సంపాదకీయం

స్వచ్ఛ విశ్వం కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో కుదిరిన అంతర్జాతీయ పరిసరాల పరిరక్షణ ఒప్పందాన్ని మన ప్రభుత్వం ధ్రువీకరించడం ప్రకృతి పట్ల మనకు కల మక్కువకు మరో నిదర్శనం. యుగయుగాలుగా భారతీయులు ‘పంచ భూత భాసితమైన ప్రకృతి కళ’ను కనిపించే దివ్య స్వరూపంగా భావించడం ఈ మక్కువకు చిహ్నం! అందువల్లనే 2020 నుంచి ఈ ఒప్పందం అమలుకు వలసిన చర్యలను తీసుకొనడానికి మన ప్రభుత్వం అంగీకరించింది. పరిసరాలను పాడు చేస్తున్న కాలుష్యపు పొగల శాతాన్ని క్రమంగా తగ్గించడం ద్వారా ప్రకృతికి చికిత్స చేయడం ‘పారిస్ ఒప్పందం’లోని ప్రధాన అంశం! ఈ కాలుష్యపు పొగల కారణంగా వాతావరణం వేడెక్కిపోతోంది, ఈ వేడిమి కారణంగా భూమి ఉపరితలంపై రెండు తీవ్రమైన వికృతులు సంభవిస్తున్నాయి. మొదటిది సముద్రాల నీరు వేడెక్కి సముద్రాల నీటి మట్టం పెరుగుతోంది. ఈ పెరుగుదల వల్ల అన్ని దేశాలలోని సముద్ర తీర ప్రాంతాలు శాశ్వతంగా ముంపునకు గురైపోయి కోట్లాది ప్రజలు నిర్వాసితులు అవుతారు.. సముద్రాలలో నెలకొని ఉన్న ద్వీపాలు, చిట్టిదేశాలు జలసమాధి అయిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఫలితంగా అసంఖ్యాక జాతుల మొక్కలు, జంతువులు కూడ నశించిపోయే ముప్పు ముంచుకొని వస్తోంది. ఇప్పటికే కాలుష్యం కాటుపడిన సముద్ర చరాలు కుప్పలు తెప్పలుగా మరణించి తీర ప్రాంతాలకు మృత కళేబరాల రూపంలో కొట్టుకొని వస్తున్నాయి. మన దేశపు తీరాలలోనే తరచు వందలాది సముద్రపు తాబేళ్లు మాత్రమే కాక, భారీ కాయాలున్న తిమింగలాలు సైతం కాలుష్య మరణం పొందుతుండడం నిన్న, నేడు ఆవిష్కృతమైన విషాద దృశ్యాలు.. రెండో వైపరీత్యం భూమి ఉపరితలంపై ప్రవహిస్తున్న నదుల నీరు, పర్వతాలను ఆవరించి ఉన్న మంచు కాలుష్యగ్రస్తం అవుతుండడం! పరిశ్రమలు వెళ్లగక్కుతున్న కాలుష్యాలు-ఇండస్ట్రియల్ ఎమిషన్స్-నదులలోకి నిర్నిరోధంగా ప్రవహిస్తోంది, నదుల నీరు తాగడానికి, స్నానం చేయడానికి, వ్యవసాయానికి పనికిరాని దుస్థితి దాపురించి ఉంది. నదుల నీటిని ముట్టుకుంటేనే కాలుష్యం కాటు వేస్తుందన్న భయం ప్రజలను పీడిస్తున్నది.. భూగర్భ జలాలు మురికి నీరుగా మారిపోయి దుర్గంధ దూషితమై గొట్టపు బావుల ద్వారా బయటపడుతోంది! పర్వతాలలోను, సముద్ర ఉపరితలం మీద నిక్షిప్తమై ఉన్న సువిశాలమైన ‘హిమశకలాలు’-్భరీ మంచు ముక్కలు-క్రమంగా కరిగిపోయి రాళ్లు బయటపడుతున్నాయి. మన దేశానికి మకుటాయమైన హిమాలయ పర్వత శ్రేణిలోనే ఇప్పటికే పదమూడు శాతం హిమశకలాలు కరిగిపోయి అంతరించిపోయాయి! హిమాలయం ‘శిలాలమయం’-రాళ్లగుట్టలకు ఆలవాలంగా మారిపోనున్నదన్న శాస్తవ్రేత్తల హెచ్చరికలు వినబడుతునే ఉన్నాయి! పారిస్‌లో 2015 డిసెంబర్ 12న కుదిరిన పర్యావరణ పరిరక్షణ ఒప్పందానికి ఇదీ నేపథ్యం..
పారిశ్రామిక కాలుష్యపు పొగలు ధరాతలాన్ని దిగమింగుతుండడానికి కారణం సంపన్న దేశాల క్రూరమైన పర్యావరణ హనన స్వభావం. పదిహేను, ఇరవై సంపన్న దేశాలు ప్రపంచాన్ని ఊపిరి ఆడని స్థితికి గురి చేస్తున్న కాలుష్యంలో డెబ్బయి ఐదు శాతానికి పైగా పంచిపెడుతున్నాయి. అందువల్ల ఈ సంపన్న దేశాలు మొదట తమ కాలుష్యపు పొగలను తగ్గించి వేయాలన్నది మనదేశం సహా ప్రవర్ధమాన దేశాలు విధించిన నిబంధన. ఈ నిబంధన కారణంగానే పారిస్ సదస్సుకు పూర్వం అనేక వారాలపాటు ఒప్పందంపై సందిగ్ధ స్థితి ఏర్పడిపోయింది. ప్రపంచ కాలుష్య నివారణ కోసం, ఉన్న కాలుష్యాన్ని తొలగించడం కోసం ఏర్పాటు చేసే ‘ఆర్థిక నిధి’పై కూడ సంపన్నదేశాల మధ్య సామాన్య దేశాల మధ్య అనేక రోజులపాటు అనిశ్చిత స్థితి ఏర్పడిపోయింది. సంపన్న దేశాల కాలుష్య పాపానికి సామాన్య దేశాల ప్రజలు బలి అవుతుండడం అంతర్జాతీయ భయంకర వికృతి. సంపన్న దేశాల వారు పారిశ్రామిక విష రసాయన వ్యర్థ పదార్ధాలను పాతబడిన పనికిరాని ఓడలలో నింపి ఆ ఓడలను తరలించుకుని వచ్చి సంపన్న దేశాల సమీప సముద్ర జలాలలో ముంచేసి పోవడం దశాబ్దుల వైపరీత్యం. తమ దేశాలకు సమీపంలోని సముద్ర జలాలు మాత్రం స్వచ్ఛంగా ఉండాలన్నది ఐరోపా, అమెరికా, చైనా వంటి దేశాల భయంకర బీభత్స మనస్తత్వం. ఐరోపా దేశాల ఇలాంటి ప్రయత్నాన్ని మన ప్రభుత్వం కొన్నిసార్లు అడ్డుకోగలిగింది! కానీ మన దేశ సమీపస్థ జలాలలోను ఇతర ప్రవర్ధమాన దేశాలకు చేరువలోని సముద్రాలలోను రహస్యంగా ఎన్నిసార్లు ఈ కాలుష్య నౌకలు మునిగిపోయాయన్నది అంతుపట్టని వ్యవహారం!
చైనా అతిపెద్ద కాలుష్య కారక దేశాలలో ఒకటి. 1959 వరకు క్రమంగా టిబెట్ దేశపు స్వతంత్రాన్ని హరించిన చైనా ఆ తరువాత తమ దేశంలో బలవంతంగా కలుపుకున్న టిబెట్‌ను విచ్చలవిడిగా కొల్లగొట్టింది, భూమిని తవ్వేసింది, అపురూప భూగర్భ ఖనిజ ధాతువుల-రేర్ ఎర్త్ ఎలిమెంట్స్-కోసం కన్నాలు పెట్టేసింది. నదులను, నీటి వాగులను దారి మళ్లించింది! ఇంధన వాయువును కొల్లగొట్టింది. ఫలితంగా యాబయి ఏళ్లలో మన హిమాలయ పర్వతాలలోని మంచు శకలాలలో పదమూడు శాతం కరిగిపోయాయి. మిగిలిన ఎనబయి ఏడు శాతం మంచు గడ్డలనైనా పరిరక్షించుకోవాలన్నది మన ప్రభుత్వ లక్ష్యం. ఇలా పర్యావరణ పటుత్వానికి రంధ్రాలు పెట్టిన కాలుష్య సంపన్న దేశాలు అరవై ఐదు వేల కోట్ల రూపాయలు వర్ధమాన దేశాలకు చెల్లించాలని మన దేశం కోరింది. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు పదమూడు వందల కోట్ల రూపాయలను మాత్రమే సంపన్న దేశాలు విదిల్చాయి. ఈ నేపథ్యంలో నిజానికి మన దేశం 2020 వరకు పారిస్ ఒప్పందాన్ని ధ్రువీకరించవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాలుష్య నిరోధక చర్యలను మన దేశం 2020 నుంచి ప్రారంభించే వెసులుబాటు ఉంది. సంపన్న దేశాలు ఈ ఏడాదినుంచి నాలుగేళ్ల పాటు కాలుష్యాన్ని ఏ మేరకు తగ్గించగలవన్నది వర్ధమాన దేశాలు ఒప్పందాన్ని ధ్రువీకరించడానికి ప్రాతిపదిక! అందువల్ల మన దేశం కూడ ఇతర వర్ధమాన దేశాలతో కలిసి 2020 వరకు వేచి ఉండవచ్చు! అయినప్పటికీ మన ప్రభుత్వం సంపన్న దేశాల సత్ ప్రవర్తన కోసం వేచి ఉండకుండా ఇప్పుడే ఒప్పందాన్ని ధ్రువీకరించడం ప్రపంచ సమష్టి స్వచ్ఛత పట్ల మనకున్న చారిత్రక ధ్యాసకు నిదర్శనం...
ఈ ధ్యాస వేద ద్రష్టలు పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, నేలను గురించి ఆవిష్కరించిన ప్రార్ధనలలో నిబిడీకృతమై ఉంది! పుట్టను, చెట్టును, చెరువు గట్టును, కొండ గుట్టనూ పూజించే భారతీయుల ప్రవృత్తిలో నిహితమై ఉంది. మహాత్మాగాంధీ నాయకత్వంలో బ్రిటిష్ వారి కాలుష్య విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రస్ఫుటించింది. అందువల్లనే మహాత్మాగాంధీ జయన్తి రోజున ‘పారిస్ ఒప్పందం’ ధ్రువీకరణ పత్రాన్ని మన ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి సమర్పించడం ఔచిత్యవంతమైన పరిణామం! 2005 నాటి స్థాయి ప్రాతిపదికగా 2030 నాటికి కాలుష్యం పొగలను ముప్పయి శాతం తగ్గించాలన్నది మన లక్ష్యం. ‘స్వచ్ఛ్భారత్’ పరిశుభ్ర ప్రపంచాన్ని కోరుతోంది!