సంపాదకీయం

శభాష్ మోదీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2016 సెప్టెంబర్ 29 భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు. కడచిన నాలుగున్నర దశాబ్దాల్లో మొట్టమొదటిసారి మన సైనిక బలగాలు మాటువేసి, గీతదాటి, పాకిస్తాన్‌కి దానికి అర్థమయ్యే భాషలో, జన్మలో మరవలేని గుణపాఠం నేర్పాయి. అదీ ప్రపంచంలో ఎవరూ వంకపెట్టలేని రీతిలో! దెబ్బతిన్నవారే కనీసం తమకు దెబ్బతగిలిందని చెప్పుకోలేక తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండక తప్పని విధంగా!
విభజన వెనువెంటనే రెయిడర్ల ముసుగులో సైనికదాడి మొదలుకుని కార్గిల్ యుద్ధం దాకా ఇప్పటికి జరిగిన నాలుగు యుద్ధాల్లోనూ, సరిహద్దుల వెంబడి చెదురుమదురు ఘర్షణల్లోనూ బరితెగింపు పాకిస్తాన్‌ది; ప్రతిస్పందన మనది. మదించిన విరోధి మీద మనమే చొరవ తీసుకుని మెరపు దాడి చేయటం ఇదే మొదలు.
ఉరీలో భారత సైనిక స్థావరం మీద దొంగదాడి చేసినవారిని, వారిని ఉసికొలిపిన వారిని శిక్షించి తీరుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నప్పుడు నిజంగానే ఆయన అంతపనీ చేయగలడని పాకిస్తాన్ ఊహించి ఉండదు. తన చెప్పుచేతల్లోని పెంపుడు టెర్రరిస్టులను ప్రయోగించి ఇండియాలో భయానక విధ్వంసానికీ, దారుణ మారణకాండకూ పాల్పడిన ప్రతిసారీ ఇక్కడి ప్రభుత్వాల నుంచి వట్టి అరుపులే తప్ప గట్టి జవాబు లేకపోవటంతో మెత్తటి వారిని విడవకుండా మొత్తటమే పాకిస్తాన్ పాలిసీగా పెట్టుకుంది. భారత సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన పార్లమెంటు మీదే తాను దుర్మార్గంగా దాడి చేయించినా... అప్పటి వాజపేయి ప్రభుత్వం ‘ఆపరేషన్ పరాక్రమ్’తో తెగ హడావుడి చేసి సరిహద్దులకు సేనలను తరలించటమే తప్ప, వాటిని పొలిమేర దాటించే పరాక్రమాన్ని చూపించ లేకపోవటం పాకిస్తాన్‌కి అలుసు అయింది. 2008లో ముంబయిని ముట్టడించి వందల ప్రాణాలు బలిగొన్నప్పుడు అధీనరేఖ ఆవల మెరపు దాడులకు మన్మోహన్ సర్దార్జీ ఆలోచన మాత్రం చేసి, ఆచరణలో తోక ముడవటంతో ఇస్లామాబాద్‌కి మనమంటే భయం లేకుండా పోయింది. తాజాగా ఉరీ సైనిక స్థావరంపై తీరి కూర్చుని తాము దొంగదాడి చేయించాక ప్రధాని నరేంద్రమోదీ చేసిన తీవ్ర హెచ్చరికనూ షరామామూలు తాటాకు చప్పుడుగానే పాకిస్తానీలు పరిగణించారు. వెనకటి పాలకులవలె మోది మెతక మనిషి కాడని తెలుసు కనుక యుద్ధ్భేరి మోగిస్తాడేమోనని ఊహించి, అధీనరేఖ వెంబడి బలగాలను పటిష్ఠపరచి, ‘దురాక్రమణ’పై గగ్గోలుకు వారు సిద్ధంగా ఉన్నారు. కాని - ఇంత ఒడుపుగా, మెరపు వేగంతో సైనిక దళాలను దూకించి, తన ఇలాకాలోని టెర్రరిస్టు అడ్డాలను బద్దలు కొట్టించి, తమకు దిమ్మతిరిగేట్టు అతడు చెయ్యగలడని వారు కలనైనా అనుకుని ఉండరు.
గీతకు అవతల ప్రాంతం పాక్ అధీనంలో ఉన్నా వాస్తవానికి అది కూడా మనదే. 1947లో పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ఆ భూమిమీద మనకు సర్వహక్కులూ ఉన్నాయి. ఆ సంగతి భారత పార్లమెంటు 1994లోనే ఏకగ్రీవ తీర్మానం ద్వారా లోకానికి నొక్కి చెప్పింది. కాబట్టి నిన్న భారత దళాలు చొచ్చుకు వెళ్లింది పాకిస్తాన్ భూభాగం మీదికి కాదు. ఐక్యరాజ్య సమితి పంచాయతీ ప్రకారం అది తన అధీనంలో ఉన్నది కాబట్టి, అందులో అడుగు పెట్టటం తమ మీద దురాక్రమణ అనీ పాకీలు అనలేరు. ఎందుకంటే భారత దళాలు దాడిచేసింది పాక్ సైన్యం మీద కాదు. భారత భద్రతకు ముప్పుగా తయారైన టెర్రరిస్టుల పుట్టలమీద! టెర్రరిస్టు చర్యలను నివారించేందుకు అవసరమైన చర్యలను తీసుకోవటం అన్ని రాజ్యాల బాధ్యత అని ఐక్యరాజ్యసమితి చార్టరు 8వ అధ్యాయం ఘోషిస్తున్నది. అధీనరేఖ అవతల పుట్టుకొచ్చిన ఉగ్రవాద పుట్టగొడుగులను పెకలించటం ద్వారా భారతదేశం ఆ అంతర్జాతీయ బాధ్యతనే నిర్వర్తించింది. అది తప్పు అనే దమ్ము పాకిస్తానీలకు లేదు.
అధీనరేఖ వెంబడి టెర్రరిస్టు శిబిరాలు లేవు; వాటికి తన వత్తాసూ లేదు అని ఇస్లామాబాద్ ఇప్పటిదాకా గొంతు చించుకున్నది. అదే ఇప్పుడు దాని గొంతులో వెలక్కాయ అయింది. తానే లేవని చెప్పిన ఉగ్రవాద శిబిరాలను భారత దళాలు ధ్వంసం చేశాయని, లేరని తాను పలికిన ఉగ్రవాదులను మట్టుపెట్టాయని ఒప్పుకుంటే దాని బండారమే బయటపడుతుంది. టెర్రరిస్టు కుంపట్లను ఆర్పే క్రమంలో పాక్ సైనికులు నలుగురు భారత చేతిలో హతమయ్యారని అంగీకరిస్తే ఆ కుంపట్లను రాజేసింది తానేనన్న గుట్టూ రట్టు అవుతుంది. పోనీ తన భూభాగాన్ని ఇండియా ఆక్రమించిందని గోల పెడదామా అనుకుంటే దానికీ సందు ఇవ్వకుండా భారత దళాలు లక్ష్యాన్ని ఛేదించిన వెంటనే మెరపు వేగంతో వెనక్కి మరలాయి. పాకిస్తాన్‌ని గాని, దాని మిలిటరీని గాని పల్లెత్తుమాట అనకపోవటమే కాదు. మానవాళికి శత్రువు అయిన ఉగ్రవాదాన్ని పీచమణచేందుకు కలిసి పని చేద్దామనీ భారత సైన్యాధికారి తెలివిగా సాదరహస్తం చాచాడు. ఇక ఏమీ చెయ్యలేకే, అల్లరి చేస్తే తానే అల్లరిపాలవుతానన్న భయంచేతే అసలు మెరపు దాడే జరగలేదని ఇస్లామాబాద్ పాచినోటితో పచ్చి అబద్ధమాడుతున్నది.
‘సర్జికల్ దాడి’ని సరిహద్దు ఘర్షణగా చిత్రించి పాక్ మిలిటరీ, దాని అదుపులోని ప్రధాని, పాకిస్తానీ పత్రికలు అసలు నిజాన్ని దాచేందుకు, భంగపాటుకు కప్పిపుచ్చేందుకు ఎన్ని ఆపసోపాలు పడితేనేమి? ఎంత ఆక్రోశం వెళ్లగక్కితేనేమి? సరిహద్దు పొడవునా పాక్ సేనలు, సైనిక విమానాలు ఎంత అప్రమత్తంగా ఉన్నా గీత అవతలికి చొచ్చుకువెళ్లి వీరోచితంగా పని పూర్తిచేయటం భారత సేన శౌర్యపరాక్రమాలకు కొండ గుర్తు. 1965, 1971 నాటి భారత సైనిక దిగ్విజయాలను గుర్తుకు తెచ్చే రీతిలో ఎవరూ ఆక్షేపించలేని విధంగా సైనిక చర్య జరిపించి తాను చేతల మనిషినని నిరూపించి, ప్రతీకారం కోసం రగిలిపోతున్న భారత ప్రజావళికి సాంత్వన చేకూర్చిన న.మో. నాయకత్వ దక్షతకు జేజేలు. సింహం కదిలాక నక్కల ఆటలు సాగవు.