ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మనకెందుకు వద్దు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిపాదించిన జాతీయ పౌర రిజిష్ట్రేషన్ (ఎన్.ఆర్.సి)ని అన్ని ప్రతిపక్షాలతోపాటు ముస్లిం మైనారిటీ ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్.ఆర్.సి తమ ప్రయోజనాలు దెబ్బ తీస్తుందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నాయి. అయితే ప్రపంచంలోని మెజారిటీ దేశాలు తమ పౌరుల వివరాలు రిజిష్టరు చేసి గుర్తింపు కార్డులు ఇస్తుంటే భారతీయ పౌరులకు ఎందుకు ఇవ్వకూడదన్నది ప్రశ్న. పొరుగున ఉన్న మూడు ముస్లిం దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ సైతం తమ పౌరుల వివరాలతోకూడిన రిజిష్టరులను ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇచ్చినప్పుడు మన దేశంలో దీనిని ఎందుకు అమలు చేయకూడదు? ఏఏ దేశాల్లో ఎన్.ఆర్.సి లాంటివి అమలు జరుగుతున్నాయనేది పరిశీలిస్తే మనమెంత వెనుకబడి ఉన్నామనేది వెలుగులోకి వచ్చి ఆశ్చర్యం వేయకమానదు. పొరుగున ఉన్న ఇస్లామిక్ పాకిస్తాన్ ప్రభుత్వం తమ పౌరులందరికి తమను తాము రిజిష్టరు చేసుకుని గుర్తింపు కార్డు తీసుకోవటం తప్పనిసరి చేసింది. పాకిస్తాన్‌లో దీనిని సి.ఎన్.ఐ.సి (కంప్యూటరైజడ్ ఐడింటిటీ కార్డ్) అని అంటారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ కార్డును తీసుకోవలసి ఉంటుంది. బ్యాంకు ఖాతా, పాస్ పోర్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు, కారు, భూమి కొనుగోలుకు, విమానం, రైలు టికెట్ కొనుగోలుకు ఇది తప్పనిసరి. ఇది గుర్తింపు కార్డు లేని పక్షంలో మొబైల్ ఫోను, సిమ్ కార్డు కొనుక్కోలేము. విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్, నీటి కనెక్షన్ కావాలంటే ఈ కార్డు ఉండవలసిందే. చివరకు కాలేజీల్లో పిల్లలకు సీటు కావాలన్నా ఈ కార్డును చూపించవలసిందే. పెద్ద ఆర్థిక లావాదేవీలన్నింటికి ఈ కార్డు తప్పనిసరి. పాకిస్తాన్‌లో ఉండాలంటే ఈ కార్డు తప్పనిసరి. ఈ కార్డు లేనిపక్షంలో పాకిస్తాన్‌లో జీవించే అవకాశాలు దాదాపుగా శూన్యం.
పాకిస్తాన్ నేషనల్ డాటా బేస్ అండ్ రిజిష్ట్రేషన్ అథారిటీ (ఎన్‌ఏడిఆర్‌ఏ) ఈ కార్డును జారీ చేస్తుంది. పాకిస్తాన్‌లో రెండు రకాల గుర్తింపు కార్డులు అమలులో ఉన్నాయి. సి.ఎన్.ఐ.సి మరియు ఎస్.ఎన్.ఐ.సి. సి.ఎన్.ఐ.సి మొత్తం ఉర్దూలో ఉంటుంది. ఎస్.ఎన్.ఐ.సి మొదటి జాతీయ ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డు. యంత్రం చదివేందుకు వీలుగా తయారు చేసిన ఈ కార్డులో యజమాని ఫొటోతోపాటు చేతివేళ్ల ముద్రలు నిక్షిప్తమై ఉంటాయి.
ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే దేశంలోని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఈ కార్డును తీసుకోవలసిందే. నేషనల్ ఐడెంటిటీ కార్డు (ఎన్.ఐ.డి) అని పిలిచే బంగ్లాదేశ్ గుర్తింపు కార్డును దేశంలోని ప్రతి మహిళ, ప్రతి పురుషుడు కలిగి ఉండవలసిందే.. ప్రభుత్వం జారీ చేసే ఈ ఫొటో గుర్తింపు కార్డు బయోమెట్రిక్, మైక్రోచిప్ కలిగి ఉంటే స్మార్ట్ గుర్తింపు కార్డు. ఎన్.ఐ.డి కార్డు ఉన్నవారు మాత్రమే బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీలుంటుంది. దీనితోపాటు డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, ఫ్లాట్, ప్లాటు కొనాలన్నా ఈ కార్డు తప్పనిసరి. నీరు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్‌కు కూడా ఇది ఉండవలసిందే.. బంగ్లాదేశ్ ఎలక్షన్ కమిషన్‌లోని జాతీయ గుర్తింపు రిజిస్ట్రేషన్ విభాగం (ఎన్.ఐ.డి.డబ్లు) ఈ స్మార్ట్ కార్డును 2016 నుండి జారీ చేస్తోంది. పాకెట్ సైజ్ గుర్తింపు కార్డులోని చిప్‌లో సదరు వ్యక్తికి సంబంధించిన ఫొటోతోపాటు పూర్తి వివరాలను పొందుపరుస్తారు. మొత్తం ఇరవై రెండు ముఖ్యమైన సేవలను పొందాలంటే ఈ గుర్తింపు కార్డు ఉండటం తప్పనిసరి. పౌరుల హక్కులు, ప్రయోజనాలు పొందేందుకు, జాతీయ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్టు కోసం ఇది తప్పనిసరి. దీనితోపాటు ఆస్తుల కొనుగోలు, విక్రయం చేయాలంటే ఈ కార్డు ఉండవలసిందే. పెళ్లిని రిజిష్టరు చేయాలంటే ఈ కార్డు ఉండవలసిందే. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందేందుకు ఇది తప్పనిసరి. మొత్తం మీద ఈ కార్డు లేనివాడు దేశం పౌరుడు కాదు.
తాలిబాన్ తదితర ఇస్లామిక్ ఉగ్రవాదుల సమస్యలతో సతమతమవుతున్న అఫ్ఘనిస్తాన్ సైతం తమ పౌరులకు ఎలక్ట్రానిక్ గుర్తింపు కార్డులు ‘ఈ-తజ్కిరా’ జారీ చేస్తోంది. ఈ-తజ్కిరా కార్డు అఫ్ఘనిస్తాన్ పౌరుల జాతీయ గుర్తింపు కార్డు. దేశంలోని ప్రతి పౌరుడు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ఈ కార్డు గుర్తింపు, నివాసం, పౌరసత్వానికి సాక్ష్యం. ఈ-తజ్కిరా కార్డు లేనివాడు అఫ్ఘనిస్తాన్ పౌరుడు కాదు. అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ ఘనీ, ఆయన భార్య రూలా ఘనీకి 2018 మే మూడో తేదీనాడు ఈ-తజ్కిరా కార్డును మొదటిసారి అందజేయటంతో దేశ పౌరులకు ఈ గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైంది. అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి ఈ-తజ్కిరా కార్డును అప్‌డేట్ చేసుకోవలసి ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మాదిరిగానే అఫ్ఘనిస్తాన్‌లో ఈ కార్డు ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. ఓటింగ్‌లో పాల్గొనాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా ఈ కార్డు తప్పనిసరి. అదే విధంగా ఫ్లాట్, ప్లాటు కొనాలన్నా, విక్రయించాలన్నా, బ్యాంకు నుండి రుణం తీసుకోవాలన్నా ఈ కార్డు ఉండవలసిందే. ఈ-తజ్కిరా కార్డు లేకపోతే ప్రభుత్వంతో ఎలాంటి లావాదేవీలు సాధ్యం కాదు. ఈమూడు ముస్లిం దేశాలు కావటం వలన ఇస్లామిక్ షరియా రూలు ప్రకారం అన్ని పనులు జరుగుతాయి అంటే ముస్లిం కాని వారిని ఈ దేశాల్లో పౌరులుగా గుర్తించరు. అందుకే ఇతర మతాల వారికి ఈ మూడు ఇస్లామిక్ దేశాల్లో గుర్తింపు కార్డులు లభించవు. గుర్తింపు కార్డులు లేకుండా ఈ మూడు ఇస్లామిక్ దేశాల్లో జీవించటం అంటే నరకంతోసమానం.
ఇక మిగతా ముస్లిం దేశాల్లో గుర్తింపు కార్డుల విధానాన్ని పరిశీలిద్దాం. ఇస్లాం మతానికి కేంద్ర బిందువైన సౌదీ అరేబియాలో పౌరుల జాతీయ గుర్తింపు కార్డును ‘బితాగత్ అల్-హవియ్యా అల్-వతనియ్యా’ అని అంటారు. సౌదీ అరేబియా దేశం పౌరసత్వానికి ఇది గుర్తింపు. ఈ కార్డు లేనివాడు సౌదీ అరేబియా పౌరుడు కాదు. సౌదీ అరేబియాలో కూడా జాతీయ గుర్తింపు కార్డు లేకపోతే ఎలాంటి పనులు సాధ్యం కాదు. ఓటింగ్‌లో పాల్గొనలేరు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు లభించదు. ప్రభుత్వం, బ్యాంకుల నుండి ఎలాంటి రుణాలు లభించవు. ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం పొందేందుకు వీలుండదు. ఇక ఫ్లాట్,ప్లాట్ కొనటం అనేది అసాధ్యం. ఈ కార్డు లేకపోతే సౌదీ అరేబియాలో ఉండేందుకు వీలుండదు. క్రెడిట్ కార్డు సైజులో ఉండే జాతీయ గుర్తింపు కార్డులోని ఆప్టికల్ స్ట్రిప్‌లో కార్డు యజమానికి సంబంధించిన ఫోటో, ఇతర వివరాలు పొందుపరుస్తారు. ఈ కార్డును యంత్రం చదివేందుకు వీలుగా రూపొందించకపోవటం గమనార్హం. ముస్లింలు అత్యధికంగా ఉన్న మలేషియాతోపాటు ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాలు తమ పౌరులకు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. జాతీయ గుర్తింపు కార్డులు లేకపోవటం అంటే సదరు వ్యక్తి ఆ దేశం పౌరుడు కాదనేది సుస్పష్టం. ముస్లిం దేశాలతోపాటు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు తమ పౌరులకు జాతీయ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దేశ భద్రత, ప్రభుత్వ పథకాల లభ్యత, ఇతర అవసరాల కోసం ఈ కార్డు తప్పనిసరి చేయటం గమనార్హం. ప్రపంచంలోని ఇన్ని దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేయటంతోపాటు పౌరుల రిజిష్టర్లను నిర్వహిస్తున్నప్పుడు మన దేశంలో ఎందుకు చేయకూడదన్నది ప్రశ్న. మన దేశంలో కూడా పౌరులందరికి జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వటంతోపాటు వారి పౌరసత్వ రిజిష్టర్లు నిర్వహిస్తే తప్పేమిటి?
దేశంలో నివసిస్తున్న వివిధ మతాలు, వర్గాల ప్రజల స్థితిగతులు ఏమిటి? బడుగు, బలహీనవర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి ఎలాంటి పథకాలు చేపట్టాలనేది నిర్ధారించాలంటే వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఉండవలసిన అవసరం ఎంతో ఉన్నది. ప్రణాళికా రూపకర్తల ముందు సరైన సమాచారం లేకపోతే పథకాల రచన ఎలా జరుగుతుంది? సమస్యను గుర్తిస్తేనే కదా పరిష్కారం గురించి ఆలోచించగలుగుతాము? సమస్య గురించి అవగాహన లేనప్పుడు పరిష్కారం ఎలా లభిస్తుంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకోకుండా దేశాభివృద్ధికి, ఆయా మతాలు, వర్గాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించటం, పథకాలను సిద్ధం చేయటం సాధ్యం కాదనేది మన ప్రతిపక్షానికి తెలియదా? లౌకికవాదులకు ఇది తెలియదా? వీరు ఏ దురుద్దేశ్యంతో ఎన్.ఆర్.సిని వ్యతిరేకిస్తున్నారనేది ఆలోచించవలసి ఉన్నది.

కె.కైలాష్ 98115 73262