విశాఖపట్నం

తూర్పు తీరానికి సైన్యాధ్యక్షుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: భారత రాష్టప్రత్రి ప్రణబ్ ముఖర్జీ సర్వ సైన్యాధ్యక్షుని హోదాలో తూర్పు తీరంలో ప్రయాణించనున్నారు. 2006లో విశాఖలో జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం ఈ తీరంలో యుద్ధ నౌకల సమీక్ష నిర్వహించారు. అదే సమయంలో రక్షణ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఆయనతోపాటు ఉన్నారు. ఇప్పుడు భారత రాష్టప్రతిగా, సర్వసైన్యాధ్యక్షునిగా తూర్పు తీరంలో యుద్ధ నౌకలను సమీక్షించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఐఎన్‌ఎస్ సుమిత్ర యుద్ధ నౌకలో ఆయన ప్రత్యేక ఆసనంపై కూర్చుని నౌకలను సమీక్షించనున్నారు. ఆయనతోపాటు ప్రధాని మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, త్రివిథ దళాధిపతులు ప్రయాణిస్తారు. ప్రణబ్ ఆశీనులైన యుద్ధ నౌకపై నుంచి బారులు తీరిన నౌకలు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయన్నది నౌకాదళ అధికారులు ముందుగానే సమీక్షించారు. భారత నౌకాదళం సగర్వంగా చెప్పుకునే వేడుక ఇది. ఇంత అద్భుత సన్నివేశం కోసం తూర్పు నౌకాదళం సంవత్సరం నుంచి కృషి చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. 50 దేశాల విదేశీ నౌకాదళ ప్రముఖులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతున్నారు.
నగరానికి చేరుకున్న విదేశీ ప్రతినిధులు
ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి నౌకాదళ ప్రతినిధులు శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్ద కొత్తగా నిర్మించిన ప్యాసింజర్స్ జెట్టీ వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్‌లో వారు కాసేపు సేదదీరారు. ఇక్కడే కరెన్సీని మార్చుకునే సౌకర్యం కల్పించారు. అలాగే ఎటిఎంలను కూడా ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులకు మన నేవీ అధికారులు అద్భుతమైన ఆతిథ్యమిచ్చారు.

సిఎం పీఠంపై కాపుల కన్ను
* హామీ అమలుకు కొంత సమయం ఇవ్వాలి
* ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి
ఆంధ్రభూమిబ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ముఖ్యమంత్రి పీఠంపై కాపుల కన్ను పడిందని, అది దక్కకపోవడంతో రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ధ్వజమెత్తారు. విశాఖలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్ష వెనుక రాజకీయ స్వార్థం దాగుందని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధులను కేటాయించారన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు జస్టిస్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. విభజన సమస్యలెదుర్కొంటున్న నవ్యాంధ్రలో ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకునే క్రమంలోనే వైకాపా సహా విపక్షాలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు సమయం ఇవ్వాలని విపక్షాలకు సూచించారు.

రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేస్తున్నారు
* కులాల చిచ్చుతో రాజకీయ లబ్దిపొందే యత్నం
* పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: కులాల మధ్య చిచ్చు రేపి రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా మారుస్తున్నారని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఆరోపించారు. ప్రభుత్వ అతిధిగృహంలో బసచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలుసుకున్న ఆమె విలేఖరులతో మాట్లాడుతూ కాపు, బిసిల మధ్య విబేధాలు సృష్టిస్తూ వైకాపా అధినేత జగన్‌మోహన రెడ్డి, ఎస్సీ వర్గీకరణ పేరిట మందా కృష్ణమాదిగ రాజకీయ లబ్దిని ఆశిస్తున్నారని ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో సీమాంధ్రులను తూలనాడిన మంద కృష్ణ, ఇప్పుడు ఎస్సీల వర్గీకరణపై విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తాననడం పట్ల ఆమె మండిపడ్డారు. తెలంగాణ వాళ్లు పొమ్మంటే ఇక్కడ రాజకీయాలు చేద్దామనుకుంటున్నావా అని నిలదీశారు. వర్గీకరణ పేరిట ఎస్సీల్లో మరోసారి విబేధాలు సృష్టించాలని చూస్తే సహించేది లేదన్నారు. విజయవాడలో బహిరంగ సభ పెడితే తాము చూస్తూ ఊరుకునేంత చేతగాని వాళ్లం కాదని, తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు.

నగరానికి ఐఎఫ్‌ఆర్ శోభ
* రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణ
* కట్టిపడేస్తున్న నగర అందాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్) నిర్వహణతో నగరం పండుగ శోభతో కళకళలాడుతోంది. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న వేడుకలకు ప్రభుత్వ యంత్రాంగం కొన్ని నెలలుగా శ్రమిస్తోంది. ప్రధాన వేదికైన ఆర్‌కె బీచ్‌తో పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలు, కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఒక్క జివిఎంసి పరిధిలోనే రహదార్ల నిర్మాణం, ఇతర పనులకు రూ.85 కోట్లను ఖర్చు చేశారు. ఎయిర్‌పోర్టు నుంచి ఆర్‌కె బీచ్ వరకూ జాతీయ రహదారి సహా, అన్ని ప్రధాన రహదార్లను, ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఆధునీకరించారు. అలాగే నగరం అంతటా పచ్చదనాన్ని పరిచినట్టు మొక్కలతో నింపేశారు. ఇక ఐఎఫ్‌ఆర్ వేడుకల నేపథ్యంలో అన్ని ప్రధాన రహదార్లను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీల్‌మెట్ట, సిరిపురం కూడలి, జగదాంబ జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ తదితర కూడళ్లను విద్యుదీకరణ చేశారు. రోడ్లకి ఇరువైపులా మొక్కలను సైతం రంగురంగుల విద్యుత్ దీపాలతో అలకరించారు. కూడళ్లు, డివైడర్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల కాంతులతో రహదార్లు అందాలు చిందిస్తున్నాయి. ఇక ప్రధాన వేడుక జరిగే ఆర్‌కె బీచ్ ప్రాంతం చీకట్లో చూస్తే సింగపూర్, మలేషియాలను కలపిస్తోంది. విద్యుత్ దీపాల కాంతులతో పాటు సందర్శకులతో నగరం మొత్తం కళకళలాడింది. ఇక ఐఎఫ్‌ఆర్ విన్యాసాలు పూర్తయినప్పటికీ బీచ్‌కు సందర్శకుల తాకిడి తగ్గలేదు. ఎయు గ్రౌండ్స్‌లోని ఐఎఫ్‌ఆర్ విలేజ్ శుక్రవారం సందర్శకులతో కిటకిటలాడింది. ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు వేలాదిగా సందర్శకులు తరలివచ్చారు.

పార్కులు మానసిక ప్రశాంతతకు వేదికలు
* బుద్ధవనం సందర్శించిన సిఎం చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: యాంత్రిక జీవనంలో మానవునికి ప్రశాంతతను చేకూర్చేది ఆహ్లాదకరమైన వాతావరణమని, విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) సారధ్యంలో రూపుదిద్దుకున్న బుద్ధవనం పార్కును శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దిన బుద్ధవనం ప్రాజెక్టును వుడా ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూర్తిచేయడాన్ని ఆయన అభినందించారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో ధ్వని కాలుష్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడును సిఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఇక్కడకు వచ్చే వాకర్స్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ముఖ్యంగా సౌకర్యాలు కల్పించే విషయంలో వాకర్స్‌తో పాటు మెడిటేషన్ చేసే వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. అలాగే విశాఖ నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అన్ని ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే కొండ ప్రాంతంలో మరింతగా మొక్కలు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావాలన్నారు. ఇదిలా ఉండగా గతంలో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించాల్సి ఉంది. అయితే అప్పటికే సమయం మించిపోవడంతో ప్రాజెక్టు ప్రారంభానికి హాజరుకాలేకపోయారు. దీంతో జిల్లాకు చెందిన మంత్రులు సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా బుద్ధవనం ప్రాజెక్టును ప్రారంభించారు. బుద్ధవనం సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎన్ యువరాజ్, వుడా విసి బాబూరావు నాయుడు, తదితరులు ఉన్నారు.

మీ ఆలోచనలు వినూత్నంగా ఉండాలి
* పాఠశాలల్లో కేరీర్ కౌనె్సలింగ్, బయోమెట్రిక్
* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, పిబ్రవరి 5: విద్యార్థుల ఆలోచనలు వినూత్నంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఇందుకు స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్ కేంద్రాలు దోహదపడగలవన్నారు. శుక్రవారం విశాఖ జిల్లా చినగదిలి మండలం చంద్రంపాలెం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్లాలన్నారు. ప్రతి పాఠశాలలోను కేరీర్ కౌనె్సలింగ్ కేంద్రాన్ని నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. విద్యార్థులకు హైస్కూల్ స్థాయిలోనే వారి భవిష్యత్‌ను ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలన్న ఆలోచన ఉండాలన్నారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామన్నారు. మీ ఆలోచనలు వినూత్నంగా ఉండాలని అందుకోసమే స్టార్టప్ విలేజిలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ విద్యా సంస్థలు ఇక్కడకు రావాలని ఐఐఎం, పెట్రోలియం విశ్వవిద్యాలయం వంటివి నెలకోల్పామన్నారు. హుదూద్ సంఘటన ముగిసిన ఏడాదికే 4లక్షల 70వేల కోట్ల పెట్టుబడులతో పలు సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. విశాఖలో నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఆర్‌లో 50 దేశాలు పాల్గొనడం, స్మార్ట్ సిటీగా విశాఖ వంటి అంశాలు విశాఖను సుందర నగరంగా తయారు చేశాయన్నారు. ఇక ముందు యువతకు ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యాటకం, ఐటి, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా మన దేశ నాగరికత, సంప్రదాయాలు, భాషలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే కూచిపూడి నృత్యానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. విద్యార్థులకు యోగా, క్రీడలు వంటి అంశాల్లో మంచి ప్రతిభ కనబరచాలన్నారు. యోగా వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ పిల్లలే దేశానికి సంపదగా కొనియాడారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నారన్నారు. అందువల్లనే గతంలో విద్యా రంగానికి బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయిస్తే, నేడు 16 శాతం నిధులు కేటాయించారని వివరించారు. సమాజంలో రుగ్మతలు రూపుమాపేందుకు కులం, మతం వంటివి ప్రతిబంధకంగా మారాయన్నారు. ఎంపీ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందన్నారు. దేశాభివృద్ధి, సామాజికాభివృద్ధి యువతపై ఆధారపడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడుతోపాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులతో సీఎం ముఖాముఖీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: మీలో ఉత్సాహం చూస్తుంటే నాకు నమ్మకం కలుగుతొంది... రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దగలం...పేదరికం తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరు బాగా చదువుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 2022 నాటికి భారత్‌లోనే ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉండేందుకు ఐదు మిషన్లు, ఏడు గ్రిడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు ముఖాముఖీ నిర్వహించారు.
కుల జాడ్యం పోవాలంటే ఏం చేయాలి?
బ్రిటీష్ వారు వ్యాపారం పేరుతో భారత్‌కు వచ్చి మనలో మనకు కులం, మతం విద్వేషాలను రెచ్చగొట్టారని దాని ఫలితమే స్వాతంత్య్ర ఉద్యమమని ఆ పాఠశాల విద్యార్థి సాయి చెప్పారు. ఇప్పటికైనా దీనిని మానకపోతే ఏనాటికి దేశం ముందడుగు వేయలేదని చెప్పారు. కుల, మత, వర్గ, విభేదాలను ఏనాడు నిర్మూలిస్తామో ఆనాడే మన దేశానికి నిజమైన స్వాతంత్య్రమని చెప్పడంతో అందరు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు.
డిజిటల్ తరగతుల వల్ల ఉపయోగమేమిటి?
చదివిన దానికంటే డిజిటల్ తరగతులతో చెప్పిన అంశం పది రెట్లు అధికంగా గుర్తుండిపోతుందని స్వాతి సమాధానమిచ్చింది. ఏదేని సినిమా వినడం కన్నా, చూస్తే ఎలా గుర్తుండిపోతుందో అదే మాదిరిగా డిజిటల్ తరగతుల వల్ల సబ్జెక్టు గుర్తుంటుందని ఆమె సమాధానమిచ్చింది.
చదువుకు, పేదరికానికి సంబంధం ఏమిటి?
బాగా చదువుకుంటే ధనవంతులై పేదరికాన్ని తొలగించగలరని ఎం.స్వాతి చెప్పింది. భవిష్యత్‌లో నువ్వు ఏం కావాలనుకుంటున్నావని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అడగ్గా నేను డాక్టర్‌ని అవుతానని చెప్పింది. అందుకు ఏం చదవాలో తెలుసా అని అడగ్గా వాటన్నింటికీ ఠకీమని సమాధానమిచ్చింది. దీనికి ముందర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిలకించారు. గుణాత్మక విద్యా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, గ్లోబల్ వార్మింగ్, కస్తూరీభా పాఠశాలలు, స్మార్ట్ సిటీ తదితర వాటిపై విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను తిలకించారు.

విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి
* విద్యార్థులకు బోధన చేస్తా!
* మాజీ విసి జిఎస్‌ఎన్ రాజు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని మాజీ వైస్ ఛాన్సలర్ జిఎస్‌ఎన్ రాజు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయంలో అత్యుత్తమ బోధన, అధ్యయన విధానాలను అమలు చేయాలన్నారు. శుక్రవారం సెనేట్ మందిరంలో ఆయనకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అందరి సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయగలిగానని అన్నారు. వైస్ ఛాన్సలర్‌గా గడువు ముగిసిందని, ఇక నుంచి ఇసిఇ విద్యార్థులకు తరగతులు బోధిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎయుపై ప్రత్యేక అభిమానం ఉందన్నారు. తనకు అన్ని విధాల సహకరించిన విద్యార్థులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ ఇఎ నారాయణ మాట్లాడుతూ సుహృద్భావ వాతావరణంలో పనిచేశామని గుర్తు చేశారు. వర్శిటీ పరంగా ఈ నెల 10న జిఎస్‌ఎన్ రాజుకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వర్శిటీ గౌరవ ఆచార్యునిగా జిఎస్‌ఎన్ రాజు కొనసాగాలన్నారు. సమర్థవంతమైన నాయకత్వంలో పనిచేశామన్న తృప్తి తమకు లభించిందన్నారు. అనంతరం ఆయనకు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇసి సభ్యుడు ఎం ప్రసాదరావు, ప్రిన్సిపాళ్లు సిహెచ్‌వి రామచంద్రమూర్తి, సుందరరావు, సుబ్రహ్మణ్యం, సిహెచ్ రత్నం, సివి రామన్ తదితరులు పాల్గొన్నారు.

సైన్స్ ఎక్స్‌ప్రెస్ వచ్చేస్తోంది...
* 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఎగ్జిబిషన్
* 8వ తేదీ నుంచి కోరాపుట్‌లో ఎగ్జిబిషన్ రైలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: దేశ నలుమూలల తిరుగుతూ విజ్ఞానాన్ని అందించే సైన్స్ ఎక్స్‌ప్రెస్ వచ్చేసోంది. ప్రతి ఏడాది మాదిరి ఈసారి కూడా దీనిని విశాఖ రైల్వేస్టేషన్ సమీపానున్న తాటిచెట్లపాలెం ఆర్ఫీఎఫ్ పేరెడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి వరుసగా మూడు రోజులపాటు ఉండే ఈ ఎగ్జిబిషన్‌తో కూడిన సైన్స్ ఎక్స్‌ప్రెస్ 11 కోచ్‌లతో ఉంటుంది. దీనిని సందర్శకులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారతదేశం మొత్తంపై ఏడుచోట్ల ‘క్లైమేట్ ఛేంజ్’ అనే అంశంపై దీనిని నిర్వహిస్తున్నారు. ఈ సైన్స్‌ఎక్స్‌ప్రెస్ గత ఏడాది అక్టోబర్‌లో ‘సైన్స్-క్లైమేట్ యాక్షన్ స్పెషల్ (ఎస్‌ఇసిఏఎస్) పేరుతో ప్రారంభమైంది. ఇది ఈనెల 8వ తేదీన కోరాపుట్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ 8, 9, 10 తేదీల్లో జరిగిన ఎగ్జిబిషన్ పూర్తయిన తదుపరి 11వ తేదీనాటికి ఇక్కడకు వస్తుంది. వాతావరణంలో మార్పులు గురించి విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా దీని ద్వారా విజ్ఞానాన్ని అందించనున్నారు. సమాజంలో అన్నివర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇందులో అత్యంత ముఖ్యమైన విజ్ఞానానికి చెందిన అంశాలు పొందపర్చబడతాయి. ఐదు కోచ్‌లతో కూడిన ఈ ఎగ్జిబిషన్ ఎక్స్‌ప్రెస్‌లో నిత్యజీవితంలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులు, గతానికి ప్రస్తుతానికి వాతావరణంలో వచ్చిన మార్పులు దీనికి గల కారణాలు తదితర అంశాలతో కూడిన చిత్రాలు ఒకటవ నెంబర్ కోచ్‌లో ఉంటాయి. వాతావరణ మార్పుల ప్రభావం గురించి రెండవ కోచ్‌లో పేర్కొన్న అంశాల ద్వారా విద్యార్ధులు అవగాహన కల్పించుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయి? రుతుపవనాల్లో వ్యత్యాసం, సముద్ర మట్టం పెరుగుదల, దీనివల్ల నీరు, వ్యవసాయం, అటవీ, జంతువులపై చూపే దీని ప్రభావం, మానవాళి ఆరోగ్యంతో చూపే ప్రభావాలపై మరికొన్ని ఆకర్షణీయమైన చిత్రాలు ప్రతిఒక్కరిలో సృజనాత్మకతను పెంచేవిగా ఉంటాయి. ఇవన్నీ రెండవ కోచ్‌లోనే ఏర్పాటు చేశారు. అలాగే దైనందిన జీవితంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొనే పరిస్థితులు, వాతావరణం మార్పులపై అంతర్జాతీయ చర్చ, యుఎన్‌ఎఫ్‌సిసిసితో ముఖాముఖి అనేవి ఏడవ కోచ్‌లోను, పాఠశాలలు, రోడ్లు, ఇళ్ళు, కార్యాలయాల్లో లైఫ్‌స్టైల్‌పై దృష్టికేంద్రీకరించడం, జంతు,వృక్ష శాస్త్రాలకు సంబంధించిన విజ్ఞానంతో కూడిన పలు అంశాలు 8,9,10 కోచ్‌ల్లోను, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్‌ఐఎఫ్) ఆధ్వర్యంలో పలు అంశాల ప్రదర్శన వంటివి ఇందులో ఉంటాయి. ప్రధానంగా ఎస్ అండ్ టి, సైన్స్ ఎడ్యుకేషన్, డిఎస్‌టి స్కాలర్‌షిప్‌లు, స్కీమ్‌లు, కేరీర్స్ అనే మరికొన్ని అంశాలపై విద్యార్ధుల్లో అవగాహన పెంచేవిగా నిలుస్తాయి.

తండ్రీకొడుకుల సాహస యాత్ర
సీలేరు, ఫిబ్రవరి 5: భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రకృతి అందాలు, సాంస్కృతిక సాంప్రదాయాలను తెలుసుకునేందుకు ద్విచక్ర వాహనంపై తండ్రి కొడుకు సాహస యాత్ర చేపట్టారు. 35 రోజుల క్రితం ఢిల్లీలో బయలు దేరి శుక్రవారం సాయంత్రానికి సీలేరుకు చేరుకున్నారు. ఈమేరకు వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నివాసితులైన మధుసూధనరావు ఉద్యోగరీత్యా గత 30 ఏళ్ళ క్రితం ఢిల్లీ వెళ్ళిపోయి పార్లమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు క్రిసాన్ కోణా ఉన్నాడు. వీరు భారత దేశం మొత్తం ద్విచక్ర వాహనంపై యాత్ర చేసి ప్రకృతి అందాలు, సాంప్రదాయాలు చూడాలని ఆలోచన వచ్చింది. దీంతో వీరు యాత్ర చేపట్టారు. 35 రోజులు పాటు సుదీర్ఘ సాహస యాత్ర చేపడుతూ సముద్ర తీర ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు తిరిగారు. సీలేరు చేరుకున్న వీరు స్థానిక విలేకరులతో వారి అనుభూతులను పంచుకున్నారు. సాహస యాత్ర అనుభావాలను తెలిపారు. ఈసందర్భంగా మధుసూధనరావు మాట్లాడుతూ తాను రాజమండ్రి నివాసినని, ఉద్యోగ రీత్యా ఢిల్లీలో ఉంటున్నామన్నారు. తన కుమారుడు కోరిక మేరకు సాహస యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం అరకు వెళ్ళి విశాఖ మీదుగా రాజమండ్రికి చేరుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం తాను ఢిల్లీ వెళ్ళిపోతానని, తన కుమారుడు క్రిసాన్ కోణా కర్నాటక, కేరళ, ఛత్తీష్‌ఘడ్‌ప్రాంతాల్లో సాహసయాత్ర పూర్తి చేస్తాడన్నారు. గతంలో తన కుమారుడు హిమాలయాల్లో అక్సిజన్ లేని లడక్ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిపారు. 50 వేల కిలో మీటర్ల యాత్ర పూర్తి చేయాలని నిర్ధేశించినట్లు తెలిపారు.

ముద్రగడ దీక్షకు సంఘీభావం
* కంచాలతో గంటలు కొట్టిన కాపు నేతలు
నర్సీపట్నం (టౌన్),్ఫబ్రవరి 5: కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా పట్టణానికి చెందిన కాపు నాయకులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. కంచాలు పట్టుకుని గంటలు కొడుతూ మెయిన్ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం నుండి అబీద్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కాపు నాయకుడు మీసాల సుబ్బన్న మాట్లాడుతూ కాపులు డిమాండ్ చేస్తున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాపులను బిసిల్లో చేర్చాలని, కార్పొరేషన్‌కు ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆందోళనకు తామంతా బాసటగా ఉంటామని, ఆయన ఏ పిలుపునిచ్చినా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాపు నాయకులు కోనేటి రామకృష్ణ, గొలుసు నర్సింహమూర్తి, మున్సిపల్ కౌన్సిలర్లు కోనేటి వెంకటలక్ష్మి, గొలుసు వరలక్ష్మి, పసుపులేటి రాము, నంగిన వెంకటరమణ పాల్గొన్నారు.

ఫ్లీటూ రీవ్యూకు వచ్చే వాహనాలకు పాసులు తప్పనిసరి...సిపి
విశాఖపట్నం(క్రైం), ఫిబ్రవరి 5: ఫ్లీటూ రీవ్యూకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండ ట్రాఫిక్‌కు నియమాలు నిర్ధేశించినట్టు నగర పోలీసు కమిషనర్ ఆమిత్‌గార్గ్ వెల్లడించారు. శుక్రవారం పోలీసు కమిషనరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగో తేదీన జరిగిన ఫ్లీటూ రిహార్సల్స్ కార్యక్రమానికి ఆర్.కె.బీచ్‌కు విచ్చేసిన ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారని, దీనిలో దృష్టిలో పెట్టుకుని పక్కాగా ట్రాఫిక్‌ను నియంత్రించనున్నట్టు చెప్పారు. ఫ్లీటూ రీవ్యూకు పాసులు లేని వాహనాలు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నిర్ధేశించిన మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితులలోను ఫ్లీటూ రీవ్యూ జరిగే పరిసర ప్రాంతాల్లో ఆటోలను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. పార్కు హొటల్ మార్గం, ఎన్‌సిబి సైడ్ నుండి వచ్చే ప్రేక్షకులకు నిర్ధేశించిన పార్కింగ్ స్థలంలోనే వాహనాలను పార్కింగ్ చేయాలన్నారు. విఐపి వాహనాలకు ఎపిఐఐసి గ్రౌండ్, యోగ విలేజ్ వెనక భాగంలో పార్కింగ్ కేటాయించినట్టు ఆయన తెలిపారు. ప్లీటూ జరిగే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం రెండు గంటల నుండి ఆర్టీసీ బస్సులకు నిర్ధేశిత మార్గాలను కేటాయించడం జరిగిందని, ఆ మార్గాల్లోనే ఆర్టీసీ బస్సులు నడిచేలా ఆర్టీసీ అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ఎయులో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్‌ను శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మూసి వేస్తామని, తర్వాత ఏడో తేదీన ఉదయం నుండి సాయంత్రం వరకు అనుమతి ఇచ్చి, సాయంత్రం నాలుగు గంటల తర్వాత మూసివేస్తామని ఆయన తెలిపారు. పాసులు, గుర్తింపు కార్డులు లేని వారిని ఎట్టి పరిస్థితులలోను రీవ్యూలోకి అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌కెబీచ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు ఫ్లీటూను పురస్కరించుకుని మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఇళ్ళల్లోనే ఉండాలని, వెహికల్ పాసులు లేకుండ వారిని అనుమతించమని, వారంతా పోలీసులతో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాసులు, గుర్తింపు కార్డులు లేనివారు ధియేటర్లల్లో, టివి చానళ్ళల్లో చూడవచ్చని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో సిపితో పాటు అదనపు డిజిపి ఠాకూర్ కూడ పాల్గొన్నారు.

నేడు విదేశీ బ్యాండ్ ప్రదర్శనలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)లో భాగంగా శనివారం విదేశీ బ్యాండ్ ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. వుడా పార్కులో ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ ఆస్ట్రేలియన్ నౌకాదళం బ్యాండు ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే ఎయు ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌ఆర్ విలేజ్‌లో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకూ యుఎస్ నేవీ బ్యాండ్ ప్రదర్శన ఉంటుంది.

నగరంలో 41 ధియేటర్లలో ఫ్లీట్ రివ్యూ ప్రత్యక్ష ప్రసారం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 5: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రత్యక్షప్రసారం నగరంలోని ధియేటర్లలో ఈ నెల 7 చేయనున్నారు. ఆర్కే బీచ్‌లో జరిగే కార్యక్రమాన్ని ధియేటర్లలో వీక్షించేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 7న సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకూ ఈ కార్యక్రమాన్ని ధియేటర్లలో ప్రదర్శిస్తారు. ఇందుకు సంబంధించిన పాస్‌లను శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకూ ధియేటర్ల వద్ద జారీ చేస్తారు. ఆధార్ కార్డు జెరాక్సు తీసుకుని వెళ్లి పాస్‌లను పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.