సంపాదకీయం

సురాజ్య ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రేష్ఠ్భారత సమాజ పునరుద్ధరణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలోని ప్రధాన ఇతివృత్తం..సర్దార్ వల్లభభాయి పటేల్ అవశేష భారత్‌లోని అనేకానేక సంస్థానాలను విలీనం చేసి సమైక్య భారత్‌ను పునరుద్ధరించారు. ఈశ్రేష్ఠ భారత్ విదేశీయ దురాక్రమణ దారులు ఈ దేశంలోకి చొరబడడానికి పూర్వం నుంచి విలసిల్లిన స్వజాతీయ సమాజం. ఈ సమైక్య భారత్ ఈ సనాతన హైందవ జాతీయ భౌగోళిక సమగ్రతకు ప్రతీక. 1947, ఆగస్టు 14వ 15వ తేదీల మధ్య జరిగిన దేశ విభజన సమైక్య భారత్‌కు గొడ్డలిపెట్టు. ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులుగా ఉండిన అఖండ భారత భూభాగాలు పాకిస్తాన్‌గా ఏర్పడగా, అనాదిగా ఈ దేశంలో పరిఢవిల్లిన స్వజాతీయులైన హిందువులు అధిక సంఖ్యాకులుగా మిగిలిన భూమి అవశేష భారత్‌గా ఉండిపోయింది. ఈ అవశేష భారత్ మధ్యలో దాదాపు 575 సంస్థానాలు అర్థ స్వతంత్ర దేశాలుగా అవతరించడం బ్రిటన్ సామ్రాజ్యవాదుల కుట్రలోని మరో ప్రధానమైన ఎత్తుగడ, మొదటి ఎత్తుగడ దేశ విభజన. భారత్ అనైక్యతతో అలమటించాలన్నదే బ్రిటన్ వారి దుస్తంత్రం. ఈ దుస్తంత్రాన్ని భగ్నం చేసి సమైక్య భారత్‌ను సాధించిన ఘనత అప్పటి -1947 నాటి-ఉప ప్రధాని వల్లభ భాయ్ పటేల్‌ది సమైక్య శ్రేష్ఠ భారత పునర్ నిర్మాణానికి వౌలికమైన అనివార్యం. డెబ్బయవ స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ, దేశ రాజధానిలోని ఎఱ్ఱకోట బురుజులనుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి ఇలా సమైక్య భారత్ శ్రేష్ఠ భారత్‌గా మళ్లీ నిర్మించుకునే మహా యజ్ఞంలో భాగస్వాములం కావాలని పిలుపునివ్వడం దేశ ప్రజల ఆకాంక్షలకు మరో ఆవిష్కరణ. అరవయి తొమ్మిది ఏళ్లుగా ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న స్వాతంత్య్ర రథం సోమవారం డెబ్బయవ ఏట అడుగుపెట్టింది. శ్రేష్ఠ్భారత్ నిర్మాణ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం, ప్రభుత్వాల అలసత్వం, అధికార అవినీతి, సమాచార అనభిజ్ఞత నిలదీస్తుండడం వల్ల మందకొడితనం ఏర్పడడం నరేంద్రమోదీ ప్రసంగంలోని మరో ప్రధాన అంశం. గత రెండేళ్లుగా ఈ మందకొడితనం వదలిపోయిందన్నది ఆయన వివరించిన క్రియాశీల సంస్కృతి...
తమ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల చిట్టా చాలా పెద్దదని, వాటిని వివరించడం పరిమిత సమయంలో సాధ్యం కాదని, నరేంద్ర మోదీ ప్రసంగ ప్రారంభంలో చెప్పారు. అందువల్ల తమ ప్రభుత్వపు కార్య సంస్కృతి గురించి మాత్రమే వివరించనున్నట్టు ఆయన చెప్పారు. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడం ఈ కార్యసంస్కృతి స్వభావమన్నది ఆయన వివరించిన తీరు...దిశను మాత్రమే నిర్దేశించడం కాక వ్యాపక దృష్టిని కార్యక్రమ ప్రగతిని జోడించడం ఈ కార్య సంస్కృతి..క్రాంతివాదుల బలిదానాల ఫలితం స్వరాజ్యం. క్రాంతివాదుల స్వప్నం సురాజ్యం. అందువల్ల స్వరాజ్య సాధనకోసం ప్రాణాలను అర్పించిన క్రాంతికారుల-స్వాతంత్య్ర విప్లవయోధుల- స్వప్నాన్ని సర్వసమగ్ర వాస్తవ రూపంగా పరివర్తన చేయడం తమ ప్రభుత్వ కార్య సంస్కృతి అన్నది నరేంద్ర మోదీ ప్రసంగం ధ్వనించిన తీరు. చిర పురాతనమైన సనాతనమైన-శాశ్వతమైన- ఈ జాతిలో ప్రభవించిన అసంఖ్యాక మహాపురుషులు మానవులు మనుగడకు వౌలికమైన విలువలను, సంస్కారాలను విస్తరింపజేయడానికి తపస్సు చేశారు. వేదాలనుంచి వివేకానందస్వామి వరకు ద్వాపర యుగంనాటి మురళీ మోహనుని- యదుకుల కృష్ణుని-నుండి బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర ఉద్యమం నడిపిన మోహనుని-మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ-వరకు, పాండవ భీమసేనుని నుండి భీమ్‌రావ్-బాబా సాహెబ్ అంబేద్కర్-వరకు ఈ తపస్సు కొనసాగిన సంగతి మోదీ గుర్తు చేసారు! ఈ తపః ఫలితంగా వాస్తవ రూపం దాల్చిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా తీర్చి దిద్దడమే తమ ఫ్రభుత్వ కార్య సంస్కృతి అన్నది ప్రధాని ప్రసంగం సారాంశం.
ఈ కార్య సంస్కృతిని సంస్కరించడం, సమకూర్చడం, సమర్పించడం...పని తీరులో జరిగిన సంస్కరణల గురించి గొప్ప పరివర్తన గురించి మోదీ గత ప్రభుత్వాలతో సరిపోల్చి వివరించారు. ప్రసంగంలోని అధిక భాగాన్ని ఆయన తులనాత్మక ప్రగతికి కేటాయించడం పరోక్షంగా గత ప్రభుత్వాల పనితీరును విమర్శించడం! మతి, సహమతి-ఏకాభిప్రాయం-, ప్రగతి ఈ త్రివేణి సంగమ ప్రవాహంగా ఈ తమ ప్రభుత్వ కార్య సంస్కృతి కొనసాగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. అవినీతి, దళారీలు బొక్కేసిన ప్రభుత్వ కార్యక్రమాలను వారినుండి విముక్తం చేసి నిరుపేదలకు అట్టడుగు వర్గాలకు-ఈ కార్యక్రమాల పథకాల ఫలితాలను సమకూర్చడమని ఆయన వివరించారు. ఈ కార్య సంస్కృతి పండిత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయం సాధనలో భాగమన్నది మోదీ చేసిన నిర్ధారణ..దీన్‌దయాళ్ ఉపాధ్యాయ 1960వ దశకం వరకు జీవించిన గొప్ప దార్శనికుడు, జాతీయతా తత్త్వవేత్త! ఇది ఆయన శతజయంతి ఉత్సవ సంవత్సరం! వంటగ్యాస్, విద్యుత్తు మొదలు రైల్వేలు, ఎరువులు వరకు సామాన్య జన జీవనంలో నింపుతున్న వేగ వంతమైన ప్రగతి వెలుగులు...నరేంద్ర మోదీ మాటలలో ధ్వనించిన కార్య సంస్కృతి... భూమి ఆరోగ్యాన్ని రక్షించడానికి, నీటిని సేకరించడం పంపిణీ చేయడం పరిరక్షించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని సమృద్ధం చేయడానికి జరుగుతున్న కృషి గురించి ఆయన చెప్పుకొచ్చారు! ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చుకోవడం తమ లక్ష్యం కాదని, దేశానికి గుర్తింపు తీసుకురావడం తమ లక్ష్యమని చెప్పడం ద్వారా నరేంద్రమోదీ రాజనీతికి అతీతమైన జాతీయ నాయకుడుగా తనను తాను చిత్రీకరించుకోగలిగారు....మహనీయులైన జాతీయ ధర్మాచార్యులైన రామానుజాచార్యులు, గురు గోవిందసింగ్ తదితరులను స్మరించడం ద్వారా వారు చూపిన సామాజిక సామరస్య సమన్వయ పథంలో కదలి పోవాలన్న సంకల్పాన్ని మోదీ పునరుద్ఘాటించారు. ఇది రామానుజాచార్యుల సహస్రతమ జయంతి వత్సరం, గురుగోవిందుని సార్ధ త్రిశత తమ జయంతి వత్సరం! నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్వాతంత్య్ర సమరగతికి సంబంధించిన రహస్య పత్రాలను వెల్లడి చేయడం తమ ప్రభుత్వం సాధించిన మరో విజయమన్నది నరేంద్ర మోదీ చేసిన నిర్ధారణ...తమ ప్రభుత్వ విజయాలను చెప్పడం లేదని, దేశానికి గుర్తింపు తేవడమే లక్ష్యమని వివరించిన మోదీ పరోక్షంగా తమ ప్రభుత్వం ఘనతను చాటుకున్నారు...ఇది ఆయన జాణతనం, గడుసుతనం! ఎన్నికలలో పదే పదే విజయాలను సాధించుకొనడం నీతి, నిజాయతి, నిర్ధారణ స్వభావమైన ప్రభుత్వ అధినేతలకు సైతం అనివార్యం మరి...
బలూచిస్తాన్‌లోని, గిల్గిత్ ప్రాంతం సహా పాకిస్తాన్ దురాక్రమించిన కశ్మీర్‌లోని ప్రజలు తమకు ధన్యవాదాలను తెలపడం గురించి మోదీ ప్రస్తావించడం అత్యద్భుతమైన దౌత్య వ్యూహం! తరతరాలుగా పాకిస్తాన్ ప్రభుత్వ దమన నీతికి గురి అవుతున్న బలూచిస్తాన్ ప్రజలు ఎదురుతిరుగుతున్నారు, స్వాతంత్య్రాన్ని కోరుతున్నారు. గిల్గిత్ సహా పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ ప్రజలు మళ్లీ మనదేశంలో కలిసిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. తమకు ఋణపడి ఉన్నామని ఈ ప్రాంతాల ప్రజలు తమకు సందేశాలు పంపుతున్నట్టు ప్రకటించిన మోదీ బీభత్సకారులను మనపైకి ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ హెచ్చరిక అనాదిగా ఈ దేశపు కార్యసంస్కృతిలో భాగమన్నది మోదీ ప్రసంగంలోని ధ్వని...