ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘వ్రతం’ చెడ్డా ఫలితం దక్కని భాజపా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి గవర్నర్ పాలన మొదలైంది. పీడీపీ అధినేత్రి, ముఖ్యమంత్రి మెహబూ బా ముఫ్తీ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించుకోవటంతో గవర్నర్ పాలన అనివార్యమైంది. ఈ పరిణామాలకు పీడీపీని కంటే భాజపాను తప్పుపట్టవలసి ఉంటుంది. ముఫ్తీతో చేతులు కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ‘కమల దళం’ చేసిన అతిపెద్ద తప్పు. హిందూ మత పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పుకునే భాజపాపై ‘ముస్లిం వ్యతిరేక పార్టీ’ అనే ముద్ర ఉండడం అందరికీ తెలిసిందే. దేశంలోని ముస్లిం మైనారిటీలకు భాజపా అంటే గిట్టదనేది జగమెరిగిన సత్యం. భాజపా నేతలు, ముస్లిం సంఘాల నాయకులు ఎంత వాదించినా ఇది కాదనలేని వాస్తవం. భాజపా వల్ల తమకు ఎప్పటికైనా ప్రమాదం తప్పదని ముస్లిం మైనారిటీలు గట్టిగా విశ్వసిస్తారు.
మూడేళ్ల క్రితం జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ-్భజపా కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఎవరూ ఊహించని పరిణామం. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ అధినాయకత్వం ఏ లక్ష్యసాధన కోసం జమ్మూ కశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారనేది ఈ రోజుకూ అంతుపట్టని వ్యవహారం. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చారిత్రాక ఘనత అని భాజపా ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ గతంలో అభివర్ణించారు. ఇప్పుడు ఆయనే ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయామని వాపోతున్నారు. చారిత్రాత్మక తప్పిదాలు ఎప్పడూ ఆశించిన ఫలితాలను అందజేయవు. ఈ మూడేళ్లలో ఏం సాధించారనే ప్రశ్నకు భాజపా అధినాయకులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. వాస్తవానికి ఈ మూడేళ్లలో జమ్ములో భాజపా పట్టు కోల్పోయింది. పీడీపీతో చెలిమి చేసి ఏదో సాధించాలనుకున్న ఆ పార్టీకి చేదు అనుభవం మిగిలింది. పీడీపీ ఏకపక్షంగా వ్యవహరించడంతో జమ్ము, లద్దాక్‌లో హిందువులు, బౌద్ధులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం నిర్వాకంతో కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు, వారి మద్దతుదారులు బాగా లాభపడ్డారు. ఉగ్రవాదులు తమను తాము పటిష్టం చేసుకోవటంతోపాటు భద్రతాదళాల పాలిట ఏకు మేకై కూర్చున్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని మెహబూబా కేంద్ర ప్రభుత్వానికి సూచించారంటే శాంతిభద్రతల పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించవచ్చు. లోయ నుండి వేలాది మంది హందువులు, బౌద్ధులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస పోయారు. వీరికి కశ్మీర్‌లో పునరావాసం కల్పించేందుకు భాజపా చేసిన ప్రతి ప్రయత్నాన్ని మెహబూబా దెబ్బతీశారు. ఆమె పరోక్షంగా ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాద నాయకులతో చేతులు కలిపి హిందువులను కశ్మీర్‌లోకి తిరిగి రానీయకుండా అడ్డుకోవటంలో విజయం సాధించారు. భాజపా నాయకులు మాత్రం చేష్టలుడిగి చూస్తుండిపోయారు. సంకీర్ణ ప్రభుత్వం హయాంలో జమ్ములో హిందువులకు, లద్దాక్‌లో బౌద్ధులకు భద్రత లేకుండాపోయింది. ముఫ్తీ ప్రభుత్వం పథకం ప్రకారం కశ్మీర్ నుంచి ముస్లింలను జమ్ముకు తరలించింది. దీంతో జమ్ములో కూడా హిందూ, ముస్లింల నిష్పత్తిలో మార్పు వచ్చింది. ఈ పరిణామం హిందువులు, బౌద్ధులను దిక్కుతోచని పరిస్థితిలో పడవేసింది. దీనికి భాజపా నాయకత్వం పూర్తి బాధ్యత వహించక తప్పదు.
మూడు సంవత్సరాల సంకీర్ణ ప్రభుత్వం హయాంలో ఉగ్రవాదం మరింత పెరిగింది. ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులు ధైర్యంగా భద్రతా దళాలపై, స్థానిక పోలీసులపై ప్రత్యక్ష దాడికి దిగే స్థాయికి ఎదిగిపోయారు. సైనిక అధికారులపై కేసులు పెడుతుంటే భాజపా నాయకులు దిక్కుదోచని పరిస్థితిలో పడిపోయారు. మెహబూబాను తమ ఇష్టానుసారం ఆడించాలనుకున్న భాజపా నాయుకులను ఆమె తోలు బొమ్మలుగా చేసి ఆడించింది. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు చంపకుండా ఉండాల్సిందని మెహబూబా అనడంతో ఆమె ఎవరి పక్షం అనేది స్పష్టమైంది. భద్రతా దళాలపై రాళ్లు విసిరిన యువకులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఆమె చేసిన ప్రస్తావనను భాజపా ఒప్పుకోక తప్పలేదు. రంజాన్ మాసం సందర్భంగా భద్రతా దళాలు ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేసి, ఆమేరకు ప్రధాని మోదీని ఒప్పించింది. రంజాన్ మాసంలో ఎన్ని అకృత్యాలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఇస్లామిక్ ఉగ్రవాదులు రంజాన్ పండుగను కూడా ఖాతరు చేయకుండా భద్రతా దళాలపై దాడులు చేశారు. ఉగ్రవాద ముష్కరులను పాకిస్తాన్ మన దేశంలోకి పంపించి మారణ హోమం సృష్టించింది. ప్రముఖ పాత్రికేయుడు సుజాత్ బుఖారీని ఉగ్రవాదులు హత్య చేయటంతో సంకీర్ణ ప్రభుత్వానికి పాలనపై పట్టులేదని తేలిపోయింది.
కశ్మీర్‌లో తాననుకున్నదేదీ భాజపా ఏ విధంగానూ సాధించలేకపోయిది. ముఖ్యమంత్రి హోదాలో మెహబూబా తాననుకున్నదంతా నిర్భీతిగా చేసుకుపోయింది. భాజపా చేసిన ‘చారిత్రక తప్పిదం’ వల్ల కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి మరింతగా క్షీణించింది. కశ్మీర్ సమస్యను బలప్రయోగంతోనే పరిష్కరించవచ్చునన్నది తమ విధానమని భాజపా ప్రకటించింది. అయితే ఆ విధానానికి కట్టుబడి భాజపా పనిచేసిన దాఖలాలు లేవు. ‘లేస్తే మనిషిని కానంటూ’ ప్రగల్బాలు పలకటం తప్ప అవకాశాలు లభించినా భాజపా సత్తా చాటుకోలేదు. నిజానికి కశ్మీర్ విషయంలో ఆ పార్టీకి మొదటి నుండి స్పష్టమైన విధానం లేదు. గతంలో వాజపేయి, ఇప్పుడు మోదీ కూడా తాము అనుకున్నది సాధించలేక పోయారు.
ముస్లిం మైనారిటీలకు కాంగ్రెస్, ఇతర పార్టీల కంటే భాజపా అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ ప్రయోజనం కలిగింది. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ వెళ్లేందుకు పాస్‌పోర్టుల విధానం సులభతరం చేశారు. వీసాలు విరివిగా ఇచ్చారు. వాజపేయి స్వయంగా లాహోర్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాని ముషారఫ్‌తో చర్చలు జరిపారు. అందుకు ‘ప్రతిఫలం’గా ముషారఫ్ మనకు కార్గిల్ యుద్ధాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసినప్పుడు భారత సైన్యం పాకిస్తాన్‌పై దాడికి సిద్ధమైంది. పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్‌ను విడగొట్టినందుకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ‘దుర్గ’గా అభివర్ణించిన వాజపేయి కార్గిల్ యుద్ధం ద్వారా లభించిన సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నారు.
భాజపా నుంచి రెండో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ చెప్పాపెట్టకుండా పాకిస్తాన్‌లో నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత పాకిస్తాన్ సై న్యం పఠాన్‌కోట్ ఎయిర్ బేస్, ‘ఊరి’ సైనిక శిబిరంపై జైషే మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులతో దాడి చేయించింది. వాస్తవానికి కశ్మీర్ సమస్య శాంతిభద్రతల సమస్య కాదు, సామాజిక సమస్య కాదు, నిరుద్యోగ సమస్య కాదు, అది కేవలం మతపరమైన సమస్య అనే అంశాన్ని మన పాలకులు ఇప్పటికైనా గ్రహించటం మంచిది. మతపరమైన సమస్య కాబట్టి దానిని ఆ కోణం నుండే పరిష్కరించవలసి ఉంటుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కాందిశీకులుగా నివసిస్తున్న కశ్మీరీ పండిట్లకు వారి సొంత ఊళ్లలో స్థిరనివాసం ఏర్పాటు చేయలేని మన పాలకులు ఉగ్రవాదులను ఎలా అంతం చేయగలరు?

-కె.కైలాష్ 98115 73262