ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పేరుకే సహకార సమాఖ్య విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. తమ ప్రసంగాల్లో సహకార సమాఖ్య విధానానికి (కోఆపరేటివ్ ఫెడరలిజం) పెద్ద పీట వేసే మోది చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తారు. ఇందుకు తాజా ఉదాహరణ ఉత్తరాఖండ్ రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారం, సుప్రీం కోర్టు అక్షింతలు వేయటం. ఉత్తరాఖండ్‌లో దొడ్డిదారిన అధికారాన్ని చేజిక్కించుకునేందుకు నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు చేసిన విఫలయత్నం ప్రజాస్వామ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటిది. ఉత్తరాఖండ్ హైకోర్టు సకాలంలో సరైన తీర్పు ఇవ్వటం ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ కాకుండా ఆపింది కానీ లేకపోతే బి.జె.పి అధినాయకత్వం తమ రాజకీయ దాహాన్ని తీర్చుకునేందుకు ఉత్తరాఖండ్‌లోప్రజా స్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసేదే.
ఉత్తరాఖండ్ విషయంలో రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బి.జె.పిలు కూడా తల బిరుసుతో వ్యవహరించాయి తప్ప ప్రజాస్వామ్య బద్ధమైన రాజకీయ ఆలోచన, అవగాహనతో పని చేయలేదని చెప్పకతప్పదు. ఉత్తరాఖండ్‌కు చెందిన పది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల నుండి ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఏకపక్ష విధానాలపై తమ అసమ్మతిని పార్టీ అధినాయకత్వానికి తెలియజేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి హరీష్ రావత్ వ్యవహరిస్తున్న తీరు మూలంగా తాము పార్టీలో ఉండటం కష్ట సాధ్యమైపోతోందంటూ వారు ఏడెనిమిది నెలల నుండి అధినాయకత్వానికి మొర పెట్టుకుంటున్నారు. హరీష్‌రావత్‌తో మాట్లాడి పరిస్థితులు చక్కదిద్దాలని వారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి పలుమార్లు వినతిపత్రాల ద్వారా తెలియజేశారు. వినతిపత్రాలు పని చేయకపోవటంతో వారు ఇరువురు నాయకులను స్వయంగా కలుసుకునేందుకు సమయం అడిగారు.
మాజీ ముఖ్యమంత్రి బహుగుణ నాయకత్వంలో ఐదారుగురు కాంగ్రెస్ శాసన సభ్యులు పలుమార్లు ఢిల్లీకి వచ్చి అధినాయకత్వాన్ని కలుసుకునేందుకు రోజుల తరబడి ఎదురు చూశారు. కాంగ్రెస్ అధినాయకత్వం కలుసుకునేందుకు నిరాకరించిన తరువాతనే వారు తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. కాంగ్రెస్ అధినాయకత్వం తమ పార్టీ శాసన సభ్యుల మనో వేదన వినేందుకు ముందుకు వచ్చి ఉంటే ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారం జరిగేదే కాదు. కాంగ్రెస్ అధినాయకత్వం ఒక రకంగా తల బిరుసుతో వ్యవహరిస్తే బి.జె.పి అధినాయకత్వం మరో రకమైన తల బిరుసుతో వ్యవహరించి సుప్రీం కోర్టులో తాను చివాట్లు తినటంతోపాటు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి సైతం చివాట్లు పెట్టించింది. ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భారత రాష్టప్రతిపై విమర్శలు గుప్పించటం ఇదే మొదటిసారి. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించటంలో భారత రాష్టప్రతి తప్పు చేశారని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరోపించినంత పని చేశారు. భారత చరిత్రలో ఇలా జరిగటం ఇదే మొదటిసారి. ఇదంతా జరగటానికి ప్రధాన కారణం బి.జె.పి అధినాయకత్వం అధికార దాహమే.
అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ శాసన సభ్యులను లోబరుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించి అధికారంలోకి వచ్చినట్లు ఉత్తరాఖండ్‌లో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బి.జె.పి అధినాయకత్వం కుట్ర చేసింది. బహుగుణ నాయకత్వంలో పది మంది కాంగ్రెస్ శాసన సభ్యులు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రావటంతో బి.జె.పి అధినాయకత్వం ఎగిరి గంతేసి ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మూర్ఖపు ప్రయత్నం చేసి బొక్కా బోర్లా పడింది. రాష్ట్ర శాసన సభలో బడ్జెట్‌ను ఆమోదించే సమయంలో పది మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎం.ఎల్.ఏలతో గొడవ చేయించి ఆర్థిక బిల్లును ఓడించేందుకు ప్రయత్నించింది. ఇది గ్రహించిన స్పీకర్ సభలో నెలకొన్న గందరగోళాన్ని అడ్డం పెట్టుకుని బడ్జెట్ పాస్ అయినట్లు ప్రకటించి చేతులు దులుపుకున్నాడు. బి.జె.పి అధినాయకత్వం రాష్ట్ర గవర్నర్ ద్వారా తమకుఅనుకూల నివేదిక తెప్పించుకుని బడ్జెట్ పాస్ కానందున రాష్ట్రంలో రాజ్యాంగపరమైన సంక్షోభం నెలకొన్నదంటూ హడావుడిగా రాష్టప్రతి పాలన విధించింది. ఆ తరువాత పది మంది కాంగ్రెస్ ఎం.ఎల్.ఏల మద్దతుతో బి.జె.పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెర వెనక రాజకీయం నడిపించే సమయంలో కాంగ్రెస్ రాష్ట్ర హైకోర్టు తలుపులు తట్టింది. దీనితో బి.జె.పి రాజకీయ అటకట్టినట్లయంది.
రాష్ట్ర హైకోర్టు రాష్టప్రతి పాలనను కొట్టివేసి ముఖ్యమంత్రి హరీష్ రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించి సభలో బల పరీక్షకు ఆదేశించటం, కేంద్ర ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టుకు రావటం. సుప్రీం కోర్టు కూడా అసెంబ్లీలో బల పరీక్ష జరిపించిన అనంతరం రావత్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించటం అందరికి తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు, సుప్రీం కోర్టులు తమ పరిధిని దాటి లెజిస్లేటివ్ అధికారాలను తమ చేతుల్లోకి తీసుకనే విధంగా వ్యవహరించాయి. రాష్టప్రతి పాలన విధింపు వ్యవహారంపై హైకోర్టు, సుప్రీం కోర్టులో విచారణ జరిగే సమయంలో న్యాయమూర్తులు చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం విచారకరం. అయితే ఇలా జరగటానికి ప్రదాన కారణం ఎన్.డి.ఏ ప్రభుత్వమే. ఉత్తరాఖండ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ద్రోహపూరిత రాజకీయం మూలంగానే ఇదంతా జరిగింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు కోర్టులు లెజిస్లేటివ్ అధికారాన్ని హరిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జేట్లి విమర్శించటం అర్థరహితం.