌ను మన నుండి దూరం చేసేందుకు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు. అదే గనుక జరిగితే అస్సాం తదితర ఈశాన్య రాష్ట్రాలను చైనా కబంధ హస్తాల నుంచి కాపాడుకునేందుకు మనం చాలా కష్టపడవలసి వస్తుంది. బంగ్లాదేశ్‌పై తమ పట్టుపెంచుకోవటం ద్వారా చైనా మనని దెబ్బ తీసేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. జలాంతర్గాములను విక్రయించే నెపంతో బంగ్లాదేశ్ నౌకాశ్రయాల్లో కాలు పెట్టేందుకు చైనా పావులు కదుపుతోంది. చైనా తన సైనిక, ఆర్థిక బలం ఆధారంగానే మనపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. సైనిక బలం ఆధారంగానే మనల్ని భయపెట్టేందుకు అనుక్షణం ప్రయత్నిస్తోంది.
చైనా బెదిరింపులను తిప్పికొట్టాలంటే మనం కూడా సైనికంగా మరింతగా ఎదగాలి. మనం దెబ్బకు దెబ్బ కొడితే సరిపోదు, దెబ్బకు రెండు దెబ్బలు కొట్టగలగాలి. అప్పుడే చైనా దారికి వస్తుంది. డోక్‌లామ్ గొడవలో చైనాను భారత్ సైనికులు నిలువరించటం ఒక రకంగా ధైర్యంతో కూడిన పని. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అభినందించాలి. 1962 యుద్ధం తరువాత డోక్‌లామ్‌లో మొదటిసారి భారత దేశం చైనాను ధైర్యంగా అడ్డుకున్నది. ఇది మొండి ధైర్యంతో కూడిన పని. అయితే ఇక మీదట మొండి ధైర్యంతో కాకుండా సైనిక వ్యూహంతో చైనాను నిలువరించే స్థాయికి ఎదగాలి. అప్పుడే చైనాను నిజంగా నియంత్రించవచ్చు. ఈ లక్ష్య సాధన కోసం యుద్ధ ప్రాతిపదికపై ఇప్పటి నుండి చర్యలు తీసుకోవాలి.
*

చిత్రం.. మోహరించిన చైనా సైనికులు

కె కైలాష్