ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘పాపాల పాక్’ను నమ్మడం ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపేందుకు సిద్ధమంటున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాటలను ఎంత మాత్రం విశ్వసించలేం. పాకిస్తాన్ సైనికాధికారుల చేతిలో కీలుబొమ్మైన ఇమ్రాన్ ఏం చెప్పినా అది ఆచరణ సాధ్యం కాదు. ఇమ్రాన్ పాక్ ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు దాదాపు నాలుగు లక్షల మంది పాకిస్తాన్ సైనికులు ఎన్నికల ప్రక్రియలో పనిచేశారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బజ్వా ఆదేశం మేరకు ఆ సైనికులు ప్రతి పోలింగ్ కేంద్రంలో తిష్ట వేశారు. ఇమ్రాన్‌కు మద్దతుగా పనిచేసిన సైనికులకు భారీగా నగదు నజరానాలు అందాయన్నది ప్రధాన ఆరోపణ. పోలింగ్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి తాము ఏరికోరి గెలిపించుకున్న ఇమ్రాన్ స్వతంత్రంగా వ్యవహరించేందుకు పాకిస్తాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) ఎంత మాత్రం అంగీకరించే అవకాశం లేదు.
మన సరిహద్దులకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిక్కుల మతగురువు గురునానక్ సమాధి ఉన్న గురుద్వారాకు భక్తులను అనుమతించేందుకు కర్తార్‌పూర్ వద్ద రహదారిని నిర్మించేందుకు ఇమ్రాన్ ఖాన్ శంకుస్థాపన చేసినంత మాత్రాన పాకిస్తాన్ పాలకుల, సైనికాధికారుల ఆలోచనా విధానం మారిపోయిందని భావించలేం. పాక్ పాలకులు వారికి అవసరమున్నప్పుడు మన దేశంతో శాంతి నెలకొల్పటం గురించి మాట్లాడతారు, అవసరం లేనప్పుడు ఒక్కమాట కూడా వారి నోటి వెంట రాదు. వారు ఏం మాట్లాడినా- తెర వెనక ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉంటారు. ఇమ్రాన్ , పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ బవేజా శాంతి గురించి మాట్లాడేందుకు ప్రధాన కారణం అమెరికా నుండి నిధుల వరద ఆగిపోవటమే. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇస్లామిక్ ఉగ్రవాదం మూలంగా పాకిస్తాన్‌లో పారిశ్రామిక, వాణిజ్య రంగాలు నాశనమైపోయాయి. ఎళ్లవేళలా వెంట ఉండే చైనా అందజేస్తున్న రుణ సహాయం పాకిస్తాన్‌ను ఆర్థికంగా మరింత కుంగ దీస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి సహాయం అందకపోతే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి పోతుంది. అమెరికా అన్ని విధాలుగా కట్టడి చేయటంతో ఊపిరాడని పరిస్థితిలో పడిపోయిన తమ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ ఇటీవలే సౌదీ అరేబియా వెళ్లి పెద్ద ఎత్తున నిధులను సంపాదించుకు వచ్చారు. అయితే ఈ నిధుల వల్ల పాకిస్తాన్‌కు ఆశించిన ఫలితాలు లభించే పరిస్థతి లేదు.
పాకిస్తాన్ పాలకులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిలిగిత్ ప్రాంతాన్ని తమ దేశంలోని ఐదవ ప్రాంతంగా ప్రకటించుకునేందుకు పార్లమెంటులో సన్నాహాలు చేస్తున్నా రు. వివాదాస్పద ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన గిలిగిత్ తదితర ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చేసి, ఆ తరువాత చైనాకు అప్పగించేందుకు పాక్ కుట్ర చేస్తోంది. పాకిస్తాన్ ఇప్పటికే గిలిగిత్‌కు చెందిన కొంత ప్రాంతాన్ని చైనా అధీనంలో ఉంచింది. ఇక మీదట ఆ ప్రాంతాన్నంతా చైనాకు అప్పగించే ప్రమాదం లేకపోలేదు. ఇదే జరిగితే మనకు చైనా ముప్పు ముం గిట్లో వచ్చి కూర్చుంటుంది.
పాకిస్తాన్ ఇప్పటికే ఆక్రమిత కశ్మీర్‌లో కశ్మీరీ భాష, సంస్కృతులను సర్వనాశనం చేసింది. అక్కడ ఇప్పుడు కశ్మీరీ భాష మాట్లాడే వారే లేరంటే నమ్మశక్యం కాదు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇప్పుడు ఉర్దూ ప్రధాన భాష. కశ్మీరీ భాష మాట్లాడితే జరిమానా విధించే పరిస్థితులు కల్పించారు. వీటన్నింటి నుండి మన దృష్టి మళ్లించేందుకు పాకిస్తాన్ పాలకులు శాంతి చర్చల గురించి మాట్లాడుతున్నారు.
కాగా, మన లోక్‌సభకు వచ్చే సంవత్సరం జరిగే ఎన్నికల్లో భాజపాకు బదులు మరో పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది, ప్రధానిగా మోదీకి బదులు మరో వ్యక్తి పగ్గాలు చేపట్టినప్పుడే రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు అవకాశం ఉందంటున్న పాకిస్తాన్‌తో శాంతి చర్చలు ఎలా సాధ్యం? రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలనే చిత్తశుద్ధి పాకిస్తాన్ పాలకులకు ఏ మాత్రం ఉన్నా- మొదట ఇస్లామిక్ ఉగ్రవాదానికి తెర దించాలి. మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ్రా స్వరాజ్ ప్రకటించినట్లు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పోషించినంత కాలం పాకిస్తాన్‌తో ఎలాంటి శాంతి చర్చలు, ఇతరత్రా లావాదేవీలు జరపకూడదు.
పాకిస్తాన్ పాలకులు ఒక వైపు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తారు, మరో వైపుమనని దెబ్బ కొట్టేందుకు చైనాను ఉసి గొల్పుతారు. ఈ రెండు చర్యలు ఆగనంత కాలం పాకిస్తాన్‌తో ఎలాంటి శాంతి చర్చలు జరపకూడదు. పాకిస్తాన్‌లో లష్కరే తయ్యబా, హిజ్బుల్ ముజాహిదీన్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు బహిరంగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలు భారత దేశంలో దాడులు చేసేందుకు, కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని కొనసాగించేందుకు వేల సంఖ్యలో కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నాయి. ఈ కార్యకలాపాలు కొనసాగినంత కాలం పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదు.
ఇమ్రాన్ ఖాన్, సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బజ్వా కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మించేందుకు సిద్ధపడటం వెనక కూడా ఇస్లామిక్ ఉగ్రవాదం పొంచి ఉన్నది. ఐ.ఎస్.ఐ గతంలో సిక్కులను ఉసి గొల్పటం ద్వారా భారత దేశా న్ని మరోసారి చీల్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు మళ్లీ ఖలిస్తాన్ పేరుతో సిక్కు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత రెండు నెలల సమయంలో పంజాబ్‌లో సిక్కు ఉగ్రవాద దాడులు జరిగాయి. కొన్ని రోజుల క్రితం ఇద్దరు సిక్కు ఉగ్రవాదులు నిరంకారీ సిక్కు సంస్థపై జరిగిన దాడిలో పలువురు మరణించగా ఎంతో మంది గాయపడ్డారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఐ.ఎస్.ఐ ఉన్నదనేది ఎవరైనా చెప్పవచ్చు.
వాస్తవానికి ఐ.ఎస్.ఐ సిక్కు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు మరోసారి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించిందని భారత సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ నాలుగైదు నెలల క్రితమే హెచ్చరించారు. ఆయన హెచ్చరించిన కొన్ని నెలలకే పంజాబ్‌లో సిక్కు ఉగ్రవాదులు నాలుగైదు చోట్ల దాడులు చేశారు. కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం వెనక సిక్కు ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే కుట్ర ఉన్నది. గురు నానక్ సిక్కుల మొదటి గురువు. ఆయన బోధనలు సిక్కులకు ప్రాణప్రదం. పాకిస్తాన్‌లోని లాహోర్ (శ్రీరాముడి పుత్రుడు లవుడు నిర్మించిన నగరం)కు సమీపంలోని నాన్‌ఖానా సాహెబ్ పట్టణంలో గురునానక్ సమాధి ఉన్నది. గురునానక్ ఇక్కడే పుట్టాడు. ఆయన పుట్టిన చోట కట్టిన ఈ గురుద్వారా సిక్కులకు అత్యంత పవిత్రమైంది. గురునానక్ 1504 సంవత్సరంలో రావీ నది పక్కన కర్తార్‌పూర్ నగర నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. 1539లో గురునానక్ మరణించినప్పడు ఆయన తమవాడంటే తమవాడంటూ హిందువులు, ముస్లింలు పోటీ పడి విడివిడిగా సమాధులు నిర్మించారు. రావీ నది తన ప్రవాహ దిశను మార్చుకోవటంతో ఇవి కొట్టుకుపోయాయి. దీంతో ప్రస్తుతం డేరాబాబా నానక్‌గా పిలిచే కొత్త ఆవాసాన్ని అప్పట్లో నిర్మించారు. దేశ విభజన సమయంలో రావీ నదికి అటువైపు ఉన్న డేరాబాబా నానక్ పాకిస్తాన్‌కు పోగా, నదికి ఇటువైపు ఉన్న గురుదాస్ పూర్ భారత దేశానికి వచ్చింది. ఇప్పుడు కర్తార్‌పూర్ కారిడార్ పేరుతో గురుదాస్‌పూర్‌లో ఉన్న డేరాబాబా నానక్ సాహెబ్ నుండి నాలుగున్నర కిలో మీటర్ల దూరంలో పాకిస్తాన్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహబ్ కర్తార్‌పూర్ మధ్య కారిడార్ నిర్మిస్తున్నారు. భారత దేశానికి చెందిన సిక్కు భక్తులు ఎలాంటి పాస్‌పోర్టు లేకుండా గురుద్వారా దర్బారా సాహెబ్‌కు వెళ్లివచ్చేందుకు ఈ కారిడార్ వీలు కల్పస్తుంది.
కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనను భారత దేశం దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం చేస్తే పాక్ పాలకులు అప్పట్లో నిరాకరించారు. ఇప్పుడు పాక్ పాలకులు,సైన్యం సిక్కు ఉగ్రవాదాన్ని పెంచేందుకు కర్తార్‌పూర్ కారిడార్ పథకాన్ని తవ్వితీశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే భారత దేశం పాకిస్తాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు అంగీకరించే ముందు ఇలాంటి పలు అంశాలను లోతుగా పరిశీలించవలసి ఉంటుంది. లేకుంటే పాకిస్తాన్ పాలకులు, సైన్యం మరోసారి మనకు ద్రోహం చేస్తారు.
*

-కె.కైలాష్ 98115 73262