సంపాదకీయం

‘హరిత’ విలాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటవీ పరిరక్షణకు సంబంధించిన నూతన విధానాన్ని రూపొందించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిరవధికంగా వాయిదా వేయడం విచిత్రమైన వ్యవహారం. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిజంగా వాయిదా వేసిందా? లేక ఉత్కంఠను సృష్టించడానికి మాధ్యమాలలో ఇలాంటి ప్రచారం జరుపుతోందా? అన్న మీమాంసకు తావులేదు. గతంలో ప్రభుత్వ విధానం ముసాయిదా పత్రం ఒకటి సామాజిక మాధ్యమాలలో ప్రచారమైంది. కానీ అది విధాన పత్రం కాదని వెంటనే ప్రభుత్వం స్పష్టీకరించింది. కానీ ఇప్పుడు ఈ అటవీ పరిరక్షణ నూతన విధాన కార్యక్రమం వాయిదా పడినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అందువల్ల దేశం మొత్తం భూభాగంలోని మూడవ వంతు స్థలంలో అడవులను పెంచే కార్యక్రమం మళ్లీ ఎండమావిలోని నీరు కానుంది. కొత్త విధానాన్ని రూపొందించడానికి కాలవ్యవధిని నిర్ధారించలేదని, ప్రస్తుతానికి ఎలాంటి ముసాయిదా పత్రం సిద్ధంగా లేదని నవంబర్ నాలుగవ తేదీన లోక్‌సభకు పరిసరాలు, అడవులు, పర్యావరణ పరివర్తన శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే నివేదించడం ఈ నిర్ధారణకు ప్రాతిపదిక! దేశంలోని కనీసం మూ డవ వంతు భూభాగంలో అడవులను పెంచాలన్నది జాతీయ లక్ష్యమని అ యితే ఈ లక్ష్యసాధనకు ఎలాంటి ‘కాలచట్రం’- టైమ్ ఫ్రేమ్- లేదని మంత్రి చెప్పుకొచ్చారు. అందువల్ల 1988లో రూపొందించిన అటవీ విధానం నిరవధికంగా కొనసాగనున్నదని ప్రభుత్వం చేసిన స్పష్టీకరణ! నూతన విధాన రూపకల్పన చేసే గురుతర బాధ్యతను ప్రభుత్వం భోపాల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘్భరతీయ అటవీ పరిరక్షణ నిర్వహణ వ్యవహారాల సంస్థ’- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజిమెంట్- ఐఐఎఫ్‌ఎం- వారికి అప్పగించిందట. ఈ సంస్థవారు గత జూన్‌లో ముసాయిదా విధాన పత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం ఎందుకని ఈ ముసాయిదాను అధ్యయనం చేసి నిర్ణయించ లేదన్నది అంతుపట్టని వ్యవహారం. ‘ప్రపంచీకరణ’ పరిధి నుంచి బయట పడడానికి కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు బిడియపడుతున్నట్టు ఈ ‘క్రియాశూన్యత’ వల్ల స్పష్టమవుతోంది. పర్యావరణ పరిరక్షణకు ప్రధాన శత్రువు ‘ప్రపంచీకరణ’! 2004- 2014 సంవత్సరాల మధ్య ప్రత్యేక ఆర్థిక మండలుల ఏర్పాటు పేరుతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల ఎకరాల అడవులను, వ్యవసాయ క్షేత్రాలను ధ్వంసం చేయించింది. అందువల్ల 2014మే 26 నుంచి పాలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం హరిత నియమాలను పటిష్టం చేసి అడవులను పరిరక్షించగలదన్న ఆశాభావం ఏర్పడింది. గత జూన్‌లో వెలువడిన ‘ముసాయిదా’ ఈ ఆశాభావానికి ప్రాతిపదిక.
కానీ, నూతన విధానాన్ని రూపొందించడానికి వెనుకంజ వేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం కూడా 1988 నాటి విధానాన్ని కొనసాగించాలని భావిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీయ సంస్థల చొరబాటుకు ఆర్థిక వ్యవస్థ తలుపులను మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం బార్లా తెరచిపోయింది. విదేశీయ ప్రత్యక్ష నిధుల- ఫారిన్ డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ- వ్యామోహ వలయంలో గత ప్రభుత్వం వలే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇరుక్కుని ఉంది. అందువల్ల అటవీ పరిరక్షణ నియమాలను జటిలం చేయరాదన్న మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వ విధానమే ఇప్పుడు నడుస్తోంది. లక్షల ఎకరాల అడవులను, వ్యవసాయ క్షేత్రాలను నిర్మూలించి పారిశ్రామిక వాటికలను, సిమెంటు కట్టడాల కాలుష్య కేంద్రాలను, ప్రత్యేక ఆర్థిక మండలులను ఏర్పాటు చేయడమే మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం అమలు జరిపిన విధానం. ఫలితంగా ఒడిశాలోని నియాంగిరి అడవులు, కేరళ-కర్నాటకలోని పడమటి కనుమలు, తెలుగురాష్ట్రాలలోని నల్లమల, భద్రాచలం ప్రాంత అడవులు, మహారాష్టల్రోని సహ్యాద్రి పర్వత శ్రేణులు పాడుపడిపోవడానికి రంగం సిద్ధమైంది! వన్య మృగాల ప్రాణాలకు, వనవాసీ ప్రజల ఉనికికి ప్రమాదం ముంచుకొస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం హరిత హనన విధానాలనే కొనసాగిస్తుందా? హరిత పరిరక్షణ ద్వారా అడవుల విస్తీర్ణాన్ని పెంచగలదా? అన్నవి ప్రశ్నలు. హరిత నియమాలను అతిగా అమలు జరపడం వల్ల ఆర్థిక ప్రగతి దెబ్బతింటుందని మన్‌మోహన్ సింగ్ 2011 ఫిబ్రవరి మూడవ తేదీన ‘చారిత్రక’ ప్రకటన చేశారు. దీన్ని ప్రస్తు ప్రభుత్వం అంగీకరిస్తోందా? తిరస్కరిస్తోందా??
భోపాల్ సంస్థ వారు రూపొందించిన ముసాయిదాను ప్రభుత్వం ఆమోదించిందన్నది గత జూన్ 20న జరిగిన ప్రచారం. ‘అంతర్జాలం’లో ఈ ‘ముసాయిదా’ ప్రకటితమైంది. కొత్తగా అడవులను పెంచడానికి వీలుగా ‘హరిత శుల్కం’- గ్రీన్‌టాక్స్- విధించాలని ఆ ముసాయిదాలో నిర్దేశించారు. హరిత పరిరక్షక నిబంధనలను నిర్దుష్టంగా, నిర్దిష్టంగా అమలు జరపాలని, పరిశ్రమలకు ఇతర వాణిజ్య కలాపాలకు అటవీ భూమిని కేటాయించడాన్ని విచక్షణ యు తంగా నియంత్రించాలని ఆ ముసాయిదాలో పేర్కొన్నారు. భూభాగంలోని మూడవ వంతు అడవులుగా రూపొందించడానికి వీలుగా హరిత నియమావళిని కఠినంగా అమలు జరపాలని ప్రభుత్వం వారి విచక్షణ యుతమైన ప్రమేయం ద్వారా అడవులను ఇతర ప్రయోజనాలకు వినియోగించడాన్ని నియంత్రించాలని ముసాయిదాలో నిర్దేశించారు. అడవులను కాలుష్యమయం చేసే ‘విహార వినోద’ పరిశ్రమ- టూరిజం-ను నిరోధించాలని కూడా ముసాయిదాలో వెల్లడైంది. కాలుష్య నిరోధక శుల్కం- కర్బన్ టాక్స్- విధించాలని కూడా ముసాయిదాలో కోరారు. కానీ రెండు రోజులు గడవక ముందే ప్రభుత్వం స్పష్టీకరణ ఇచ్చింది. అంతర్జాలంలో ప్రచారమైన ‘పత్రం’ అటవీ విధానపు ముసాయిదా కాదన్నది ఆ స్పష్టీకరణ. ఆ పత్రంలో కేవలం భోపాల్ సంస్థవారి అధ్యయనపు వివరాలు మాత్రమే ఉన్నాయన్నది ప్రభుత్వం చెప్పిన మాట! ఐదున్నర నెలలు గడిచినప్పటికీ భోపాల్ సంస్థ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఎందుకని అధ్యయనం చేయలేదు? ఎందుకని నిర్ణయించలేదు??
కేంద్ర ప్రభుత్వం ఇలా అలసత్వం వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు సైతం హరిత నియమాలను నీరుకార్చుతున్నాయి. తమిళనాడులోని ‘మధుమలై’ శార్దూల విహార ప్రాంగణం- టైగర్ రిజర్వ్- విచ్చలవిడి మానవ విహారయాత్రల వల్ల పాడుపడిపోతోందట! తెలంగాణలోని అమ్రాబాద్ పులుల విహార ప్రాంగణంలో ‘యురేనియం’ అనే్వషణకు అనుమతి లభించడం పట్ల కూడా వనవాసులలోను, స్థానిక ప్రజలలోను తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. నిర్మల్, మంచిర్యాల ప్రాంతంలోని మరో వన్యమృగ సంరక్షణ కేంద్రం కూడా ఆధునిక నాగరికతా విన్యాసాలకు ఆలవాలమై పోతోందట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం హరిత వివాదంలో చిక్కుకొనడం మరో వైపరీత్యం.. కొత్త అడవుల సంగతి దేవుడెరుగు! దేశంలో రోజూ సగటున నూట ముప్పయి ఐదు హెక్టారుల అడవులు ధ్వంసమై పోతున్నాయట!