సంపాదకీయం

బలూచీలకు విముక్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేవలం సూత్రప్రాయంగా బలూచిస్థాన్‌ను ప్రస్తావించారు. బలూచిస్థాన్ ప్రజలు తన కు కృతజ్ఞతలను తెలుపుతూ సందేశాలను పంపినట్టు మాత్రమే డెబ్బయ్యవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ప్రసంగించిన సందర్భంగా ప్రధాని వెల్లడించారు. కానీ ఈ సూత్రానికి బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వాలు విస్తృత భాష్యాలను వివరిస్తుండడం నడుస్తున్న చరిత్ర. బలూచిస్థాన్ ప్రజల మానవ అధికారాలను పాకిస్తాన్ ప్రభుత్వం హననం చేస్తున్న వాస్తవాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆవిష్కరించింది. బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ పౌర ప్రభుత్వ, సైనిక ప్రభుత్వ దమన నీతినుంచి ముక్తిని కోరుకుంటున్నారని అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్‌ఝాయ్ స్వయంగా ప్రకటించిన వాస్తవం. కర్‌ఝాయ్ చేసిన చేస్తున్న పాకిస్తాన్ వ్యతిరేక ప్రకటనలను నిరాకరించకపోవడం ద్వారా అఫ్ఘానిస్థాన్ ప్రభుత్వం కూడ నరేంద్ర మోదీ విధానానికి వౌనంగా మద్దతు పలికింది. బలూచిస్థాన్ ప్రజలు కోరినట్టయితే బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ఏర్పడగలదని కూడ కర్‌ఝాయ్ ప్రకటించడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పరిణామం. పాకిస్తాన్ సైనిక దళాలు దశాబ్దుల తరబడి బలూచిస్థాన్ ప్రజలను ఊచకోత కోయడం జగమెరిగిన కఠోర సత్యం. సైనిక ప్రభుత్వాలు ఏర్పడిన సమయంలోను, సైనిక అధినేతల అదుపులో పౌర ప్రభుత్వాలు కొనసాగిన సమయంలోను కూడ పాకిస్తానీ సైనికులు బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమకారులను దారుణంగా చిత్రవధ చేయడం బహిరంగ రహస్యం. బలూచి ఉద్యమనాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుగితీని 2006లో పాకిస్తాన్ సైనిక దళాలు హత్య చేయడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పు డు పర్‌వేజ్ ముషారఫ్ సైనిక ప్రభుత్వ అధినేత. 2008లో ముషారఫ్ పదవీచ్యుతుడయ్యా డు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మాత్రమే యూసఫ్ రజా జిలానీ ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో ముషారఫ్‌పై న్యాయస్థానంలో బుగితీని హత్య చేసిన అభియోగాన్ని దాఖలు చేసారు. కానీ 2008 తరువాత బలూచి ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వ దమనకాండ మరింత పెరిగింది. ముషారఫ్ నిర్దోషి అని గత జనవరిలో కరాచీలోని ప్రత్యేక న్యాయస్థానం తీ ర్పు చెప్పడం బలూచి ప్రజల పుండుపై కారం...మోదీ పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ మనదన్న వాస్తవాన్ని పునరుద్ఘాటించారు. ఈ పునరుద్ఘాటనపట్ల పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్ ప్రజలు హర్షం ప్రకటించడం, కృతజ్ఞతలను చెప్పడం సహజం..కానీ బలూచి ప్రజలు సైతం మోదీని మెచ్చుకుంటూ సందేశాలను పంపడమే ఆశ్చర్యకరమైన పరిణామం. మోదీ ప్రభుత్వం తమకు సహాయం చేస్తుందని బలూచి ప్రజలు విశ్వశిస్తున్నారు కాబోలు..
కేవలం మతం ఒక జాతి సమైక్య సూక్తికి ప్రాతిపదిక కాజాలదన్నది బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమం ప్రపంచానికి నేర్పుతున్న పాఠం. బలూచిస్థాన్ పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతంలో నెలకొని ఉన్న ప్రాంతం, భౌగోళికంగా పాకిస్తాన్‌లోని అతి పెద్ద రాష్ట్రం. జనాభా రీత్యా అతి పెద్ద రాష్ట్రం పంజాబ్. పంజాబ్‌కు చెందిన వారు తమపై ఆధిపత్యం వహిస్తున్నారన్న భావం పాకిస్తాన్‌లోని సింధు, బలూచిస్థాన్, వాయువ్య సరిహద్దు రాష్ట్రాల ప్రజలలో ఆదినుంచీ కొనసాగుతోంది. 1947లో జరిగిన అఖండ భారత విభజన సమయంలో పంజాబ్, బెంగాల్ ప్రాంతాల విభజన కూడ వ్యవస్థీకృతమైంది. పశ్చిమ పంజాబ్ పాకిస్తాన్‌లో చేరిపోగా, తూర్పు పంజాబ్ అవశేష భారత్‌లో మిగిలింది. పశ్చిమ బెంగాల్ అవశేష భారత్‌లో కొనసాగుతుండగా, తూర్పు బెంగాల్ పాకిస్తాన్‌గా ఏర్పడిపోయింది. ఆతరువాత తూర్పు బెంగాల్ తూర్పు పాకిస్తాన్‌గా చెలామణి అయింది. బంగ్లాదేశ్ పేరుతో పాకిస్తాన్‌నుంచి విడిపోయి 1971లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అఖండ భారత్‌లోని ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను పాకిస్తాన్‌గా ఏర్పాటు చేయాలన్నది మహమ్మదాలీ జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ 1947 ఆగస్టు 15వ తేదీకి పూర్వం కోరిన కోరిక! దీనికి ప్రాతిపదిక మతం పేతో జాతి-నేషన్-ఏర్పడుతుందన్న కృతక సిద్ధాంతం! మతం ప్రాతిపదికగా అలా పాకిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోని, బలూచిస్థాన్‌లోను ఒకే మతం వారు అత్యధిక సంఖ్యాకులు. అయినప్పటికీ పాకిస్తాన్ ముక్కలైంది. బంగ్లాదేశ్ ఏర్పడింది. మతం ప్రాతిపదికగా జాతి ఏర్పడుతుందన్న కృత్రిమ సిద్ధాంతానికి అది తొలి నిరాకరణ. ఇప్పుడు బలూచిస్థాన్ కూడ పాకిస్తాన్‌నుండి విడిపోవడానికి రంగం సిద్ధమైనట్టు అఫ్ఘానిస్థాన్ మాజీ అధ్యక్షుడు హబీద్ కర్‌ఝాయ్ ప్రకటించారు. బలూచి ప్రజలు కోరితే ఇప్పుడు కాకపోయినా పదేళ్లకు లేదా ఇరవై ఏళ్లకు స్వతంత్ర బలూచిస్థాన్ ఏర్పడక తప్పదన్నది కర్‌ఝాయ్ నిర్థారణ.
జమ్మూ కశ్మీర్‌లో న్యాయమైన రాజ్యాంగబద్ధమైన మానవ అధికారాలకు ఎలాంటి విఘాతం కలగడంలేదు. పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ బీభత్సకారులు మాత్రమే జమ్ము కశ్మీర్‌లో ఏడుదశాబ్దులుగా మానవ హననం చేసారు. లక్షలాది అల్పసంఖ్యాక హిందువులను పారదోలారు. ఈ జిహాదీ హంతకులు బలూచిస్థాన్‌లో సైతం అత్యల్ప సంఖ్యాకులుగా మారిన హిందువులను హత్య చేస్తున్నారు. హిందువులను అపహరించుకుపోతున్నారు. బలూచిస్థాన్‌లోని కలాత్ జిల్లా సురభ్ గ్రామంలోని దుర్గా మందిరం ధర్మకర్త, ప్రధాన అర్చకుడు లక్ష్మీ చంద్ర గార్జీని జిహాదీలు అపహరించడం పైశాచిక కాండకు ఒక ఉదాహరణ మాత్రమే.గార్జీ వయసు అప్పటికి ఎనబయి రెండేళ్లు. కానీ జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం జరపని హక్కుల భంగం గురించి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తున్న ఇస్లాం మత రాజ్యాల కూటమి-ఓఐసి- వారు బలూచిస్థాన్‌ను ఎప్పుడూ ప్రస్తావించరు. ఎందుకంటె బలూచిస్థాన్‌లో స్వాతంత్య్ర ఉద్యమకారులను హతమార్చుతున్నది పాకిస్తాన్ ఇస్లాం మత ప్రభు త్వం! జమ్ముకశ్మీర్‌లో హక్కుల హననం గురించి అబద్ధాలను ప్రచారం చేసిన ఐరోపా సమాఖ్య వారు కాని, అమెరికాలోని హక్కుల సంఘాలు కాని బలూచిస్థాన్ ప్రజల పక్షాన నోరు విప్పలేదు. ఎందుకంటే దశాబ్దులపాటు పాకిస్తాన్ ప్రభుత్వం ఐరోపా వారి చంకబిడ్డ, అమెరికా వారి ముద్దుబిడ్డ! ఐరోపా, అమెరికా దేశాలలో జిహాదీలు భయంకర బీభత్సకాండను ఆరంభించిన తరువాత మాత్రమే పాశ్చాత్యులకు కనువిప్పు కలిగింది. చైనా పాకిస్తాన్‌తో జట్టు కట్టడం, గ్వాడార్ ఓడరేవులో తిష్ఠవేయడం, అరేబియా సముద్రంలోను ప్రధానంగా పర్షియా సింధుశాఖ ప్రాంతంలోను చైనా నౌకాదళాల ఉనికి పెరగడం వంటి పరిణామాలవల్ల ఐరోపా అమెరికా ప్రభుత్వాలు పాకిస్తాన్‌కు దూరంగా జరుగుతున్నాయి. బలూచిస్థాన్ స్వాతంత్య్ర ఉద్యమానికి ఇది అనుకూల పరిణామం. ఎందుకంటే గ్వాడార్ ఓడరేవు, బలూచిస్థాన్ పర్షియా సింధుశాఖ సమీపంలో నెలకొని ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్‌కు దక్షిణంగా ఉన్న బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా మారినట్టయితే భూబంధనంలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌కు సముద్ర మార్గం సుగమం కావచ్చు. అందువల్ల అఫ్ఘానిస్థాన్ బలూచీ స్వాతంత్య్రానికి మద్దతునిస్తోంది. పాకిస్తాన్‌తో నిమిత్తం లేకుండా మధ్య ఆసియా దేశాలు కూడ అఫ్ఘానిస్తాన్ బలూచిస్థాన్‌ల గుండా అరేబియా సముద్రాన్ని చేరవచ్చు! భారత్ మద్దతు ఉన్నందువల్ల బంగ్లాదేశ్ స్వతంత్ర దేశమైంది, భారత్ మద్దతు లేనందువల్లనే బలూచిస్థాన్ స్వతంత్ర దేశం కాలేదు- అన్నది ఇరుగు పొరుగు దేశాలలో ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మోదీ తీగలాగారు...డొంక కదులుతోంది!