సంపాదకీయం

పుష్కర శోభల కృష్ణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణానదీ పుష్కరాలు ఆరంభం అవుతుండడం శుభంకరమైన హైందవ జాతీయ సంప్రదాయానికి మరోసారి శ్రీకారం. ఈ శ్రీకారం ఈ భూమిపట్ల మనకు గల మమకారంతో ముడివడి ఉంది. ఈ శ్రీకారం ప్రకృతిపట్ల మనకుగల కృతజ్ఞతా భావంతో ముడివడి ఉంది, ఈ శ్రీకారం ఖగోళ స్థిత గ్రహగతులతో అనుసంధానమై ఉంది, ఆ గ్రహగతులతో ఈ భూమిపై నడయాడుతున్న మనకున్న సనాతన సంబంధంతో ముడివడి ఉంది, ఆద్యంత రహితమైన విశ్వ వ్యవస్థతో సమన్వయం సాధిస్తోంది. పుష్కరం మరో శ్రీకారం. నిన్నటి సూర్యుడు నేడు మళ్లీ ఉదయిస్తున్నాడు, రేపు మళ్లీ ఉదయిస్తాడు! ప్రతిరోజు అనంతంగా ఉదయిస్తూనే ఉంటాడు! ప్రతి ఉదయం మరో శుభారంభం. పనె్నండేళ్ల క్రితం కృష్ణా పుష్కరం వచ్చింది, నేడు మళ్లీ వచ్చింది, పనె్నండేళ్ల తరువాత మరోసారి వస్తుంది. అనాదిగా, సృష్ట్యాదిగా ఇలా ఈ పుష్కరం వచ్చింది, అనంతంగా ప్రతి పనె్నండేళ్లకోసారి వస్తూనే ఉంటుంది! ఉదయం కొత్తదయినట్టే ప్రతి పుష్కరం అందువల్ల కొత్తది. ఈ పుష్కరాంభ శ్రీకారం శుభంకరమైన ఈ భారత జాతీయ సాంస్కృతిక ప్రస్థాన క్రమానికి కొనసాగింపు కూడ...నిన్నటి సూర్యోదయానికి నేటి ఉదయం కొనసాగింపు. పనె్నండేళ్ల క్రితం మహాబలేశ్వరంనుండి హంసల దీవి వరకు సభలు తీరిన ధార్మిక స్ఫూర్తి శ్రుతులకు, స్మృతుల పరంపరకు నేటి శుభారంభం ఇలా మరో కొనసాగింపు. ఈ పునరావృత్తి విశ్వ వ్యవస్థ స్వరూపం, విశ్వహిత స్వభావం! భారతీయుడు నిరంతరం సృష్టిక్రమంతో సమన్వయం చెందుతుండడం ఈ కొనసాగింపు, సాంస్కృతిక భావ పరిమళ పునరావృత్తి, ఈ పరిమళం సృష్ట్యాదిలో మహర్షులు వేదాన్ని దర్శించిన నాటిది! ఈ పరిమళం ప్రవాహ రూపమెత్తి భరతావని నలుచెరుగులా ప్రవహిస్తోంది! ఒక్కొక్క ప్రవాహం ఒక నది. కృష్ణానది ఒక ప్రవాహం, ఒక సాంస్కృతిక స్రోతస్విని, యుగయుగాల నధిగమించిన దివ్యధుని..ఈ దివ్యధునీ దర్పణంలో, కృష్ణవేణీ పావన జలాల అద్దంలో, ఈ పునరావృత్తి అజరామర చిత్తవృత్తి మరోసారి పుష్కర రూపం ధరించి మెరుగులను దిద్దుకుంటోంది! ఈ మెరుగుల సజీవ రూపాలు మాతృభూమి నలుచెరుగులనుండి తరలివస్తున్న జనాలు, ఈ సనాతన ధరిత్రికి వరాల బిడ్డలు! ఈ అమృత పుత్రులు, పుత్రికలు పుష్కర స్నానంలో మరోసారి పునీతులవుతున్నారు, విశ్వహిత శుభంకర భావ హృదయులవుతున్నారు...ఇది కూడ మరో ఆరంభం, మరో పునరావృత్తం! ఇలా పుష్కరం పవిత్రతకు ప్రతీక, పరిశుద్ధతతకు ప్రతీక, పరిపోషణకు పతాక! పవిత్రత ఆత్మగతమైనది, పరిశుద్ధత మానసికమైనది, పరిపోషణ భౌతికమైనది. భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక త్రివేణీ సంగమం ఇలా పుష్కరమైంది, సాంస్కృతిక ప్రవాహమైంది. కృష్ణవేణి ఈ ప్రవాహం! ఈ ప్రవాహ జలాలలో స్నానం భౌతిక ధార్మిక ప్రగతికి దోహదకం, ఆధ్యాత్మిక సుగతికి మూలం!
బృహస్పతి గ్రహం సింహరాసినుండి కన్యారాసిలో ప్రవేశించడంతో శుక్రవారం ఉదయంనుండి కృష్ణానది ఆదిపుష్కరాలు ఆరంభమవుతున్నాయి. కలియుగాబ్ది 5118వ సంవత్సరం ఇప్పుడు నడుస్తోంది. చాంద్రమాన కాలగణనం ప్రకారం ఇది శుభ దుర్ముఖి. శ్రావణ శుద్ధ నవమిరోజున కృష్ణా పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. బృహస్పతి సంవత్సరంపాటు సింహరాసిలో కలసి ఉదయించిన సమయంలో గోదావరీ నదీ పుష్కరాలు జరిగాయి. గోదావరీ అంత్యపుష్కరాలు పనె్నండు రోజులపాటు జరిగి పూర్తయిన వెంటనే కృష్ణానదికి ఆరంభ పుష్కరాలు మొదలవుతున్నాయి. ఇలా పుష్కరాలు బృహస్పతి-గురువు- గ్రహం ఖగోళ గమనంతో ముడివడి ఉన్నాయి. సృష్టి మొత్తం సమాజం జీవజాలం అనుసంధానమై ఉండడం విశ్వగత వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తించిన జాతి అనాదిగా భరత జాతి. సృష్టి గత తత్త్వాన్ని జాతీయ జీవన వాస్తవంగా మలచుకున్న జాతి భారత జాతి! అందువల్లనే గ్రహాలలో అతి పెద్దవాడైన బృహస్పతి గమనం ప్రాతిపదికగా మనం మన ధార్మిక సాంస్కృతిక కలాపాలను రూపొందించుకున్నాము. సృష్టితో మానవ సమాజానికి గల అవినాభావ సంబంధానికి, అద్వైత భావానికి పుష్కరం ఇలా ప్రతీక! బృహస్పతి అత్యంత పెద్ద గ్రహం కనుకనే ఎంతో దూరాన వున్న ఈ గ్రహాన్ని మన పూర్వీకులు గురువు-పెద్దవాడు-అని గుర్తించగలిగారు. సూర్యచంద్రుల వలె గురువు కూడ భూగోళ స్థితి మానవ జీవన గతిపై ప్రభావం చూపిస్తున్నాడు. కానీ అనాదిగా దీన్ని గుర్తించిన వారు వేద ఋషులు,హిందువులు! అందువల్లనే నదులను మనం బృహస్పతి గమనంతో అనుసంధానం చేసుకుని పుష్కరాలను జరుపుకుంటున్నాము. ప్రపంచంలో మరెక్కడా లేని విలక్షణ ఉత్సవం పుష్కరం...
నీరు భూమిని పవిత్రం చేస్తోంది. పరిశుద్ధం చేస్తోంది, పండిస్తోంది. పవిత్రవంతమైన పరిశుద్ధమైన భూమినుండి జన్మిస్తున్న మనం పవిత్ర భావాలతో పరిశుద్ధ జీవనం గడపడం చరిత్ర...ఈ చరిత్ర ‘ఆపఃపునంతు పృథివీం, పృథివీ పూతా పునాతుమామ్..’-నీరు పుడమిని శుభ్రం చేయుగాక, పరిశుద్ధత పొందిన పుడమి నన్ను-మమ్ములను-పరిశుద్ధం చేయుగాక అన్న వేద ద్రష్టల ఆకాంక్షతో మొదలైంది. ఈ శుభంకరమైన అన్న ప్రదాయకమైన పంచ భూతాలలో ఒకటైన నీరు గంగగా, గోదావరిగా, కృష్ణగా, తుంగభద్రగా, సింధుగా జనజీవన క్షేత్రాన్ని పండించడం చరిత్ర. మహాబలేశ్వరం వద్ద ప్రభవించి మహారాష్ట్ర కర్నాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలగుండా బిరబిరా కృష్ణమ్మ కదలిపోతుంటేను... బంగా రు పంటలు పండడం గురించి మహాకవి శంకరంబాడి సుందరాచారి దర్శించాడు! యుగాలనాటి చరిత్రకు, తుది మొదలు లేని భారత జాతీయ జీవనయాత్రతకు, కృష్ణానది సజీవ సాక్ష్యం. వందలాది మైళ్ల పొడవునా కృష్ణానదీ తీర ప్రాంతంలో భారతీయుల బంగారు పంటలు సభలు తీరాయి. తెలుగువారి తొలి రాజధాని శ్రీకాకుళం, అతి ప్రాచీన రాజధాని అమరావతి కృష్ణానదీ సమీపంలో అవతరించాయి. శాతవాహనుల కౌశల్యం, కాకతీయుల పటిమ, హంపీ విజయనగర విభవం, చాళుక్యుల ఘనత, విద్యారణ్యుని వివేకం, ఛత్రపతి శివాజీ గరిమ కృష్ణాజలాల స్పర్శతో ప్రవాస నిత్యత్వాన్ని సంతరించుకుని చరిత్ర నడిపించాయి, నూతన చరిత్రను సృష్టించాయి. వైవిధ్య పరిరక్షకులైన సనాతన జాతీయులకు, వైవిధ్య విధ్వంసకులైన విదేశీయ మతోన్మాదులకూ కృష్ణవేణీ నదీ తీరం శతాబ్దులపాటు సంఘర్షణ క్షేత్రం! ఈ సంఘర్షణ కృష్ణాతరంగ పంక్తిన్ తొక్కి తుళ్లింత ఆంధ్ర నౌకలు నాట్యమాడునాడు...మొదలైంది! అనేకానేక పుష్కర ఘట్టాలు ఆస్మృతుల వాటికలు...విజయ వాటికలు! పుష్కర స్నానం ఈ సనాతన జాతీయ సంస్కార సమాహారం!
ఈ సంస్కారాలకు తలమానికం మనకు జన్మనిచ్చి పెంచి పోషిస్తున్న మన మాతృభూమి పట్ల మనకున్న మమకారం.ఈ మమకారం ధర్మం, దైవం, ఆరాధనం, సముత్కర్ష ప్రగతి శిఖరం, మనజీవనం ఆ సేతు శీతనగం పనె్నండు ప్రధాన నదులు విస్తరించాయి. ఈ నదులు భరతమాత జీవనాడులు, భరత జాతికి జీవన ప్రదాతలు! ప్రతి ఏటా ఒక నదిలో స్నానం చేయడం పుష్కరం! పుష్కర వృత్తం-పనె్నండేళ్లు పూర్తయ్యేసరికి మొత్తం భారతదేశాన్ని చుట్టిరావడం లక్ష్యం! ‘నమాతుఃపరదైవతమ్’-అన్నది వాస్తవం! కృష్ణా పుష్కర స్నానం అందువల్ల మాతృభూమి సమగ్ర దర్శన ప్రస్థానంలో శుభ ఘట్టం...