సంపాదకీయం

ఊపిరాడని తిమింగలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమింగలాలను దిగమింగుతున్న కాలుష్యం తాబేళ్లను మాత్రం వదలిపెడుతుందా? కాలుష్యం, అతి భయంకరమైన పరిణామాలకు కారణం! భూమి ఉపరితలంపై ఏనుగులు సముద్ర జలాలలో తిమింగలాలు పెద్ద జంతువులు. పిల్లలకు పాలిచ్చి పెంచే తిమింగలాలు భూమిపై ఏనుగుల వలెనే సముద్రంలో సాధు జంతువులు. ఈ సాధు జంతువులు చెలరేగినప్పుడు హాని జరుగుతుంది, కానీ మామూలుగా ఉన్నప్పుడు అవి మానవులకు హాని చేయవు! ముప్పయి అడుగుల పొడవుతో పది అడుగుల వెడల్పుతో విస్తరించే తిమింగలాలు అర్ధాంతరంగా మరణిస్తుండడం కాలుష్య ప్రహసనంలో వర్తమాన ఘట్టం! పదునాలుగు అడుగులు మాత్రమే పెరిగిన చిరుత ప్రాయపు తిమింగలాలు కాలుష్యంతో ఊపిరాడక సముద్ర జలాలనుండి తీరానికి కొట్టుకుని వస్తున్నాయి. అకాల మరణం పాలవుతున్నాయి! సముద్ర జలాలు కాలుష్యంతో వేడెక్కి పోతుండడంవల్ల చిన్న చిన్న దీవులు మునిగిపోతున్నాయి! పెద్ద పడవల వంటి తిమింగలాలు కాలుష్యం నిండిన జలాలలో ఉండలేక దిక్కుతోచని రీతిలో పయనించి తీరంలోకి వచ్చి భూమిపై పడిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరిగిపోతున్న ఈ ప్రమాదాలు తమిళనాడులోని తిరుచందూర్ సమీపంలోని సముద్ర తీరంలో ఇటీవల మరోసారి ఆవిష్కృతమయ్యాయి! ఎనబయి ఒక్క తిమింగలాలు తీరానికి కొట్టుకుని వచ్చి పడిపోయాయట! ఇసుక పాలైన ఈ తిమింగలాలను మళ్లీ జలాలలోకి మళ్లించడానికి జాలర్లు ప్రయత్నించినప్పటికీ నలబయి ఐదపు ఒడ్డునే ప్రాణాలను విడిచాయట! నాలుగు మీటర్ల పొడవున్న ఒక్కొక్క చిట్టి తిమిగలం బరువు వెయ్యి, పదిహేను వందల కిలోల మధ్య...పసి తిమింగలాల పరిమాణం ఇంత పెద్దది! పూర్తిగా ఎదిగిన తొమ్మిది మీటర్ల పొడవైన తిమింగలాల పరిమాణం, బరువు ఎంత ఉంటుందో మరి! ఇలాంటి మహా ప్రాణులు కొన్ని అరవై అడుగుల పొడవు వరకు పెరుగుతాయట! ప్రధానంగా నాచును ఇతర సముద్ర గర్భంలోని మొక్కలను భుజించే తిమింగలాలు శాకాహారులు! అప్పుడప్పుడు చిన్న చిన్న చేపలను మాత్రమే చప్పరిస్తాయట! ఇలాంటి భారీ కాయాలు లోతైన సముద్ర జలాలలో మాత్రమే నివసిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పదమూడు జాతుల తిమింగలాలు సముద్ర జలాలలో విహరిస్తున్నాయి. ఈ జలచరాల ఉనికి సముద్ర జలాలు కలుషితం కాకుండా నిరోధించడానికి దోహదం చేస్తోంది. కానీ కాలుష్యాన్ని కబళిస్తున్న తిమింగలాలను కాలుష్యమే కాటు వేస్తుండడం మానవకృతమైన దానవచర్య! ఇలా నలబయి అయిదు మహాప్రాణులు మట్టిపాలయిపోయాయి. జాలర్లు సముద్ర జలాలలోకి మళ్లించిన మిగిలిన తిమింగలాలలో అన్నీ బతికి ఉంటాయన్న నమ్మకం కూడ లేదట! తమిళనాడులో ఇలా తిమింగలాల మరణాలు సంభవించిన నేపథ్యంలో, ఒడిశాలోని పూరీ జగన్నాధ క్షేత్రం సమీపంలోని సముద్ర తీరంలోకి వందలాది తాబేళ్ల మృతదేహాలు కొట్టుకుని వచ్చాయట!
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఘోరాలు జరిగిపోతూనే ఉన్నాయి! నిజంగా దారి తప్పి సముద్ర చరాలు ఒడ్డునకు చేరి ఉక్కిరి బిక్కిరి కావడం సహజం! ఋతువులు మారినప్పుడు సముద్ర ఉపరితల జలాల, సముద్ర గర్భ జలాల శీతోష్ణస్థితులు పరివర్తన చెందుతాయి. ఈ పరివర్తనం నిరంతరం జరుగుతోంది! దక్షిణార్ధ గోళంలో ఎముకలు గడ్డకట్టిపోయే చలికాలం ఉన్న సమయంలో ఉత్తరార్ధ గోళంలో గ్రీష్మ ఋతువు నడుస్తూ ఉంటుంది! అందువల్ల దక్షిణార్థంలో సముద్ర జలాలు మంచుగా మారినప్పుడు లక్షలాది జల చరాలు ఉత్తర ప్రస్థానం సాగిస్తాయి! మళ్లీ దక్షిణార్థ గోళంవైపు తిరిగి వస్తాయి! ఆరు నెలల తరువాత మళ్లీ ఉత్తర జలాలవైపు...ఇలా రాకపోకలు సాగించే తాబేళ్లు, తిమింగలాలు ఇంకా అనేక రకాల జలపక్షులు కుడివైపునకు తిరగబోయి ఎడమకు తిరగడం వెనక్కు తిరిగినట్టు భావించి ముందునకే వెళ్లడం తరచు సంభవించే ప్రమాదం! అవగాహన-ఓరియెంటేషన్-లోపం ఇందుకు కారణమన్నది శాస్తజ్ఞ్రుల నిర్ధారణ! ఇలా అవగాహన లోపంతో గతి తప్పిన జల చరాలను, ఒడ్డునకు వచ్చి ఉక్కిరి బిక్కిరి అయ్యే సముద్ర ప్రాణులను మళ్లీ సముద్రంలోకి నడిపిచడం ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ జరగుతున్న ప్రహసనం! కానీ తిరుచందూర్ సమీపంలోను, పూరీ జగన్నాధ్ సమీపంలోను జరిగిన ఘోర మరణాలకు ఈ వలసలు కారణం కానే కాదట! సామాన్య మత్స్యకారులు అదే చెప్పారు, చదివిన శాస్తవ్రేత్తలు అదే చెప్పారు!
సముద్ర జలాలలో కాలుష్య కాసారాలు ఏర్పడి ఉండడమే ఈ అకాల దుర్మరణాలకు అసలు కారణమన్నది ఎవ్వరూ నిరాకరించలేని నిజం! తిమింగంలాలు బృహత్ పరిమాణ దేహులు కాబట్టి కాలుష్యం కాటు పడిన తరువాత ఒడ్డునకు కొట్టుకుని వచ్చే వరకు ప్రాణాలతో మిగిలాయి, తాబేళ్లవి అల్ప ప్రమాణ దేహాలు కాబట్టి కాలుష్య కాటు వేసిన వెంటనే అవి కళేబరాలుగా నీటిపై తేలాయి, ఈ మృతకళేబరాలు సముద్ర జలాలలో ఇంకెన్ని తేలియాడుతున్నాయో? వాణిజ్య నౌకల నిర్వాహకుల, చోదకుల క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా అనేకసార్లు అనేక చోట్ల నౌకలకు కన్నాలు పడిపోతున్నాయి. నౌకలలో నిండిన ముడిపెట్రోలియం ఈ కన్నాలగుండా సముద్రం పాలవుతోంది! పెట్రోలు నిండిన నౌకలే పగిలిపోయి వందల వేల చదరపు కిలోమీటర్ల మేర ఇంధన తైలం తెట్టుకట్టడం పునరావృత్తవౌతున్న వైపరీత్యం! బాధ్యులైన వారు ఎవరు? నష్టపరిహారం ఎవరు ఎవరికి చె ల్లించారు? అన్నవి ప్రధానం కాదు! సంవత్సరాల తరబడి దశాబ్దుల తరబడి ఈ నూనెతెట్టులను సముద్ర జలాలు జీర్ణించుకోలేకపోవడంవల్ల కాలుష్యం దూర దూర ప్రాంతాలకు విస్తరించిపోయింది! ఈ నూనె తెట్టు క్రమంగా విచ్ఛిన్నమైపోయి వందలాది ఇంధన కాలుష్య శకలాలు సముద్ర జలాలలో అన్ని వైపులకు విస్తరించిపోవడం కూడ కాలుష్యాన్ని పెంచుతున్న, పంచుతున్న విపరిణామ క్రమం...ఆ నూనె సోకినంత మేర జలచరాలు విగతప్రాణులైపోతున్నాయి! సంపన్న దేశాల వారు పాతబడిపోయిన నౌకలనిండా పారిశ్రామిక వ్యర్థ పదార్ధాలను నింపుతున్నారు. ఈ వ్యర్థాలలో విష రసాయన పదార్ధాలు విరివిగా ఉన్నాయి. అలా నింపిన నౌకలను తమదేశపు తీరానికి దూరంగా తీసుకునిపోయి అంతర్జాతీయ జలాలలో ముంచేస్తున్నారు! కొన్నిసార్లు వర్ధమాన దేశ తీర జలాల్లో ఈ నౌకలను ముంచేసి పోతున్నారు. ఇలాంటి ఎన్నో దుశ్చర్యలు సముద్ర చరాలకు నిలువ నీరులేకుండా చేస్తున్నాయి!
వేడెక్కిన సముద్ర జలం చిన్న ద్వీపాలను ముంచి వేయడానికై ఉప్పొంగిపోతోంది! మందకొడితనానికి మారుపేరైన తిమింగలం సైతం ఈ వేడికి చురుకు పుట్టి పారిపోతోంది...పెద్ద పెద్ద తిమింగలాలు చిన్న దీవులవలె సముద్ర జలాలలో నిశ్చలంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి! నౌకాయాత్రికులు వాటిని దీవులని భ్రమించి వాటిపై దిగి విశ్రమించేవారు, విహరించేవారు! ఇదంతా చరిత్ర! తమ వీపులపై మానవ సంచారం జరిగినా ఆ మందకొడి మహాప్రాణులు చలించేవి కాదట! కానీ వంట కోసం మంట మొదలు కాగానే తిమింగలాలు ఆ వేడికి ఎగిరిపడేవట! ఇప్పుడు సముద్ర జలాలలోనే కాలుష్యపు మంటలు చెలరేగుతున్నాయి...తిమింగలాలు ఎందుకు ఎగిరిపడవు??