సంపాదకీయం

‘సింగపూరు’కు శృంగభంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి ప్రాంగణంలో పరిపాలన నగర నిర్మాణానికి నవంబర్ ఒకటవ తేదీన శ్రీకారం చుట్టాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం నూతన రాజధాని అవతరణ క్రమంలో మరో శుభంకర ఘట్టం. రాజధాని నిర్మాణం కోసం ఆర్భాటంగా రూపొందిన ‘స్విస్ ఛాలెంజ్’ వాణిజ్య పథకాన్ని ఉపసంహరించినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలియజేయడం అక్టోబర్ 26వ తేదీన సంభవించిన సమాంతార పరిణామం! అందువల్ల ‘పరిపాలన నగర’ నిర్మాణ కార్యక్రమాన్ని ఎలా అమలు జరుపనున్నారన్నది ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను కుతూహగ్రస్తులను చేస్తున్న మరో పరిణామం! మొత్తం రాజధాని ప్రాంగణాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యతను సింగపూర్ దేశానికి చెందిన సింగపూర్ వాణిజ్య మండలి-సింగపూర్ కన్సార్టియమ్-అన్న బృహత్ సంస్థకు అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత జూన్‌లో అప్పగించింది! వౌలిక రాజధాని నగర-సీడ్ కాపిటల్ నిర్మాణానికి,అభివృద్ధికి వీలుగా సింగపూర్‌కు చెందిన అసాండాస్ సింగ్ బ్రిడ్జ్, సెంబ్ కార్ప్‌డెవలప్‌మెంట్ లిమిటెడ్ అన్న విచిత్ర నామధేయాలు కల సంస్థల సమాఖ్య సమర్పించిన ప్రతిపాదనను గత జూన్‌లో రాష్ట్ర ప్ర భుత్వం ఆమోదించడంతో ఆర్భాటం మొదలైంది! ఈ మొత్తం పథకం స్వరూప స్వభావాలు కాని, అమలు జరిగే తీరుకాని జనానికి అర్థం కాకపోవడం ఆర్భాటంలోని ప్రధాన ఇతివృత్తం! అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం అంటే మాటలు చెప్పటం కాదు, అందరికీ అర్థమయినట్టయితే అది అంతర్జాతీయ స్థాయికి అవమానం. అందువల్ల అర్థం కాని జనం అనుమనాలను ప్రకటించలేదు. అర్థమైన కొన్ని ఇతర వాణిజ్య సంస్థలు మాత్రం ఇలా ఏకపక్షంగా ఒక విదేశీయ వాణిజ్య సమాఖ్యకు ఇంతటి బృహత్ నిర్మాణ బాధ్యతను అప్పగించడం పట్ల అభ్యంతరాలను తెలిపాయి. హైకోర్టులో వివాదాన్ని దాఖలు చేశాయి. ఈ విజ్ఞాపన ప్రాతిపదికగా సెప్టెంబర్ 12న హైదరాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎమ్‌ఎస్ రామచంద్రరావు ఈ వాణిజ్య పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసారు.. నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాన్ని హైకోర్టు ధర్మాసనానికి నివేదించింది! వివాదాన్ని విచారిస్తున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి యు.దుర్గాప్రసాదరావు తీర్పు చెప్పకపూర్వమే ఈ స్విస్ ఛాలెంజ్ పథకాన్ని విరమించుకుంటున్నట్టు బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించడం వికసించిన విజ్ఞతకు నిదర్శనం! కానీ, సింగపూర్ ఘరానా వాణిజ్య సమాఖ్య రాజధానిని నిర్మించే ప్రతిపాదన రద్దు కావడంతో రాజధాని ప్రాంగణంలోని పరిపాలన నగరాన్ని ఎవరు నిర్మిస్తారన్నది సహజంగా స్ఫురిస్తున్న సందేహం..
ఈ ‘స్విస్ ఛాలెంజ్’ అన్నది మరో విచిత్రమైన పదజాలం! అమరావతి నిర్మాణంలో నెలకొన్న అయోమయంలో ఇది భాగం! నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించవలసిన ప్రభుత్వేతర సంస్థలను ఎంపిక చేసే సాధారణ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలులో ఉంది! ఈ జాతీయ ప్రక్రియలో భాగంగా ప్రతిపాదన-టెండర్‌లను సమర్పించవలసిందిగా ప్రభుత్వేతర సంస్థలను కేంద్ర,రాష్ట్రాల ప్రభుత్వాలు కోరుతున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రజలకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చడంలో పథకాలను అమలు జరపగల, నిర్మించగల, నిర్వహించగల ప్రభుత్వేతర సంస్థలకు ఆయా పథకాలను ఆయా ప్రభుత్వాలు అప్పజెపుతున్నాయి. కానీ ఈ జాతీయ ‘ప్రక్రియ’కు భిన్నంగా అంతర్జాతీయ ‘విక్రియ’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంకురార్పణం చేయడం అమరావతి ప్రాభవానికి దాపురించిన అపశ్రుతి! ఈ అంతర్జాతీయ ‘విక్రియ’లో భాగంగా మొదట సింగపూర్ కన్సార్టియమ్‌ను ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎంపిక చేసారు! ఈ సింగపూర్ కన్సార్షియం వారి కంటె తక్కువ వ్యయంతో, మెరుగైన రీతిలో సీడ్ కాపిటల్‌ను నిర్మించగల సంస్థలున్నట్టయితే ముందుకు రావాలని అంతర్జాతీయంగా ప్రకటించారు. ఇదన్నమాట ‘స్విస్ ఛాలెంజ్’! ఇది ప్రభుత్వానికి పరీక్షా? లేక అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు పరీక్షా? ఎవరిని ఎవరు ఛాలెంజ్ చేయాలి? పైగా ఇలా సింగపూర్ సంస్థతో పోటీ పడే ప్రక్రియకు ‘స్విస్ ఛాలెంజ్’ అన్న పేరెందుకు పుట్టుకొచ్చింది. ‘స్విస్’ అంటే స్విట్జర్లాండు దేశమా? లేక మరో నిగూఢార్థం ఏమైనా ఉందా? ఇవేవీ తేలలేదు! రాజధాని నిర్మాణం అడుగడుగునా అంతరాలను ఎదుర్కొనడం మాత్రమే జనానికి తెలిసిన సమాచారం!
రాజధాని నిర్మాణం జమా ఖర్చులకు సంబంధించిన కేవల వాణిజ్య ప్రక్రియ కాదు! రాజధాని నిర్మాణం చారిత్రక భౌగోళిక రాజనైతిక సామాజిక సాంస్కృతిక మహా పరిణామం! అంతర్జాతీయ స్థాయి ఆర్భాటం పేరుతో పాలకులు ఈ చారిత్రక సాంస్కృతిక జాతీయతా నిష్ఠను నీరుకార్చడం అమరావతి ప్రస్థానాన్ని నిలదీస్తున్న విషాదం! దేశంలోని సంస్థలను, వ్యవస్థలను కించపరిచే రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాహకులు రాజధాని నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.. విదేశీయ సంస్థలకు వాటి నైపుణ్య, పాటవ, ప్రతిభ, చోరకళా గరిమలను ఘనతకు సంకీర్తన చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వాహకులు సరిపెట్టుకోలేదు! స్వదేశీయ సంస్థలను, స్వదేశీయ పరిజ్ఞానాన్ని అపహాస్యం చేసారు, అవమానించారు! సింగపూర్ నిజానికి ఒక ప్రత్యేక జాతి కాదు. ప్రత్యేక దేశం కాదు. ప్రత్యేక సంస్కృతికి, నాగరికతకు ప్రతీక కాదు. మలయా ద్వీపకల్పంలో శతాబ్దులుగా భాగం. పాశ్చాత్య దేశాల, చైనా వంటి ప్రాచ్య దేశాల వాణిజ్య సామ్రాజ్య వాద విస్తృతిలో భాగంగా మాత్రమే సింగపూర్ నగరం ఒక స్వతంత్ర దేశంగా అవతరించింది! వాస్తవంగా సింగపూర్ ప్రపంచ దేశాల సంత.. వాణిజ్యపు వాటాలు, దళారీ వ్యాపారం ప్రాతిపదికగా సింగపూర్ ఆర్థిక వ్యవస్థ రూపొందింది! ‘కుంజర యూధమ్ము దోమకుత్తుక చొచ్చిన’ రీతిలో ఇంత పెద్ద భారతదేశం సింగపూర్ ఎదుట వాణిజ్య సాష్టాంగ వందన ప్రదర్శన చేయడం విచిత్రమైన వ్యవహారం. సింగపూర్ సంస్థల ప్రమాణాలకు దీటుగా నిర్మాణాలు చేయగల సంస్థలు మన దేశంలో లేనే లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిశోధించి నిగ్గుతేల్చిన అంతర్జాతీయ రహస్యం.. మన సంస్థలు చేస్తున్న నిర్మాణాలు మురికివాడలకంటె గొప్పగా లేవు.. అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాక్రుచ్చినట్టు గత జూన్‌లో ప్రచారమైంది! ఇంతటి ఆర్భాటంతో మొదలుపెట్టిన ‘స్విస్ ఛాలెంజ్’ విధానాన్ని ఇప్పుడు రద్దు చేసుకొనడం ‘అయ్యవారు ఏం చేస్తున్నారంటే అబద్ధాలు వ్రాసి, దిద్దుకుంటున్నారు..’ అన్న సామెతకు మరో ఉదాహరణ...
ఈ పరిణామాల ఫలితం రాజధాని నిర్మాణంలో జాప్యం.. నవంబర్ ఒకటవ తేదీన ప్రభుత్వమే స్వయంగా నిర్మాణ కార్యక్రమం మొదలుపెడుతుందా? ఎందుకంటె కొత్తగా టెండర్లను పిలవడం, ఆమోదించడం ఈలోగా సాధ్యమయ్యే పనికాదు! అమరావతి నిర్మాణం ప్రజల భాగస్వామ్యంతో కొనసాగుతోందన్న ప్రచారం జరిగింది! ఒక్కొక్కరు ఒక ఇటుకను సమర్పించే కార్యక్రమం కూడా విజయవంతమైంది! ప్రధానమంత్రి సైతం ఇటుకను సమర్పించాడు! కానీ, విదేశీయ సంస్థలు మాత్రమే రాజధానిని నిర్మించాలని కోరుకోవడం ఈ స్ఫూర్తికి విఘాతకరం కాదా??