మెదక్

ఎనమండుగురిలో.. ఎన్నికయ్యేది ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 15: అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగిన నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక బరిలో నిలిచిన ఎనిమిది మంది అభ్యర్థుల్లో ఎన్నికయ్యేదెవరోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ నెల 13వ తేదీన నిర్వహించిన ఉప ఎన్నికకు సంబంధించి ఓటర్లు నిక్షిప్తం చేసిన తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడబోతుంది. అధికారుల అంచనాకు మించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కావడంతో ఏ అభ్యర్థి గెలిచినా భారీ మెజార్టీ ఖాయమన్న అభిప్రాయం నెలకొంది. అధికార టిఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులతో సహా ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులతో మొత్తం ఎనిమిది మంది బరిలో నిలిచారు. మూడు పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా స్వతంత్రులు, నోటా మీటా ఎవరి ఓట్లను కొల్లగొడుతారోనన్న భయం పార్టీలను పీడిస్తోంది. 1.50 లక్షల పైచీలుకు ఓట్లు పోలవగా వీటిని లెక్కించడానికి ఖేడ్ మండలం జూల్‌కల్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవిఎంలలో పోలైన ఓట్లను లెక్కించనున్నారు. మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి 21 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలలోగా అభ్యర్థుల భవితవ్యం ఏమిటో స్పష్టం కానుంది. అభివృద్ధి మంత్రాన్ని ప్రయోగించిన టిఆర్‌ఎస్ పార్టీ గెలుపు తమదేనన్న ధీమాను వ్యక్తం చేస్తుండగా సానుభూతి ఓట్లతో తామే గట్టెక్కుతామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్వాస పడుతున్నారు. టిడిపికి సైతం చెక్కు చెదరని ఓటు బ్యాంకు ఉందని గెలిచే అవకాశం లేకపోలేదన్న బరోసాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు. ఉదయం 7 గంటలకే అభ్యర్థుల పక్షాన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించడానికి ఏజెంట్లు చేరుకోనున్నారు. ఆరు మాసాలుగా ఖాళీగా ఉన్న ఖేడ్ ఎమ్మెల్యే పదవి నేటితో భర్తీ కానుండటం గమనార్హం. గత యేడాది ఆగస్టు 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి అకస్మాత్తుగా మరణించడంతో ఖాళీ ఏర్పడిన విషయం తెలిసిందే. ఆరు మాసాల్లో భర్తీ చేయాల్సిన నేపథ్యంలో గత నెలలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ల దాఖలు ఘట్టానికి తెరలేచింది. జనవరి 30వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ అనంతరం ప్రచారపర్వం ప్రారంభమైంది. సుమారు పక్షం రోజుల పాటు పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేసారు. ఫ్యాక్షన్ రాజకీయాలను తలపించే ఖేడ్‌లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయన్న ఆందోళన వ్యక్తంకాగా పోలింగ్ రోజు ఎక్కడ కూడా చిన్న పాటి సంఘటన లేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఆరు నెలలుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో మాత్రం గెలుపు, ఓటములపై ఉత్కంఠ నెలకొనగా విజయలక్ష్మీ ఎవరిని వరిస్తుందోనని ఖేడ్ ప్రజలు ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో గెలుపు గుర్రం ఎవరిదో ఓట్ల లెక్కింపు అనంతరం అధికారులు నిర్ధారించనున్నారు. అందరి దృష్టి మెజార్టీపై ఉండటం గమనార్హం.

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 15: నారాయణఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లనీ పూర్తయ్యాయని అదనపు సంయుక్త కలెక్టర్, రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. నారాయణఖేడ్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో సోమవారం కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతందని, రెండు, మూడు గంటల వ్యవధిలో ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ నిమిత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసామని, ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక సూక్ష్మపరిశీలకుడిని నియామకం చేసామని, ఆ విధంగా మొత్తం 137 మందిని కౌంటింగ్ కొరకు వినియోగించనున్నానమని తెలిపారు. కౌంటింగ్ 21 రౌండ్లలో ముగుస్తుందని, ఫలితం త్వరితగతిన అందించేందుకు ప్రింటర్ కమ్ అగ్జీలరీ డిస్ ప్లే యూనిట్లు వినియోగిస్తున్నామన్నారు. ఫలితాల సమాచారం మీడియాకు ఎప్పటికప్పుడు అందించేందుకుగాను కౌంటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాదటు చేసామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసారని వెల్లడించారు. కాగా కౌంటింగ్ కేంద్రం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో అణువణువు శోధించి తనిఖీలు చేపట్టారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు. అభ్యర్థులు పంపించే కౌంటింగ్ ఏజెంట్లకు గుర్తింపు కార్డులను అధికారులు జారీ చేసారు.
సిఇఓ బన్వర్‌లాల్ సమీక్ష
నారాయణఖేడ్-35 నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్ ఈ నెల 16న నిర్వహిస్తున్నందున ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ బన్వర్‌లాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్ రాస్‌ను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి ఆయన కౌంటింగ్ ఏర్పాట్లపై వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ను ఈ నెల 16న ఉదయం 8 గంటలకు ప్రారంభించాలన్నారు. ప్రతి రౌండ్‌కు ఒక మైక్రో అబ్జర్వరును, వీడియో గ్రాఫర్‌ను నియమించాలని సూచించారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్ల మూడవ ర్యాండమైజేషన్‌ను ఈ నెల 16న ఉదయం 5 గంటలకు అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్‌లను అనుమతించకూడదని ఆయన తెలిపారు. రౌండ్ల వారిగా ఫలితాలను తమ కార్యాలయానికి ఈ-మెయిల్, ఫ్యాక్స్ ద్వారా సమర్పించాలని సూచించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రొనాల్డ్ రాస్ మాట్లాడుతూ కౌంటింగ్‌ను నారాయణఖేడ్ మండలం జూల్‌కల్ గామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 14 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేసి 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని వివరించారు. 14 టేబుళ్లకు 16 మంది సూపర్‌వైజర్లను నియమించి అందులో ఇద్దరు రిజర్వుగా ఉంచనున్నామని తెలిపారు. 16 కౌంటింగ్ అసిస్టెంట్లలో ఇద్దరు రిజర్వ్‌గా ఉంటారని, 19 మంది సూక్ష్మ పరిశీలకుల్లో ఐదుగురు రిజర్వ్‌గా ఉంటారని వివరించారు. కౌంటింగ్ సూపర్‌వైజర్లకు అసిస్టెంట్లకు ఈ నెల 9న, 15న కౌంటింగ్‌పై శిక్షణ ఇచ్చామని చెప్పారు. కౌంటింగ్ కేంద్రంలోనే సూక్ష్మ పరిశీలకులకు సోమవారం నాడు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్నికల అబ్జర్వర్లు నరేందర్ సింగ్ పాటిల్, రాజేష్‌కుమార్‌రాయ్, అదనపు ఎస్పీ వెంకన్న, డిఆర్‌ఓ దయానంద్, ఖేడ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లు, మెదక్ ఆర్డీవో నగేష్ తదితరులు పాల్గొన్నారు.

అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం
విశ్వకర్మల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం
స్పీకర్ మధుసూదనాచారి
సిద్దిపేట, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ కృతనిశ్చయంతో పని చేస్తుందని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. విశ్వకర్మలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఫలాలు అందించేందుకు సిఎం కెసిఆర్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రశాంత్‌నగర్‌లో గాయత్రి దేవి సమేత మద్విరాట్ విశ్వకర్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో లోకకల్యాణార్థం అందరు బాగుపడాలని కోరుకునేవారే విశ్వబ్రాహ్మణులన్నారు. స్వాతంత్య్రం వచ్చి 6దశాబ్దాలైనా నీటికి విశ్వరర్మలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ, నాలి చేసుకునే వారు కడుపునిండా భోజనం చేసి ప్రశాంతంగా ఉంటున్నారని, విశ్వకర్మల పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. వడ్రంగి పని చేసిన వారు అటవీశాఖ, బంగారు నగలు తయారుచేసేవారు పోలీసులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వడ్రంగులను అటవీశాఖ అధికారులు దొంగ కలప తెచ్చావని, బంగారు నగలు చేసేవారిని దొంగ బంగారం కొన్నారని పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. వండ్రంగులు, కంసాలీల పై అటవిశాఖ, పోలీసులు పెట్టిన కేసుల వల్ల కోర్టుల చుట్టు తిరగాల్సి వస్తుందన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బులు సైతం కేసులకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. పవిత్రతకు సంకల్పానికి సిద్దిపేట గడ్డ మారుపేరుగా నిలుస్తుందని, ఈ గడ్డ ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. సిద్దిపేట నుంచి విశ్వకర్మ గుడి నిర్మాణం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. విశ్వకర్మల గుడి నిర్మాణానికి సహకరించిన మంత్రి హరీష్‌రావును అభినందించారు. విశ్వకర్మలు ఐక్యంగా ఉండి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ ఫలాలను విశ్వకర్మలకు అందించేందుకు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. విశ్వకర్మల అభివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, విశ్వకర్మ సంఘం నేతలు నాగభూషణం, యాదగిరి, వేణు, నర్సింలు, పెంటాచారి, చంద్రశేఖరాచారి, శ్రీనివాసాచారి, పండితులు బాలాచారి, శంకరాచారి బృందంచే ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. అంతకుముందు స్పీకర్ మధుసూదనాచారికి నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు స్పీకర్‌ను సన్మానించారు. ఈ మహోత్సవాల్లో స్పీకర్ పూజలు చేశారు.

రెవెన్యూ వినతులకు వెంటనే పరిష్కారం
* వీడియో కాన్ఫరెన్స్‌లో తహశీల్దార్లను
ఆదేశించిన జెసి వెంకట్రాంరెడ్డి
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 15: రెవెన్యూకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, పిర్యాదులను ఏరోజుకారోజు సమీక్షించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి తహశీల్దార్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి డివిజనల్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతి మండల తహశీల్దారు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు, పిర్యాదులను తమ పరిధిలో సమీక్షించి ముందుకు సాగాలని ఆయన సూచించారు. సర్వే, మూటేషన్, వెబ్‌ల్యాండ్ వివరాలను సంబంధిత అధికారులతో సమీక్షించి ప్రతి రోజు వివరాలను అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ద వహించి తమ పరిధిలోని తహశీల్దార్లతో చర్చించి దరఖాస్తులు వచ్చిన రోజునే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు ఇచ్చే మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని తహశీల్దార్లకు సూచించారు. మండల స్థాయిలో కొత్తగా ఆహార భద్రత కార్డులకై వచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి మాత్రమే కార్డులను జారీ చేయాలన్నారు. మండల పరిధిలో చనిపోయిన వారి వివరాలను సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా సేకరించి వారి పేర్లను ఆహార భద్రత కార్డుల నుంచి తొలగించాలన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలన్నారు. చాలా మండలాల్లో పంటల వివరాలను నమోదు చేసారని, కొన్ని మండలాల్లో మాత్రమే పంట నమోదు వివరాలు సక్రమంగా నమోదు కాలేదని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డిఆర్‌డిఎ పిడి సత్యనారాయణరెడ్డి, డ్వామా పిడి సురేందర్‌కరణ్, డిఎస్‌ఓ అనురాధ, ఆర్డీఓ మధుకర్‌రెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కిడ్నాప్, అత్యాచారం కేసులో..
యువకుడికి ఏడేళ్ల కఠిన కారాగారం
మెదక్, ఫిబ్రవరి 15: 2012 సంవత్సరంలో ఒక బాలికను కిడ్నాప్ చేసి ఆత్యాచారం చేసిన 25 ఏళ్ల యువకునికి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు 20 వేలు జరిమానా విధిస్తూ మెదక్ సీనియర్ సివిల్ జడ్జి లలిత శివజ్యోతి సోమవారం నాడు సంచలన తీర్పునిచ్చారు. బాధితురాలి పక్షాన పిపి చంద్రారెడ్డి వ్యవహరించారు. 2012లో అప్పటి సిఐ ఎల్.విజయ్‌కుమార్ బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారని మెదక్ సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు. సికింద్రాబాద్ వారాసిగూడకు చెందిన మహ్మద్ షబ్బీర్(25) మెదక్ పట్టణానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై బాధితురాలు మెదక్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు వాదోపవాదాలు ముగిసిన తరువాత మహ్మద్ షబ్బీర్ నేరస్థుడిగా పరిగనించి 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమాన విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి లలితా శివజ్యోతి సంచలన తీర్పు ఇచ్చినట్లు సిఐ సాయి ఈశ్వర్‌గౌడ్ తెలిపారు.

వైభవంగా..
ఆదినారాయణుడి కల్యాణం
జిన్నారం, ఫిబ్రవరి 15: మండలంలోని కొడకంచి గ్రామంలో ఆదినారాయణ స్వామి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ట్రస్టీ చైర్మెన్ రామాజీరావు ఆద్వర్యంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకిసేవను నిర్వహించారు. వారం రోజుల పాటు ఆదినారాయణ స్వామి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతర ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్దానిక నాయకులు శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు
సంగారెడ్డి టౌన్, ఫిబ్రవరి 15: గిరిజనుల ఆరాధ్య ధైవం సంత్ సేవాలాల్ మహారాజ్ 277వ జయంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని భవానీ సేవాలాల్ మందిర్‌లో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు భైక్ ర్యాలీ నిర్వహించి, ఆలయం వద్ద భోగ్ బండార్ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి అమర్‌సింగ్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగ్మల్‌సింగ్ నాయక్‌లు హాజరై మాట్లాడారు. సేవాలాల్ జయంతిని జరుపుకోవడం సంతోషకరమన్నారు. సేవాలాల్ జీవిత చరిత్రను వివరించారు. సేవాలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో రాంసింగ్‌నాయక్, దేవిదాస్, జైరాంనాయక్, రూప్‌సింగ్, సుచాన్ సింగ్, కిషన్, గోపాల్, లక్ష్మిచందర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేవు
* వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి
కొల్చారం, ఫిబ్రవరి 15: నూతనంగా రేషన్ కార్డుల పంపిణీ ఇంతట్లో లేవని జేసి వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమవారం నాడు విడియో కాన్పరెన్స్‌లో ఏర్పాటు చేసిన అయా మండలాల తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తహశీల్దార్ నిర్మల తెలిపారు. రేషన్ కార్డులలో ఆనార్యోగంతోగానీ వృద్దులు చనిపోయిన వారు, పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన వారి పేర్లను జాబితాలో నుండి తొలగించాలన్నారు. మోటేషన్ 45 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ప్రొసిడింగ్ ఆర్డర్ జారీ చేయాలని తెలిపినట్లు ఆమె తెలిపారు. ఈ కాన్పరెన్స్‌లో విఆర్‌ఎలు పాల్గొన్నారు.

మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు
గజ్వేల్, ఫిబ్రవరి 15: మేడారం సమ్మక్క-సారక్క జాతరకు గజ్వేల్ నుండి 30 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, జిపిపి డిపో మేనేజర్ పాల్, జిపిపి డిపో కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కళ్యాణ్‌కర్ నర్సింగరావులు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ నుండి మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రత్యేక బస్సులు ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్టమొదటి సారిగా మేడారం జాతరపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు జిపిపి డిపో నుండి మేడారం జాతరకు 30 ప్రత్యేక బస్సులు నడపడానికి నిర్ణయం తీసుకోగా అవసరమైన పక్షంలో మరిన్ని ప్రత్యేక బస్సులు నడిపించడానికి సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా మేడారం సమ్మక్కసారక్క జాతరకు వెళ్ళే బక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దుంబాల అరుణభూపాల్‌రెడ్డి, నేతలు ఆకుల దేవేందర్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోసంరక్షణకు పార్లమెంట్‌లో
చట్టం తేవాలి
* గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి
* లోక కల్యాణార్థం గోవులను పూజించాలి
* అఖిల భారత గోసంరక్షణ సేవాసమితి
జాతీయ అధ్యక్షుడు ఠాకూర్ జైపాల్‌సింగ్
సిద్దిపేట, ఫిబ్రవరి 15: భారతదేశంలో గోసంరక్షణకు పార్లమెంట్‌లో చట్టం తేవాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అఖిలభారత గోసంరక్షణ సేవా సమితి జాతీయ అధ్యక్షుడు ఠాకూర్ జైపాల్‌సింగ్ వెల్లడించారు. సిద్దిపేటలో సోమవారం శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించారు. గోవులకు ఆకుకూరలు, పండ్లు, ఫలహారాలు అందించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోని గోసంరక్షణ కోసమే ప్రధాని నరేంద్రమోడిని కలిసి చట్టం తేవాలని విన్నవించనట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడి గోశాలల అభివృద్ధి కోసం రూ.100కోట్లు విడుదల చేశారన్నారు. గోసంరక్షణ చట్టంకు మద్దతుకోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ప్రజాప్రతినిధుల మద్దతు కూడగడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సిఎం కెసిఆర్, ఏపి సిఎం చంద్రబాబు, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లను కలిసి గోసంరక్షణకు మద్దతు పలకాలని కోరగా సానుకూలంగా స్పందించారన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్ అయుత చండీయాగం సందర్భంగా గోమాతకు సాష్టాంగ నమస్కారం చేశారన్నారు. తాముసైతం ముగ్దులమై గోమాతను దర్శించుకున్నట్లు తెలిపారు. దేశంలో గోవులు, వృషభాల వధ పెద్దఎత్తున జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పాలితరాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో గోవధలు అధికంగా జరుగుతున్నాయన్నారు. గుజరాత్ ఓడరేవు నుంచే బీఫ్ అధికంగా ఎగుమతి చేస్తున్నారని తెలిపారు. లోక కల్యాణార్థం, ధర్మరక్షణకు గో సంరక్షణ కోసం పార్లమెంట్‌లో చట్టం తెచ్చి దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నారు. తాను ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గత డిసెంబర్ 1-25వరకు నిరాహార దీక్ష చేపట్టాటనన్నారు. దీంతో శివసేన ముందుకొచ్చి పార్లమెంట్‌లో చట్టం తెచ్చేలా పోరాడుతామని హామీనిచ్చారన్నారు. గోసంరక్షణకు హిందూ పరివార్‌లోని బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. నవంబర్ 16లోగా గోసంరక్షణకు చట్టం తేవాలనే లక్ష్యంతోనే దేశంలో అన్ని రాష్ట్రాలు పర్యటించి మద్దతు కూడగడుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావు, ఎంపిలు కవిత, బాల్కసుమన్‌ల దృష్టికి తీసుకపోగా మద్దతు తెలిపారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపిలు కవిత, బాల్కసుమన్‌లు గోసంరక్షణ పై చర్చిస్తామని హామినిచ్చినట్లు తెలిపారు. దేశంలో 12కోట్ల ఆవులు, వృషభాలు మాత్రమే ఉన్నాయన్నారు. వాటి సంరక్షణ బాధ్యత హిందువులందరిదన్నారు. గోసంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షురాలు బొమ్మకంటి పద్మ మాట్లాడుతూ గోపూజ ఎంతో శ్రేష్ఠమైందని, గోపూజ వల్ల భూసంపద, పాడిపంటలు సమృద్దిగా పండుతాయన్నారు. తెలంగాణలో 108గోశాలలు నిర్మించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. లోక కల్యాణం కోసం గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోసంరక్షణ సమితి ప్రతినిధులు బొమ్మకంటి శ్రీనివాస్, దొంతుల దుర్గయ్య, వైకుంఠం, సాయిగౌడ్, వీరమల్లు విజయ, శ్రీకృష్ణ సేవాసమితి గోశాల ప్రతినిధులు రవి తదితరులు పాల్గొన్నారు.