సాహితి

ఆంగ్లభాషలో ‘వేయిపడగలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్ర సాంకేతిక రంగాలలో సాధింపబడే పురోగతి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పందొమ్మిదవ శతాబ్దంలో జరిగిన వివిధ వైజ్ఞానిక రంగాలలోని విప్లవాత్మకమైన ఆవిష్కరణలు ప్రపంచ దేశాలన్నింటితోపాటు భారతదేశాన్నీ ప్రభావితం చేసాయి. వీటికి తోడు బ్రిటిష్ పాలన మూలంగా, ఆధునిక నాగరికతా వ్యాప్తి మూలంగా తెలుగు సమాజంలో వచ్చిన మార్పులనూ, మార్పుల ఫలితంగా ఆనాటి వివిధ వ్యవస్థలూ, వివిధ రంగాలూ అనుభవించిన సంఘర్షణలనూ తమ విశ్వాసాల నేపథ్యం నుంచి విశ్వనాథవారు ఆవేదనాత్మకంగా ‘వేయిపడగలు’ నవలలో చిత్రించారు. ప్రతీకాత్మకమైన అనేక స్తరాలు కలిగిన కథాసంవిధానంతో కూడిన నవల వేయిపడగలు. ఒక్కొక్క పొర ఒక్కొక్క రకమైన ‘అర్తయుక్తి’తో కూడినది. ఈ నవలలోని స్థల నామాలు, పాత్రలు, పాత్రల పేర్లూ ప్రతీకాత్మకమైనవే. ఈ నవలలోని అన్ని పార్శ్వాలలో ప్రతీకాత్మకత ప్రతిఫలిస్తుంది. ‘వేయిపడగల నాగు విప్పారు కొనివచ్చి కాటందుకున్నది కలలోన రాజును’ అనే ఈ నవలలోని తొలి వాక్యం మొదలుకుని, ‘నీవు మిగిలితివి, నా జాతి శక్తి ఇది. నా యదృష్టము, నీవు మిగిలితివి’ అనే చివరి వాక్యం వరకు ప్రతీకాత్మకతా నిర్వహణలో విశ్వనాధ వారి ‘సచేతన కళాసృజన‘ అనన్య సాధ్యమైనది. ‘నీవు మిగిలితివి.’ అనే వాక్యంలోని తొలి పదాలనే, వాక్యాంతంలోను, పునరుక్తం చేయడం ద్వారా రచయిత దృష్టిలో కుటుంబ వ్యవస్థకున్న ప్రాధాన్యం వ్యంగ్యం చేయబడింది. నిర్దిష్ట కాలంలోని నిర్దిష్ట సమాజాన్ని, నిజాయితీతో, వాస్తవిక దృష్టితో చిత్రిస్తే రచయిత ఉద్దేశించిన అంశాలతోపాటు, రచయిత ఉద్దేశించని అనేక విషయాలు కూడ వ్యంగ్యమవుతునే ఉంటాయి. ఈ మాటలు వేయిపడగలు నవలకూ వర్తిస్తాయి.
విలక్షణమైన, విలువైన రెండు తరాల సామాజిక సాంస్కృతిక చరిత్ర అనదగిన వేయిపడగలు నవలకు ఆంగ్లానువాదం వెలువడడం ముదావహం. విశ్వనాథ సాహిత్య పీఠంవారు, విశ్వనాథ పబ్లికేషన్స్ వారు సంయుక్తంగా ఈ ఆంగ్లానువాద గ్రంథాన్ని ముద్రించారు. విశ్వనాథ సాహిత్య పీఠ వ్యవస్థాపకులు, నిర్వాహకులు అయిన డా.వెల్చాల కొండలరావుగారు (విశ్వనాథ సత్యనారాయణ జూనియర్‌తో కలిసి) ఈ ఆంగ్లానువాద గ్రంథ నేపథ్యాన్ని వివరిస్తూ ఒక ముందు మాట రాశారు. విశ్వనాథ కులవాదా? మతవాదా? సంప్రదాయవాదా? బ్రాహ్మణవాదా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ‘ఇన్ డిఫెన్స్ ఆఫ్ విశ్వనాథ’ పేరుతో కొండలరావుగారు మరో ముందుమాట రాశారు. ఈ ఆంగ్లానువాదాన్ని చదవాల్సిన అవసరాన్ని వివరిస్తూ (చేపూరి సుబ్బారావుగారితో కలిసి) మరో ఉపోద్ఘాతం కూడ సమకూర్చారు. వేయిపడగలు నవలకున్న వర్తమాన ప్రాసంగికతను చర్చిస్తూ, ‘వై వేయిపడగలు నౌ?’ అనే శీర్షికతో ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి గార్లు రాసిన మరో వ్యాసం కూడ చేర్చబడింది. విశ్వనాథ వారి సాహిత్య వైభవాన్ని విశే్లషిస్తూ డా.ప్రేమ నందకుమార్‌గారు రాసిన ‘ట్రెజరింగ్ ఎ వానిష్‌డ్ పాస్ట్’ అనే వ్యాసం కూడ ఉన్నది. ఇవన్నీ విశ్వనాథ సాహిత్యాభిమానులకు ఎంతో ఉపయోగకరకమైనవి. సుమారు యాభై పేజీల ఈ ముందు మాటల తెలుగు అనువాదాలను విడిగా ఒక పుస్తకంగా ప్రచురిస్తే బాగుంటుంది. డా. వెల్చాల కొండలరావుగారి ఆధ్వర్యంలో, చేపూరి సుబ్బారావుగారి సంపాదకత్వంలో, సంపాదకునితోపాటు, ఉప్పులూరి ఆత్రేయశర్మ, డా.వైదేహి శశిధర్, డా.అరుణావ్యాస్, ఎస్.నారాయణస్వామి అనే మరో నలుగురు విద్వాంసులు వివిధ అధ్యాయాలను అనువాదం చేసారు. వీరందరు బహుభాషా సాహిత్య ప్రవీణులు, బహు గ్రంథకర్తలు, అందులోనూ విశ్వనాథ సాహిత్యాభిమానులు, సంప్రదాయ ప్రీతి కలిగినవారు, విశ్వనాథ హృదయాన్ని ఎరిగినవారు. కనుక ఈ అనువాదాన్ని ఒక పవిత్ర కార్యంగా భావించి నిష్ఠతో సమర్ధంగా నిర్వహించారు. ఆంగ్లపాఠకుల సౌకర్యార్ధం ప్రతి అధ్యాయం చివర, వివరణలతో కూడిన పాదసూచికలను చేర్చారు. వేయిపడగలులో అనేక పద్యాలు, శ్లోకాలు, కీర్తనలు ప్రస్తావించబడినాయి. వాటిని కూడా ఆంగ్లంలోకి అనువదించారు. వాటికి లిప్యంతరణలను ఆయా అధ్యాయాల చివర ప్రచురించారు. విశ్వనాథ సాహిత్య అమృతాన్ని కడుపార గ్రోలిన విద్వాంసులు, విమర్శకులు ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, ఆచార్య ఎస్.లక్ష్మణమూర్తి, డా.రేవూరి అనంతపద్మనాభరావుగార్లు రిసోర్స్ పర్సన్స్‌గా వ్యవహరించడంవల్ల కూడ ఈ అనువాదానికి ప్రామాణికత సమకూరింది. విశ్వనాథ వారి సాహిత్యం మీద రాయబడిన ఆంగ్ల వ్యాసాలనూ, విశ్వనాథ వారి ఆంగ్ల రచనలనూ కలిపి ‘విశ్వనాథ: ఎ లెజండ్’ పేరుతో 762 పేజీల బృహత్ గ్రంథం అచ్చయింది. విశ్వనాథ వారి రచనల ఆంగ్లానువాదాల ప్రచురణ క్రమంలో వేయిపడగలు ఆంగ్లానువాద ప్రచురణ మూడవది. ఇలాంటి బృహన్నవలను సమర్ధవంతంగా అనువాదాలు చేయించడం ఒక ఎత్తు అయితే ప్రచురించడం మరో ఎత్తు.

- పెన్నా శివరామకృష్ణ, 9440437200