కడప

ఎర్రచందనం కూలీల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జనవరి 25: అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఏడుగురు తమిళ కూలీలను అరెస్టుచేసి రిమాండుకు తరలించినట్లు రాయచోటి ఫారెస్టు రేంజర్ ప్రసాదరావు తెలిపారు. సోమవారం స్థానిక అటవీ రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రేంజర్ ప్రసాదరావు మాట్లాడుతూ ఎర్రచందనం దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టగా గువ్వలచెరువు చెక్‌పోస్టు వద్ద తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లా చిన్నసేలం తాలూకాకు చెందిన చినియన్‌రాజ్, పేరిస్వామి అన్బుగలన్, రామన్‌సత్యవేల్, సేలంకు చెందిన అండిఅన్నామలై, క్రిష్ణగిరికి చెందిన వడివేలు మణికండన్, అర్జున్‌రాజేంద్రన్, తిరుణామరికి చెందిన నరేషన్ గోపిలు ఏపీ 21 జె 4736 టీ ఎన్ 21జె4736 నెంబర్ గల లగ్జరీ బస్సుల్లో 50 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా అరెస్టు చేసినట్లు చెప్పారు. ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.30 లక్షల విలువ ఉంటుందని తెలిపారు.
దువ్వూరు మండలంలో ఏడుగురు అరెస్టు
దువ్వూరు మండల పరిధిలోని క్రిష్ణంపల్లె సమీపంలోని నారాయణస్వామి మఠం వద్ద గల కొండ వద్ద ఆదివారం పోలీసులు జరిపిన దాడుల్లో ఏడుమంది ఎర్రచందనం స్మగ్లర్లు, ఏడు ఎర్రచందనం దుంగలతోపాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రామక్రిష్ణ తెలిపారు. సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ మైదుకూరు రూరల్ సిఐ నాగభూషణం, దువ్వూరు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి, కడప టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. క్రిష్ణంపల్లె గ్రామ సమీపాన ఉన్న కొండపైన ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం గ్రామంలోని బేస్తకాలనీకి చెందిన బనగానపల్లి మధు, బ్రహ్మం, గొడుగు గుర్రప్ప, చెంగనబోయిన రాముడు, ముత్యాల నరసింహులు, గొల్లం జమాలయ్య, కొండబోయిన రమేష్‌లు ఉన్నారన్నారు. వీరిని విచారించగా రుద్రవరం మండలానికి చెందిన మేస్ర్తిలైన సుబ్బయ్య, బాలు, సంజీవయ్య, ఆళ్లగడ్డకు చెందిన ఓ బడా స్మగ్లర్ పథకం ప్రకారం స్మగ్లింగ్ నిర్వహిస్తున్నారని తెలిసింది. మిగతా వారిని పట్టుకొనేందుకు ప్రత్యేక టీమ్‌తో గాలింపు చర్యలు చేపట్టామని డీ ఎస్పీ తెలిపారు.

రాయలసీమ హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 25: రాయలసీమ విద్యార్థి సంఘం (ఆర్‌ఎస్‌యు) రాష్ట్ర మహాసభల్లో భాగంగా రెండవరోజైన సోమవారం కోటిరెడ్డి సర్కిల్ నుంచి ఎర్రముక్కపల్లెలోని శివశివాని స్కూల్ వరకు వందలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్కూల్ ఆవరణలో ఆర్‌ఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి అధ్యక్షతన రెండోరోజు సభ జరిగింది. సభనుద్దేశించి మాజీ ఎమ్మెల్సీ ఎం.వెంకటశివారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నడుమ రాయలసీమ అనాధగా మారిందన్నారు. ఏపి అంటే తీరంలో ఉన్న 9 జిల్లాలేనన్న భావనతో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలో సిఎం సొంత జిల్లా అయిన చిత్తూరు ఉన్నప్పటికీ ఆయన సీమ అభివృద్ధిపై దృష్టిసారించడం లేదని ధ్వజమెత్తారు. ఏపి ప్రభుత్వం కేవలం కోస్తాప్రాంత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. సీమలో వలసలు, ఆత్మహత్యలు పెరిగినా ప్రభుత్వానికి చీమకుటినట్లయినా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్టవ్రిభజన తర్వాత కొత్త రాష్ట్రంలో కోస్తాప్రాంతంతో సమానంగా రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన నీరు, పరిశ్రమలు, కేంద్రస్థాయి విద్యాసంస్థలతోపాటు సీమ హక్కులను సాధించేవరకు విద్యార్థులు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాయలసీమ పేద విద్యార్థులకోసం ఫీజు రీయంబర్స్‌మెంట్ , ఉపకారవేతనాలు అమలు చేశారన్నారు. కోట్లరూపాయలతో ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. సీమప్రాంత విద్యార్థులు, యువతకోసం కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు ప్రయత్నించారని, అనుకోని పరిస్థితుల్లో వైఎస్ మరణంతో సీమ అభివృద్ధి కుంటుపడిందన్నారు. టిడిపి ప్రభుత్వంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఆర్‌ఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ సీమ హక్కులతోపాటు ఈప్రాంత విద్యారంగం సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీల సాధనకోసం ఆర్‌ఎస్‌యు ఉద్యమిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌యు కడప జిల్లా అధ్యక్షుడు జగదీష్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి శ్రీ్ధర్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు మధు తదితరులు పాల్గొన్నారు.
3సీమ విద్యారంగానికి రూ.20వేల కోట్లివ్వండి2
ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును రద్దుచేయాలని, రాయలసీమ ప్రాంత విద్యారంగ అభివృద్ధికి రాష్టబ్రడ్జెట్‌లో రూ.20వేల కోట్లు కేటాయించాలని ఆర్‌ఎస్‌యు రాష్ట్ర మహాసభ డిమాండ్ చేసింది. రెండురోజులపాటు కడపలో జరిగిన తొలి మహాసభల ముగింపు సందర్భంగా పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కడపలో తక్షణం ఉక్కుపరిశ్రమ పనులు ప్రారంభించాలని , కోస్తాంధ్ర ప్రాంతంలో నెలకొల్పిన జాతీయ విద్యాసంస్థలు రాయలసీమ ప్రాంతంలో కూడా ఏర్పాటుచేయాలని తీర్మానించారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలు, సాంఘికసంక్షేమ హాస్టళ్ల మూసివేత ఆలోచన విరమించుకోవాలని తీర్మానించారు.
ప్రజాసమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలి
కడప (కలెక్టరేట్), జనవరి 25: ప్రజాసమస్యలపై అధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని జిల్లాకలెక్టర్ కెవి రమణ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో నిర్వహించిన మీ కోసం కార్యక్రమంలో ఆయన ప్రజలనుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలపై కార్యాలయాలకు వస్తుంటారని, సత్వరమే పరిష్కరించి వారి మన్ననలు పొందాలన్నారు. జిల్లాకేంద్రంలోనే కాకుండా మండల కేంద్రంలోని అధికారులు కూడా వారి విన్నపాలు పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే మీ కోసం కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులు తమ పరిధిలో లేకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మీ కోసం కార్యక్రమానికి వచ్చిన వీరపునాయునిపల్లె మండలం ఊటుకూరు నివాసి పి.శివాంజన తాను షెడ్యూలు కులానికి చెందిన నిరుపేదనని, స్థిరాస్తులు లేవని అంటూ తనకు మీసేవ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ముద్దనూరు మండలం కోడిగాళ్లపల్లె నివాసి బాలకొండయ్య తన భూమి రైల్వేరోడ్డుకు వెళ్లిందని, ఇందుకు సంబంధించిన పరిహారం ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. కాశినాయన మండలం గొంటువారిపల్లె నివాసి కొండా దుగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామంలోని పొలాలకు నీటి సౌకర్యం లేదని, నీటి సౌకర్యం కోసం కాలువలు నిర్మించాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు. రాజుపాలెం మండలం తొండలదినె్న నివాసి నరసింహులు తనకు రేషన్ బియ్యం తక్కువ ఇస్తున్నారని, అదనంగా 10కిలోల రేషన్ బియ్యం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. చిన్నమండెం మండలం కొత్తపల్లె నివాసి బాబు తాను వికలాంగుడనని, బతుకుదెరువుకోసం వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం ఫిర్యాదుల దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో సులోచన, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పిడి బాలసుబ్రమణ్యం, సివిల్‌సప్లయిస్ మేనేజర్ వెంకటేసు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కొత తరెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,జనవరి 25: రాష్టవ్రిభజన అనంతరం చిన్న రాష్టమ్రైన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుతోపాటు నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాగా ప్రొద్దుటూరు పరిశీలనలోకి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యు డివిజన్లుగా ప్రస్తుతమున్న కడప , రాజంపేట, జమ్మలమడుగుతోపాటు మైదుకూరు, రాయచోటిలను ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే మండలాల సంఖ్య కూడా 50వేల జనాభా గరిష్టంగా నిర్ణయించి, మరో ఐదారు మండలాలను ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. మండలాల విభజనపై ఇటీవల ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో ప్రొద్దుటూరులో కొంతభాగం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొంతభాగాన్ని కలుపుతూ కొత్తజిల్లాగా ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. రైల్వేకోడూరు ప్రాంతాన్ని చిత్తూరు జిల్లాలో కలిపి తిరుపతి బాలాజీ జిల్లాగా కొత్తజిల్లా ఏర్పాటుచేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైల్వేకోడూరును బాలాజి జిల్లాలోకి విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో 51మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం కొత్త రాష్ట్రం ఏర్పాటుతో కొత్త జిల్లాల, రెవెన్యు డివిజన్ల మండలాల స్వరూపాలు మారే అవకాశాలున్నాయి. 50వేల జనాభాలోబడి వున్న ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక మండలంగా ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉమ్మడి రాష్ట్రాల్లో ఉండేది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా దాదాపు 30లక్షల జనాభాకు చేరుకోవడంతో 60 మండలాలు ఏర్పాటుచేసే వీలుంది. అలాగే రాష్టవ్రిభజనలో ఉమ్మడి రాష్ట్రాల్లో పనిచేస్తున్న రెవెన్యు అధికారులు చాలా మంది ఆంధ్రప్రదేశ్‌కు రాకతో వారందరికీ అవకాశం కల్పించాలంటే ఖచ్చితంగా మండలాల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కొత్త మండలాలపై కసరత్తు చేస్తున్నారు. రైల్వేకోడూరు, సుండుపల్లె, గాలివీడు, వేంపల్లె, పోరుమామిళ్ల, ఖాజీపేట తదితరాలను రెండేసి మండలాలుగా చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే రెవెన్యూ డివిజన్ల పెంపుతో జిల్లా స్వరూపం మారనుంది.

ఊరిస్తున్న రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలు!
రాజంపేట, జనవరి 25:శాసనసభ ఎన్నికలకు ముందే జరగాల్సిన రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలు కోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పక్షాలు ముఖ్యంగా అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల నేతలను ఊరిస్తున్నాయి. ఇవిగో అవిగో అంటూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌పై రకరకాల ఊహాగానాలు గత ఆరు నెలల కాలం నుండి వ్యక్తమవుతూ వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దమైనప్పటికి కోర్టు స్టే కారణంగా రాజంపేట మున్సిపాలిటీకి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ముగిసి ఒకటిన్నర సంవత్సరం పూర్తయ్యినా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అతీగతీ లేదు. అప్పట్లో ఓసి మహిళకు ఈ మున్సిపాలిటీ రిజర్వు అయ్యింది. రాజంపేట మున్సిపాలిటీలోకి పట్టణ శివారులోని కూచివారిపల్లె, తాళ్ళపాక, మదనగోపాలపురం, న్యూబోయనపల్లె తదితర పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనల నేపధ్యంలో ఈ పంచాయతీల ప్రజలు విలీనాన్ని నిరసిస్తూ కోర్టుకు వెళ్ళడం కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా ఈ పంచాయతీల ఎన్నికలు కూడా ఇప్పటివరకు జరగలేదు. మున్సిపాలిటీలోకి రాజంపేట పట్టణ శివారు పంచాయతీలను కలపాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఆయా పంచాయతీలు కోర్టుకు వెళ్ళడంతో విలీనం ప్రక్రియపై స్టే ఇచ్చి ఉన్నారు. ఇప్పటివరకు స్టే కొనసాగుతూనే ఉంది. దీంతో రాజంపేట మున్సిపాలిటీలోకి శివారు పంచాయతీల విలీనం ప్రక్రియ కొలిక్కి రాలేదు. అయితే తాజాగా విలీనం ప్రక్రియ కొలిక్కి రానుందని, పట్టణ శివారు ప్రాంతం 2 నుండి 3 కిలోమీటర్ల పరిధి వరకు విలీనం కానుందని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు గత రెండునెలల నుండి పేర్కొంటూ వస్తుండడంతో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా అలజడి నెలకొంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న అధికార తెలుగుదేశం పార్టీతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూ వస్తున్నారు. కాగా ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవికి సంబంధించి తమ అభ్యర్థిని దాదాపుగా ఖరారు చేసి ఉండగా, అధికార తెలుగుదేశం పార్టీలో పలువురి మధ్య పోటీ వాతావరణం కనిపిస్తుంది. అయితే తాజాగా పంచాయతీలు విలీనం జరిగితే ఛైర్మన్ పదవికి సంబంధించి గతంలో ఖరారైన రిజర్వేషన్ ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇదమిద్దంగా అంతుపట్టని పరిస్థితి. ఇకపోతే ఈ మున్సిపాలిటీలో వార్డు డివిజన్ ప్రక్రియ కూడా అసంపూర్తిగా ఉంది. పంచాయతీల విలీనం ప్రక్రియ ఒక కొలిక్కి వస్తే వార్డు డివిజన్ ప్రక్రియ కూడా చేసేందుకు వీలవుతుంది. అలాగే పంచాయతీల విలీనం జరిగితే ప్రస్తుతం ఓసి మహిళకు రిజర్వు అయిన రిజర్వేషన్‌లో కూడా మార్పులు ఉండే అవకాశముందని కూడా తెలుస్తుంది. అయితే అధికారవర్గాల సమాచారం ప్రకారం అనేక సమస్యలతో ముడిపడి ఉన్న పంచాయతీల విలీనం ప్రక్రియ రాజంపేట మున్సిపాలిటీలోకి కలపడం ఆషామాషీ వ్యవహరంగా కనిపించడం లేదు. ఇకపోతే మున్సిపాలిటీకి ఎన్నికలు జరగని కారణంగా రాజంపేట ఆర్డీఓ స్పెషల్ అధికారిగా ఈ మున్సిపాలిటీ పరిపాలనా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 17 మండలాల్లో పరిపాలనా వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆర్డీఓ రాజంపేట మున్సిపాలిటీ పాలనా వ్యవహరాలు చూసుకునేందుకు ఇబ్బందికరంగా పరిస్థితులున్నాయి. అంతేకాకుండా పట్టణంలో అనేక సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగి నూతన కార్యవర్గం మున్సిపాలిటీకి వచ్చి ఉంటే అనేక సమస్యల పరిష్కారం విషయంలో పురోగతి ఉండేదంటున్నారు. ఏది ఏమైనా రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికలు జరగని కారణంగా పట్టణ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పవచ్చు. ఎన్నికలు జరిగితే ప్రతి వార్డులో కౌన్సిలర్స్ ఉంటారు కనుక సమస్యలు వారికి చెప్పుకునేందుకు వీలుగా ఉంటుందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. శివారు పంచాయతీల విలీనం ప్రక్రియ, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తికాకపోవడం తదితర అంశాలు రాజంపేట మున్సిపల్ ఎన్నికలకు పెద్ద అడ్డంకిగా మారింది. రాజంపేట మున్సిపల్ ఎన్నికకు అవసరమైన కోర్టు స్టే వ్యవహారం తేలేందుకు మరికొంతకాలం సమయం పట్టవచ్చని, అప్పటివరకు ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి తప్పదు. కాగా మున్సిపల్ ఎన్నికలు జరగని కారణంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన చాలా మంది నేతల దిగాలు చెంది ఉన్నారు. ఏది ఏమైనా రాజంపేట మున్సిపాలిటీకి ఎన్నిక ఎప్పటికి జరుగుతుందన్న విషయంలో స్పష్టత లేదు. రాజంపేట మున్సిపాలిటీ మొదటిసారి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది.

రైలుకింద పడి ఇద్దరి దుర్మరణం
కడప (క్రైం), జనవరి 25: కడప రైల్వేస్టేషన్ పరిధిలో ఆదివారం వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు రైలు కింద పడి మరణించినట్లు రైల్వే ఎస్‌ఐ శ్యాంసుందర్ తెలిపారు. కడప రైల్వేస్టేషన్ సమీపంలో 20సంవత్సరాల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఈ దుర్ఘటనలో తలనుంచి మొండెం వేరైంది. ఇతనివద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. అలాగే ఫాతిమా కళాశాల సమీపంలో 30సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడన్నారు.
అతని వద్ద ఆసుపత్రికి చెందిన చీటీలో ప్రసాద్ అని ఉంది. రెండుకేసులను నమోదుచేసుకుని మృతదేహాలను రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో 20 మంది చైన్‌స్నాచర్లు
కడప,(కైం)జనవరి 25: కడపలోని వివిధ పోలీసుస్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారన్న అనుమానంతో 20మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. వారిలో కొంతమంది బాగా డబ్బున్నవారి పిల్లలు ఉండటంతో పోలీసులు కేసులు నమోదుచేసేందుకు తటపటాయిస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి పోలీసులకు అధికంగా వత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
కొండాపురం, ఫిబ్రవరి 25: కొండాపురం మండల పరిధిలో సుగుమంచిపల్లె సమీపంలో సోమవారం గుర్తు తెలియని వాహనం డీకొనడంతో ఓ స్కూటరిస్టు మృతిచెందాడు. తాళ్లపొద్దుటూరు నుంచి సుగుమంచిపల్లెకు అనిల్‌కుమార్‌రెడ్డి (24) సొంతపనుల నిమిత్తం స్కూటర్‌పై వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం డీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

పవిత్రమైన ఓటుహక్కు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 25: ఓటు హక్కు అత్యంత పవిత్రమైందని, 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదై ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ కెవి రమణ పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా స్థానిక రాష్ట్ర అతిధిగృహం నుంచి నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రం వరకు ర్యాలీ సాగింది. అనంతరం కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 6వ జాతీయ ఓటర్ల దినోత్సవానికి విచ్చేసిన అతిధులకు అభినందనలు తెలిపారు. భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, 2011జనవరి 25న మొదటిసారి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రారంభించారని తెలిపారు. 18సంవత్సరాలు నిండిన యువతీ యువకులు వారి పేర్లను ఓటరు జాబితాలో నమోదుచేసుకోవాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారతదేశంలో ఓటుకు ఎంతో విలువవుందని, ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటే సుపరిపాలన సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజలకు చక్కటి అవకాశమని అన్నారు. ప్రజలు పూర్తి అవగాహనతో వారి ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా జడ్జి రాఘవరావు మాట్లాడుతూ ఓటు అనేది ప్రతి పౌరునికి జన్మహక్కు అన్నారు. పోలింగ్ రోజు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటును వినియోగించుకోవాలన్నారు. అనంతరం సీనియర్ ఓటర్లు ప్రతాప్‌రెడ్డి, పెనుబాల సుబ్బన్న, సమ్మెట నాగమ్మ, చిన్నసుబ్బారెడ్డి, సుబ్బమ్మలను సన్మానించారు. అలాగే యువ ఓటర్లు అయిన భవాని, అంజలి, బాలాజి, ఈశ్వరప్రసాద్, స్వర్ణ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాలస్థాయిలో నిర్వహించిన వక్తృత్వ పోటీలు, డ్రాయింగ్, క్విజ్ పోటీల్లో గెలుపొందిన యువతీ యువకులకు మెమెంటోలు, సర్ట్ఫికెట్లతో సన్మానించారు. అనంతరం కళాజాతా నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.డ్వామా పిడి బాలసుబ్రమణ్యం, డిఇఓ ప్రతాప్‌రెడ్డి, ఆర్డీవో చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.
ఓటుహక్కుతో మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం
రాజంపేట, జనవరి 25: ఓటు అనే ఆయుధంతో మంచి నాయకుని ఎన్నుకోవాలని ఆర్డీఓ ప్రభాకర్ పిళ్లై ఓటర్లకు పిలుపునిచ్చారు. సోమవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బాలికోన్నత పాఠశాలలో ఓటుహక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. రాష్ట్రం, దేశం అభివృద్ధికి ఓటుహక్కు ఒక మంచి ఆయుధం అన్నారు. ఓటుహక్కును నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ సదుపాయం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఓటుపై అవగాహన కలిగి ఓటు యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలన్నారు. ప్రపంచంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని మొట్టమొదటి సారిగా మనదేశంలోనే ఏర్పాటు చేశారన్నారు. ఓటుపై అవగాహన కలిగి ఉండేందుకు ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు. ఓటర్లు ధనం, మద్యంకు లొంగకుండా సమర్ధవంతమైన నాయకున్ని ఎన్నుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతీ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్‌లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిడిఓ హరినాధ్‌బాబు, మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా, ఆర్‌ఐపిఇ భానుమూర్తిరాజు, హెచ్‌ఎం లక్ష్మీదేవి, ఎంఇఓ కృష్ణకుమార్, టిడిపి నాయకులు టి.సంజీవ్‌రావు, డాక్టర్ సి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్‌ఐకు ఉత్తమ సేవా పతకం
సంబేపల్లె, జనవరి 25: మండల పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కెసిఎం వర్మ ఉత్తమ సేవా పతకం అవార్డుకు ఎంపికైనట్లు ఎస్‌ఐ రఘురాం తెలిపారు. ఈ అవార్డును గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకలెక్టర్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ వర్మ మాట్లాడుతూ సుమారు 30 సంవత్సరాలుగా పోలీసుశాఖలో సేవలు అందిస్తున్నామని, వృత్తినే దైవంగా భావించి అన్నిస్థాయిల అధికారుల నుండి మన్ననలు పొందానని అన్నారు. ఈ పతకం రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని, సమాజంలో మంచిని పెంపొందించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. ఉత్తమ సేవా పతకం రావడం పట్ల పలువురు పోలీసులు వర్మను అభినందించారు.

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన కడప
కడప (కల్చరల్), జనవరి 25: 67వ గణతంత్ర వేడుకలకు కడప నగరం ముస్తాబైంది. సోమవారం నిర్వహించే ఈ వేడుకలకు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలన్నీ జాతీయ జెండాలతో కళకళలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో జాతీయ జెండాలను, రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబుచేశారు. నగరంలోని ఏడురోడ్లు సర్కిల్, వైఎస్సార్ సర్కిల్, ఎన్‌టిఆర్ సర్కిల్, ఐటిఐ సర్కిల్, ప్రధాన పోస్ట్ఫాసు కార్యాలయం, కోటిరెడ్డి సర్కిల్, జిల్లా పరిషత్, డిఆర్‌డిఏ , వన్‌టౌన్ పోలీసుస్టేషన్ సర్కిల్, అంబేద్కర్ సర్కిల్, ఆర్టీసి బస్టాండు, ఎర్రముక్కపల్లి సర్కిల్, కృష్ణ్థాయేటర్ సర్కిల్, గాంధీవిగ్రహం సర్కిల్ తదితర ప్రాంతాల్లో కడప నగరం విద్యుత్ దీపాలతో కళకళలాడింది. అదేవిధంగా కడప పోలీసుపేరేడ్ మైదానంలో పోలీసులు ప్రత్యేకంగా వేడుకలను నిర్వహించేందుకు శ్రద్ధతీసుకున్నారు. భద్రతాపరంగా జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. అలాగే నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు ప్రభుత్వ,ప్రైవేట్ విద్యాసంస్థలు గణతంత్య్రవేడుకలు నిర్వహించేందుకు ఆయా యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఉదయం 7గంటలకే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి , పోలీసుమైదానంలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. అదేవిధంగా పోలీసుస్టేషన్ల వద్ద కూడా జాతీయ జెండాను ఎగురవేసేందుకు స్టేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.