పశ్చిమగోదావరి

గంటలోపు కానిచ్చేశారు....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 30: వచ్చే ఆర్ధిక సంవత్సరంలో నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఆదాయాలపై అంచనాలు ఇలాంటివన్నీ కీలకంగా నిలుస్తున్నాయనుకున్నప్పటికీ కార్పోరేషన్ సమావేశంలో ఈ బడ్జెట్ వ్యవహారాన్ని గంటలోపు కానిచ్చేశారు. వైసిపి సభ్యుల నుంచి పలు అభ్యంతరాలు తెరపైకి వచ్చినా ఇవన్నీ చెప్పాలంటే నెలగడిచినా సమావేశం పూర్తికాదంటూ అధికారపక్షం నుంచి ఎదురుదాడి ప్రారంభమైంది. చివరకు బడ్జెట్‌ను మూకుమ్మడిగా ఆమోదిస్తున్నట్లు ప్రకటించి సమావేశాన్ని ముగించారు. బడ్జెట్ కాపీలను ఆలస్యంగా అందించినందుకు నిరసనగా వైకాపా సభ్యులు నల్లచొక్కాలు వేసుకుని సమావేశానికి హాజరై నిరసన తెలిపారు. బుధవారం స్ధానిక కార్పోరేషన్ కార్యాలయ సమావేశమందిరంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షతన కార్పోరేషన్ బడ్జెట్ సమావేశం జరిగింది. తొలుత మేయర్ నూర్జహాన్ మాట్లాడుతూ నగరపాలకసంస్ధ పాలకవర్గం బాధ్యతలు తీసుకుని రెండేళ్లు ముగుస్తోందని, ఈసమయంలో నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రానున్న ఏడాదికాలంలోనూ ఆదాయం, ఖర్చు బేరీజు వేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు బడ్జెట్‌ను వాస్తవికత దృక్ఫధంతో రూపొందించినట్లు చెప్పారు. అనంతరం బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించారు. తొలిదశలోనే వైకాపా ఫ్లోర్‌లీడర్ బండారు కిరణ్‌కుమార్ బడ్జెట్ పుస్తకాలను అందించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులకు వారంరోజులు ముందుగా బడ్జెట్ కాపీలను అందించాల్సి ఉండగా రెండురోజుల ముందు 74 పేజీల బడ్జెట్ కాపీలను అందించి చర్చకు సిద్ధం కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. ఈవిషయంలో అధికారులు సమాధానం చెప్పితీరాలని, ఇది సభ్యుల ఆత్మగౌరవానికి సంబంధించిందంటూ పేర్కొన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ వారంరోజులు ముందుగా ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ ముద్రణ పూర్తికావటంలో జాప్యం జరగటం వల్ల కాపీలు అందించటం ఆలస్యమైందని, ఇకనుంచి అలాజరగకుండా చూస్తామని పేర్కొన్నారు. అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి దానిపై చర్చ నిర్వహించారు. తొలిదశలోనే కొన్నిచోట్ల బడ్జెట్ అంచనాల్లో సంవత్సరాలను పొరపాటుగా పేర్కొన్నామని, వాటిని సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. దీంతో మరోసారి కిరణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బడ్జెట్ కాపీల్లో మీరు పేర్కొన్న విధంగా వాటిని అధ్యయనం చేసి వచ్చామని, ఇప్పుడు ఒక్కసారిగా సంవత్సరాలు మార్చివేయటం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. దీంతోపాటు ఆయన పలు అంశాలపై అభ్యంతరాలను లేవనెత్తారు. వీటికి అయా అధికారుల నుంచి సమాధానం రాబట్టే విషయంలోనూ కొంత రసాభాసగా వ్యవహారం నడిచింది. ఆస్తిపన్ను విషయంపై ఆయన లేవనెత్తిన ప్రశ్నలకు కమిషనర్ సాయిశ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతిపాదనలు తయారుచేయటంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయని, అయినప్పటికీ అయా విభాగాలు, సిబ్బంది కష్టపడి బడ్జెట్‌ను రూపొందించారని చెప్పారు. ఆస్తిపన్నుకు సంబంధించి ఇంతవరకు 17కోట్ల రూపాయలు వసూలు చేసి రాష్ట్రంలోనే పన్ను వసూళ్లలో ఏలూరు ముందంజలో ఉందని చెప్పారు. ఆతర్వాత ఖాళీస్ధలాలకు సంబంధించి ఈ ఏడాది 40లక్షల రూపాయలు పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీనిపై కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ఏడాది ఎంతవసూలు చేశారు, వచ్చే ఏడాది అంత అధికంగా వసూలు చేయగలరో చెప్పాలని పేర్కొన్నారు. దీనికి కోఆప్షన్ సభ్యులు ఎస్‌ఎంఆర్ పెదబాబు స్పందిస్తూ నగరంలో ఖాళీస్ధలాల యజమానుల పూర్తి వివరాలు తెలుసుకుని వాటిపై ఈ ఏడాది 40లక్షలకు పైగానే పన్ను వసూలు చేపడతామని స్పష్టం చేశారు. చివరకు కిరణ్‌కుమార్ మరికొన్ని అంశాలను లేవనెత్తేందుకు ప్రయత్నించినా అధికారపక్షం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇలా అన్ని అంశాలు మాట్లాడితే నెలరోజులు గడిచినా బడ్జెట్ ఆమోదం కుదరదని అధికారపక్ష సభ్యులు బౌరోతు బాలాజీ తదితరులు పేర్కొన్నారు. మరో సభ్యులు చోడే వెంకటరత్నం మాట్లాడుతూ బడ్జెట్ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని, దీనిపై చర్చ అనవసరమని స్పష్టం చేశారు. అయినప్పటికీ కిరణ్‌కుమార్ విద్య, ఆయిల్‌ఖర్చులు ఇలా పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తినా వాటిని స్పష్టంగా ఖండిస్తూ అధికారపక్షం నుంచి సమాధానాలు వచ్చాయి. మరికొన్ని అంశాలను కిరణ్‌కుమార్ ప్రస్తావిస్తుండగానే బడ్జెట్ సమావేశం ముగిసిందని ప్రకటించి మేయర్ తన ఛాంబర్‌లోకి వెళ్లిపోయారు. అనంతరం కిరణ్‌కుమార్, అధికారపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది.

రూ. 12.52కోట్ల మిగులుతో బడ్జెట్ ఆమోదం
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మార్చి 30: ఏలూరు నగరపాలకసంస్ధ 12.52కోట్ల రూపాయల మిగులుతో 2016-17 సంవత్సరానికి బడ్జెట్‌ను ఆమోదించింది. స్ధానిక కార్పోరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన బడ్జెట్ సమావేశానికి మేయర్ షేక్ నూర్జహాన్ అధ్యక్షత వహించారు. ఈసమావేశంలో వచ్చే ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభనిల్వ 29.23కోట్ల రూపాయలతో కలిపి మొత్తం 103.11 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు. దీనిలో 90.59కోట్ల రూపాయల మేరకు ఖర్చులను చూపారు. ఈమేరకు 12.52 కోట్ల రూపాయల మిగులు ఉంటుందని అంచనా వేశారు. ఆదాయానికి సంబంధించి ఆస్తిపన్ను రూ. 20కోట్లు, ఖాళీస్ధలాలపై పన్ను రూ. 40లక్షలు, స్టాంప్ డ్యూటీపై సర్‌ఛార్జీల ద్వారా రూ. 3.50కోట్లు, వినోదపుపన్నుగా కోటి రూపాయలు, ప్రకటనల పన్నుల ద్వారా 50లక్షలు, లాభసాటి వనరుల ద్వారా రూ. 4.77కోట్లు, వాటర్ ఛార్జీల ద్వారా రూ. 4.28కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల రాబడుల ద్వారా రూ. 7.25కోట్లు, ఇతరాల నుంచి రూ. 2.19కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఇక ఖర్చులకు సంబంధించి రోడ్ల నిర్మాణానికి రూ. 1.50కోట్లు, డ్రైన్ల నిమిత్తం రూ. 60లక్షలు, ఉద్యానవనాలకు రూ. 1.10కోట్లు, కార్యాలయ భవనాలకు రూ. 50లక్షలు, ట్రాఫిక్ ఐలాండ్స్‌కు రూ. 60లక్షలు, మార్కెట్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లకు రూ. 30లక్షలు, స్కూల్ బిల్డింగ్‌లకు రూ. 35లక్షలు, శ్మశానవాటికలకు రూ. 50లక్షలు, ఆటస్ధలాలు, స్టేడియంల నిమిత్తం రూ. 10లక్షలు, వాటర్‌పైపులైన్ల నిమిత్తం రూ. 50లక్షలు, కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం రూ. 60లక్షలు, బిపిఎస్ ఫండ్ రూ. 2.80కోట్లు అవుతుందని అంచనా వేశారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
వీరవాసరం, మార్చి 30: పెళ్లి వేడుకలకు హజరై పరీక్షకు వెడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థి వీరవాసరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. క్షణకాలంలో వీరవాసరం డిగ్రీ కళాశాల ఎదురుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు, కళాశాల సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుని బంధువులు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకోవడంతో వారి రోదనలతో ఆ ప్రాంతవాసులు కంటతడిపెట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకొల్లుకు చెందిన కలిశెట్టి విజయ కనకం(19) భీమవరం విష్ణు కళాశాలలో బిటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పరీక్షలకు హజరుకావాల్సి ఉంది. అయితే కనకం సోదరికి ఫంక్షన్ నిమిత్తం పాలకొల్లు రావాల్సిందిగా కుటుంబ సభ్యులు కోరారు. దీంతో వేడుకకు హాజరై కనకం తిరిగి అతని స్నేహితుడితో కలిసి కళాశాలకు వెళ్తుండగా వీరవాసరం డిగ్రీ కళాశాల ఎదురుగా ఒక వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో కనకం అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో స్నేహితుడు అఖిల్ షాక్ గురయ్యాడు. స్థానికులు వెంటనే కనకంకు సపర్యలు చేశారు. అయితే అప్పటికే అతను మృతి చెందడంతో కళాశాల సిబ్బంది కంటి తడిపెట్టారు. బంధువులకు విషయం తెలియడంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కనకాన్ని వీరవాసరంలోని ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన వాహనం ఢీ కొందంటూ స్థానికులు చెబుతుండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఆ వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శ్యామ్‌సుందర్ పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రాబోయే ఖరీఫ్, రబీ పంటల గణనపై
సమగ్ర నివేదిక సమర్పించాలి
జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి సత్యనారాయణ
ఏలూరు, మార్చి 30 : ప్రతీ పల్లెలో రాబోయే ఖరీఫ్, రబీ పంటల గణన తప్పనిసరిగా చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె సత్యనారాయణ వి ఆర్‌వోలను ఆదేశించారు. స్థానిక సిపివో కార్యాలయంలో గ్రామ రెవిన్యూ అధికారులు (వి ఆర్‌వో)లకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శిక్షణతోపాటు వివిధ అంశాలపై 8 రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఏ సర్వే నెంబరులో రైతులు ఏ ఏ పంటలు వేసారో వాటి వివరాలను సేకరించాలని పంటలు పండిన తర్వాత పంటల గణన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని దీనివల్ల ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారో స్పష్టమైన సమాచారం తెలుస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో పంట కోతల ప్రయోగాలు, వర్షపాతం, తదితర అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోవాలని చెప్పారు. భూమి వినియోగం, సాంఘిక, ఆర్ధిక గణన, పరిశ్రమల సర్వే తదితర అంశాలపై వి ఆర్‌వోలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. జిల్లాలో వ్యవసాయోగ్యమైన భూమిలో ఏ విధమైన పంటలు వేస్తున్నారో ఆ భూముల్లో భూసార పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నారా, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయా లేదా అనే అంశాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలని భవిష్యత్తులో రైతుకు మేలు చేకూర్చే నూతన ఆధునిక వ్యవసాయ విధానాలు ఏ విధంగా అమలు చేయవచ్చునో నిర్ధారించడానికి ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. శిక్షణా కార్యక్రమం నేటి నుండి ఏప్రిల్ 6వ తేదీ వరకు సిపివో కార్యాలయంలో జరుగుతున్న దృష్ట్యా సంబంధిత వి ఆర్‌వోలు పాల్గొని పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ఏలూరు డివిజన్ వి ఆర్‌వోల అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ ఎ ఎస్ ఆర్ చంద్రమూర్తి కోరారు. కార్యక్రమంలో ప్రణాళికా శాఖ డిడి సురేష్‌కుమార్, ఎడి సాంబశివరావు, ఎస్‌వో బి కృష్ణారావు, ఉప గణాంక అధికారులు పార్వతిదేవి, కేశరావు, రమణ, వి ఆర్‌వోల అసోసియేషన్ నాయకులు ఎంవి లక్ష్మీనారాయణ, కె శ్రీనివాసరావు, రామానుజం అచ్యుత సీతారామ చంద్రమూర్తి (రాంబాబు) తదితరులు పాల్గొన్నారు.
రబీలో 13.66లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి
జాయింట్ కలెక్టరు కోటేశ్వరరావు
ఏలూరు, మార్చి 30: జిల్లాలో రబీపంట ఆశాజనకంగా ఉన్నందున 13.66లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగలదని అంచనావేశామని, ఈ ధాన్యాన్ని గిట్టుబాటుధరకు కొనుగోలు చేసేందుకు జిల్లాలో 266 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు తెలిపారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం జిల్లాలోని రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కంటే ఈసారి రబీసీజన్‌లో 1850 కోట్ల రూపాయల విలువైన ధాన్యం పండిందని, దీన్ని కొని రైతుకు గిట్టుబాటుధర కల్పించడానికి మిల్లర్లు సహకరించాలని ఆయన కోరారు. జిల్లాలో వెలుగు ఆధ్వర్యంలో 172, కోఆపరేటివ్ సొసైటీల ద్వారా 92 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డిఎస్‌ఓ డి శివశంకర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు రవిబాబు, డిఆర్‌డిఎ పిడి శ్రీనివాసులు, జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు, డి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
బుద్దిమాన్యతతో పుట్టిన చిన్నారులకు ఆధునిక వైద్యం
డిఎంహెచ్‌ఒ విజయగౌరి
ఏలూరు, మార్చి 30: సమాజంలో బుద్దిమాన్యతతో పుట్టిన చిన్నారులను సకాలంలో గుర్తిస్తే ఆధునిక వైద్యం ద్వారా సాధారణ జీవనం సాగించే వైద్యవిధానం అందుబాటులోకి వచ్చిందని డిఎంహెచ్‌ఓ డాక్టరు ఎస్ విజయగౌరి చెప్పారు. స్ధానిక అక్షరదీక్ష కార్యాలయంలో బుధవారం గ్రూప్-5 మెడికల్, పారామెడికల్ సిబ్బందికి విభిన్న ప్రతిభావంతుల విషయంలో తీసుకోవాల్సిన సహాయకచర్యలపై జరిగిన సదస్సులో ఆమె మాట్లాడారు. రక్తసంబంధీకుల మధ్య మేనరికపు వివాహాలు జరిగితే ఎక్కువుగా బుద్ధిమాన్యత, అంగవైకల్యం తదితర వాటితో శిశువుల జననం జరుగుతుందన్నారు. బుద్ధిమాన్యత ఉన్నట్లు తొలిదశలోనే గుర్తిస్తే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఆధునిక సర్జరీ అందుబాటులో ఉందన్నారు. పసిపిల్లలకు సరైన సమయంలో వ్యాధినిరోధక టీకాలు అందించాలని, శిశువుకు చిన్నతలగాని, పెద్దతలగాని ఉన్నట్లు అయితే తక్షణమే డాక్టరుకు చూపించాలని, ముందుజాగ్రత్త చర్యలు చేపడితే సమాజంలో మానసిక వికలాంగులను దూరం చేయవచ్చునన్నారు. విభిన్నప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమశాఖ ఎడి వి ప్రసాదరావు మాట్లాడుతూ మూడుశాతం జనాభా అంగవైకల్యంతో బాధపడుతున్నవారు ఉన్నారని, భవిష్యత్‌లో అంగవైకల్యం ఉండకుండా ఉండాలంటే ప్రసవం సమయం నుండి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విభిన్నప్రతిభావంతుల విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తోందన్నారు. ఏలూరులో 1.37కోట్ల రూపాయలతో వికలాంగ బాలుర వసతిగృహాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో వయోజనవిద్యాశాఖ డిడి రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. సమీకృత సమాచారదర్శిని పుస్తకాన్ని ఈసందర్భంగా డిఎంహెచ్‌ఓ విజయగౌరి విడుదల చేశారు.
కోర్టు వివాదాల్లో ఉన్న కంపోస్టు యార్డు సాధిస్తాం
* వైసిపి జెండా అడ్రస్సు లేకుండా పోతుంది: విసి ముదునూరి* ఛైర్మన్ వల్లే ఉద్యోగులు సెలవుపెట్టి వెళిపోతున్నారు: వైసిపి* గరం గరంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, మార్చి 30: భీమవరం పురపాలక సంఘానికి అతి ముఖ్యమైనది కంపోస్టు యార్డు. కోర్టు వివాదంలో ఉన్న ఈ కంపోస్టు యార్డును సాధిస్తామని ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కంపోస్టు యార్డు సమస్య ఉందని, న్యాయ స్ధానంపై తనకెంతో గౌరవముందని అన్నారు. తప్పకుండా ఈ కౌన్సిల్ హయాంలోనే కంపోస్టు యార్డు సాధిస్తామన్నారు. బుధవారం తోట సీతారామలక్ష్మి కౌన్సిల్ హాలులో ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. సభ ఆరంభంలోనే వైసిపి ప్రతిపక్ష నేత తాతరాజు, భూసారపు సాయి సత్యనారాయణలు అనేక అంశాలను ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. కంపోస్టుయార్డు సమస్య ఏమైందని, పార్కుల అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. ఇటీవల కొద్దిరోజుల క్రితం మున్సిపల్ ఛైర్మన్‌తో పాటు తెలుగుదేశం పార్టీ సభ్యులు కౌన్సిల్‌ను అవమానిస్తూ మాట్లాడారని, దీనిపై ఛైర్మన్ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. మున్సిపల్ పరిపాలన గురించి మాట్లాడే హక్కు ఉందా.. అని ప్రశ్నించారు. కౌన్సిల్ పరిధి దాటి ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఉన్న ఉద్యోగులు సెలవు పెట్టి వెళ్తున్నారని, బిల్లు చెల్లింపులు కూడా ఛైర్మన్ అభిప్రాయం మేరకు జరుగుతున్నాయని తాతరాజు వెల్లడించారు. తన 32వ వార్డులో డ్రెయినేజి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఏడాది గడిచిందన్నారు. ఇంతలో వారి వ్యాఖ్యలను వైస్‌చైర్మన్ ముదునూరి సూర్యనారాయణరాజు వ్యతిరేకించారు. కౌన్సిల్ సమావేశంలో అభియోగాలు చేస్తున్నారని, సూచనలు చేయాలని కోరారు. కౌన్సిల్‌లో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలన్నారు. ఏదో గొడవ చెయ్యాలని చూస్తున్నారని, రావడం, అరవడం ఎందుకో తెలియడం లేదన్నారు. వైసిపి కార్యకర్తల కనుసైగల్లోనే కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఐదేళ్లల్లో మీ జెండా అడ్రస్సు లేకుండా పోతుందన్నారు. ఇంతలో వైసిపి కౌన్సిలర్లు తాతరాజు ఆక్రమణల తొలగింపు ఏమైందని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల అభిమానాన్ని పొందాలన్నారు. వైస్‌చైర్మన్ ముదునూరి మాట్లాడుతూ వైసిపి నాయకులు అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బ్లాక్‌మెయిల్ నిజం కాదా అని ప్రశ్నించారు. వైసిపి, టిడిపి నేతల మధ్య జరుగుతున్న వాగ్వివాదాన్ని ఛైర్మన్ సముదాయించారు. న్యాయస్థానం మీ జేబులో ఉందంటూ ఒకానొక సందర్భంలో వైసిపి కౌన్సిలర్ భూసారపు సాయి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఛైర్మన్ తప్పుపట్టారు. కంపోస్టుయార్డు సమస్య రేగిన సమయంలో అప్పటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఏం చేశారని టిడిపి కౌన్సిలర్లు ప్రశ్నించారు. మొత్తం మీద కౌన్సిల్ సమావేశం గరంగరంగా సాగింది.
చౌక డిపో డీలర్ల ప్రవర్తనలో మార్పు రావాలి
*ఏలూరు ఆర్డీవో తేజ్‌భరత్
ఏలూరు, మార్చి 30: చౌకడిపోడీలర్ల ప్రవర్తనలో మార్పురావాలని, ప్రతి డీలర్ స్మార్ట్ డీలర్‌గా తయారైనప్పుడే వినియోగదారులకు సత్వర సరుకులు అందుతాయని ఏలూరు ఆర్డీవో ఎన్ తేజ్‌భరత్ చెప్పారు. స్ధానిక కోటదిబ్బలోని పెన్షనర్స్ హాలులో బుధవారం జరిగిన ఏలూరు చౌకడిపోడీలర్ల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చౌకడీపోలలో వందశాతం సరుకులు ప్రజలకు అందించినప్పుడే స్మార్ట్ డీలర్‌గా పేరు వస్తుందన్నారు. నగరంలో 159 చౌకడిపోల ద్వారా 93వేల మంది తెల్లరేషన్‌కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణి చేయాల్సి ఉండగా 85వేల కార్డుదారులకు సరుకులు అందించినప్పటికీ ప్రగతిలో ఏలూరు 48వస్ధానంలో ఉండటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది డీలర్లు వ్యక్తిగత పనుల వల్ల సకాలంలో డిపోలు తెరవకపోవటం, నిర్దేశించిన సమయానికి సరుకులు ఇవ్వకపోవటం వల్ల ఏలూరు మండలం సరుకుల పంపిణిలో చివరిస్ధానానికి చేరుకుందన్నారు. వేసవితీవ్రత దృష్ట్యా డిపోలను ఉదయం 6గంటల నుండి 11 గంటల వరకు తెరిచి ఉంచి ప్రజలకు నిత్యావసర సరుకులు అందించాలని ఆయన సూచించారు. కొంతమంది డీలర్లు రాజకీయ పలుకుబడి ఉందన్న ఉద్దేశ్యంతో సరుకుల పంపిణిలో జాప్యం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. డిఎస్‌ఓ డి శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలందరికి నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోందని, దీనికి డీలర్లు సహకరించాలని కోరారు. సమావేశంలో తహసిల్దార్ సిహెచ్‌విఎస్ ప్రసాద్, డిప్యూటీ తహసిల్దార్ లాం విద్యాసాగర్, డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజులపాటి గంగాధరరావు, చిందా కృష్ణంరాజు, రాజా తదితరులు పాల్గన్నారు.
గడువుదాటినా పరిష్కరించకపోతే చర్యలు
పరిశ్రమలు స్ధాపన దరఖాస్తులపై కలెక్టర్ హెచ్చరిక
ఏలూరు, మార్చి 30: జిల్లాలో వివిధరకాల పరిశ్రమలు స్ధాపించడానికి ఇచ్చే ప్రోత్సాహకాలు అనుమతి కొరకు 47 దరఖాస్తులు గడువుదాటి ఉన్నాయని, వీటిని వచ్చే సమావేశానికి పరిష్కరించకపోతే చర్యలు తప్పవని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ హెచ్చరించారు. స్ధానిక కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతవారంలో గడువుదాటిన ఆరు దరఖాస్తులు సింగిల్‌విండోలో పరిష్కరించామన్నారు. నవభారత్ ఇండస్ట్రీ 2015 డిసెంబర్‌లో ప్రతిపాదనలు సమర్పించగా ఇప్పటివరకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఈవిధంగానే మరికొన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిపై కూడా ఆయన అధికారులను నిలదీశారు. పావలావడ్డీ రుణాల దరఖాస్తులు కూడా గడువుదాటి ఉన్నాయని, వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పరిశ్రమల ప్రోత్సాహకాలకు తొమ్మిది దరఖాస్తులు రాగా వాటిలో ఎనిమిది పరిశ్రమలకు 35లక్షల రూపాయలు రాయితీ అందించటం జరిగిందన్నారు. హైదరాబాద్‌లో పెండింగ్‌లో ఉన్న 47 దరఖాస్తులను కూడా వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం త్రిమూర్తులు, సిపిఓ కె సత్యనారాయణ, సాంఘిక సంక్షేమశాఖ డిడి లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.

పునరావాస గ్రామాల్లో
ఇళ్ల నిర్మాణం పూర్తి:జెసి
పోలవరం, మార్చి 30: రామయ్యపేట, పైడిపాక పునరావాస గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు తెలిపారు. పోలవరంలోని సుజల అతిథిగృహంలో బుధవారం ఆయన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ రెండు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం పూర్తయిన కుటుంబాలు తరలి వెళ్తున్నాయని తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం వద్ద రామయ్యపేట గ్రామ నిర్వాసితులకోసం నిర్మించిన కాలనీలో ఇప్పటివరకు 65 కుటుంబాల వారు తరలివెళ్లినట్టు తెలిపారు. పైడిపాక నిర్వాసితులకోసం పోలవరం వద్ద నిర్మిస్తున్న చంద్రన్న కాలనీకి 50 కుటుంబాల వారు గురువారం తరలివెళ్లనున్నట్టు జెసి తెలిపారు. ప్రస్తుతం ముందుగా ఖాళీ చేయాల్సిన ఏడు గ్రామాలపై దృష్టి పెట్టామన్నారు. ఇప్పటికే నాలుగు నిర్వాసిత గ్రామాలు ఖాళీ చేయగా, ఏప్రిల్ 20 నాటికి రామయ్యపేట, సింగనపల్లి, పైడిపాక గ్రామ నిర్వాసితులు పునరావాస గ్రామాలకు తరలి వెళ్తాయని అన్నారు. నిర్వాసితులకు ఇప్పటికే అన్నిరకాల ప్యాకేజీలు చెల్లించామని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించిన అదనపు ప్యాకేజీ ఖాళీ చేస్తున్న కుటుంబాలకు చెల్లిస్తున్నట్టు తెలిపారు.
టెన్త్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ అరికట్టేందుకు చర్యలు:ఆర్డీవో
కొవ్వూరు, మార్చి 30: పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టంగా నిఘా ఏర్పాటు చేసినట్లు కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు తెలిపారు. బుధశారం కొవ్వూరులోని పదవ పరీక్షా కేంద్రాలను ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో కఠినమైన పరీక్షలున్నందున, మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా రెవెన్యూ శాఖ ప్రత్యేక స్క్వాడ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. పదవ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలను పరిశీలించి విద్యార్థులకు అవసరమైన మందులు ఉన్నవీ, లేనివీ ఆర్డీవో పరిశీలించారు. ఆర్డీవో శ్రీనివాసరావు వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కౌలురైతు ఆత్మహత్య
బుట్టాయగూడెం, మార్చి 30: నష్టాలను భరించలేని ఆ కౌలురైతుకు పురుగులమందే దిక్కయ్యింది. మండలంలోని నిమ్మలగూడెంకు చెందిన దూలి కృష్ణ(50) బుధవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. స్థానికుల కథనం ప్రకారం కృష్ణ గత కొనే్నళ్లుగా కౌలు వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కానీ గత రెండు, మూడేళ్లుగా వ్యవసాయంలో నష్టం రావడంతో, చేసిన అప్పులు తీర్చలేక కృష్ణ ఆత్యహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఇంటికి దగ్గరగా ఉన్న కౌలు పొలంలోకి వెళ్ళి, పురుగులమందు సేవించి ఇంటికి తిరిగివచ్చాడని చెప్పారు. ఇంటికి రావడంతోనే వాంతులు చేసుకుంటున్న కృష్ణను ప్రశ్నించడంతో, పురుగులమందు తాగిన విషయం తెలపడంతో, హుటాహుటిన బుట్టాయగూడెం సామాజిక ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించి, ఉన్నతవైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ సుమారు ఉదయం 11గంటల సమయంలో ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. మృతుని కుమారుడు దూలి చంద్రం ఫిర్యాదు మేరకు సంఘటనపై బుట్టాయగూడెం హెచ్‌సి డి.నరసింహారావు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు బుట్టాయగూడెం పోలీసులు తెలిపారు.
సిఎస్‌కు ఉద్యోగుల వినతి
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, మార్చి 30 : పశుసంవర్ధక శాఖ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ శాఖ మినిస్టీరియల్ సర్వీస్ అసోసియేషన్ నాయకులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. అంశాల వారీగా సమస్యలను సి ఎస్ దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై అధికారులతో చర్చించి సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని సి ఎస్ టక్కర్ హామీ ఇచ్చారు. ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సతీష్, జిల్లా కార్యదర్శి ఎ సతీష్, అసోసియేట్ ప్రెసిడెంట్ డి భాస్కర్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఇ శ్రీనివాసరావు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ కె జనార్ధనరాజు తదితరులున్నారు.