మెయన్ ఫీచర్

‘ఆదాయ నిఘా’తో అక్రమార్కులకు కళ్లెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ‘తిమింగలాల’ ఆస్తుల చిట్టా చూస్తే ఎవరికైనా కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఓ అవినీతి అధికారి ఆస్తి మార్కెట్ విలువ ప్రకారం అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు! ఉద్యోగుల ఆస్తులే ఇలా ఉంటే రాజకీయ నాయకుల ఆస్తుల సంగతి వేరే చెప్పాలా? దేశంలో కోటి రూపాయల ఆస్తి దాటని ముఖ్యమంత్రులు ఉన్నారంటే ఆశ్చర్యకరమే. కేరళ సీఎం పినరయి విజయన్ ఆస్తి కోటి రూపాయిలు కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్తి కేవలం 95 లక్షలే. ఇక ఝార్ఖండ్, హరియానా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రుల ఆస్తులు కోటి రూపాయల లోపే! రిటైర్మెంట్‌కు దగ్గర పడిన ఒక ప్రభుత్వ టీచర్ వేతనం కంటే ఈ సీఎంల ఆదాయం తక్కువే. ఢిల్లీకి చెందిన ఏడీఆర్ సంస్థ సీఎంల ఆస్తులపై లెక్కలు తీయగా- దేశం మొత్తమీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తుల విషయంలో అగ్రగామిగా నిలిచారు. ఆయన ఆస్తి 177 కోట్లు.
ఒకప్పుడు పేద, మధ్య తరగతికి చెందిన నాయకులు చట్టసభల్లోకి వెళ్లగానే అమాంతం వారి ఆస్తులు పెరగడమేగాక, కుటుంబ సభ్యులు, వారసుల పేరిట వందల కోట్లరూపాయిల డిపాజిట్లు పెరగడంపై సుప్రీం కోర్టు దృష్టి సారించింది. ఎన్నికల్లో పారదర్శకత కోసం, ధనబలాన్ని అడ్డుకునేందుకు సుప్రీం కోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థి తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా వెల్లడించాలి, ఆ ఆస్తులకు ఉన్న ఆదాయ మూలాలను కూడా బహిర్గతం చేయాలని కోర్టు స్పష్టంచేసింది. అపుడే పుట్టిన మనుమల పేరిట కోట్లాది రూపాయిలు డిపాజిట్లు చేసి, తమ పేరిట లక్షల్లో మాత్రమే ఆస్తులున్నట్టు చెప్పుకుంటున్న నేతలకు ఈ తీర్పు చెంపపెట్టు కానుంది. ఎన్నికైన తర్వాత నేతల ఆస్తుల వృద్ధి ఏ క్రమంలో సాగుతోందో నిర్దేశిత సమయం ప్రకారం సమాచారాన్ని సేకరించి తగిన చర్యలకు సిఫార్సు చేసేందుకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. ప్రజాప్రతినిధుల, వారి కుటుంబ సభ్యుల ఆస్తులు అసాధారణంగా వృద్ధి చెందినట్టు తేలితే సంబంధిత నేతలను అనర్హుడిగా ప్రకటించేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో సరికొత్త నిబంధనలను చేర్చేలా జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన బెంచ్ తన తీర్పులో స్పష్టం చేసింది.
ఆస్తులను, ఆదాయ వనరులను వెల్లడించకపోవడాన్ని ‘ప్రజాప్రాతినిధ్య చట్టం-1951’ ప్రకారం ‘అవినీతికి పాల్పడినట్టే’ భావించాలని ధర్మాసనం పేర్కొంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 70 మంది ప్రజాప్రతినిధులు ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లు భావించాలి. వీరు ఇంత వరకూ తమ ఆదాయ వివరాలను స్పీకర్‌కు సీల్డుకవర్‌లో అప్పగించనే లేదు. చట్టసభ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల ఆదాయ మూలాలను వెల్లడించడాన్ని తప్పనిసరి చేస్తూ- నామినేషన్ దాఖలు చేసే సమయంలోనే ఆ మేరకు వివరాలు ప్రకటించేలా మార్పులు చేయాలని ధర్మాసనం సూచించింది. ఆస్తులు అమాంతం పెరిగిపోవడాన్ని దర్యాప్తు చేయడానికి ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని స్వచ్ఛంద సంస్థ ‘లోక్‌ప్రహారి’ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. చట్టసభల సభ్యులు తమ హోదాలను దుర్వినియగం చేస్తూ ఆస్తులను కూడబెట్టుకోవడాన్ని నిరోధించకుంటే అది ప్రజాస్వామ్య విధ్వంసానికి, మాఫియా పాలనకూ దారితీస్తుందని బెంచ్ అభిప్రాయపడింది. ఇలాంటి సమస్యల పరిష్కారానికి పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశాలు కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాయని, మన దేశంలో మాత్రం ఇటు పార్లమెంటు కానీ, ఎన్నికల సంఘం కానీ దృష్టి సారించలేదని బెంచ్ నిర్మొహమాటంగా చెప్పింది. ప్రజాప్రతినిధుల అక్రమార్జనపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం విచారణ జరపడం కాలం చెల్లిన విధానమే అవుతుందని, విచారణకు ముందే వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులను చేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలోమార్పులు చేయాల్సి ఉంటుందని బెంచ్ పేర్కొంది.
కాగా, ప్రస్తుతం వందల కోట్ల రూపాయల ఆస్తులను తమ రికార్డుల్లో చూపుతున్న నేతల ఆస్తులు దశాబ్దం క్రితం చాలా స్పల్పం అనేది సుస్పష్టం. దేశంలో ముఖ్యమంత్రుల ఆస్తులను విశే్లషిస్తే ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత సంపన్నుడిగా తేలిందని అసోసియేషన్ ఫర్ డెముక్రటిక్ రిఫార్మ్సు (ఎడిఆర్) సంస్థ తెలిపింది. ఎడిఆర్ నివేదిక ప్రకారం చంద్రబాబు ఆస్తుల విలువ 177 కోట్లు. అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమాఖండూ 129 కోట్లతో రెండోస్థానంలోను, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ 48 కోట్లతో మూడోస్థానంలో ఉన్నారు. భారీగా ఆస్తులున్నవారి జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు 15.51 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. అతి తక్కువ ఆస్తులు ఉన్న వారి జాబితాలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఉన్నారు.
అవినీతి అనేది రాత్రికి రాత్రి వ్యాపించిన మహమ్మారి కాదు, వాస్తవానికి ప్రపంచంలో అవినీతిని నిర్మూలించే చట్టాలు ఎన్నో శతాబ్దాల క్రితమే ఉనికి లోకి వచ్చాయి. అయినా శాసనాలు మాత్రం దాన్ని రూపుమాపలేక పోతున్నాయి. ప్రతిరోజూ కోట్లాది రూపాయల లంచం రూపంలో చేతులుమారుతోంది. దాని పర్యవసానాలను కోట్లాది మంది అనుభవిస్తున్నారు. చేతులు తడపకపోతే అస్సలు ఏ పనీ జరగదు. సరైన వ్యక్తికి లంచం ఇవ్వడం పరీక్షలో ఉత్తీర్ణులయ్యేలా చేస్తుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టుల కోసమే కాదు, డ్రైవింగ్ లైసెన్స్‌కు, సిమ్ కార్డులకు, ఆధార్ కార్డుకూ లంచాలు ఇచ్చిన ఘటనలు వెలుగు చూశాయి. ఒక వివాదంలో కోర్టులో గెలుపునకు కూడా లంచం తెచ్చిపెడుతుందని రుజువైంది. అవినీతి ప్రజల దృక్పధాన్ని నీరసపరిచి, వారిపై పెద్ద భారంలా మారింది అని ప్యారిస్‌లోని న్యాయవాది అర్నో మోనె్టబర్గ్ వాపోతున్నాడు.
ఆశించిన దానిని సులభంగా పొందడానికి అతి సులభమైన మార్గం అవినీతి మాత్రమే. కొన్ని సార్లు లంచం ఇవ్వడం ద్వారా శిక్షను తప్పించుకునేలా చేస్తుందనే ఉదంతాలు కళ్లముందే ఎన్నో జరిగాయి. రాజకీయ నాయకులు, పోలీసులు, న్యాయవ్యవస్థలో కొంత మంది అవినీతిని అలక్ష్యం చేస్తున్నట్టు లేదా వాళ్లే స్వయంగా అవినీతికి పాల్పడుతున్నట్టు గమనించి గుడ్డిగా వాళ్లను అనుసరించేవాళ్లున్నారు. అవినీతి అంగీకారయోగ్యమైనదిగా తయారై, చివరికి అదే జీవన విధానంగా మారిపోతోంది. చాలా తక్కువ వేతనాలు అందుకుంటున్న ప్రజలు ఇక తమకు మరో మార్గం లేదని భావిస్తున్నారు. సంతృప్తికర జీవన విధానం కోసం లంచాలు మరుగుతున్నారు. ఇతరులకు అనుచిత ప్రయోజనాలను చేకూర్చేందుకు లంచాలు మార్గంగా మారాయి.
ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడితే విజిలెన్స్, ఎన్‌ఫోర్సుమెంట్ బృందాలు, అవినీతి నిరోధక శాఖ నిరంతరం పనిచేస్తుంటాయి. న్యాయవ్యవస్థల్లో అవినీతి నిరోధక కోర్టులు, లోకాయుక్తలు, ఉప లోకాయుక్తలు , అపెక్స్ కోర్టులు పనిచేస్తుంటాయి. కేంద్ర విభాగాల కోసం సిబిఐ ఉండనే ఉంది. ఇన్ని వ్యవస్థలున్నా భారత్‌లో మాత్రం అవినీతి సమసిపోవడం లేదు. రాజకీయాలతో ముడిపడిన వాణిజ్య ప్రపంచంలో లంచగొండితనం విశృంఖలంగా ఉంది. కొన్ని కంపెనీలు తమకు వచ్చే లాభాల్లో మూడో వంతు ఆదాయాన్ని అధికారులకు లంచాలు ఇవ్వడానికే కేటాయిస్తారు. బ్రిటన్ పత్రిక ‘ది ఎకనమిస్టు’ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులపై వెచ్చిస్తున్న 2,500 కోట్ల అమెరికన్ డాలర్లలో 10 శాతం దాని కొనుగోలుదారులకు లంచం ఇవ్వడానికే ఉపయోగపడుతోంది. గత దశాబ్దంలో బంధుజనప్రీతి పెట్టుబడిదారీ విధానం, అంటే మంచి స్థితిలో ఉన్న కొద్ది మందికే ప్రయోజనం చేకూర్చే వ్యాపార లావాదేవీలు దేశాల ఆర్ధిక వ్యవస్థలనే కూలదోసినట్టు చెప్పబడుతోంది. అవినీతి ఒక విధమైన అణచివేత వంటిది, ఈ అణిచివేతను నిర్మూలించడం సాధ్యమేనా అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. సంపూర్ణంగా అన్ని రంగాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని పారదర్శక విధానంలో అమలుచేయగలిగితే లంచగొండితనం నాశనం కావడం ముమ్మాటికీ నిజం.
168 దేశాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న అవినీతి గురించి నిర్వహించిన సర్వేలో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం డెన్మార్క్, ఫిన్లాండ్‌లు అతి తక్కువ అవినీతితో మొదటి రెండో స్థానాల్లో ఉండగా, సోమాలియా, ఉత్తర కొరియా, ఆఫ్గనిస్తాన్‌లు అత్యధిక అవినీతి దేశాలుగా తేలింది. భారతదేశం 76వ స్థానంలో, చైనా 83వ స్థానంలో, పాకిస్తాన్ 117వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలో అన్ని దేశాలనూ అవినీతి పట్టిపీడిస్తోందనేది నిర్వివాదాంశం. మనే దేశంలో అవినీతికి వ్యతిరేకంగా సమాజ స్పందన అంతంత మాత్రమే. దాదాపు 80శాతం ప్రజలు అవినీతి నిరోధకంలో తమ పాత్ర కీలకమైందని భావించకపోవడమే దీనికి కారణం. అవినీతితో ఏ పనైనా తేలికగా అయిపోతుందనుకుంటే లంచం ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకంజవేయరు.
ఒక రాష్ట్రంలో అవినీతికి అవకాశం ఇవ్వని ఒక ఐఎఎస్ అధికారిని రాళ్లతో కొట్టి చంపినా మన సమాజం అవసరమైన రీతిలో స్పందించలేదు. అదే రాష్ట్రంలో హైవే పనుల్లో అక్రమాలు జరిగాయని ఒక అధికారి ఆ అక్రమాలకు అడ్డుపడి విషయాన్ని ఆనాటి ప్రధానమంత్రికి వివరించినా చలనం లేదు. ఆ లేఖ రాసిన అధికారిని అవినీతి మాఫియా క్రూరంగా చంపేస్తే కూడా మనం పట్టించుకోలేదు. అధికారం కోసం, హక్కుల కోసం ఉద్యమించిన గిరిజనులను ఊచకోత కోసిన వ్యక్తులను మనం ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రులుగా చూస్తుంటాం. తండ్రులు పదవుల్లో ఉండగా వారి కుమార రత్నాలు అవినీతి సామ్రాజ్యాలను నిర్మించుకున్న ఉదంతాలు కోకొల్లలు.
దేశం కోసం బలిదానాలు చేసిన సైనికులకు కేటాయించిన హౌసింగ్ ఫ్లాట్‌లలో సైతం అవినీతి వ్యవహారాలను చేసిన నాయకులకు జై కొడతాం. ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి , కాని మా పార్టీకి ఓటు వేయండి అంటూ బహిరంగంగా పిలుపునిచ్చిన నేతలను మనం మేధావులుగా భావించి, వారిని అందలం ఎక్కిస్తాం. ఎవరూ తమంతట తాముగా ముందుకు వచ్చి కుళ్లును కడిగే ప్రయత్నం చేయలేకపోతున్నారు. కొద్ది మంది అటువంటి ప్రయత్నం చేసినా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానాలు మాత్రమే పూనుకుని ఇచ్చే ఆదేశాలు శిరోధార్యం అవుతాయి. అపుడే వ్యవస్థ గాడిలో పడుతుంది. పేదలు సైతం ఏ ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు.

-బీవీ ప్రసాద్ 98499 98090