ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘భారతదేశం’ మనుగడ కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ భారత దేశం’ బతికి బట్టకట్టాలంటే పౌరసత్వ సవరణ చట్టం (సిఏఏ), జాతీయ పౌరసత్వ రిజిష్టరు (ఎన్.ఆర్.సి) ఎంతో అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించటం వెనక పదవీ రాజకీయంతోపాటు మైనారిటీ ఓటు బ్యాంకు రాజకీయం కొనసాగుతోంది. అందుకే ముస్లిం మైనారిటీలను రెచ్చగొట్టటం ద్వారా తమ పబ్బం గడుపుకునేందుకు పలు రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లోమతపరమైన హింసను ఎదుర్కొని భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్శీలు, జైనులకు భారతీయ పౌరసత్వం కల్పించటాన్ని వ్యతిరేకించటం అర్థరహితం. మతం ఆధారంగా కాకుండా మూడు దేశాలకు చెందిన మైనారిటీలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న వాదన సమర్థనీయం కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ దేశాలు నూటికి నూరు శాతం ఇస్లాం మతం ఆధారంగా పనిచేసే దేశాలు. ఈ మూడు దేశాలలోని మైనారిటీలకు ఎలాంటి భద్రత లేదు. ఈ మూడు దేశాల్లోని హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులు, పార్శీలు భారతదేశానికి రాకుండా ఏ ఇతర దేశానికైనా వెళ్లగలుగుతారా? వీరిని ఏ ఇతర దేశమైనా స్వీకరిస్తుందా? వీరికి భారతీయ పౌరసత్వం కల్పిస్తే భారతదేశంలోని ముస్లింలకు వచ్చే నష్టం ఏమిటి? ఎలా వారి పట్ల ఎలా వివక్ష చూపించినట్లు అవుతుందనే ప్రశ్నలకు ప్రతిపక్షాలు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాట వేస్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంలో ఆరు మతాల వారిని పేర్కొనటం ద్వారా ముస్లింల పట్ల వివక్ష చూపించారంటూ ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు చేస్తున్న వాదన పూర్తిగా అర్థరహితం. మూడు ఇస్లామిక్ దేశాలలోని ముస్లింల గురించి పౌరసత్వ చట్టంలో ప్రస్తావించకపోవటం పట్ల ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఇస్లాం మతంలోని చిన్న వర్గాల వారికి పౌరసత్వ సవరణ చట్టంలో ఎందుకు స్థానం కల్పించలేదంటూ ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు వాదించటం సిగ్గుచేటు. శ్రీలంకలోని తమిళ హిందువుల గురించి ఎందుకు సవరణ చట్టంలో ప్రస్తావించలేదన్నది వీరి ప్రశ్న. శ్రీలంకలో హిందువులు మతపరమైన హింసకు గురవుతున్నారా? అంటే లేదనే చెప్పాలి. మూడు ఇస్లామిక్ దేశాలోని హిందువులు, ఇతర మైనారిటీల వర్గాల వారు ఎదుర్కొంటున్న కష్టాలు, హింసతో పోలిస్తే శ్రీలంకలోని హిందువులు ఎంతో బాగున్నారు. శ్రీలంకలోని తమిళ హిందువులు భారతదేశంలోని ముఖ్యంగా తమిళనాడులోకి వచ్చి పోవటంపై ఎలాంటి నిర్భంధం లేదు. పాకిస్తాన్‌లోని హిందువులు, ఇతర మైనారిటీలు తమ ఇష్టానుసారం భారతదేశానికి వచ్చి వెళ్లేందుకు వీలుందా? మూడు ఇస్లామిక్ దేశాల్లోని హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు పడుతున్న బాధలను శ్రీలంకలోని తమిళ హిందువులతో పోల్చేందుకు వీలులేదు. శ్రీలంకలోని తమిళ హిందువులు తమ మనుగడను కాపాడుకునేందుకు కొన్ని దశాబ్దాల పాటు పోరాటం చేయగలిగారు. మూడు ఇస్లామిక్ దేశాలలోని హిందువులు, ఇతర మైనారిటీలకు ఆ అవకాశం ఉండిందా? మూడు ఇస్లామిక్ దేశాలలోని ఆరు మైనారిటీ మతాల వారికి భారతీయ పౌరసత్వం కల్పించటం వలన భారతదేశంలోని ముస్లింల మనుగడకు ప్రమాదం ముంచుకు వస్తోందటూ కాంగ్రెస్, వామపక్షాలు, టి.ఎం.సి., ఆర్.జె.డి. ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం వెనక ఉన్న కుట్రను బట్టబయలు చేయవలసిన బాధ్యత బి.జె.పి.పై ఉన్నది. పౌరసత్వ సవరణ చట్టంపై చేస్తున్న తప్పుడు ప్రచారం, భారతదేశంలోని ముస్లింలను రెచ్చగొడుతూ దేశంలో అశాంతిని రెచ్చగొట్టేందుకు చేస్తున్న రాజకీయ కుట్రలకు ఈ ప్రతిపక్షాలు భారీ మూల్యం చెల్లించక తప్పదు. దేశ ప్రజలు ముఖ్యంగా మెజారిటీ హిందువులు ఈ పరిణామాలను, ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. వారు అవకాశం వచ్చినప్పుడు ప్రతిపక్షాలకు గట్టి గుణపాఠం నేర్పిస్తారు. కాంగ్రెస్ జాతీయ రాజకీయాల నుండి తుడిచి పెట్టుకుపోవటానికి ప్రధాన కారణం ఆ పార్టీ దశాబ్దాల తరబడి అనుసరించిన మైనారిటీల బుజ్జగింపు విధానమే ప్రధాన కారణం. ఈ మాట నేను చెప్పటం లేదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎ.కె. ఆంథోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి ముస్లిం, ఇతర మైనారిటీలను వెనకేసుకురావటం పట్ల ఆగ్రహం చెందిన దేశ ప్రజలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో బి.జె.పికి పట్టం కట్టారు, నరంద్ర మోదీని భారీ మెజారిటీతో గెలిపించారని ఎ.కె. ఆంథోని తన నివేదికలో స్పష్టం చేశారు. ఆంథోని చెప్పిన ఈ మాటలను కాంగ్రెస్ పార్టీ మరోసారి పెడచెవిన పెడుతోంది. కాంగ్రెస్‌ను సమర్థంగా నడిపించటంలో ఘోరంగా విఫలమైన రాహుల్‌గాంధీ అధ్యక్ష పదవి చేపట్టకుండానే బాధ్యతలనేవి లేకుండా పార్టీని నడిపిస్తున్నారు. బాధ్యతలు తీసుకోకుండా తెర వెనక నుండి కాంగ్రెస్‌ను నడిపించేందుకు రాహుల్‌గాంధీ చేస్తున్న ఈ ప్రయోగం పార్టీని మరోసారి నిండా ముంచుతుంది. రాహుల్ గాంధీ ఆదేశం మేరకే కాంగ్రెస్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించటంతోపాటు ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను రెచ్చగొడుతోంది. కాంగ్రెస్‌ను పట్టుకుని వేలాడే ఆర్.జె.డి లాంటి పార్టీలు పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే పేరుతో హింసాత్మక పరిస్థితులను సృష్టిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం పట్ల పౌర ఆగ్రహం వ్యక్తమవుతోందంటూ ప్రతిపక్షాలతోపాటు మీడియా కూడా దుష్ప్రచారాన్ని చేస్తున్నాయి. పౌర ఆగ్రహం అంటే దేశంలోని పౌరులందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారనే అర్థంతో ఈ పదాన్ని ఉపయోగించటం మంచి విధానం కాదు. ముస్లిం మైనారిటీలతోపాటు ఈశాన్య రాష్ట్రాలలోని ఇతర మైనారిటీలు మాత్రమే పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌరసత్వ రిజిస్టరు విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. మూడు ఇస్లామిక్ దేశాలు ముఖ్యంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి కొనసాగుతున్న ముస్లింల అక్రమ చొరబాటును అరికట్టటంతోపాటు ఇదివరకే ఇక్కడికి వచ్చి తిష్ట వేసిన వారిని పంపించి వేయటమే జాతీయ పౌరసత్వ రిజిస్టరు లక్ష్యం. దీనిని అక్రమంగా వచ్చినవారు తప్ప ఇతరులు వ్యతిరేకించేందుకు ఎంత మాత్రం వీలులేదు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చి రాష్ట్రంలో స్థిరపడిన వారి ఓట్ల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోంది. గతంలో బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన వారిని వెనుకకు పంపించాలని ఉద్యమం చేసిన మమతా బెనర్జీ ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయం కోసం సి.ఏ.ఏను వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు తాత్కాలిక, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక, శాశ్వత ప్రయోజనాలను దెబ్బతీయటం దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. పౌరసత్వ సవరణ చట్టం మూలంగా భారతీయ ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందని బాధపడుతున్న ప్రతిపక్షాలు, కుహనా లౌకికవాదులు ఇస్లామిక్ దేశాల్లోని మైనారిటీలను పరిరక్షించగలరా? దీనికోసం పోరాడగలరా? ఇస్లామిక్ దేశాలలోని మెజారిటీ ముస్లింలకు కూడా భారతీయ పౌరసత్వం ఇస్తే భారతదేశం అనేది మిగులుతుందా? హిందువులనే వారుంటారా? ముస్లిం దండయాత్రల మూలంగా పోయింది పోగా రెండు ముక్కలైంది. ఇప్పుడున్న పరిస్థితిలు యథాతథంగా కొనసాగితే మరో ఇరవై, ముప్పై సంవత్సరాల తరువాత దేశం మరోసారి మతపరమైన సమస్యల మూలంగా విభజనకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. కాశ్మీర్‌లో మతపరమైన దౌర్జన్యాలు, దోపిడీని అరికట్టలేని కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీలు, కుహనా లౌకికవాదులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాశ్మీర్ లాంటి పరిస్థితులు నెలకొంటే అపగలుగుతారా? మతసామరస్యం, లౌకికవాదం గురించి చెప్పటం చాలా సులభం. కానీ చేసి చూపించటం చాలా కష్టం. మతవ్ఢ్యౌం హద్దుమీరిన ప్రతిసారీ లౌకికవాదం కనుమరుగైపోవటం పరిపాటి. ప్రతిపక్షాలు ఇప్పటికైనా పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టరు విషయంలో విజ్ఞతతో వ్యవహరించటం మంచిది. అక్రమ వలసలు ఇలాగే కొనసాగితే అనతికాలంలోనే భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదంలో పడిపోతుందనేది కుహనా లౌకికవాదులు ఇప్పటికైనా గ్రహించటం మంచిది. మైనారిటీలకు శరణు ఇచ్చిన ఐరోపా తదితర దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయనేది తెలుసుకోవటం మంచిది.

కె.కైలాష్ 98115 73262