పశ్చిమగోదావరి

ఇసుకపై మల్లగుల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో అమలవుతున్న ఇసుక విధి విధానాల తీరుతెన్నులపై సొంత పార్టీ నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని ప్రభుత్వం మూటకట్టుకుంటోందన్న అభిప్రాయం ఇప్పుడు బహిరంగ రహస్యంగానే మారింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఇసుక విధానంలో కొత్త తీరుతెన్నులను తీసుకువచ్చి డ్వాక్రా సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగిస్తే అనుకూలమైన ఫలితాలు వస్తాయని ప్రభుత్వం భావించింది. అయితే చివరకు ఈ వ్యవహారం బెడిసికొట్టి అసలుకే మోసం వచ్చే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా ఇసుక ఇప్పుడు ఒక బ్రహ్మపదార్ధంగా మారిపోయి అందుబాటులో లేకుండా పోయి ఆ ప్రభావం నిర్మాణ రంగంపైనా, దానిపై ఆధారపడి వున్న వందల వేల మంది కార్మికులపైనా తీవ్రంగానే పడింది. చివరకు ఈ పరిణామాలు మిగిలిన వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఎలా వున్నా ఇసుకలో ఎదురవుతున్న విపరిణామాలు మాత్రం ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో చెడ్డపేరు తీసుకువచ్చే పరిస్థితికి చేరుకున్నాయి. దీనితో డ్వాక్రా విధానానికి స్వస్తి చెప్పి ఇప్పుడు అమలుచేయాల్సిన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించడం తెలిసిందే. దానిలో భాగంగానే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ వ్యవహారంలో చొరవ చూపి పరిష్కార మార్గం వైపు సమస్యను తీసుకువెళ్లేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే ఈ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రభుత్వం పెద్ద స్థాయిలోనే మల్లగుల్లాలు పడుతూ వచ్చింది. చివరకు ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించాలంటూ సబ్ కమిటీని నియమించినా ఆ కమిటీ ఏకాభిప్రాయానికి రాలేక ఒక పరిష్కారాన్ని సూచించలేక మిగిలిపోయింది. చివరకు రకరకాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి అధికారులతో విస్తృతంగా చర్చలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇదే అంశంపై విస్తృత చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుకపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదని, అవసరమైతే ఉచితంగా ఇసుకను అందించే విధానాన్ని ప్రవేశపెడితే ఎలావుంటుందన్న అంశంపైనా చర్చ జరిగింది. ఈ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా మొత్తం మీద ఈ నూతన విధానం వల్ల ఎటువంటి ఫలితాలు రావచ్చునన్న అంశంలో మల్లగుల్లాలు విస్తృతంగానే ప్రారంభమయ్యాయి. అయితే ఈ విధంగా రీచ్‌లలో ఇసుకను ఎవరికి వారు తవ్వుకునేందుకు అవకాశం కల్పిస్తే పర్యావరణ, ఇతరత్రా సమస్యలు తలెత్తితే ఎవరు బాధ్యత వహిస్తారన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. అలాగే చాలా చోట్ల ఇసుక రీచ్‌లు ఆయా పట్టణాలకు, మండల కేంద్రాలకు సమీపంలో వుండటం, ఒక వేల ఉచిత ఇసుక తెరపైకి తీసుకువస్తే ఆయా ప్రాంతాల్లో రహదారులు ఇసుక వాహనాలతో చిద్రమైతే ఎప్పటికప్పుడు ఆయా స్థానిక సంస్థలు వీటిని ఎంత వరకు భరించగలవు అన్న అంశంపైనా చర్చ మొదలైంది. అయితే ఇదే సమయంలో రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా వంటి ఎన్నో నదులు ప్రవహిస్తుండటం వలన అత్యధిక పరిమాణంలో రాష్ట్రానికి ఇసుక అందుబాటులో వుందని, అలాంటప్పుడు కూడా ఈ విషయంలో కొరత ఇతర సమస్యలు రావడం విడ్డూరంగా వుందన్న అంశం కూడా చర్చకు వచ్చింది. పర్యావరణానికి విఘాతం కలిగించే పరిస్థితులు గానీ, భూగర్భ జలాలకు ముప్పు తీసుకువచ్చే పరిస్థితి తలెత్తినా బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ఇసుక విధానాన్ని ముందుకు తీసుకువెళ్లవచ్చునన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అవసరమైతే ఒక ప్రత్యేక టాస్క్ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల పర్యవేక్షణలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందేలా చూడవచ్చునన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఇదే సమయంలో పశ్చిమ కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఈ చర్చపై స్పందిస్తూ ఉచిత ఇసుక విధానం బాగున్నా కొన్ని ర్యాంపుల్లో నలుగురైదుగురు ముందుగానే ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని సిండికేట్ అవడం ద్వారా మిగిలిన వారికి అన్యాయం చేసే అవకాశాలు వుంటాయని పేర్కొన్నారు. మొత్తం మీద ఉచిత ఇసుక విధానంపై ప్రస్తుతం చర్చ ప్రారంభమైనా దీనిపై ఈ కసరత్తు ముందుకు సాగి రెండ్రోజుల్లో ఒక నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు.
ఆటోను ఢీకొన్న కారు
ఎనిమిది మందికి
తీవ్ర గాయాలు
వీరవాసరం, ఫిబ్రవరి 26: వీరవాసరం మండలం నందమూరిగరువు గ్రామం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. భీమవరం నుంచి వీరవాసరం వైపు వస్తున్న ఆటోను పాలకొల్లు నుంచి భీమవరం వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు, కారులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. గాయపడిన వారి (మిగతా 6వ పేజీలో)
వివరాలు తెలియరాలేదు. ఆటోలో ఉన్న బాలుడికి ఇరువురు మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన 40 నిముషాల వరకు 108 వాహనం రాకపోవడంతో ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా మారింది.జాతీయ రహదారి 216 పై ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. అనంతరం 108 ప్రమాదం జరిగిన వారందరికి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి బాధితుల బంధువులు రావడంతో వారి రోధనలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. పరిస్ధితిని చూసి ప్రయాణికులు కంటతడిపెట్టారు.
సమాచార హక్కు చట్టంపై
అధికార్లు అవగాహన పెంచుకోవాలి
రాష్ట్ర కమిషనర్ లాం తాంతియాకుమారి
కొవ్వూరు, ఫిబ్రవరి 26: సమాచార హక్కు చట్టం వజ్రాయుధం వంటిదని, ఆ చట్టంపై సాంఘిక సంక్షేమ శాఖ, వసతి గృహాల సంక్షేమాధికారులు అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర సమాచార కమిషనర్ లాం తాంతియాకుమారి ఆదేశించారు. శుక్రవారం రాత్రి స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని సాంఘిక సంక్షేమ శాఖ, బిసి వెల్ఫేర్ వసతి గృహాల అధికారులు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వసతి గృహాల సమాచారం కొందరు అవసరం లేకపోయినా అడుగుతున్నారని, ఎవరూ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా సమాచార హక్కు చట్టం ద్వారా వారు అడిగిన సమాచారం సకాలంలో అందజేయాలన్నారు. ఏళ్ల తరబడి అడిగే సమాచారానికి సంబంధించి ప్రతి పేజీకి చెల్లించవలసిన సొమ్మును వసూలు చేసి సమాచారాన్ని అందజేయాలన్నారు. సమాచారం కొరకు వత్తిడి తీసుకువచ్చే వారిపై పోలీసు కంప్లైట్ ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో 90 శాతం వసతి గృహాల సంక్షేమాధికారులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన లేదన్నారు. బాలికల వసతి గృహంలోనికి ఎవర్నీ రానీయకుండా వారికి కావలసిన సమాచారాన్ని పోస్టుద్వారా అడగమని చెప్పి, పోస్టు ద్వారానే సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఆర్డీవో బి శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీల్లో పారదర్శక పన్ను విధానం
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 26 : జిల్లాలోని పంచాయతీల్లో ఆస్తిపన్ను పెంచలేదని, శాస్ర్తియ విధానం ద్వారా పారదర్శక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవో ఆర్‌డిల సమావేశంలో పంచాయితీల అభివృద్ధిపై ఆయన సమీక్షించారు. పంచాయితీల్లో పన్నులు పెంచే విషయంలో తన జోక్యం లేదని గతంలో ఇష్టానుసారం పన్నులు విధానాన్ని అమలు చేసేవారని, ప్రస్తుతం శాస్ర్తియ పద్దతిలో పూర్తి పారదర్శకతతో ఇంటి నిర్మాణ తీరు, స్థలం, తదితర అంశాలను పరిగణనలోనికి తీసుకుని ఆయా పంచాయితీల్లో పన్నులు పెంచే అధికారం పంచాయితీలకే అప్పగించామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని ప్రతీ పంచాయితీలో వంద రూపాయలకు 25 పైసలు మాత్రమే పెంచుతూ తీర్మానాలుచేసామని దానికనుగుణంగా శాస్ర్తియ విధానాన్ని ఆచరించి భవిష్యత్తులో ఎవరిష్టానుసారం వారు పన్ను పెంచకుండా ఉండేలా ప్రతీ ఇంటి ఎసెస్‌మెంట్ నెంబరు ఆన్‌లైన్‌లో పొందుపరిచామని చెప్పారు. ఈ విధానంలో జిల్లా వ్యాప్తంగా లక్ష మంది ఇళ్ల యజమానులు ఆధార్‌కార్డులు లేవని చెబుతున్నారని, జిల్లాలో 99.98 శాతం ప్రజలకు ఆధార్‌కార్డులు అందించినట్లు కలెక్టర్ చెప్పారు. ఇంటి ఎసెస్‌మెంట్ నెంబరుకు ఆధార్ అనుసంధానం జరగాల్సిందేనని ఆధార్‌కార్డు ఆధారంగా జిల్లాలో ఎటువంటి సంక్షేమ పధకాలు అమలు చేయబోమని స్పష్టం చేశారు. కొంతమంది ప్రజల్లో ఆధార్‌కార్డు నెంబరిస్తే సంక్షేమ పధకాల లబ్ధి అందదేమోనన్న అభిప్రాయం ఉన్నదని అయితే జిల్లాలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాలకు ఆధార్ తప్పనిసరి కాదని ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఒక్కపైసా అదనంగా ఎవరికీ పన్ను విధించలేదని, గతంలో పెద్ద పెద్ద ఇళ్లు ఉన్న వారికి 200 రూపాయలు సాధారణ పన్ను కింద వసూలు చేసేవారని, ఇకపై అటువంటి పైరవీలకు తావు లేకుండా శాస్ర్తియ విధానంలో ఇళ్ల పన్ను అమలు తీరు పట్ల సర్వత్రా సంతోషం వ్యక్తం అవుతోందని అయితే ఇన్నాళ్లు దొడ్డిదారిన తక్కువ పన్ను వేయించుకున్న కొంతమంది పన్నులు పెంచేసారంటూ గగ్గోలు పెడుతున్నారని, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు.
పంచాయతీల్లో కూడా బయోమెట్రిక్ హాజరు
గ్రామ పంచాయితీల్లో పంచాయితీ కార్యదర్శుల ఇష్టానుసారం వ్యవహరించే విధానాన్ని నిరోధిస్తామని ప్రతీ కార్యదర్శి ఉదయం 5.30 గంటలకే గ్రామాలలో పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో తొలిదశగా 591 క్లస్టర్ గ్రామ పంచాయితీల్లో మార్చి 1వ తేదీ నుండి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ భాస్కర్ డిపివో ఆర్‌వి సూర్యనారాయణను ఆదేశించారు. పోలవరం పంచాయితీ కార్యదర్శిగా నియమితులై 15 రోజులైనా బాధ్యతలుచేపట్టని ఇ సత్యనారాయణ నేటి సాయంత్రం లోగా బాధ్యతలు చేపట్టకపోతే చర్యలు తీసుకోవాలని డిపివోను ఆదేశించారు. డివిజన్ స్థాయిలో పంచాయితీ కార్యదర్శుల సమావేశాలను నిర్వహించి ఆన్‌లైన్ ఇళ్ల పన్నులు సకాలంలో చెల్లించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఈ విధానం వలన క్షణాలలో ఇళ్ల పన్ను చెల్లించవచ్చునని చెప్పారు. సమావేశంలో డిపివో ఆర్‌వి సూర్యనారాయణ, డివిజనల్ పంచాయితీ అధికారులు, ఇవో ఆర్‌డిలు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ నుండి బయోమెట్రిక్ హాజరు
పాఠశాలల్లో అమలు:జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదనరావు
ఏలూరు, ఫిబ్రవరి 26 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి మధుసూదనరావు తెలిపారు. స్థానిక డి ఇవో కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానం వల్ల పాఠశాలల్లో పరిస్థితులు మరిన్ని మెరుగుపడతాయని ఆయన చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పధకానికి సంబంధించిన వివరాలను ఏరోజుకారోజు సేకరించే కార్యక్రమాన్ని శనివారం నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో 3289 ప్రభుత్వ పాఠశాలలున్నాయని, ఈ పాఠశాలల్లో 2.78 లక్షల మంది విద్యార్ధినీ విద్యార్ధులున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన సమయంలో మధ్యాహ్న భోజనంపై పరిశీలన జరిపామని, దీనిలో 70 నుంచి 80 శాతం మందికి మాత్రమే మధ్యాహ్న భోజనం అందుతున్నట్లు తెలిసిందన్నారు. అయితే హైదరాబాద్ కమిషనరేట్‌కు మాత్రం 95 శాతం అమలు చేస్తున్నట్లు నివేదికలు వెళుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు ఎంత మంది విద్యార్ధులు వస్తున్నారు? మధ్యాహ్న భోజనాన్ని ఎంత మంది వినియోగించుకుంటున్నారు అన్న వివరాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మెసేజ్‌ల ద్వారా కమిషనరేట్‌కు నివేదిక ఇవ్వాల్సి వుంటుందని తెలిపారు. దీనికోసం ప్రత్యేక సర్వర్‌ను ఏర్పాటు చేశారన్నారు. ప్రధానోపాధ్యాయుని సెల్‌ఫోన్‌తో దీన్ని అనుసంధానం చేశామన్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాలో ఈ విధానాన్ని ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిందని, రెండవ జిల్లాగా శనివారం నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పధకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదలయ్యాయని, 10.50 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. బకాయి బిల్లులన్నీ వారం రోజుల్లో అందజేస్తామని తెలిపారు. ఉపాధ్యాయులకు ఆదర్శ ప్రవర్తనా నియమావళిని రూపొందించినట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు విధిగా రోజుకు ఒక తరగతి బోధించాలని, వారానికి ఏడు తరగతులు బోధించాలని, ఆయా పరీక్షలు ముగిసిన వెంటనే సబ్జెక్టుల తరగతుల మార్కులను సి ఎం ఆర్‌వోలో నమోదు చేయాలని తెలిపారు. ఏ విద్యార్థి అయినా వరుసగా మూడు రోజులు స్కూలుకు హాజరుకాకపోతే ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి కారణాలు తెలుసుకుని తల్లిదండ్రులతో చర్చించి సమస్యను పరిష్కరించి తిరిగి స్కూలుకు వచ్చేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతపైనా, మరుగుదొడ్ల వాడకంపైనా ప్రతీ రోజూ (మిగతా 6వ పేజీలో)
అసెంబ్లీలో చర్చించాల్సి వుంటుందన్నారు. ప్రతీ శనివారం రెండు గంటలపాటు స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి కార్యక్రమాలనురిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు వాడుక పరిస్థితుల్లో వుండేలా ప్రధానోపాధ్యాయులే చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్ధుల ప్రగతిని తెలియజేసే ప్రోగ్రెస్ రిపోర్టులను విద్యార్ధులకు ఇచ్చి వారి ప్రగతిని తల్లిదండ్రులకు వివరించి వారి సంతకంతో తిరిగి తీసుకోవాలని తెలిపారు. ప్రతీ నెలా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు వుండాలన్నారు. అసెంబ్లీకి హాజరుకాని ఉపాధ్యాయులకు ఒక పూట సెలవు నమోదు చేయాలని తెలిపారు. పరీక్షలు ముగిసిన వెంటనే పేర్లు దిద్ది విద్యార్ధులకు మార్కులు చెప్పాలన్నారు. ఉపాధ్యాయులు టీషర్టులు, జీన్ ఫ్యాంటు, షార్ట్‌లెంత్ షర్టులు, టైట్ ఫ్యాంట్లు వేసుకుని పాఠశాలలకు వెల్లకూడదని తెలిపారు. మహిళా ఉపాధ్యాయినీలు వృత్తికి తగిన దుస్తులు మాత్రమే ధరించాలన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు పాఠశాల ప్రారంభానికి ముందు ఉదయం 7.30 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు విద్యార్ధులకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
అంబేద్కర్ విగ్రహం తరలింపుపై ఉద్రిక్తత
కొవ్వూరు, ఫిబ్రవరి 26: కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలోని ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఉంచిన అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్రిక్తత పరిస్థితుల మధ్య పోలీసుల సహకారంతో అధికారులు శుక్రవారం పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ స్థలంలో సుందరికీకరణ నిమిత్తం పార్కు నిర్మాణాన్ని చేపట్టాలని పంచాయతీ తీర్మానం చేసినట్టు తెలిపారు. అయితే ఆ స్థలంలో చెరువు ఉండేదని, దానిని పూడ్చివేసి పార్కు నిర్మించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. అయితే ఆ స్థలంలో కొందరు వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి సామాజిక భవనాన్ని నిర్మించాలని డిమాండు చేసినట్టు తెలిపారు. అయితే ఈ స్థలం అందరికీ చెందనదని, దీనిని అందరూ ఉపయోగించుకుని అభివృద్ధికి సహకరించాలని, ఎవరూ ఆవేశాలకు లోనుకావద్దని కోరారు. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహాన్ని ఆ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నించడంతో ఆ స్థలం పక్కనే ఉన్న కొంతమంది దళిత యువకులు, మహిళలు ప్రతిఘటించారు. కొంతమంది యువకులు వంటిపై కిరోసిన్ పోసుకుని ఉద్రిక్తపరిస్థితి కలుగజేశారు. అయితే పోలీసులు కొంతమంది యువకులను అదుపులోనికి తీసుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించవద్దని మహిళలు విగ్రహం వద్ద బైఠాయించగా, పోలీసుల సహకారంతో దానిని తొలగించారు. చివరికి అంబేద్కర్ విగ్రహాన్ని పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఆ గ్రామంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ విధించి, పోలీసు పహారా ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసరావుతోపాటు డిఎస్పీ ఎన్ వెంకటేశ్వరరావు, రూరల్ సిఐ ఎం సుబ్బారావు, పట్టణ ఎస్సైలు ఎస్‌ఎస్‌ఎస్ పవన్‌కుమార్, డి గంగాభవాని, తహసీల్దార్ ఎం గంగరాజు, పోలీసులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించే అధికారులకు ప్రత్యేక రేటింగ్
కలెక్టర్ భాస్కర్
ఏలూరు, ఫిబ్రవరి 26 : జిల్లాలో మీ-కోసం, మీ-సేవా, జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించే అధికారులకు ప్రత్యేక రేటింగ్ ఇచ్చి పనితీరును నిర్ధారిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ నుండి శుక్రవారం సాయంత్రం జిల్లాలోని మండల తహశీల్దార్లు, ఎంపిడివోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మీ-సేవ, మీ-కోసం, జన్మభూమి తదితర ప్రజా ఫిర్యాదుల పరిష్కార తీరుపై కలెక్టర్ సమీక్షించారు. నిర్ణీత కాల వ్యవధిలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని వ్యక్తిగత శ్రద్ధతో పనిచేసినప్పుడే ఫలితాలు లభిస్తాయని చెప్పారు. జిల్లాలో ఎంపిడివో, తహశీల్దార్లతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరును ప్రజా సమస్యల పరిష్కార తీరును బట్టి రేటింగ్ నిర్ణయిస్తామని చెప్పారు. మీ-కోసం, మీ-సేవా కార్యక్రమాల్లో ప్రజలు ఇచ్చే సమస్యలను వెంటనే పరిశీలించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్య పరిష్కరించాలే తప్ప మొక్కుబడిగా సమస్యలను పరిష్కరించామంటే కుదరదని స్పష్టం చేశారు. జిల్లాలో మీ-సేవలో సమస్యలు పరిష్కరించిన తీరుపై త్వరలోనే ఒక డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తామని పరిష్కరించిన ప్రజా సమస్యలు ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో ఉన్నాయా? లేదా? అని థర్డ్ పార్టీ ద్వారా విచారణ జరిపిస్తామని చెప్పారు. పెన్షన్లు, రేషన్‌కార్డులు, తదితర విషయాలపై ఫిర్యాదులను స్వీకరించి వాటిని ఎప్పటిలోగా పరిష్కరిస్తామో, అసలు పెన్షన్‌కు గానీ, రేషన్ కార్డుకుగానీ అర్హత ఉందా? లేదా? అని పరిశీలన జరపాలని కొత్తగా మంజూరయ్యే పెన్షన్లలో ఈ పెన్షన్ వచ్చేలా చూస్తామని స్పష్టమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలని ఆదేశించారు. వేలేరుపాడు, కామవరపుకోట, ఆచంట, యలమంచిలి మండలాల్లో అత్యధిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని దీని వలన జిల్లాలోని అందరికీ చెడ్డపేరు వస్తోందని వారం లోగా జన్మభూమి అర్జీలన్నీ పరిష్కరించేందుకు మండలస్థాయి అధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు. పురపాలక సంఘాలలో కూడా ప్రజా సమస్యలు పరిష్కారంలో చాలా వ్యత్యాసం కనిపిస్తోందని, భీమవరంలో 17 శాతం సమస్యలు పరిష్కరిస్తే పాలకొల్లులో నూరుశాతం పరిష్కారం జరిగాయని రెండు మున్సిపాల్టీలు ప్రక్కప్రక్కనే ఉన్నప్పుడు పనితీరు ఎందుకు జాప్యం జరుగుతుందో ఆలోచించుకోవాలని భీమవరం మున్సిపల్ కమిషనర్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. కార్యక్రమంలో డి ఆర్‌వో కె ప్రభాకరరావు, డి ఆర్‌డి ఎ పిడి కె శ్రీనివాసులు, డ్వామా పిడి రమణారెడ్డి, డిపివో ఆర్‌వి సూర్యనారాయణ, బిసి కార్పొరేషన్ ఇడి పెంటోజీరావు, జడ్పీ సి ఇవో సత్యనారాయణ, డి ఎస్‌వో శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉల్లంపర్రులో మెగా సైన్స్‌ఫేర్ ప్రారంభం
పాలకొల్లు, ఫిబ్రవరి 26:ఉల్లంపర్రు మాంటిస్సోరీస్‌లో లిమ్కా బుక్ రికార్డ్సు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు నమోదు చేసే విధంగా ఒకే పాఠశాల నుండి 600 మంది విద్యార్థులు, 476 ఈవెంట్స్‌తో అర కిలోమీటరు పొడువుగల మెగా సైన్స్‌ఫేర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు శుక్రవారం ప్రారభించారు. విద్యార్థులు ప్రదర్శించిన అంశం ప్రదర్శించకుండా ఒకేసారి ఒకే పాఠశాల నుండి 476 స్టాల్స్ పెట్టి ఆధునిక విజ్ఞానాన్ని, కొత్త ఆలోచనలు జోడించి చేస్తున్న సైన్స్‌ఫేర్ నిర్వాహకులను ఆయన అభినందించారు. విద్యార్థుల ప్రతిభా పాటవాలను వెలుగులోకి తెస్తూ ప్రతీ సంవత్సరం కొత్త కొత్త పద్ధతులతో అన్ని రంగాల్లో తీర్చి దిద్దటం వల్ల కార్పొరేట్ విద్యాలయాలు దీటుగా ఉల్లంపర్రు మాంటిసోరీస్ విద్యాసంస్థ నిలిచిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఎం.రాంప్రసాద్, ఎంఎస్ వాసు, ప్రిన్సిపాల్ వసంతలక్ష్మి, లయన్స్, రోటరీ, వాసవీ క్లబులు, పిసిఎన్, విసివి కేబుల్ విజన్ ప్రతినిధులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. రోటరీ అధ్యక్షులు కావలి నగేష్, గోదావరి రోటరీ అధ్యక్షులు దీప్తి అప్పారావు, చందక రాము, బివి మెహతాజీగుప్త, ద్వారా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తయారు చేసిన సైన్స్‌ఫేర్ ప్రతి ఈవెంట్ ఒక సంతేశాన్ని ఇస్తూ ఆకట్టుకొంటుంది. తులసీ, పుదీనా వంటి మొక్కలు వల్ల పర్యావరణ బాగుండటంతోపాటు దోమలు చేరవని, జంక్ పుడ్ కన్నా కాయగూరల ఆహారమే మేలని చెప్పే సందేసంతో ఏర్మాటు చేసిన శిబిరం ఆకట్టుకుంది. గ్రహాలు ఆకర్షరణ శక్తి ద్వారా ఎలా తిరుగుతున్నాయో చూపే స్టాలు, హ్యాంగిగ్ వంతెనల ద్వారా ఓడలు వచ్చినప్పుడు వంతెనలు పైకి లేచి దారి ఇచ్చే పరికరం చాల అందంగా ఉంది. చైనాలో ట్రైను వెళుతుంటే మద్యలో ఉన్న ఖాళీలో కార్లు వెళ్లటం వల్ల ట్రాఫిక్ జామ్ ఉండదన్న ప్రయోగం ఇక్కడ చేసి చూపారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
ఏలూరు, ఫిబ్రవరి 26 : కేంద్ర రైల్వే బడ్జెట్‌లో ఆంధ్రరాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర మంత్రి సురేష్ ప్రభు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వసంతమహల్ సెంటర్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. విశాఖపట్టణానికి ప్రత్యేక జోన్ కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ఈ సందర్భంగా పలువురు నేతలు విమర్శించారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహనరావు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పెద్దిరెడ్డి ప్రదీప్, నాయకులు దండుబోయిన చంద్రశేఖర్, రసపుత్ర లక్ష్మీనారాయణ, దండుపాటి అప్పలనర్స, కాటూరి దుర్గా ప్రసాద్, ఎన్ వెంకటేశ్వరరావు, సుబ్బారావు, ఎన్ మాణిక్యాలరావు, రత్నంబాబు తదితరులు పాల్గొన్నారు.
‘చింతలపూడి’ కాలువ పనులు అడ్డుకున్న రైతులు
గోపాలపురం, ఫిబ్రవరి 26: చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు చిన్న చిన్న ఘర్షణల మధ్య శుక్రవారం భీమోలు గ్రామ శివారులో ప్రారంభమయ్యాయి. తమకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని భీమోలు గ్రామానికి చెందిన రైతులు గత కొన్ని నెలలుగా కాలువ తవ్వకం పనులను అడ్డుకుంటున్న విషయం విదితమే. తమ గ్రామానికి ఎగువ, దిగువున ఉన్న గ్రామాలకు ఇచ్చిన నష్ట పరిహారాన్ని తమకూ వర్తింప చేయాలని, ప్రస్తుతం అవార్డు ప్రకటించిన రూ.15 లక్షల 40 వేలు వల్ల తాము అన్యాయానికి గురవుతున్నామని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపధ్యంలో గోపాలపురం తహసీల్దారు ఎన్ నరసింహమూర్తి పలుమార్లు కాలువ తవ్వకాలు జరిపించడానికి సంఘటనా స్థలానికి వెళ్లగా ఇప్పటివరకు రైతులు అడ్డుపడుతూ వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తహసీల్దారు శుక్రవారం పోలీస్ బలగాల సహకారంతో కాలువ పనులు చేయడానికి పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆడ, మగ తేడా లేకుండా అధిక సంఖ్యలో కాలువ తవ్వే ప్రదేశానికి చేరుకున్నారు. తమ పొలాల్లో కాలువలు తవ్వితే ఊరుకునేది లేదని, తమకు న్యాయమైన నష్ట పరిహారాన్ని ఇచ్చే వరకు పనులు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. అయినా పనులు సాగిస్తే ఆత్మహత్యలకు కూడా వెనుకాడబోమని పురుగు మందుల డబ్బాలతో హెచ్చరించారు. పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న తహసీల్దారు నరసింహమూర్తి, పోలవరం సిఐ బాలరాజు, ఎస్‌ఐ లక్ష్మీనారాయణ రైతులకు నచ్చజెప్పేయత్నం చేశారు. అయినా రైతులు పనులకు అడ్డుతొలగకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి, అరెస్టు చేస్తామని బెదిరించి జీపు ఎక్కించారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడున్న వారిని వెనక్కి పంపించి వేశారు. అనంతరం ఎట్టకేలకు అధికారుల సమక్షంలో కాలువ పనులు ప్రారంభించారు.