ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘శీతాకాల సభ’లో వేడి పుట్టిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేలా చూసే బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్షంపై కూడా ఉంది. తామెంత గొ డవ చేసినా అధికార పక్షం పార్లమెంటు ఉభయ సభలను ప్రశాంతంగా నడిపించాలని ప్రతిపక్షం ఆశించటం బాధ్యతారాహిత్యం అవుతుంది. అలాగే, ప్రతిపక్షాన్ని పట్టించుకోకుండా పార్లమెంటును ఏకపక్షంగా నడిపించుకోవాలని భావించటం అధికార పక్షం తప్పిదం అవుతుంది. మంగళవారం నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు జరిగే పార్లమెంటు ఆఖరి సమావేశాలను అర్థవంతంగా నడిపించుకునేందుకు ఇరుపక్షాలు పోటీపడాలి. అంతేగాని సమావేశాలను రభసగా మార్చేందుకు మాత్రం అధికార, విపక్షాలు పోటీ పడకూడదు.
ఇటీవలి కాలంలో మన పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగటం లేదన్నది కాదనలేని వాస్తవం. సమావేశాలు గందరగోళంగా జరగడంతో దేశం ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలపై నామమాత్రపు చర్చ కూడా జరగటం లేదు. ఈ పరిస్థితి వల్ల దేశానికి అన్ని రకాలుగా నష్టం కలుగుతోందనేది మన పాలకులు, విపక్ష నాయకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. దేశం ప్రస్తుతం ఎన్నో ప్రధాన సమస్యలతో సతమతమవుతోంది. పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవటం, రైతన్నల కష్టాలు, ఉపాధి అవకాశాలు రోజురోజుకూ తగ్గిపోవటం, జమ్మూ కశ్మీర్‌లో తగ్గని ఉగ్రవాదం, పంజాబ్‌లో మరోసారి ఖలిస్తాన్ వేర్పాటువాదం ప్రమాద సంకేతాలుగా జాతిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం ఎంత మాత్రం తగ్గించటం లేదు. దేశంలో పారిశ్రామిక, ఆర్థిక రంగాలు పలు ఒడుదుడుకులను ఎదుర్కొంటున్నాయి. దేశాభివృద్ది ఆశించిన స్థాయిలో జరగటం లేదు. దేశం మొత్తం మీద శాంతిభద్రతల పరిస్థితి ఆదుపులోనే ఉన్నా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితి దిగజారుతోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆటుపోట్లు ఇంకా ఒక కొలిక్కి రావటం లేదు. ప్రాంతీయ అసమానతల గురించి పార్లమెంటులో ఎలాంటి అర్థవంతమైన చర్చ జరగలేదు. ఇన్ని విపరిణామాలు, విపత్కర పరిస్థితులు రాజ్యమేలుతున్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును దురుపయోగం చేస్తున్నాయి. పార్లమెంటులో ఎక్కువ సమయం రాజకీయలపై చర్చకు వృథా అవుతోంది. ఇది జాతి శ్రేయస్సుకు ఎంతమాత్రం మంచి పరిణామం కాదు.
ఈ సువిశాల దేశంలో ఎన్నికల ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎన్నికల ఫలితాలు పార్లమెం టు సమావేశాలను ప్రభావితం చేయకూడదు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, ఆ ప్రభావం పార్లమెంటు శీతాకాల సమావేశాలపై పడకూడదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధికార, విపక్షాలు బయట ఎలా విమర్శలు చేసుకున్నా, పార్లమెంటు సమావేశాల్లో ప్రతిష్టంభన ఏర్పడకుండా ఉభయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎన్నికల ఫలితాలపై ఇరుపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవటం ద్వారా తమ తప్పొప్పులను సరిదిద్దుకోవాలి. ప్రత్యర్థులను తప్పుపట్టేందుకు పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకోరాదు.
ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించేందుకు ఉద్దేశించిన ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటులో చట్టం చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రయత్నం సజావుగా జరిగేందుకు అధికార పక్షం అన్ని ప్రతిపక్షాలతో సమాలోచనలు జరపటం మంచిది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలను ఈ చర్చకు దూరంగా పెట్టటం వల్ల అధికార పక్షానికి ఒరిగేదేమీ లేదు. ‘తలాక్’ బిల్లుపై రభస జరిగితే ఉభయ సభలు స్తంభించి పోవటం ఖాయం. ఉభయ సభల్లో ‘తలాక్’ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేందుకు అధికార పక్షం వారు విజ్ఞతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రతిపక్షం కూడా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా, ముఖ్యంగా మైనారిటీ ఓటు బ్యాంకు కోసం ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించకూడదు. ముస్లిం మహిళల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు ట్రిపుల్ తలాక్ బిల్లు ఎంతో అవసరం. ఈ బిల్లుపై లోతుగా చర్చించటం ద్వారా దీనిలోని లోపాలను సరిదిద్దేందుకు విపక్ష పార్టీలు చొరవ చూపాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిఘటన విధానాన్ని అవలంబించకూడదు. అధికార,ప్రతిపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయి.
ట్రిపుల్ తలాక్‌తోపాటు పలు ముఖ్యమైన అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగవలసి ఉంది. వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు భారీ సంఖ్యలో ఇటీవల దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి తమ నిరసన గళం వినిపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవటం పట్ల వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రైతులు ఇలా రోడ్డున పడటం దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. అధికార, ప్రతిపక్షాలు రైతుల సమస్యపై యుద్ధ ప్రాతిపదికపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది. రైతులు వారి సమస్యల పరిష్కారానికి ఇంతకాలం స్థానికంగానే ఉద్యమించే వారు. అయితే ఇప్పుడు వారు ఏకంగా దేశ రాజధానిలో నిరసన తెలిపేందుకు సిద్ధపడుతున్నారంటే వారి సమస్యలు ఎంత తీవ్ర రూపం ధరించాయనేది అధికార పక్షం అర్థం చేసుకోవాలి. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నది. వ్యవసాయ రంగం కుప్పకూలితే దేశ ఆర్థిక వ్యవస్థ ఏమవుతోందనేది ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. ఎన్నికల సమయంలో ప్రయోజనం కోసం వ్యవసాయ రంగానికి తాయిలాలు ప్రకటించే బదులు అర్థవంతమైన విధానంతో రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వటం ఎంతో ఉత్తమం. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై బాధ్యతతో కూడిన చర్చ జరపవలసిన అవసరం ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఉభయసభల సమయాన్ని వృథా చేయకుండా ఉభయ పక్షాలూ చిత్తశుద్ధితో చర్చ జరపటం ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలి.
మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో జడలు విప్పిన ఇస్లామిక్ ఉగ్రవాద సమస్య ఇప్పటికీ అదుపులోకి రావటం లేదు. మన భద్రతా దళాలు ఎన్నో త్యాగాలు చేస్తున్నాయి. కశ్మీర్‌లో దాదాపుప్రతి రోజూ ఒకరిద్దరు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్లలో మరణిస్తున్నారు. ఇదే సమయంలో సైనికులు, వారి కుటుంబ సభ్యులు, సాధారణ పౌరులు మరణించటం ఎంతమాత్రం అంగీకారం కాదు. కశ్మీర్ సమస్య రావణ కాష్టంగా మారి సరిహద్దుల్లో శాంతిభద్రతలు లోపిస్తున్నాయి. ఉద్రిక్తతలను కొనసాగించేందుకు పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అమలు చేస్తోంది. మరోవైపు పంజాబ్‌లో సిక్కు ఉగ్రవాదాన్ని మరోసారి తెర మీదికి తెచ్చేందుకు పాకిస్తాన్ పాలకులు, ఆ దేశ సైనికులు కుట్రలు ప్రారంభించారు. మన సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ కొన్ని నెలల ముందే పంజాబ్ సిక్కు ఉగ్రవాదం మరోసారి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆయన అనుమానించినట్టుగానే కొందరు సిక్కు ఉగ్రవాదులు పంజాబ్‌లో రెండుమూడు చోట్ల బాంబు దాడులకు పాల్పడ్డారు. ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని అరికట్టని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయనేది గత అనుభవం చెబుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం మన రాజకీయ నాయకులు అలవాటే. నష్టం జరిగిపోయిన తరువాత అధికార, విపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నంత మాత్రాన ఎలాంటి ఫలితం ఉండదు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పార్లమెంటులో చర్చ జరిపి, కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇకనైనా నడుం బిగించాలి.
ప్రస్తుత లోక్‌సభ పదవీకాలం ముగుస్తున్న సమయంలో నిరుద్యోగం, యువతకు ఉపాధి వంటి కీలక అంశాలపై చర్చించటం అర్థరహితమనే అభిప్రాయానికి రావటం మంచిది కాదు. నిరుద్యోగం, ఉపాధి కల్పన అనేవి నిరంతర సమస్యలు గనుక ఈ అంశంపై నిజాయితీతో చర్చ జరపాలి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో లోటుపాట్లపై చర్చించి ఉభయసభల సభ్యులు తమవంతు బాధ్యతను నిర్వహించాలి. అధికార, ప్రతిపక్షాలు ప్రతి చిన్న అంశంపైనా గొడవ పడడానికి స్వస్తివాక్యం పలకాలి. ప్రశ్నోత్తరాల కార్యక్రమం సజావుగా జరిగేలా చూడవలసిన ప్రధాన బాధ్యత ప్రతిపక్షంపై ఉంది. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రజలకు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా చర్చ ఉంటుంది కాబట్టి దీన్ని వృథా కాకుండా చూడాలి. పార్లమెంటులో కనీసం ఒక గంట సమయమైనా దేశానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని అధికార, ప్రతిపక్షాలు చేజార్చుకోవటం మంచిది కాదు.
*

-కె.కైలాష్ 98115 73262