ఉన్నమాట

‘ఎర్ర’కామెర్ల కళ్లకు దేశద్రోహాలు కనిపించవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌర స్వేచ్ఛకు పుట్టి మునిగింది.
అసమ్మతిని అణచేస్తున్నారు.
భావ స్వాతంత్య్రాన్ని బాదేస్తున్నారు.
మోదీ రాక్షసుడు పేట్రేగాడు.
పావన జెఎన్యూను పాడుచెయ్యబట్టాడు.
ప్రపంచ మేధావులారా ఏకం కండి.
హిందూనాజీల పనిపడదాం రండి.
ప్రచారం అదిరింది. గోరీలోని గోబెల్స్‌గాడు కళ్లుకుట్టి మూర్ఛపోయేంత బెమ్మాండంగా ప్రాపగాండా పనిచేసింది.
వేళ్లమీద లెక్కపెట్టగలిగినంత కొద్దిమంది విద్యార్థులెవరో... చాలా దశాబ్దాల ఇండియన్ మిలిటరీ పీడాకారం నుంచి కాశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలంటూ ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జె.ఎన్.యు.)లో హక్కుల నినాదాలు చేయగా... వాటితో ఏ సంబంధం లేని విద్యార్థి నాయకుడు కన్నయ్యను మరునాడు దేశద్రోహ చట్టాల కింద అన్యాయంగా అరెస్టు చేయటం... అసమ్మతిని సహించని ప్రస్తుత ప్రభుత్వ నియంతృత్వ పోకడకు మరో సాక్ష్యం... ఎమర్జన్సీ చీకటికాలాన్ని మళ్లీ తెచ్చిపెట్టే నైజం...
- అంటూ నోమ్ చోమ్‌స్కీ తక్కుంగల దేశదేశాల ‘ఎడమ’ మేధావులు ప్రశస్తమైన అభిశంసన శ్రీముఖాన్ని 62 సంతకాలతో జాయింటుగా జారీచేశారు. బ్రాహ్మణీకాన్ని, హిందూ భావజాలాన్ని తిట్టే ప్రతివాడూ జాతి వ్యతిరేకా? దేశంలో ఎవరు దేశభక్తులో, ఎవరు దేశద్రోహులో ఆరెస్సెస్ వాళ్లా తేల్చేది?... అంటూ వామపక్ష, ప్రగతిశీల, ప్రజాతంత్ర, లిబరల్, కమ్యూనల్, వేర్పాటువాద, జిహాదిస్టు, మావోయిస్టు వగైరా వగైరా వివిధానేక వర్ణాల రాజకీయ, సామాజిక, ఉగ్రవాద, మేధావి వర్గాలు చడామడా దులిపేస్తున్నాయి. ఎడమ గూటి పక్షులైన మిడిమేలపు మీడియా వాళ్లకైతే కన్నయ్యను కీర్తించే పూనకంలో ఒళ్లు తెలియటం లేదు. దేశంలో ఎక్కడెక్కడి యూనివర్సిటీల్లో జెఎన్‌యు కామ్రేడ్లకు మద్దతుగా, మోదీ సర్కారు దుర్మార్గానికి నిరసనగా ప్రదర్శనలు, శాపనార్థాలు జోరయ్యాయి. ‘ఔను! నేనూ జాతివ్యతిరేకినే, దేశద్రోహినే’ అంటూ ప్రకటనలు చేయడం ఫ్యాషన్ అయింది. ఎటొచ్చీ అసలు విషయమే అడుగున పడింది.
గొడవంతటికీ మూలం ఏమిటి? పార్లమెంటును పేల్చబోయి, పదిమంది పోలీసులను పొట్టనపెట్టుకున్న అఫ్జల్‌గురు అనే టెర్రరిస్టు ముష్కరుడిని చట్ట ప్రకారం ఉరితీసి మూడేళ్లయిన సందర్భాన; వాడిని అమరవీరుడిగా కీర్తిస్తూ, భారతదేశాన్ని దూషిస్తూ జెఎన్‌యులో పీఠం పెట్టిన జాతి వ్యతిరేక విద్రోహశక్తులు బరితేగించి దిక్కుమాలిన ప్రోగ్రాం పెట్టటం! అందులో భారతదేశం నాశనమయ్యేదాకా యుద్ధం చేస్తాం, ఇండియాను ముక్కలు చేస్తాం, అఫ్జల్ కోరిక తీరుస్తాం, ఇంటింటా ఒక అఫ్జల్‌ను తయారు చేస్తాం అంటూ ఎలుగెత్తి నినాదాలు చేయటం!
అది దేశద్రోహమా కాదా? దానికి పాల్పడిన వాళ్లను శిక్షించాలా వద్దా?
ఢిల్లీ పోలీసులు అరెస్టుచేసిన విద్యార్థి సంఘ నాయకుడి మీద నేరారోపణకు ఆధారాలేమిటి అన్న విషయంలో అనుమానాలుండవచ్చు. విద్రోహకర కార్యక్రమం నిర్వహించింది ఫలానా విద్యార్థి సంఘం కాగా, దానిని వ్యతిరేకించే సంఘానికి చెందిన వాడిని ఎందుకు నిర్బంధించారు అన్న సందేహం దేశంలో చాలామందికి ఉంది. తనకు రాజ్యాంగంపట్ల, రాజ్యవ్యవస్థపట్ల విశ్వాసం ఉందంటూ అతడు మాట్లాడిన దాఖలాలున్నాయి కనుక జాతి విద్రోహ నినాదాలు అతడు చేసి ఉండడని విశ్వసించడానికి ఆస్కారం ఉంది. పోలీసులు తప్పుచేస్తే ఆ సంగతి న్యాయస్థానంలో తేలుతుంది. కన్నయ్యకుమార్ అనేవాడు నిర్దోషిగా రుజువైతే ప్రభుత్వం పరువే పోతుంది. దాని గురించి చింతించనక్కరలేదు.
‘క్రేజీ’లూ, కాంగీలూ, వామపక్షులూ గోల పెడుతున్నదే నిజమనుకుందాం. విద్యార్థి సంఘం నాయకుడి మీద పెట్టిన కేసు ఎగిరిపోతుందనే నమ్ముదాం. అలా జరిగినప్పుడు... ముందు వెనక చూడకుండా గుడ్డెద్దు చేలోపడిన చందంగా నిరపరాధిని సతాయించినందుకు ఢిల్లీ పోలీసులను, వారిని ఉసిగొలిపిన మోదీ సర్కారును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిపోద్దాం.
కాని - కన్నయ్య కాకపోతే ఓ గన్నయ్య లేదా ఇంకో గున్నయ్య సదరు దేశద్రోహ నేరానికి పాల్పడి ఉండాలి కదా? వారెవరో వెతికి పట్టుకోవాలని అడగాలా వద్దా? నేరానికి పాల్పడింది ఎవరు అన్నది ఇదమిత్థంగా ఎరుకపడలేదుగాని నేరం జరగడమైతే నిజమే కదా? చోమ్‌స్కి ఇత్యాది మహాశయుల చేత పలికించినట్టుగా - ఆనాడు జెఎన్‌యులో జరిగింది కాశ్మీరీ వేర్పాటువాదానికి అనుకూలంగా కొద్దిమంది విద్యార్థులెవరో చేసిన ప్రజాస్వామిక భావ ప్రకటన కాదు. కనీసం కొన్ని వందల మంది పోగై ఉచ్చనీచాలు మరచి చేసిన వికృత విద్రోహ చేష్ట అది! అందుకు జగమంతా చూసిన వీడియోయే సాక్షి. లిబరల్ మేధావులకు వ్యవస్థమీద సహజంగా ఉండే ధిక్కారంగా దాన్ని సమర్థించటం కుదరదు. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించి అసమ్మతి తెలపటం దేశద్రోహం హిందూ వ్యతిరేక కమ్యూనిస్టు దినపత్రిక ‘‘ది హిందూ’’, విదేశీ దాస ఎన్.డి.టి.వి.లాంటి మీడియా చూడామణులు సెలవివ్వటం శుద్ధ తప్పు.
జె.ఎన్.యు.లో చేసిన నినాదాలు మోదీ ప్రభుత్వాన్ని, దానిని సమర్థించే సంఘ్ పరివారాన్ని మాత్రమే తూలనాడినవి అయితే ఎవరూ పట్టించుకోనక్కర లేదు. కాని - అక్కడ చేరినవారు కత్తి దూసింది భారత రాజ్యవ్యవస్థ మీద. భారత రిపబ్లిక్ సార్వభౌమాధికారం మీద. భారతదేశ ప్రాదేశిక సమగ్రత మీద! భారతదేశం ముక్కలు కావాలని కోరేవాడు, భారత్ నాశనమయ్యేంతవరకూ యుద్ధం చేస్తామనేవాడు, భారత రిపబ్లిక్‌కు మణిమకుటంలాంటి పార్లమెంటును పేల్చబోయిన విద్రోహిని అమరవీరుడిగా కీర్తించేవాడు ఈ దేశానికి శత్రువు. భారత రిపబ్లిక్‌కు పగవాడు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చీడపురుగు. రాజ్యాంగ వ్యవస్థకే నాశనం కోరేవాడు ఆ రాజ్యాంగం తన పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు పూర్తిగా అయోగ్యుడు; అనర్హుడు.
ఈ ప్రాథమిక సత్యాన్ని మన హక్కుల రాయుళ్లు గుర్తిస్తారా? అనర్థానికి మూలమైన నినాదాల సంగతే వారు ఎక్కడా ప్రస్తావించరు ఎందుకని? అలాంటి నినాదాలు చేసిన విషయమే ప్రజలకు తెలియకుండా మాయమాటలతో మభ్యపెట్టటానికి కారణమేమిటి? భారతీయ క్రికెట్ ఆటగాడు విరాట్‌కొహ్లీ వీరాభిమాని ఎవరో పాకిస్తాన్‌లో భారత పతాకాన్ని ఇంటిమీద ఎగురవేసినందుకే పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్ల ఖైదు విధించబోవటంలేదా? ఇండియాలో మాత్రం పాకిస్తాన్ భజన చేయటం, భారత జాతీయ పతాకాన్ని యూనివర్సిటీలో ఎగురవేయకూడదని వాగటం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమని అనుకోవాలా? ప్రపంచంలోని ప్రతి దేశమూ దేశద్రోహం పట్ల నిష్కర్షగా అనుసరిస్తున్న కరకు వైఖరి భారతదేశానికి మాత్రం తగదని మతిచేడిన మేధావులంటారా? తాము పాచినోటితో నొక్కి వక్కాణించే ‘్భవప్రకటన స్వేచ్ఛ’ను, వాక్స్వాతంత్య్రాన్ని పొందుపరిచిన భారత రాజ్యాంగం 19వ అధికరణంలోనే - అవి భారత భద్రతకు, సార్వభౌమాధికారానికి లోబడి ఉండాలన్న షరా ఉన్నదని వారెరుగరా? దేశ నాశనానికి యుద్ధం చేసి, దేశాన్ని ముక్కలు చేస్తామని కేకలు వేయటం వారి దృష్టిలో జాతివ్యతిరేక నేరం అవునా కాదా? దానికి పాల్పడినవారిని గుర్తించి, చట్ట ప్రకారం శిక్షించాలని కోరటానికి వారికి నోరు ఎందుకు పెగలడం లేదు?
ఢిల్లీ కోర్టులో హాజరుపరిచినప్పుడు నిందితుడి మీద, అతడిని వెనకేసుకు వచ్చేవారి మీద కొంతమంది న్యాయవాదులో, ఇతరులో చేసిన దౌర్జన్యాన్ని ఎవరూ సమర్థించరు. సుప్రీంకోర్టు ఆదేశాన్ని కూడా లక్ష్య పెట్టకుండా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దుర్మార్గపు దాడికి దిగినవారెవరైనా శిక్షార్హులే. వారు చేసిన దానిని నిష్కర్షగా ఖండించవలసిందే. కాని జాతివ్యతిరేక చర్యలకు కడుపుమండిన వారెవరో చేసిన తప్పువల్ల జాతి వ్యతిరేకులు చేసింది ఒప్పు అయిపోతుందా? ఆ పాపం ఈ నేరంతో చెల్లవుతుందా? మహిళలపై అత్యాచారాలు, దారుణ హత్యలు వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన నరపిశాచులపై న్యాయస్థానాలవద్ద ఆగ్రహించిన జనం దాడులు చేయటం, జైల్లో తోటి ఖైదీలే వారిని చితక బాదటం ఇంతకుముందు ఎన్నిసార్లు జరగలేదు? దేశాన్ని ముక్కలు చేస్తానన్న వాళ్లకు దేహశుద్ధి చేయదలచి ఎవరో హద్దుమీరడాన్ని మోదీ ప్రభుత్వం పనిగట్టుకుని చేయించిన రాక్షస చర్య అయనట్టు, నాలుక భుజాన వేసుకుని యాగీ చేస్తున్న బుద్ధి జీవులు చిరకాలం ‘ఎడమ’వారి అడ్డా అయిన యూనివర్సిటీలో విచ్చలవిడి విద్రోహక కార్యకలాపాలను అంతే తీవ్రంగా ఖండించరేమి?
ముఖ్‌బుల్‌బట్‌ను ఉరి తీయించింది రాహుల్‌బాబు నాయనమ్మ. అఫ్జల్‌గంజ్‌ని ఉరికంబమెక్కించింది ఈ మా - బేటాల అదుపాజ్ఞల్లో నడిచిన యు.పి.ఎ. సర్కారు. అయినా ఆ ఇద్దరినీ ఉరితీయటం ఘోరం, జుడిషియల్ కిల్లింగు అంటూ బజార్నపడ్డ జాతి విద్రోహులకు కాంగ్రెసు రాకుమారుడు వంతపాడతాడు. పైగా జాతీయత తన రక్తంలోనే ఉందంటూ స్టేట్‌మెంట్లు ఇస్తాడు. బహుశా అది నిజమే కావచ్చు. ఎటొచ్చీ అతగాడి రక్తంలో భారత జాతీయత ఎంత, ఇటాలియన్ జాతీయత ఎంత అన్నదే సందేహం!
రాజ్యవ్యవస్థను ధిక్కరించటం, మెజారిటీ ప్రజలు విశ్వసించే మతాన్ని అవమానించటం చిరకాలంగా జె.ఎన్.యు.లో చేరిన వారికి ఫ్యాషను అయి ఉండొచ్చు. 2010 సంవత్సరంలో దంతెవాడలో మావోయిస్టులు మాటువేసి 76 మంది సిఆర్‌పి జవాన్లను రాక్షసంగా చంపినందుకు సంగీత నృత్యాలతో ఆనందోత్సవం చేసుకున్న ఘనకీర్తి వారికి ఉండవచ్చు. దేశ భద్రతకు మావోయిస్టులే అత్యంత ప్రమాదకారులని తమ ప్రభుత్వ బినామీ ప్రధాని మన్‌మోహన్‌సింగే ఐదేళ్ల కింద ప్రకటించిన సంగతి మైనరుబాబు రాహుల్‌కు గుర్తుండి ఉండకపోవచ్చు. కాని ప్రజలు ఏదీ మరచిపోలేదు. వామపక్ష తీవ్రవాదపు గుడ్లను పొదిగే ఎర్రగూటిలో కాశ్మీరీ వేర్పాటువాద జాతి విద్రోహక పక్షులు కూడా చేరటం, చదువుల తల్లికి గుడిలాంటి ఉన్నత విశ్వవిద్యాలయాలు జాతి వ్యతిరేకుల అడ్డాలుగా మారటం మొత్తం జాతిని కలవరపరుస్తున్న విపరిణామాలు. విద్రోహపు వైరస్ మిగిలిన విద్యాలయాలకూ వ్యాపించకముందే ఈ రోగాన్ని తుదముట్టించటం ఎలా అన్నది జాతియావత్తూ సావధానంగా ఆలోచించాలి.
బ్రిటిషు పాలకులు పెట్టిన సెడిషన్ సెక్షన్లు పనికిరావనుకుంటే The Unlawful Activities (Prevention) Act 1967 చట్టం సెక్షన్ 2, 13ల క్రింద జాతి విద్రోహుల భరతం పట్టవచ్చు. ఇప్పటి కేసులో ప్రయోగించిన ఐపిసి 124 సెక్షను సరికాదని మన మహామేధావులు, వారి మార్గదర్శకులు చెబుతున్నారు కనుక వారికి పూర్తి సంతృప్తి కలిగే విధంగా శ్రీ- చట్టాన్ని సంధించటం మేలు. ఇంతకుముందు కోబాడ్ గాంధీ, వినాయకసేన్ వంటి మావోయిస్టులకు చవి చూపించిన కాంగ్రెసు మార్కు పాత శాసనమే అది.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ