ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వోటర్లకు బాధ్యత లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వోటర్లు ప్రలోభాలకు లొంగిపోయి, తమ బాధ్యతను విస్మరిస్తే- అసమర్థ, నిరంకుశ, అవినీతి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ప్రస్తుతం తెలంగాణ సహా అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం తారస్థాయికి చేరింది. వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయిదు రాష్ట్రాల్లో వోటర్ల ‘నాడి’పై లోక్‌సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేసే అవకాశం ఉంది.
ఒకప్పుడు ‘యథారాజా తథాప్రజా’ అనే వారు. ఇప్పు డు ఆ పరిస్థితి మారింది. ప్రజాస్వామ్యంలో ప్రజలు కోరుకునే ప్రభుత్వాలు ఏర్పడాల్సి ఉంది. అన్ని విషయాలను లోతుగా ఆలోచించి, ప్రజలు వోటుహక్కును సద్వినియోగం చేసుకొంటేనే సమర్థులైన నేతలు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎన్నికవుతారు. నిజాయితీ గల నాయకులు ఎన్నికలైతే ప్రజల ఆకాంక్షలు కొంతవరకైనా నెరవేరి, అభివృద్ధి సాధ్యమవుతుంది. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. వోటర్లు అనాలోచితంగా వ్యవహరిస్తే అనర్థం జరిగిపోతుంది. డబ్బుకు ఆశపడి ఓటు వేసే విధానం పోవాలి. కులం, మతం, ప్రాంతం, ధనం వంటి కోణాల్లో ఆలోచించి వోటు వేస్తే దేశానికి మేలు చేసే దిక్కెవరు? అక్రమాలు లేని పాలన కావాలంటే వోటర్లు ప్రలోభాలకు లొంగరాదు. కానీ, ఈ పద్ధతిలో వోటింగ్ జరుగుతోందా? అంటే ‘కాదు’ అనే జవాబు వస్తుంది.
ఎన్నికల వేళ చాలామంది ఓటర్లు డబ్బు, మద్యం, ఇతర నజరానాలకు ఆశపడుతున్నారు. ఓటును వెయ్యి, రెండు వేలు, నాలుగు వేలకు అమ్ముకుంటున్నారు. వోటు విలువకు పాతరేస్తున్నారు. అభ్యర్థులు ఎవరెంత ఇస్తారోనని జనం ఆలోచిస్తున్నారు. వోటర్లను పలురకాలుగా ప్రలోభపెట్టి, విచ్చిలవిడిగా ధనం ఖర్చు చేసినా నేతలు చట్టసభలకు ఎన్నికయ్యాక- జనం కోసం ఆలోచించే ప్రసక్తే ఉండదు. ఎన్నికల్లో తాము చేసిన ఖర్చును రాబట్టుకొనేందుకే నేతలు తపన పడతారు. అందుకే వారు అక్రమాలకు, అవినీతికి పాల్పడతారు. అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోరు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని ఎ వరూ తగ్గించలేకపోతున్నారు. వోటర్లు కూడా ‘వోటుకు ఎంత ఇస్తారు?’ అని నిర్మొహమాటంగా అడుగుతున్నారు. ఈ రకంగా భారీ ఎత్తున బేరసారాలు సాగుతుంటాయి. నోట్లు తీసుకున్న వోటర్లు ఆ తర్వాత ప్రజాప్రతినిధులను నిలదీసే అవకాశం లేకుండా పోతోంది. ఎన్నికల్లో పెట్టిన పెట్టుబడికి చక్రవడ్డీ సహా నేతలు వసూలు చేసుకుంటున్నారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు డెబ్బయి కోట్లు ఖర్చు చేసి ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధి ఆ తరువాత తన పెట్టుబడికి సరపడా ఆదాయం లేక విలవిలలాడాడు. పెట్టుబడితోపాటు కొంత లాభం సంపాదించుకునేందుకు ఇలాంటి ప్రజాప్రతినిధులు ఎంతకైనా తెగిస్తారు. ఓటర్లను మభ్యపెట్టటం నాయకులకు హక్కుగా మారింది. ఇలాంటి నేతలు ఎన్నికలు ముగిశాక ముఖం చాటేస్తారు. ఒకానొక ముఖ్యమంత్రి సచివాలయానికే రాడు. పరిపాలన తన ‘్భవన్’ నుంచే చేస్తాడు. సచివాలయానికి వెళ్లకపోతే ప్రజలు ఏమనుకున్నా ఆయన పట్టించుకోడు. మరో ముఖ్యమంత్రి తాను తప్ప మరొకరు గొప్పగా పాలించలేరంటూ బీరాలు పలుకుతాడు. తన వల్లే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని, తాను లేకుంటే వారు అనాథలవుతారని అంటాడు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం తామున్నామనే వాస్తవాన్ని వీరు మరిచిపోతున్నారు.
ఇలా ఎందుకు జరుగుతోందని ఓటర్లు ఎప్పుడైనా ఆలోచించారా? అధికారంలో ఉన్న నేతలు ఎందుకింత నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వాస్తవాలను అర్థం చేసుకున్నారా? నేతలు ఇలా మారడానికి ప్రజలే కారకులు. ప్రజల ఉదాసీనత వల్లే ఇదంతా జరుగుతోంది. నాయకులు ప్రతి పనినీ ప్రజల పేరుతో చేస్తారు. పనికిమాలిన పనైనా దానికి ప్రజా ప్రయోజనం అనే రంగు పలుమి తప్పించుకుంటున్నారు. ప్రజలు ఆలోచించడం మానేస్తున్నందున నేతలు బరితెగిస్తున్నారు. వోటర్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటే రాజకీయ వ్యవస్థ దారికి వస్తుంది.
నేడు సామాజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా సమాజాన్ని శాసించే పరిస్థితులు నెలకొంటున్నాయి. వోట్లు అడిగేందుకు వచ్చే నేతలను ప్రజలు నిర్భయంగా ప్రశ్నించాలి. ఎన్నికైన నేతలపై వారు నిఘా పెట్టాలి. పార్టీల సిద్ధాంతాలు, పనితీరు, అభ్యర్థుల చరిత్ర, గుణగణాలు, వ్యవహార శైలి గురించి ఓటర్లు ఆలోచించాలి. వీటి ఆధారంగానే ఫలానా అభ్యర్థికి ఓటు వేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి. పార్టీ పేరు మీద ఓటు వేయటం సమర్థనీయం కాదు. కొన్ని జాతీయ పార్టీలు అసమర్థులకు టిక్కెట్లు ఇవ్వటం ద్వారా ప్రజాస్వామ్యానికి కీడు చేస్తున్నాయి. తాము నిలబెట్టిన అభ్యర్థులకే జనం వోట్లు వేస్తారన్న ధీమా రాజకీయ పార్టీల్లో నెలకొంటోంది. అందుకే అసమర్థులు, అవినీతిపరులు, అరాచకవాదులు సైతం డబ్బుతో టిక్కెట్లు దక్కించుకొని అధికారంలోకి వస్తున్నారు.
జాతీయ , ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏమిటనేది కూడా ఓటర్లు ఆలోచించాలి. కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఒక కుటుంబం లేదా కొందరు వ్యక్తుల సొంత ఆస్తులుగా మారాయి. ఇలాంటి పార్టీలతో ఓటర్ల ప్రయోజనాల పరిరక్షణ ఎంతవరకు సాధ్యం? ప్రజాస్వామ్యం పేరుతో కుటుంబ పాలన కొనసాగిస్తున్న పార్టీలను ఓడించవలసిన బాధ్యత ప్రజలదే. ప్రజల ‘మూకుమ్మడి’ ఓటింగ్ వల్లే కొన్నివర్గాల వారు మాత్రమే అధికారంలోకి వస్తున్నారు. ఐదు శాతం జనాభా ఉన్న వారు అరవై శాతం జనాభా ఉన్న వారిని శాసిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మెజారిటీదే అధికారం కానీ, ప్రస్తుతం మన దేశంలో ఐదారు వర్గాలకు చెందిన నాయకుల పాలన కొనసాగుతోంది.
ప్రజాస్వామ్యం తమకు కల్పించిన అధికారాల గురించి తెలుసుకోకపోవటం, పవిత్రమైన ఓటు హక్కును జనం బాధ్యతతో వినియోగించనందున అర్థబలం, అంగబలం ఉన్న నేతలు పాలకులవుతుంటే మెజారిటీ ప్రజలు పాలితులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల్లో కొందరు నేతలు పోటీ చేయడం ప్రజాసేవ కోసం కాదు, జనం పేరిట అధికారం చెలాయించేందుకే. ఒక్కసారి గెలిస్తే ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించేందుకే నేతలు టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. మన దేశంలో ఎన్నికలు, అధికారం వ్యాపారంగా మారాయి. ఈ పరిస్థితి మారాలంటే ముందు ఓటర్లు మారాలి. ఓటు వేసే ముందు నిజాయితీపరులైన నాయకులెవరన్నది జనం గుర్తించాలి. ప్రలోభాలకు లొంగిపోయి వోట్లు వేస్తే- ఐదేళ్ల పాటు తమ గురించి ఆలోచించే నాథుడే ఉండడని వోటర్లు గుర్తించాలి.
*

-కె.కైలాష్ 98115 73262