ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ముదురుతున్న రాఫెల్ రగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం రోజురోజుకూ సెగలు పుట్టిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దీన్ని అతి పెద్ద కుంభకోణంగా అభివర్ణిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వ అవినీతికి ఇది నిదర్శమంటూ ధ్వజమెత్తుతున్నారు. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఏ రాజకీయ నాయకుడైనా ఇదే విధంగా వ్యవహరిస్తాడు. రాహుల్ సైతం రాఫెల్ కొనుగోలు వివాదాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేలా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాహుల్ నుంచి రాఫెల్ దాడి తీవ్రతరమవుతోంది. ఈ వ్యవహారంపై త్వరలోనే ‘బంకర్ బాంబులు’ ప్రయోగిస్తాయంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ‘బంకర్ బాంబులు’ ప్రయోగించడమంటే త్వరలోనే మోదీ పై రాహుల్ మరింత బలంగా ఆరోపణలు చేస్తారని అర్థం.
గత నాలుగేళ్ల కాలంలో మోదీ ప్రభుత్వంపై చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు రాలేదు. అందుకే రాహుల్ ఎన్నికల ముందు రాఫెల్ వివాదాన్ని భారీ కుంభకోణంగా చిత్రీకరిస్తున్నారు. యూపీఏ హయాంలో 560 కోట్ల చొప్పున చెల్లించి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. మోదీ ప్రభుత్వం ఆ ధరను 1600 కోట్లకు పెంచిందన్నది రాహుల్ ఆరోపణ. మోదీ ప్రభుత్వం 46వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిదంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అధిక ధరలకు యుద్ధ విమానాలు కొనుగోలు చేయడం ద్వారా అవినీతికి పాల్పడడమే గాక, రిలయన్స్ అధినేత అనిల్ అంబానీకి విమానాల నిర్వహణ కాంట్రాక్టు ఇస్తున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. యుద్ధ విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ ‘రక్షణ ఉత్పత్తుల సంస్థ’ను ప్రారంభించిన పక్షం రోజులకే ఈ కాంట్రాక్టును మోదీ ఇప్పించారని రాహుల్ అంటున్నారు. అంబానీకి చెందిన ఏ సంస్థకూ యుద్ధ విమానాలు తయారు చేసే అనుభవం లేదు. రాహుల్ ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వంపై ఉంది. ఇది దేశ రక్షణకు సంబంధించిన విషయం గనుక మోదీ స్వయంగా జోక్యం చేసుకుని అనుమానాలను నివృత్తి చేయాలి. గత నాలుగున్నరేళ్లలో లేని విధంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయనపై అవినీతి కుంభకోణం ఆరోపణ వచ్చింది. ఒక్కో యుద్ధ విమానం ధర ఎంత అన్నది రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇంతవరకూ స్పష్టం చేయలేదు. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే యుద్ధ విమానం ధరను వెల్లడించడం ఆమె చెబుతుండగా, యూపీఏ హయాంలో రక్షణ శాఖను నిర్వహించిన ఏకే ఆంటోనీ మాత్రం ఇది నిజం కాదంటున్నారు. అందుకే మోదీ అయినా వాస్తవాలను వివరిస్తే బాగుంటుంది.
యుద్ధ విమానాల ఉత్పత్తిలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారా? లేదా? అనేది కూడా స్పష్టం చేయవలసిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న రాఫెల్ ఒప్పందంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో మెరుగైంది, యుద్ధ విమానాలు ఇరవై శాతం తక్కువ ధరకు మనకు లభిస్తున్నాయంటూ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చారే తప్ప, వాటి అసలు ఖరీదు ఎంత? అన్నది చెప్పలేదు. ఈ వివాదంపై రాహుల్ చేస్తున్న ఆరోపణలు నెమ్మదిగానైనా ప్రజల వద్దకు వెళుతున్నాయి. ఈ ఏడాది చివరిలో నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, 2019 ఆరంభంలో లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ‘రాఫెల్ మచ్చ’ మోదీ ప్రభుత్వ నిజాయితీకి ఎంతమాత్రం మంచిది కాదు. ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారితే- సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు ప్రతికూల ఫలితాలు తప్పవా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాహుల్ ప్రస్తావించిన కీలక అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చి ఈ వివాదానికి తెరదించకపోతే- ఇది మరో బోఫోర్స్ కుంభకోణంలా మారే అవకాశం ఉంది. గతంలో బోఫోర్స్ కొనుగోలు వ్యవహారం వివాదాస్పదం కావటంతో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ 1989 ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చింది. బోఫోర్స్ సంస్థ నుండి 1.4 బిలియన్ డాలర్ల వ్యయంతో 410 బోఫోర్స్ ఫిరంగులు కొనుగోలు చేయాలన్నది అప్పటి ఒప్పందం. ఈ వ్యవహారంలో దాదాపు అరవై కోట్ల రూపాయల మేరకు ముడుపులు అందాయన్నది ప్రతిపక్షాల ఆరోపణ. రాజీవ్ మంత్రివర్గంలో మొదట ఆర్థిక శాఖ నిర్వహిస్తూ- ధీరూభాయి అంబానీ, అమితాబ్ బచ్చన్‌లపై ఆదాయపు పన్ను అధికారులచే దాడులు చేయించి వివాదాస్పదమైన వీపీ సింగ్ రక్షణ శాఖకు మారిన తరువాత బోఫోర్స్ ఫిరంగుల కొనుగోలుపై దర్యాప్తుకు ఆదేశించేందుకు ప్రయత్నించారు. దీంతో రాజీవ్ గాంధీ అతణ్ని మంత్రివర్గం నుండి తొలగించారు. వీపీ సింగ్ ఆ తరువాత జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేసి బోఫోర్స్ కుంభకోణంపై దేశమంతా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్న ఎన్.టి.రామారావు బోఫోర్స్ శతఘు్నలను తుప్పుపట్టిన తుపాకులంటూ ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ, ఆయన కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడ్డారంటూ జనతదళ్‌తోపాటు భారతీయ జనతాపార్టీ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కురిపించింది. 1989 నాటి ఎన్నికల్లో జనతాదళ్ స్వల్ప మెజారిటీ సంపాదించి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వానికి భాజపా, వామపక్షాలు పరోక్షంగా మద్దతు ఇచ్చాయి.
బోఫోర్స్ కుంభకోణం పేరుతో అధికారంలోకి వచ్చిన వీపీ సింగ్ తన ఏడాది పాలనలో రాజీవ్ గాంధీపై అవినీతి ఆరోపణలను రుజువు చేయలేకపోయారు. దర్యాప్తు పేరుతో కాలయాపన చేశారే తప్ప వాస్తవాలను వెలుగులోకి తీసుకురాలేదు. బోఫోర్స్ కుంభకోణానికి ముప్పై సంవత్సరాల తరువాత కూడా తెరపడలేదు. రాజకీయావసరాల మేరకు బోఫోర్స్ కుంభకోణంపై దర్యాప్తు ముందుకు, వెనకకూ జరుగుతోంది. రక్షణ ఉత్పత్తులకు సంబంధించిన కుంభకోణాలు త్వరగా ఒక కొలిక్కిరావు. కానీ వాటి మూలంగా జరిగే రాజకీయ పరిణామాలతో అధికారం చేతులు మారుతుంది. ఈ నేపథ్యంలో మోదీ రాఫెల్ యుద్ధ విమానాల వివాదానికి వీలైనంత త్వరగా చరమగీతం పాడడం ఉత్తమం. రాజకీయ నాయకులకు అధికారం పట్ల ఉన్న ఆరాటం వాటిని నిగ్గుతేల్చడంలో ఉండదనేందుకు బోఫోర్స్ మంచి ఉదాహరణ. ఇప్పుడు ‘రాఫెల్ కుంభకోణం’ అంటూ గొంతెత్తి ఆరోపణలు కురిపిస్తున్న వారి లక్ష్యం కూడా అధికారమే తప్ప అవినీతిని ఎండగట్టటం కాదు. బోఫోర్స్ కుంభకోణం పేరుతో అధికారంలోకి వచ్చేందుకు చూపిన చొరవ, ముడుపులు అందుకున్న వారిని శిక్షించడంపై, దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడంపైన చూపించలేదు. తాను నిజాయితీకి మారుపేరని చెప్పుకునే మోదీ ఇకనైనా స్పందించి వాస్తవాలను ప్రజలు ముందు పెట్టటం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. *

-కె.కైలాష్ 98115 73262