ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అదే వరస.. ‘సభ’లో రభస..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అంతా ఊహించిందే జరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలు తమ రాజకీయాల కోసం శీతాకాల సమావేశాలను భ్రష్టుపట్టిస్తున్నాయి. గతవారం ప్రారంభమైన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఏ ఒక్కరోజు కూడా సజావుగా జరుగలేదు. మొదటిరోజున మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి, లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ సహా మరికొందరు ఎంపీల మృతి పట్ల సంతాపం తెలిపిన అనంతరం సభ వాయిదా పడింది. మిగతా మూడురోజుల్లో ఉభయపక్షాలు చేసిన గొడవ మూలంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇకముందు కూడా ఉభయ సభలు సజావుగా జరుగుతాయనే గ్యారంటీ ఎంతమాత్రం లేదు.
అధికార, ప్రతిపక్షాలు తమ పార్టీ రాజకీయాలకు ఇచ్చినంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత దేశ సమస్యలకు ఇవ్వడం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించక కష్టాల పాలవుతున్న వేలాది మంది రైతులు ఢిల్లీని ముట్టడించిన సంఘటనపై పార్లమెంటులో చర్చించి వారి సమస్యలకు సముచిత పరిష్కారం కనుగొనాలనే ఇంగిత జానం ఇరుపక్షాల్లోనూ లోపించింది. ఈ పరిస్థితి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టిన దుర్గతికి అద్దం పడుతోంది. కాంగ్రెస్, తెలుగుదేశం, అన్నా డీఎంకే, శివసేన పార్టీలు వారం రోజులపాటు సమావేశాలను స్తంభింపజేశాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో పెద్దఎత్తున అవినీతి జరిగిందని అనుమానిస్తున్న కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సమగ్ర విచారణ జరిపేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలని పట్టుపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనంతవరకు పార్లమెంటును స్తంభింపజేస్తామని తెలుగుదేశం రాజకీయం చేస్తోంది. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేయాలని అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు ఉభయ సభల్లో పోడియం వద్ద తిష్టవేస్తున్నారు.
శివసేన పార్టీ అయోధ్యలో రామమందిరాన్ని వెంటనే నిర్మించాలంటూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నది. ఈ నాలుగు పార్టీలు ఉభయ సభల్లో ప్రస్తావిస్తున్న సమస్యలకు ఇప్పట్లో ఎలాంటి పరిష్కారం లభించదు. ఈ వాస్తవం ఆయా పార్టీలకు బాగా తెలుసు. ‘రాఫెల్’ వివాదంపై జేపీసీని నియమించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం అంగీకరించదనేది అందరికీ తెలిసిందే. కాంగ్రెస్‌తోపాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌తో కూడిన ధర్మాసనం ‘రాఫెల్ ఒప్పందం’లో ఎలాంటి అక్రమాలు కనిపించలేదని తీర్పు ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ప్రభు త్వం ఇచ్చిన పత్రాలను సు ప్రీం కోర్టు ఏ మేరకు అధ్యయనం చేసిందోగానీ తీర్పు మాత్రం చాలా స్పష్టంగా ఉంది. యుద్ధ విమానాల కొనుగోలుకు అనుసరించవలసిన అన్ని పద్ధతులనూ పాటించారు, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా జరిగింది కాబట్టి దీనిపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఎంత మాత్రం లేదని తీర్పులో స్పష్జం చేశారు. సుప్రీం కోర్టు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తరువాత కూడా- ‘రాఫెల్ వివాదం’పై ఉభయ సభలను స్తంభింపజేయడం కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలకు ఎంత మాత్రం తగదు. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు సుప్రీం కోర్టు తీర్పును అవహేళన చేస్తూ పార్లమెంటు ఉభయ సభల్లో గొడవ చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆమోదించేందుకు విముఖత చూపడం మంచి పరిణామం కాదు.
కోర్టులు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే మెచ్చుకోవటం, ప్రతికూలంగా తీర్పు ఇస్తే నిందించటం, ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యాయని ఆరోపించటం ప్రతిపక్షాల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. కోర్టు తీర్పులో ఏమైనా లొసుగులు ఉంటే వాటిపై మళ్లీ కోర్టు తలుపులు తట్టడం సమంజసం. పార్లమెంటును స్తంభింపజేయటం సమర్థనీయం కాదు. రాఫెల్ ఒప్పందంలో తమకు ఎలాంటి లొసుగులు కనిపించలేదని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం చెబుతుంటే, అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ మొండిగా వాదించటం ప్రజాస్వామ్య విరుద్ధం అవుతుంది. కోర్టు తీర్పు దృష్ట్యా రాహుల్ గాంధీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ భాజపా, దాని మిత్రపక్షాల సభ్యులు ఉభ య సభల్లో గొడవ చేయటం, సభా కార్యక్రమాలకు అడ్డుతగలటం శోచనీయం. అధికార పక్షం ఇలా వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. రాఫెల్ విషయంలో రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పారని భాజపా భావిస్తే- తమ వాదనను వినిపించేందుకు ప్రజల వద్దకు వెళ్లవచ్చు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రజల ముందు పెట్టి వారి తీర్పు అడగటం ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది తప్ప, ఆ తీర్పును అడ్డం పెట్టుకుని పార్లమెంటు సమావేశాల్లో గొడవ చేయటం ఎందుకు? రభస చేయడం ద్వారా అధికారపక్ష సభ్యులు సైతం బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారు.
ఇక పార్లమెంటును కుదిపివేస్తున్న రెండో అంశం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్. పదహారవ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో ఇకమీదట ఏ రా ష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వటం జరగదని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయటం తెలిసిందే. ప్రత్యేక హోదా ఇచ్చినంత మాత్రాన పెద్దగా ఒరిగేదేమీ లేదని తెలిసిన తరువాత కూడా పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం తెలుగుదేశం పార్టీకి ఎంత మాత్రం తగదు. ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఎంతో మంచిదని గతంలో ఊదరకొట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇపుడు వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవదీయిస్తున్నారు. ప్రత్యేక హోదాపై ఆందోళన కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నారే తప్ప అది నిజంగా వస్తుందనే చిత్తశుద్ధితో కాదు. ఆచరణ సాధ్యం కాని డిమాండ్ కోసం పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయటం బాధ్యతారాహిత్యమే అవుతుంది. తెలుగుదేశం గత పార్లమెంటు సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించినా ఏమీ సాధించలేకపోయింది. పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతిసారి ప్రత్యేక హోదా పేరుతో రాజకీయం చేయటం తెలుగుదేశం, వైకాపాలకు అలవాటుగా మారింది. భాజపా ప్రభుత్వంలో కొనసాగినంత కాలం ప్రత్యేక హోదా వ్యవహారంపై సభలో గొడవ చేయాలనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి రాలేదు. కానీ ఎన్‌డీఏ కూటమి నుండి తప్పుకున్న మరుక్షణం ప్రత్యేక హోదా లేనందున ఏపీకి అన్యాయం జరుగుతోందన్న సంగతి గుర్తుకు రావటం రాజకీయం కాక మరేమిటి?
పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తున్న మూడో అంశం కర్నాటక ప్రభుత్వం చేపట్టిన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు వ్యవహారం. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరీ నదిపై చేపట్టిన మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు సమస్యను పార్లమెంటులో ప్రస్తావించినంత మాత్రాన పరిష్కారం కాదు. ఈ వాస్తవం అందరికీ తెలిసిందే అయినా ఉభయ సభలను స్తంభింపజేయం రాజకీయమే తప్ప ప్రజల ప్రయోజనం ఆశించి కాదు. పార్లమెంటులో గొడవ చేయటం వలన ఇంతవరకు ఏ నదీ జలాల సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఉభయ పక్షాలూ చర్చల ద్వారానే నదీ జలాల పంపిణీ సమస్యలను ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించుకున్నాయనే వాస్తవాన్ని అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు గ్రహించటం మంచిది. పార్లమెంటును స్తంభింపజేసినంత మాత్రాన అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశం కొలిక్కి వస్తుందని ఆశించటం శివసేన పార్టీ తప్పిదమే అవుతుంది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలనే డిమాండ్‌తో ఉభయ సభలను శివసేన పార్టీ రెండురోజుల పాటు స్తంభింపజేసింది. రామమందిరం నిర్మాణంపై అధికారంలో ఉన్న భాజపా సర్కారును ఇరకాటంలో పడవేసేందుకే శివసేన ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని ఉభయ సభలను గందరగోళానికి గురి చేసింది. భాజపా, దాని అనుబంధ సంస్థలు, సంఘ్ పరివార్ వంటి సంస్థలు ఇంతకాలం అయోధ్యలో రామమందిరం అంశాన్ని రాజకీయ,సామాజిక ప్రయోజనాల కోసం వాడుకునేవి. తాజాగా శివసేన కూడా అయోధ్య అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయటం ప్రారంభించింది. ప్రతి రాజకీయ పార్టీ దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును దుర్వినియోగం చేస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్న పార్టీలను ప్రజలు తిరస్కరించినప్పుడే ఇవి దారికి వస్తాయి. పోడియం వద్ద గొడవ చేసే ఎంపీలకు ప్రజలు తదుపరి ఎన్నికల్లో ఓటు వేయటం మానేస్తే- పరిస్థితి చక్కబడుతుంది.

-కె.కైలాష్ 98115 73262