దక్షిన తెలంగాణ

పంపకాలు ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా, ఏడవకమ్మా! ప్లీజ్.. ఏడవకమ్మా! నీవు ఏడిస్తే నాకూ ఏడుపొస్తుంది’
భర్త వివేక్ పలవరింతలకు కలల లోకాల్లో తేలిపోతున్న కౌముది దిగ్గున లేచింది.
‘ఏవండీ!’ భర్తను గట్టిగా కుదుపుతూ లేపింది కౌముది. కళ్లు తెరచి కౌముదివైపు అయోమయంగా చూస్తున్న వివేక్ ఒక్కసారి చంటి పిల్లాడిలా బోరుమంటూ కౌముది ఒడిలో తలదాచుకున్నాడు.
‘ఏవండీ! ఏం జరిగింది?’
తనను తాను సంబాళించుకునే ప్రయత్నంలో వివేక్ ఏదో చెప్పబోయి, ‘అమ్మ, అమ్మ’ అంటూ ముఖానికి రెండు చేతులూ అడ్డం పెట్టుకున్నాడు.
‘ఏవండీ! మీరు అంతలా కన్నీరు కారుస్తూ బాధ పడకండి.. ఈ రోజు మధ్యాహ్నం అత్తయ్య, మామయ్యలతో ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్లిద్దరూ బాగున్నారు’ అంది.
‘అది కాదు కౌముదీ! పంపకాల రోజు (అత్తయ్య) అంటే అమ్మ, డాడీ ఎంత బాధపడతారో! వారం రోజుల క్రితం ఆస్తి పంపకాల ప్రస్తావన రాగానే అమ్మా, నాన్నలిద్దరు ఎంతగా చలించిపోయారు! నీవు కూడా చూశావుకదా! డాడీ మగవాడు కాబట్టి ధైర్యంగా, నిబ్బరంగా ఉన్నారు కొంతవరకు.
మమీ మాత్రం ‘అందరూ ఉండి, ఎవరూ లేని అనాధలమయ్యాం’ అంటూ నన్ను దగ్గరకు తీసుకుని ఒకటే ఏడుపు. ఆ దృశ్యాన్ని ఇంకా మరవలేకపోతున్నాను.
భర్త స్థితిని గమనించిన కౌముది అతన్ని ఓదార్చడం తప్ప, ఏం చెప్పినా వినే స్థితిలో లేడని గమనించి, తల్లిలా అతన్ని దగ్గరకు తీసుకుని లాలించింది.
ధర్మయ్య, లక్ష్మమ్మ ఊళ్లో మంచి పేరున్నోళ్లు. ఊరి పెద్దల లిస్టులో ధర్మయ్య పేరు మొదటి (సంఖ్య)లోనే ఉంటుంది. పిత్రార్జితాన్ని దంపతులిద్దరూ రెక్కల కష్టంతో పెంచుకుంటూ వచ్చారు. భర్తతో పాటు లక్ష్మమ్మ కూడా పొలం పనులకు వెళ్లేది.
ధర్మయ్యకు సంతానం పట్ల ఎనలేని ప్రేమ. ఆ దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, ఎవరికీ ఎక్కువగా చదువబ్బలేదు. వ్యాపారం చేసుకుంటూ తలోచోట ఉంటున్నారు.
పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నంత సేపు ఏ సమస్యలూ రాని ధర్మయ్య దంపతులకు కొత్త కొత్త సమస్యలు మొదలయ్యాయి. పిల్లలు పెరిగి పెద్దవాళ్లై పెళ్లిళ్లు, సంతానం కలిగి, ఎవరి కుటుంబం వారిదయ్యాక కొడుకులు, కూతుళ్లు ఆ ఇంట్లో పెరిగిన వాళ్లేకానీ, కోడళ్లు, అల్లుళ్లు వేర్వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్లు కదా! అభిప్రాయాలెలా కలుస్తాయి!
ప్రతి పండుగకి అందరూ కలుసుకోవడం, వెళ్లేప్పుడు ఏదో కారణంతో గొడవపడి మూతి ముడుచుకొని వెళ్లిపోవటం. సరిగ్గా సంక్రాంతి రోజు అలాగే జరిగింది. పిల్లలు గొడవపడ్డారని పెద్దలు కల్పించుకుని..పెద్ద రాద్ధాంతం జరిగింది. ఎవరికీ ఏమీ చెప్పలేక ధర్మయ్య ఊళ్లోకి వెళ్తే లక్ష్మమ్మ ఏడ్చుకుంటూ ఏమీ చేయలేక ఓ మూలన కూచుంది.
అందరిలోకి చిన్నవాడు వివేక్ అంటే లక్ష్మమ్మకు కాస్తంత ఎక్కువే మమకారం వివేక్ చాలా మెత్తని స్వభావంగలవాడు. పైగా అమ్మా, నాన్నలంటే చాలా ప్రేమ ఆ రోజు అందరూ ఎక్కడి వాళ్లు అక్కడ వెళ్లిపోయినా, వివేక్ మాత్రం తల్లి పక్కనే ఉండి ఆమెను సముదాయించాడు.
ఆ రోజు శుక్రవారం లక్ష్మమ్మ తలారా స్నానం చేసి, దేవుడి ముందు నిలబడి రెండు చేతులూ జోడించి, తన కొడుకులకు విడిపోవాలనే ఆలోచన తొలగించు స్వామి అని మొక్కింది.
‘అమ్మా! మాకు రావాల్సింది మాకు పంచి ఇవ్వండి’ అంటూ పెద్ద కొడుకు రాజశేఖరం, రెండవ వాడు బాలకృష్ణ ఫోన్ చేసి తమ అభిప్రాయాల్ని ఖచ్చితంగా చెప్పేశారు. ఎంత సముదాయించినా వాళ్ల అభిప్రాయం మారలేదు. ధర్మయ్యకు ఆస్తి పంపకాలు చేయక తప్పలేదు.
***
ఆరోజే పంపకాలు. లక్ష్మమ్మ అన్నా వదినలు, దగ్గరి బంధువులు అంతా వచ్చారు. అందరికీ ఒకటే ఆశ్చర్యం! ఈ నలుగురు అన్నదమ్ములు ఎంత చక్కగా కలిసుండేవాళ్లు, ఇంతలోనే ఏమైంది వీళ్లకి.
వంటలూ, వార్పులూ వచ్చిన వాళ్లందరికీ, ఇల్లంతా పెళ్లిల్లులా ఉంది.
కొడుకులు, కోడళ్లు, కూతుళ్లూ, అల్లుళ్లు, మనవలు, మనుమరాళ్లు అందరూ హాయిగా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి ముఖంలోనూ, కుటుంబం విడిపోతున్నదన్న చింత ఇసుమంత కూడా లేదు.
పాపం.. ఆ కుటుంబ పెద్దలు ధర్మయ్య, లక్ష్మమ్మలు మాత్రం చిన్నబోయిన ముఖాలతో ఆ ఇంట్లో తిరుగుతున్నారు. లక్ష్మమ్మ మాటి మాటికి కళ్లు తుడుచుకుంటుంది.
అంతా సవ్యంగా జరిగింది. అందరూ వికసించిన ముఖాలతో, సంతృప్తి చెందిన హృదయాలతో ప్రయాణమవుతున్నారు.
ఇక లక్ష్మమ్మ ఆపుకోలేకపోయింది. ఉదయం నుండి బిగబట్టుకున్న దుఃఖం ఒక్కసారి పొంగి వచ్చింది.
‘నాన్నా! వివేక్’ అంటూ బోరుమంది ఒక్కసారిగా. ధర్మయ్య కళ్లు తుడుచుకుంటూ వాకిట్లోకి నడిచారు. ‘అమ్మా! ఎందుకమ్మా దుఃఖిస్తావు ఇదీ ఒకందుకు మంచిదే. కలిసి ఉండి గొడవ పడేకంటే, ఎప్పుడో ఓసారి అపురూపంగా కలిసుంటే అందరికీ ఆనందం, విడిపోతే వాళ్లకు తెలుస్తుంది కష్టం, సుఖం అన్నాడు. వివేక్ వారం రోజులు ఆఫీసుకు లీవు పెట్టి, భార్య కౌముది బాబు కార్తీక్ తల్లిదగ్గరే ఉన్నారు. బాబు ఆట పాటలో లక్ష్మమ్మ కొంతవరకు కోలుకుంది.

- గరిశకుర్తి శ్యామల, కామారెడ్డి
నిజామాబాద్ జిల్లా
సెల్.నం.9948326270

పుస్తక సమీక్ష

మనసు తడి
ప్రతులకు:
శ్రీమతి పాతూరి అన్నపూర్ణ
1156/28-1
ప్రశాంతినగర్
నవలాకుల గార్డెన్స్
నెల్లూరు - 524002
సెల్.నం.9490230939
పేజీలు : 99
వెల : 100

కళ్లు చెమర్చడం అంటే
ఏమిటో తెలిసింది
నీతో స్నేహం చేసాక!
ఓ ఆర్ద్రతా వీచిక మనసుకు తగిలి
వౌనంగా ఉన్న హృదయాన్ని మీటి
రాగాలను పలికించిందంటూ..స్నేహాన్ని అక్షరాల్లో అందంగా ఆవిష్కరించిన పాతూరి అన్నపూర్ణ గారు తన ఐదో గ్రంథంగా ‘మనసుతడి’ కవితా సంపుటిని పాఠకలోకానికి అందిస్తున్నారు.
ఏ అదృశ్య శక్తో హృదయాంత రాళంలో దిగబడి.. భావ పరంపరను మథనం చేసి.. అక్షర రూపంగా ఆవిర్భవించి.. పుడమి నెర్రెల నుండి.. కొత్త మొక్క ఉదయించినట్లు.. మేఘాల మాటున మెరుపు మెరిసినట్లు కవితా సృష్టి కురుస్తుందని సవినయంగా స్వయంగా ప్రకటించుకున్న కవయిత్రి అన్నపూర్ణ కవితా వస్తువు కోసం అనే్వషణ కొనసాగిస్తూ.. చుట్టూ వున్న సమాజంలోని నిన్నత్వాన్ని పరికిస్తూ..ఏకత్వ దారాన్ని చుట్టుకు పోతాననడం ఆమె ఉత్తమ అభిరుచికి నిదర్శనం..ఉన్నత వ్యక్తిత్వానికి ప్రతిబింబం!
కవిత్వం నీడ నాలో పరుచుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఊపిరి పోస్తుందన్న ఆమె.. చైతన్యం సిరా ఉన్నంతవరకు.. అక్షరం కాలాన్ని జయిస్తూనే వుంటుందనీ..ఎన్నో కవిత్వపు సంతకాలకు..నా ఇల్లు చిరునామాగా మారుతుందనడంలో కవిత్వం పట్ల ఆమెకున్న మక్కువను మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు..
అన్నపూర్ణ గారి కవిత్వంలో.. నిరాశ నిస్పృహలకు తావివ్వని ఆశావహ దృక్పథం ఉట్టిపడుతుంది. తమ అంతరంగంలో గూడు కట్టుకున్న అనంత భావాలకు భావుకత జోడించి పదబంధాలను అందంగా ఆవిష్కరించడంలో ఆమె దిట్ట అనే విధంగా ఈ కావ్యంలోని కవిత్వం మనకు కానవస్తుంది. హృదయాలను కదిలించేలా..మనసు తడితో ఆమె ఆయా కవితల్లో పొందుపరిచిన పంక్తులు మనల్ని ఆకట్టుకుంటాయి! అడుగడుగున మనల్ని తట్టి లేపుతాయి. బాధ్యతల్ని గుర్తు చేస్తాయి..చైతన్య పథాన నడిచేలా దిశా నిర్దేశం చేస్తాయి..బాల్యం జాడలను గుర్తుకు తెస్తాయి. రెప్పల వెనక దృశ్యాలతో సంభాషిస్తూ ఆమె పేర్కొన్నట్లు పదే పదే పరామర్శిస్తాయి! క్షణ క్షణం వేగిరపడుతున్న ఆమె ఆలోచనలను అక్షర శిల్పాలుగా మార్చి మనం సేదతీరేలా ఈ కావ్యంలోని కొన్ని కవితల్ని తీర్చిదిద్దారు.
యుగాలు మారుతున్నా.. తరాలు మారుతున్నా.. మహిళల తల రాతలు మారడం లేదనీ..ఓ కవితలో వాపోయారు. తన నీడను చూసి తనే ఉలిక్కిపడటం.. గొంగళి పురుగులా ముడుచుకుపోతున్నది ఆత్మవిశ్వాసం..ఏ మృగత్వం నాశనం చేస్తోందన్న భయం వెంటాడుతోందన్న భావం స్ఫురించే విధంగా ‘హృదయంతో ప్రేమించాలి’ కవితను రూపుదిద్దారు. మగశిశువుకు జన్మనిచ్చిన ప్రతి తల్లి నైతికతను చనుబాలతో రంగరించి పోయాలని హితవు పలికారు. అ, ఆలు దిద్దడమే కాదు..అమ్మతనానికి మొక్కడమూ నేర్పాలని సూచించారు.
‘ఈ తెలుగు మనదిరా’ కవితలో.. తెలుగు మనదిరా! ఈ వెలుగు మనదిరా! కమ్మనైన తెలుగు భాషని కలనైనా మరువకుండా రేపటి వారసుల చేతికి అందిద్దామనీ..తెలుగు భాషా పల్లకిని మోసే బోయాలను తయారు చేద్దామని పిలుపునిచ్చిన తీరు బాగుంది.
కనిపించే ఈ హరిత వర్ణంలో..నా జీవన చిత్రం రంగులద్దుకుంటూనే ఉంటుంది..చెట్టు ఆశీర్వదించే తల్లి మాత్రమే కాదు..జీవిత పాఠాలు నేర్పే గురువని..చెట్టును మరో కవితలో ఉన్నతంగా చిత్రించారు.
ఆలోచనలు మంచి ముత్యాల్లా వుంటే అవకాశాలు అంతర్మథనానికి తావివ్వవనీ.. ఎడారిలో ఎండ మావుల్లా కాక.. హిమవన్నగవులా మార్చుకుంటే బ్రతుకు సార్థకత అంటే తెలుస్తుందని ‘ఒక చిరునవ్వు చాలు’ కవితలో చక్కగా తెలియజెప్పారు.
తరాలెన్ని గడిచినా..నువ్వు మాతోనే వుంటావు. మళ్లీ జన్మంటూ ఉంటే అక్కినేని గానే అవతరిస్తావని నటుడు నాగేశ్వర రావుకు అక్షరాంజలి ఘటించారు.
పెదాలు చిరునవ్వుల్ని పూయిస్తున్నా..వాటి వెనకాల దాగున్న విషం..మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతుందనీ.. ఎవర్ని చూస్తే కళ్లు తేజోవంతమవుతాయో అదే ఆత్మీయానుబంధానికి ప్రతీక అని.. అప్పుడు మాత్రమే మనిషికీ.. మనిషికీ మధ్య.. మమతల వారథి వెలుస్తుందని ఓ కవితలో చక్కగా చెప్పారు.
చదువుల పేరుతో..బాల్యాన్ని బందీ చేస్తున్న సంగతిని ‘రెక్కలు తెగిన బాల్యం’ కవితలో ప్రస్తావించిన తీరు బాగుంది. మార్నింగ్‌వాక్ ప్రయోజనాలను ఇంకో కవితలో ఏకరువు పెట్టారు.
నిశ్శబ్దం ఒక్కసారి వరంలా లభిస్తుందనీ మనసు నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు..కళ్లముందు సాక్షాత్కరించే పద చిత్రాలు అక్షరాలుగా ఆకృతిని సంతరించుకుంటాయన్న అన్నపూర్ణ గారి మాటలు అక్షరాల నిజం! ఇలా అనేక కవితలు ఈ గ్రంథంలో ఆమె ప్రతిభకు, సామాజిక చింతనకు పట్టం కట్టేలా వున్నాయి.. వస్తు ఎంపికలో వైవిధ్యం ఉన్నప్పటికీ.. అభివ్యక్తిలో మున్ముందు శిల్పం విషయంలో ఇంకా శ్రద్ధ చూపిస్తారన్న విశ్వాసం ఉంది. ఆ దిశలో ఆమె అడుగులేస్తారని ఆశిద్దాం.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

మనోగీతికలు

అక్షర కౌగిలి!
అక్షరాన్ని కౌగిలించుకుంటే
అజ్ఞానం మటుమాయం!
నెలకొల్పుతుంది జ్ఞానగ్రంథం
మార్చుతుంది మనిషిని పరబ్రహ్మగా!
అక్షరాలు పొదిగిన పదజాలం
మనసును చిక్కించే మాయాజాలం!
పద్మవ్యూహాన్ని తలపించే మహా కుహరం!
అక్షరం..ఓ మంత్రదండం!
మహాత్వపూర్ణ ఆయుధం!
అక్షర కౌగిలి
పద ప్రభంజనాలకు లోగిలి!
అక్షరాల కుచ్చుదండలు
పడగలెత్తే పదాల నీరాజనాలు!
రక్తాన్ని ఉరికించి, నరాలను కదిలించి
రోమాలను నిక్కించే నటరాజ తాండవాలు!
కఠిన హృదయాలను కరిగించి
కన్నీరు కార్పించే
తన్మయత్వ తదిగినతోం!
భగవంతుడిది వౌన భాష
దాని అనువాదమే మానవ భాష!
భాష ఆలోచనను, ఆలోచన భాషను
ఆకాశానికెత్తొచ్చు,
పాతాళానికి పడవేయొచ్చు!
ఒకసారి వాడిన పదాలు..
తిరిగిరాలేని శస్త్రస్త్రాలు!
ఎత్తు నుండి జారిపడ్డ గుడ్ల గంపలు!
పగిలిన గుడ్డు అతకదు కదా?

- ఆచార్య కడారు వీరారెడ్డి
కరీంనగర్
సెల్.నం.7893366363

ఉప్పుసంచి మెరుపులు
పురిట్లోనే నన్ను ఇడ్చి అమ్మ పైకిపోయింది!
సల్లగుండు బిడ్డా! ఆయుష్షు పోసి..
బాపు చెమట చుక్కలే నాకు అన్నీ అయినాయి!
ఆయి మోకాళ్లు - తాత భుజాలు కాయాలు కాసినై
ఉప్పు సంచిని ఎత్తుకొని - ఊళ్లు - ఊరు తిరిగిండ్రు
ఎన్ని రోజులని గీమెనే బిడ్డ మీ అమ్మ అన్నరు!
గామెగాదు గోడ మీద ఫోటోల..
దేవుడు దగ్గరకు పోయింది!
గాయి గాయి జేసిన!
మరుపు దేవుడిచ్చిన వరం కదా..
కాలం గిర్రున తిరిగింది
లాగు ఎనకోరంగు ముందటికోరంగు
అంగీకి డైమండ్ గుండీలు
గప్పుడు అదే ఫ్యాషన్
అట్లనో గిట్లనో సదువు పూర్తయింది
నూనూగు మీసాలొచ్చినయి
లోకం వెలుగు ‘సూరీడు’ అయితే
మా ‘అయ్య’ నా వెలుగు!
జీవితాన్ని విడమర్చి చూపిండు
వికారాన్ని తీసి జీతమిచ్చిండు
‘డాక్టర్’ అయిదామనుకుంటే
‘టీచర్’ అయిన గట్లెట్ల
అయినోళ్లు కానోళ్లు మా పిల్లనిస్తం
ఉద్యోగం పురుష లక్షణంగావచ్చు
పెళ్లిగానే అయింది!
‘అమ్మ’కు నేనంటే మస్తుగ ప్రేమ
మల్ల మల్ల పుట్టింది!
ఇప్పుడిక రాజదర్పం..
ఇల్లు-కారు-బైకు-రివాల్వింగ్ చైర్-లాప్‌టాప్
చెబ్తె భారతమంత-ఇంటె రామాయణమంత
కొందరంటరు గాడికి పోకడ - రుబాబు మస్తుగని
నా పెండ్లాం మాత్రం
‘మనసున్న మారాజంటది’
గట్టనే గానీ!!

- మడిపల్లి హరిహరనాథ్ శర్మ
నిర్మల్, అదిలాబాద్ జిల్లా
సెల్.నం. 9603577655

ఉమ్మడి కుటుంబం !
పూలదండలో
దారం చందంలా..
అందమైన
ఉమ్మడి కుటుంబంలో..
ఆప్యాయతలు కనబడవు!
మరుగున ఉంటాయి!
పూలదండ
విచ్ఛిన్నమై..
పూలు చెల్లాచెదురైనప్పుడే..
దారం కనిపిస్తుంది!
అలానే..
ఎవరికి వారు యమునా తీరు వోలే
విడిపోయినప్పుడు..
ఉమ్మడి కుటుంబంలోని
‘అనుబంధం’
పూల దండలోని దారం వలె
గుర్తుకు తెస్తుంది!
కలిసి వుంటే
సుఖమేమిటో తెలియజేస్తుంది!

- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి
సెల్.నం.9440642809

ఆడదే ఆధారం
బంధానికైనా సంబంధానికైనా
ఆడదే ఆధారం ఈ జగతిలో
ప్రణయంలో శిఖరాగ్ర భాగానికి చేర్చి
తను స్కలించి తనువంతా పులకింపజేసి
స్వర్గం ఇదని తుది శిఖరాన నిల్పి
అమరలోకాల అంచున చేర్చునది ఆడదే
భోగాలకు - భోగ భాగ్యాలకు - సుఖాలకు
సుఖ సంపదల సంసార సుఖానికి
ఆడదే ఆధారం!
రాజ్యాధికార యుద్ధాలకు
ప్రగతిపద సోపానాలకు నిచ్చెన ఆడదే
కుల వంశ సాంప్రదాయాలకు
సంక్రమనానికి మూలం ఆడదే
ప్రణయానికి - ప్రళయానికి
ఓపికకు - సహనానికి - పంతానికి
సంతాన సహజీవనానికి
అష్టైశ్వర్యాల సృష్టికి ప్రగతి పునాదికి
ఆధారం ఆడదే
అందుకే..
బంధాలకు సంబంధాలకు ప్రేమలకు
ఆడదే మూలం ప్రగతికి సోపానం!
ఆడజన్మకు సార్థకం మాతృత్వం
ఓపికకు శాంతికి మూలం!!

- బోనగిరి రాజారెడ్డి
హమాలివాడ, మంచిర్యాల
సెల్.నం.9701381944

అమ్మా..!
నీ కడుపులో..
నేను ఆడపిల్లగా
పెరుగుతున్నాని
నువు తెలుసుకున్నాక..
నీ ముఖంలో
నిరాశ, నిస్పృహలు
ఆవరించాయెందుకమ్మా!
ఆడపిల్లంటే..
అవమానమా?
ఆత్మన్యూనతా భావమా?
లేదా..
మీ బ్రతుకులకు
నేను భారమా?
ఆడపిల్లంటే..
అంత అసహ్యమెందుకమ్మా!
మీ అమ్మా...
నీ గురించి అలాగే
అనుకుంటే
నువ్వు ఈ లోకం
చూసేదానివా?
పశు పక్ష్యాదులకు లేని
ఆలోచన నీకొద్దమ్మా!
ఆడపిల్లతోనే సదా...
ఇల్లంతా ఆనందం!
ఆడపిల్లతోనే కదా..
మమతాను బంధం!!

- కోరుకంటి శశికిరణ్మయి, జ్యోతినగర్
సెల్.నం.9490287740

బంగారు బతుకమ్మ

బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ పండుగే వచ్చింది
సద్దుల బతుకమ్మ, సందడే చేసింది
తెలంగాణాలోన, తెలుగు వారింట
మహిళల పండుగ, మనవూరి పండుగ
గూనుగు పువ్వుల్లో, గుమ్మడీ పూవుల్లో
తంగేడు పువ్వుల్లో, రుద్రాక్ష పూవుల్లో
రంగు రంగుల పూలల్లో, రతనాల బొమ్మ
పదిలంగ కూర్చుండే, తరుణి గౌరమ్మ
పారాణి పాదాల్తో, పడతులే ఆడంగ
గల గల గాజుల్లు సవ్వడే సేయంగా
బతుకమ్మ వచ్చింది, సద్దుల బతుకమ్మ వచ్చింది
వాగుల్లో వంకల్లో, బావుల్లో చెరువుల్లో
నిన్నంపుతామమ్మ, నా బిడ్డ బతుకమ్మ
మెట్టినింటికి పోయి, మరల రావమ్మా
పోయిరా బతుకమ్మ, పోయిరావమ్మా
పసుపు కుంకుమలిచ్చి, కాపాడవమ్మా
పిల్లల్ని పాపల్ని, సల్లంగ సూడమ్మా
పాడి పంటల తోటి పాలించవమ్మా
పోయిరా బతుకమ్మ, పోయిరావమ్మా

- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9493210293

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com

- గరిశకుర్తి శ్యామల