ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాహుల్ వ్యాఖ్యల్లో వాస్తవమెంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అబద్ధాలు చెప్పటం, అసత్యాలను ప్రచారం చేయటంలో పట్టు సాధించటం ద్వారా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ఎదిగి వచ్చాడని చెప్పక తప్పదు. రాహుల్ గత వారం పది రోజుల నుండి చేస్తున్న ప్రసంగాలు- ముఖ్యంగా గత వారం జర్మనీ, ఇంగ్లాండ్ పర్యటనల సందర్భంగా చేసిన ఆరోపణలు, చెప్పిన విషయాలు చూస్తుంటే రాహుల్ మోసపూరిత రాజకీయాల్లో పరిపక్వత సాధించారనే విషయం స్పష్టమవుతోంది. రాహుల్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆ తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టినప్పుడు కూడా కొంతమేర నిజాయితీతో మాట్లాడేవారు. దేశానికి వంశపారంపర్య రాజకీయాలు ఎంతమాత్రం మంచివికావంటూ నిజాయితీతో కూడిన ప్రకటనలు చేయడమూ తెలిసిందే. అయితే దేశంలోని పలు ఇతర రాజకీయ నాయకుల మాదిరిగానే రాహుల్‌కు కూడా బాధ్యతా రాహిత్య రాజకీయం అలవాటైనప్పటినుండి ఆయన తన ఇష్టానుసారం నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. తాను చేప్పేదే నిజం.. తాను చేసేదే నిజమైన రాజకీయం అనే స్థాయికి రాహుల్ ఎదిగిపోయారు. రాహుల్‌ను కొంతకాలం క్రితం వరకు అందరూ ఆయనను ‘పప్పు’ అని పిలిచేవారు. ఇప్పుడా ‘పప్పు’ చిత్తశుద్ధిలేని రాజకీయం చేయటంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారనిపిస్తోంది.
రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఆరోపణలు చేయటం, విమర్శించటం ఎప్పుడూ జరిగేదే. ప్రత్యర్థులు ఏ చిన్న తప్పు చేసినా గోరంతను కొండంతలు చేసి చూపించటం ద్వారా ప్రజలను మభ్యపెట్టటం మన దేశంలోని ప్రతి చిన్నా, పెద్ద నాయకుడికి వెన్నతో పెట్టిన విద్య. అబద్ధాలు, అసత్యాలు చెప్పి తప్పించుకుపోవటం మన రాజకీయ నాయకులందరికీ అలవాటే. రాహుల్ గాంధీ ఈ కళలో ప్రావీణ్యం సాధించటంతోపాటు ప్రత్యర్థులపై లేనిపోని ఆరోపణలతో అప్రతిష్టపాలు చేసేస్థాయికి ఎదిగిపోయారనిపిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, బీజేపీపై ఆయన చేస్తున్న ఆరోపణలు పలు సందర్భాల్లో శృతిమించుతున్నాయి. ఇక కాంగ్రెస్ గురించి చెబుతున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాహుల్ గాంధీ గత వారం జర్మనీ పర్యటన సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ను ఈజిప్ట్‌లోని ‘ముస్లిం బ్రదర్‌హుడ్’తో పోల్చారు. ముస్లిం బ్రదర్‌హుడ్ చేసిందేమిటి? ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్నదేమిటనేది పరిశీలిస్తే.. రాహుల్ చేసిన ఆరోపణ ఎంతమేరకు నిజమో స్పష్టమైపోతుంది. ముస్లిం బ్రదర్‌హుడ్ ఇతర మతాలను ద్వేషిస్తుంది కానీ ఆర్‌ఎస్‌ఎస్ ఇతర మతాలను ద్వేషించదు. దేశంపట్ల ప్రేమ, భక్తిని చూపించమంటుంది. దేశం ముందు కులం, మతం ప్రాధాన్యతను కోల్పోతాయని చెబుతోంది. దేశభక్తి అన్నింటికంటే ముఖ్యమని చెప్పే ఆర్‌ఎస్‌ఎస్‌ను ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చటం ఆలోచనా రాహిత్యానికి నిదర్శనం.. బాధ్యతారాహిత్య రాజకీయానికి పరాకాష్ట. మరోచోట మాట్లాడుతూ ప్రజలను అభివృద్ధికి దూరంగా పెట్టినప్పుడే ఐఎస్‌ఐ లాంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకువస్తాయని వాక్రుచ్చారు. ఆయన ముస్లింలను దృష్టిలో పెట్టుకునే ఈ వ్యాఖ్యలు చేశారని విడిగా చెప్పనక్కర లేదు. ఇస్లాం పుట్టినిల్లు సౌదీ అరేబియాతోపాటు ప్రపంచంలోని ఇతర ముస్లిం దేశాలతో పోలిస్తే భారత దేశంలోనే ముస్లింలు అత్యంత ఆనందంగా ఉన్నారు. ఈ వాస్తవాన్ని సహేతుకంగా ఆలోచించే ప్రతి ముస్లిం అంగీకరిస్తాడు. మన దేశంలోని ముస్లింలకు ఉన్నంత స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఇస్లామిక్ దేశాల్లో సైతం లేవనేది పచ్చినిజం. ముస్లింలను జాతి జీవన స్రవంతిలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ కంటే బీజేపీ ప్రభుత్వమే అధికంగా ప్రయత్నించింది. బీజేపీ పాలనలో ముస్లింలకు కలిగినంత ప్రయోజనం మరే ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కలుగలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ముస్లింల ప్రయోజనాల పరిరక్షణ ఏమేరకు జరిగిందనేది విడిగా చెప్పనక్కర లేదు. వాస్తవానికి ముస్లింల వెనకబాటుతనానికి కాంగ్రెస్ ప్రధాన బాధ్యత వహించాలి. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకున్న కాంగ్రెస్ వారి సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయలేదు. అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పటం మినహా ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ఏనాడు మనసు పెట్టి పని చేయలేదు. షాబాను కేసే ఇందుకు మంచి ఉదాహరణ.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశాన్ని విభజిస్తుంటే కాంగ్రెస్ దేశాన్ని ఏకం చేస్తోందంటూ రాహుల్ మరోచోట వ్యాఖ్యానించారు. దేశాన్ని ఏకం చేస్తున్న కాంగ్రెస్‌ను ప్రజలెందుకు ఓడిస్తున్నారనే విషయాన్ని రాహుల్ ఒకసారి ఆలోచిస్తే మంచిది. కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలను తలకెక్కించుకోవటం వల్లే హిందువులు దూరమయ్యారని పార్టీ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోని గతంలో ఇచ్చిన నివేదికను రాహుల్ గాంధీ అప్పుడే మరిచిపోయారా? కర్నాటక శాసనసభ ఎన్నికల సందర్భంగా హిందూ ఓట్లు సంపాదించేందుకు రాహుల్ గాంధీ ఎన్ని మఠాలు, దేవాలయాల చుట్టూ తిరిగారు. తన అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ మత రాజకీయం చేయటం అందరికీ తెలిసిందే. తమ కుటుంబం గత 30 ఏళ్లనుండి అధికారానికి దూరంగా ఉన్నదని రాహుల్ మరో అద్భుతమైన ప్రకటన చేసి తన తెలివిని ప్రదర్శించుకున్నారు. రాజీవ్ గాంధీ తరువాత గాంధీ కుటుంబం అధికారంలో లేదని రాహుల్ చెప్పటం హాస్యాస్పదం కాదా? పార్టీకి పూర్తి మెజారిటీ లేకున్నా ఐదేళ్లపాటు దేశానికి సుస్థిరమైన పాలనను అందజేయటంతోపాటు ఆర్థిక సంస్కరణల ద్వారా దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించిన పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రి కాదా? 2004 నుండి 2014 వరకు పదేళ్లపాటు ప్రధాన మంత్రిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు కాదా? యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లపాటు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరవెనక నుండి బాధ్యతలేని అధికారం చెలాయించలేదా? మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగేతర శక్తిగా కొనసాగినవారు గాంధీ కుటుంబ సభ్యులు కాదా? మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయినా సోనియా గాంధీ నివాసం 10, జనపథ్ వద్ద చేతులు కట్టుకుని నిలబడలేదా? గాంధీ కుటుంబం గత 30ఏళ్ల నుండి అధికారంలో లేదని చెప్పటం పచ్చి అబద్ధం కాదా? రాహుల్ ఈ ప్రకటన ద్వారా దేశ ప్రజలను మభ్యపెట్టాలనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇందిరా గాంధీ హత్యానంతరం ఢిల్లీలో సిక్కులపై జరిగిన ఊచకోతతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ గాంధీ మరో ప్రకటన చేశారు. ఢిల్లీలో సిక్కులపై జరిగిన ఊచకోతపై రాజీవ్ గాంధీ స్పందిస్తూ ఒక మహావృక్షం కూలితే భూమి కంపించటం అత్యంత సహజమని వ్యాఖ్యానించటం రాహుల్ గాంధీకి తెలియదా? ప్రజల పట్ల నిజమైన ప్రేమాభిమానాలు, బాధ్యత, చిత్తశుద్ధి, నిజాయితీ లేని రాజకీయ నాయకుల మూలంగా దేశానికి తీరని నష్టం వాటిల్లింది. పొరుగున ఉన్న చైనా అత్యంత వేగంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతుంటే మనం కుంటినడకతో వెనకబడ్డాం. దీనికి ప్రధాన కారణం దేశంపట్ల ప్రేమ, పట్టుదల లేని నాయకులే. రాహుల్ గాంధీ తన బాధ్యతారాహిత్య, తప్పుడు మాటల ద్వారా తాను కూడా నిజాయితీ లేని నాయకుల కోవకు చెందినవాడినని చెప్పకనే చెప్పుకుంటున్నారు. రాహుల్ ఇలాంటి ప్రకటనలు చేసే బదులు పార్టీ పునరుజ్జీవంపై దృష్టి సారిస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో కనుమరుగైపోయింది. ఉత్తరప్రదేశ్, బిహార్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోయాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగూ అధికారంలోకి రాదు.. కానీ ఇప్పుడున్న ఉనికిని కూడా కాపాడుకోలేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై ఎంత దుమ్మెత్తిపోసినా రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ స్వశక్తిపై కేంద్రంలో అధికారంలోకి రావటం కల్ల. ఈ నేపథ్యంలో రాహుల్ నోటికి వచ్చింది మాట్లాడటం ద్వారా ఉన్న కాస్తంత పరువు, ప్రతిష్టను దిగజార్చుకునే బదులు ఆలోచన, అవగాహన, బాధ్యతతో వ్యవహరించటం ద్వారా ప్రజల్లో పలుకుబడిని పెంచుకోవటం మంచిది. బాధ్యతాయుత రాజకీయాలు చేయటం, నిజాయితీతో మాట్లాడడమే దీర్ఘకాలంలో రాజకీయంగా కలిసి వస్తుందనే వాస్తవాన్ని రాహుల్ ఇప్పటికైనా గ్రహించటం మంచిది.
*

--కె.కైలాష్ 98115 73262