మెయన్ ఫీచర్

ప్రాభవం తగ్గుతున్న జాతీయ పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీలు కొన్ని సిద్ధాంతాలతో అవతరిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం తీసుకొని రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టింది. వచ్చిన స్వాతంత్య్ర ఫలాలను అనుభవించడం కోసం మనుగడ సాగించింది. అవినీతి పుట్టలు పెరిగిపోవడంతో అధికారం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇలా అంటున్నారు. ‘‘కామ్రేడ్లతో..కేరళలో కుస్తీ, బెంగాల్‌లో దోస్తీ!’’ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఊపునందుకోవడంతో పాటు, జాతీయ పార్టీలు తృతీయ స్థానం లో ఉండటం దేశ భవిష్యత్తుకు అశుభ సూచన.

బెంగాల్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ ఏడాది మే నెలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భవిష్యత్తు ప్రశార్థకమైన నేటి పరిస్థితిలో కేరళలోతిరిగి అధికారంలోకి వస్తుందా అనేది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ఇక్కడ నిలదొక్కుకోవడానికి భాజపా విశ్వప్రయ త్నం చేస్తున్నది. ఇక్కడ భాజపాను దెబ్బతీయడానికి అధికార కాంగ్రెస్ కూటమి, విపక్ష ఎల్‌డిఎఫ్‌ల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం భాజ పా బలంగా ఉన్న నియోజకవర్గాల్లో తమ ఇద్దరిలో ఎవరికి అవకాశముంటే వారికి రెండో కూటమివారు అంతర్గతంగా మద్దతునివ్వాలి. వీరి లక్ష్యం ఒక్కటే భాజపాకు అసలు స్థానం దక్కనీయకూడదు! ప్రస్తు తం కేరళలో కమ్యూనిస్టుల ప్రాబల్యం నల్లేరు మీద బండిలా సాగడం లేదు. పినరాయ్ నియోజకవర్గంలో ఎల్‌డిఎఫ్‌కు చెందిన విజయన్ వర్గం-అచ్యుతానందన్ వర్గాలు సుందోపసుందులవలె సంఘర్షించుకుంటున్నాయి. విజయన్‌కు ‘బాహుబలి’ అనే పేరుంది. హత్యారాజకీయాలకు పెట్టింది పేరు. ఏచూరి సీతారాం వంటి వారు విజయన్‌కే మద్దతివ్వడం గమనార్హం. ఇక అచ్యుతానందన్‌కు ప్రజల్లో మంచిపేరుంది. నంబూద్రిపాద్ తరానికి చెందిన నిజాయతీ గల నాయకుడు. అయితే అచ్యుతానందన్‌కు ఇప్పుడు 93 ఏళ్లు. ఈ వయసులో రాష్ట్ర రాజకీయాలు నిర్వహించడం కష్టం. ఈయన వెనుకబడిన దర్జీల కుటుం బం నుంచి వచ్చినవాడు. అయితే విజయన్ దుందుడుకు రాజకీయాలకు అచ్యుతానందన్ విలవిలలాడుతున్నాడు.
మిగిలిన రాష్ట్రాలతో పోల్చినప్పుడు కేరళలో 2015లో జరిగిన రైతుల ఆత్మహత్య లు నామమాత్రమే. అధికారికంగా ఒకటి రెండు కన్నా ఎక్కువ లేవు. కాకపోతే రాజకీయ కక్షలతో జరిగిన హత్యలు మాత్రం గణనీయంగానే ఉన్నాయి. ముఖ్యంగా కన్నూరు, త్రిశూర్ వంటి ప్రాంతాల్లో హిందూ సామాజిక కార్యకర్తలపై సిపిఎం కార్యకర్తలు హత్యా రాజకీయాకు దిగడం, వీరిపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెట్టడం మామూలే. ఇవి కాలక్రమంలో నీరుగారిపోతాయి. తగిన సాక్ష్యాలు లేవంటూ కొట్టి పారేస్తారు.
పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, ‘నేడు బెంగాల్ ఎలా ఆలోచిస్తే..రేపు భారత్ అట్లా ఆలోచిస్తుంది’ అనేది నిన్నటి మాట గా మిగిలిపోయింది. వివేకానంద, అరవిందులు, శ్యాంప్రసాద్ ముఖర్జీ, సత్యజిత్ రాయ్ వంటి మహామహులను కన్న భూమి ఇది. కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వా త పశ్చిమ బెంగాల్ వామపక్షాల హస్తగతమైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అప్రతిహతంగా వీరు బెంగాల్‌ను పాలించారు. నాయకుల్లో అవినీతి పెరిగిపోయి, విలాసాలకు అలవాటుపడి పార్టీ ప్రతిష్ట మసకబారిన స్థితిలో మమతా బెనర్జీ క మ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టిం ది. ఆమెకు తన నిరాడంబర జీవితమే ప్లస్ పాయింట్. కానీ ఇటీవల పెచ్చరిల్లిన హత్యా రాజకీయాలు, శారదా స్కాం, మాల్డా ఉదంతం, ఈ మధ్యనే స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుబడిన ఆమె పార్టీకి చెందిన నాయకుల ఉదంతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అయినప్పటికీ ఇటీవల జరిపిన సర్వేలో తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 294 స్థానాల్లో 200 సీట్లను గెలుచుకుంటుందని తేలింది. ఇక కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కలిపి 60 సీట్లు దక్కే అవకాశమున్నదని కూడా సర్వే తేల్చింది. మమతమ్మను ఓడించడం కోసం బెంగాల్‌లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వారు కలిసి పోటీ చేస్తున్నారు. మరి అదే కేరళలో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నారు. ఇక ఇందులో సైద్ధాంతిక నిబద్ధత ఏముంది? విచిత్రమేమంటే, తృణమూల్ ప్రభుత్వంపై ఇన్ని రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ మమతమ్మ ప్రాభవానికి ఢోకాలేకపోవడమే ఆశ్చర్యం కలిగించే అంశం. ఇక ఇక్కడ భాజపా ఇంకా బలపడలేదు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భాజపాకు రెండంకెల సీట్లు కూడా వచ్చేఅవకాశం కనిపించడం లేదు.
తమిళనాడులో జయలలితకు తిరుగులేని పరిస్థితి కొనసాగుతోంది. ‘డిఫెక్షన్’లతో విజయకాంత్‌ను చిత్తు చేసింది. ‘లింగ’ సినిమా కేసు కత్తిలా రజనీకాంత్‌పై వేలాడుతోంది. కరుణానిధి బాగా వృద్ధుడైపోయాడు. ఆయన కుమారులు స్టాలిన్, అళగిరిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దయానిధిమారన్, పళనియప్పన్ చిదంబరంలు ఏక్షణంలోనైనా అరెస్టు కావ చ్చు. ఇటీవల జరిపిన సర్వేలో జయలలితకే విజయావకాశాలున్నాయని తేలింది. ఇక కాంగ్రెస్‌కు ఇక్కడ భవిష్యత్తు లేదు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పుట్టిన విధంగానే, ద్రవిడ సంస్కృతి నినాదంతో తమిళనాడులో డిఎంకె పుట్టిం ది. అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే ఆర్థిక వనరు అందుబాటులో ఉండటంతో భోక్తల సంఖ్య ఎక్కువైంది. కరుణానిధి, కనుమొజి, స్టాలిన్, దయానిధి మారన్, పళనియప్పన్ కార్తి, జయలలిత ఇలా తమిళ రాజకీయాలన్నీ జైళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. కేంద్రంలో భాజపా అధికారంలో ఉండటం ఆ పార్టీలకు ఇప్పుడు కంటగింపుగా ఉంది. అందుకు తగినట్లుగానే నరేం ద్ర మోదీ అవినీతిపై ఉక్కుపాదం మోపుతాడని ఆశించిన వారికి ఆయన త్రివిక్రమత్వం ఇంకా కన్పించడం లేదు.
తమిళనాడులో నెలకొన్న మరో దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే తవ్వినకొద్దీ అవినీతి బాగోతాలు బయటపడుతుం డటం. ఇవి డిఎంకె- కాంగ్రెస్ పార్టీలకు తలనొప్పిగా మారాయి. ఇక పళనియప్పన్ చిదంబరం కుమారుడే కార్తి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఎయిర్‌సెల్-మాక్సిస్ బాగోతాన్ని దర్యాప్తు చేస్తుండగా, వేరే రహస్య పత్రాలు లభించాయి. అందులో కార్తి లండన్ వర్జిన్ ద్వీపాలు, దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, సింగపూర్, స్పెయిన్, గ్రీసు, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్,దుబాయి, మలేసియా వంటి ఎనె్న న్నో దేశాల్లో భారీ పెట్టుబడులు పెట్టాడు. ఎడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ కంపెనీ పేరుతో ఈ లావాదేవీలు, మనీ లాండరింగ్‌లు జరిగాయి. ఈ అక్రమ ధనాన్ని మొ త్తం 28 దేశాల్లోని 436 కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. ఇందులో చిదంబరంతోపాటు, ఇద్దరు డిఎంకె మంత్రుల ప్రమేయం కూడా ఉంది. రాజస్థాన్‌కు చెందిన అంబులెన్స్ కుంభకోణం ఇందులో భాగమే.
ఈ మొత్తం అవినీతి బాగోతానికి సంబంధించిన సమాచారాన్ని ఈడీ అధికార్లు సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్‌లో అందించారు. ఇప్పుడు పళనియప్పన్ పై సిబిఐ ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. మరి చిదంబరం ఈ కేసులనుంచి తప్పించుకోవాలంటే, భాజపాకు వ్యతిరేకంగా ఎవరితోనైనా సరే చేతులు కలిపి, ఎన్నికల్లో పోరాడి పదవిని దక్కించుకోవాలి. అందుకే బిహారులో లాలూ ప్రసాద్‌తో, బెంగాల్‌లో కమ్యూనిస్టులతో, కాంగ్రెస్ జట్టు కట్టింది. తమిళనాడులో జయలలితను ఓడించాలాని సోనియా, చిదంబరం గ్రూప్ భావిస్తున్నారు. జయలలితమీద అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. వాటి నుంచి ఆమె అనూహ్యంగా బయటపడింది. మరి ఇప్పుడు చిదంబరం-కార్తీలు అలాగే బయటపడతారా?
జగన్ భుజ్‌బల్ మహారాష్టల్రోని ప్రము ఖ రాజకీయ నాయకుడు. కొద్ది రోజుల క్రితం ఆర్థిక అవినీతి ఆరోపణలతో అరెస్ట్ చేయబడ్డాడు. బెంగాల్‌లో టిఎంసి అవినీతి ఆరోపణల వీడియో విడుదలైంది. ఇది ఎన్నికల స్టంట్ అంటూ తృణమూల్ కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ధరించే రిస్ట్ వాచ్ ఖరీదు ఏకంగా రూ.75 లక్షలు! మొ న్న బిహార్‌లో ఎంఎల్‌ఏలకు రూ.70 లక్షల విలువైన గిఫ్ట్‌లను రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టింది. అక్కడ నాలుగు నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేని స్థితి! ఇదంతా దేన్ని సూచిస్తుంది? మోదీకి గిఫ్ట్‌లు ఇవ్వడం లేదా?మేము తీసుకుంటే త ప్పేంటి? అని ఆర్‌జెడి నాయకులు ఎదురుదాడికి దిగారు. మోదీ తనకు వచ్చిన ప్రెజెంటేషన్లను అక్కడే వేలం వేసి వచ్చిన డబ్బు ను ఆయా సంస్థలకు ఇవ్వడం గమనార్హం. విజయ్‌మాల్యా, లలిత్‌మోదీలు దేశ సంపదను దోచుకొని విదేశాల్లో దాక్కున్నమాట నిజమే. కాని దేశంలో ఇంకా కనీసం ఓ వందమంది విజయ్‌మాల్యాలు ఉన్నారు. మరో వందమంది దావూద్ ఇబ్రహీంలు ఉన్నారు. వీరందరి సంగతి ఏమిటి? ఆర్థిక నేరస్థులకు పద్మ పురస్కారాలు ఇవ్వడమేంటి? కింగ్‌ఫిషర్ ఉద్యోగులు తిండిలేక రోడ్డున పడితే విజయ్‌మాల్యా లండన్ స మీపంలోని 30 ఎకరాలలోని విశాల మందిరాలలో భారత బ్యాంకుల సొమ్ముతో విలా స జీవితం గడుపుతున్నాడు. భారత మాజీ ప్రధాని దేవెగౌడ మాట్లాడుతూ, ‘‘మా విజయ్ మాల్యా బుద్ధిమంతుడు’ అని సర్ట్ఫికెట్ ఇవ్వడం ఈ ఉదంతానికి కొసమెరుపు. పాండిచ్చేరి చిన్న రాష్ట్రం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఇది దేశ రాజకీయాలపై ఏమాత్రం ప్రభావం చూప దు. అస్సాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ఏటికి ఎదురీదుతున్నారు. అక్కడ అస్సాం గణసంగ్రామ పరిషత్‌తో, భాజపా పొత్తు పెట్టుకున్నది. ఈ కూటమి ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.
పార్టీలు కొన్ని సిద్ధాంతాలతో అవతరిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం తీసుకొని రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టింది. వచ్చిన స్వాతంత్య్ర ఫలాలను అనుభవించడం కోసం మనుగడ సాగించింది. అవినీతి పుట్టలు పెరిగిపోవడంతో అధికారం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇలా అంటున్నారు. ‘‘కామ్రేడ్లతో..కేరళలో కుస్తీ, బెంగాల్‌లో దోస్తీ!’’ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఊపునందుకోవడంతో పాటు, జాతీయ పార్టీలు తృతీయ స్థానం లో ఉండటం దేశ భవిష్యత్తుకు అశుభ సూ చన.

- ముదిగొండ శివప్రసాద్