ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాష్ట్రపతిని అవమానించటం ప్రతిపక్షానికి తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత రాష్ట్రపతిని కూడా పార్టీ రాజకీయాలకు బలి చేయటం ప్రతిపక్షానికి ఎంత మాత్రం తగదు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ గత శుక్రవారం నాడు పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు చేసిన గొడవ ఎంత మాత్రం సమర్థనీయం కాదు. రామ్‌నాథ్ కోవింద్ పౌరసత్వ సవరణ చట్టం చారిత్రాత్మకమని ప్రకటించగానే ప్రతిపక్షం సభ్యులు ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యులు ‘సిగ్గు.. సిగ్గు..’ అనే నినాదాలతో రాష్ట్రపతి ప్రసంగానికి చాలా సేపు అడ్డుతగలటం ద్వారా దుష్ట సంప్రదాయానికి తెర లేపారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను రాష్ట్రపతి చదువుతారు కాబట్టి అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేయటం ఎప్పుడు జరిగేదే. రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగాన్ని సమర్థిస్తూ ఎన్.డి.ఎ. సభ్యులు బల్లలు చరుస్తూ తమ ఆమోదం తెలిపితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎందుకు ఉడికిపోవాలి? పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సంధర్భంగా సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం రాష్టప్రతి రాజ్యాంగపరమైన బాధ్యత. అధికారంలో ఉన్న పార్టీ తయారుచేసే ప్రసంగ పాఠాన్ని రాష్ట్రపతి చదవుతారనేది కాంగ్రెస్‌తో పాటు ఇతర ప్రతిపక్షాలకు బాగా తెలుసు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం అభీష్టానికి అనుగుణంగా రాష్టప్రతి ప్రసంగం ఉంటుంది తప్ప రాష్టప్రతి ఇష్టానుసారం ఉండదు. రాష్టప్రతి ప్రసంగాన్ని కేంద్ర మంత్రి వర్గం ఆమోదించవలసి ఉంటుంది. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానే్న రాష్ట్రపతి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులకు చదివి వినిపిస్తారు. అధికారంలో ఉన్న పార్టీ తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి రాష్ట్రపతి ప్రసంగం ద్వారా ప్రజలకు చెబుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే జరిగేది. రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కూడా ఇదే పని చేస్తాయి. గవర్నర్ ప్రసంగం ద్వారా తమ గొప్పలు చెప్పుకోవటం ప్రతి సంవత్సరం జరిగేదే. రాష్టప్రతి పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో లోకసభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం, రాష్ట్రాల్లో రాష్ట్ర గవర్నర్ శాసన సభలో శాసన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించటం రాజ్యాంగపరమైన ఆనవాయితీ. అందుకే పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాష్టప్రతి ప్రసంగాన్ని శాసన సభల్లో రాష్ట్ర గవర్నర్ ప్రసంగాన్ని ఎవ్వరు, ఎప్పుడు అడ్డుకునే వారు కాదు. అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రతిపక్షానికి ఎంత కోపం ఉన్నా రాష్టప్రతి, గవర్నర్ ప్రసంగాలకు ఇంత పెద్ద ఎత్తున అడ్డుతగలటం ఎప్పుడు జరగలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఒకరిద్దరు సభ్యులు నిలబడి ఒక్క మాటలో తమ అభ్యంతరం తెలిపి కూర్చోవటం జరిగేది. ఇప్పుడు మొదటిసారి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో అడ్డుపడటం ద్వారా దుష్ట సంప్రదాయానికి తెర లేపింది. మామూలుగా అడ్డుతగిలితే అర్థం చేసుకోవచ్చు కానీ ఒకేసారి ఇరవై, ముప్పై మంది ఎం.పి.లు లేచి నిలబడి సిగ్గు, సిగ్గు అంటూ సెంట్రల్ హాల్ అధిరిపోయేలా నినాదాలు ఇవ్వా లా? రాష్ట్రపతి దేశం మొదటి పౌరుడు, అత న్ని అవమానించటం అంటే తమను తాము అవమానించుకోవటంతోపాటు దేశ ప్రజలు అవమానించటమే. తమ పార్టీకి చెందిన పలువురు ఎం.పి.లు రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగులుతుంటే కంగ్రెస్ అధినాయకులు వౌనం వహించటం సమర్థనీయం కాదు. కాంగ్రెస్ అధినాయకుల ఆదేశం మేరకే పార్టీ ఎం.పి.లు రాష్టప్రతి ప్రసంగానికి అడ్డుతగిలారు కాబట్టి ఈ దుష్ట సంప్రాదాయానికి సభ్యుల కంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకులే ప్రధాన బాధ్యత వహించకతప్పదు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశంలోని ప్రతి రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నాడని ఆరోపించే ప్రతిపక్షాలు రాష్టప్రతి ప్రసంగానికి అందునా బడ్జెట్ సమావేశాల సంధర్భంగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రసంగిస్తున్న రాష్టప్రతికి అడ్డుతగలవచ్చా? రాష్ట్రపతికి అడ్డుతగలటం ద్వారా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షం సభ్యులు రాష్టప్రతి వ్యవస్థను, పార్లమెంటరీ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టుపట్టించలేదా? రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారంటూ మోదీపై అనునిత్యం ఆరోపణలు కురిపించే కాంగ్రెస్ రాష్టప్రతి వ్యవస్థను కించపరటం ఎంత వరకు సమర్థనీయం? నీతులు చేప్పేందుకేనా అమలు చేసేందుకు కాదా? కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రపతి ప్రసంగానికి అడ్డుతగిలే బదులు పార్లమెంటు ఆవరణలోని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసనతో సరిపెట్టుకుంటే బాగుండేది. రాష్డ్రపతి రామ్‌నాథ్ కోవింద్ తమ ప్రసంగంలో చెప్పినట్లు పౌరసత్వ సవరణ చట్టం చరిత్రాత్మికమైనదేనని చెప్పేందుకు ఎవ్వరికి ఎలాంటి సందేహం ఉండనక్కర లేదు. మూడు ముస్లిం దేశాలలో మతపరమైన హింసను ఎదుర్కొంటున్న హిందులు, సిక్కులు, క్రైస్తవువలు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు భారతదేశం పౌరసత్వం కల్పిస్తే తప్పేమిటి? దేశ విభజన అనంతరం పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ దేశాల్లోనే ఉండిపోయిన హిందువులు, సిక్కులు భారతదేశానికి వచ్చి స్థిరపడాలనుకుంటే వారికి అన్ని సౌకర్యాలు కల్పించవలసిన బాధయత భారత ప్రభుత్వంపై ఉంటుంథని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. రామ్‌నాథ్ కోవింద్ ఈ వాస్తవాన్ని తన ప్రసంగంలో ఉటంకిస్తే కాంగ్రెస్ సభ్యులకు కోపం ఎందుకు రావాలి? పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ నుండి వచ్చేయాలనుకునే హిందువులు, సిక్కులకు భారతీయ పౌరసత్వం కల్పించాలని మహాత్మా గాంధీ చెప్పలేదా? హిందువులు, సిక్కులు, క్రైస్తవులు తదితర అల్పసంఖ్యాక వర్గాల ప్రజలకు భారతీయ పౌరసత్వం కల్పించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ముస్లింలకు కూడా ఈ అవకాశం కల్పించాలంటూ ప్రతిపక్షం చేస్తున్న వాదన అత్యంత ప్రమాదకరమైనది. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మన దేశంలోకి వచ్చిన లక్షలాదిమందికి భారతీయ పౌరసత్వం కల్పించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్షం ఈ వాదన చేస్తోంది. మూడు ఇస్లామిక్ దేశాల నుండి మతపరమైన హింస మూలంగా మన దేశంలోకి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు ఇతర మతస్థుల సంఖ్య వేలల్లో ఉంటే ఇతర కారణాల మూలంగా మన దేశంలోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశ ముస్లిముల సంఖ్య లక్షలు. వీరందరికి భారతీయ పౌరసత్వం కల్పించటం అంటే కొత్త సమస్యలను కొని తెచ్చుకోవటమే. అక్రమ చొరబాట్ల మూలంగా ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌తోపాటు మరి కొన్ని రాష్ట్రాల్లో ఆయా మతాల వారి జనాభాలో అసమతూకం నెలకొన్నది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరి కొన్ని సంవత్సరాల్లో దేశంలోని మెజారిటీ ప్రజలు మైనారిటీలుగా మారిపోయి మైనారిటీలు మెజారిటీలుగా మారే ప్రమదం ఉన్నది. మైనారిటీ ప్రజలు మెజారిటీగా మారిన మరు క్షణం దేశం పరిస్థితి ఏమవుతుందనేది విడిగా చెప్పనక్కరలేదు. కాశ్మీర్‌లో జరిగిన జాతి ప్రక్షాళన దేశమంతటా జరుగుతుందనేది పచ్చి నిజం. అస్తిత్వాన్ని కాపాడుకోలేని జాతి మనుగడ ఎక్కువ కాలం ఉండదనేది చారిత్రక సత్యం. ఈ వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అర్థం చేసుకున్నాడు కాబట్టే పౌరసత్వ సవరణ చట్టాన్ని చారిత్రాత్మక చట్టంగా అభివర్ణించారు. ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ స్వల్ప, అల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ధీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బ తీస్తోంది. పౌరసత్వ చట్టాన్ని సమర్థించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను అవమానించటం ద్వారా కాంగ్రెస్ ప్రస్తుతానికి రాజకీయంగా కొంత ప్రయోజనం పొందవచ్చు, దేశంలోని మైనారిటీల ఓట్లు దానికి కలిసి రావచ్చు కానీ దీర్ఘ కాలంలో ఈ విధానం కాంగ్రెస్‌ను, ఇతర ప్రతిపక్షాలను తుడిచిపెట్టివేస్తుందనేది వాస్తవం. రామ్‌నాథ్ కోవింద్‌ను అవమానించటం ద్వారా దేశ ప్రజలను అవమానించిన కాంగ్రెస్‌కు ప్రజలు తమదైన పద్ధతిలో, తమదైన సమయానికి గట్టిగా బుద్ధి చెబుతారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలోని కొన్ని చోట్ల కొనసాగుతున్న నిరసన ఉద్యమాలలో ఎవరు పాల్గొంటున్నారు? వారి వెనక ఎవరు ఉంటున్నారు? అనేది పరిశీలిస్తే ఈ వ్యతిరేక ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకుపోయేందుకు వీరు కుట్రలు చేస్తున్నారనేది తెలుస్తుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం దేశాన్ని మరోసారి ముక్కలు చేసేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే తప్ప మరొకటి కాదు.

- కె.కైలాష్ 98115 73262