తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

కళాసాహిత్య రంగాలలో పులులు, పిల్లులూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సాహిత్య చరిత్ర ఎందుకు నిర్మించాలి? ఆ అవసరం రాష్ట్రం ఏర్పడినందువల్ల వచ్చిందా? లేదా? లోకానికి తెలియజేయాల్సిన ప్రత్యేకత, విలక్షణతలు ఉన్నాయనా? ఇప్పటివరకు రా యబడిన చరిత్రలో అసంపూర్ణ, అలిఖిత అంశాలను పూరించడానికా? సమగ్రతని కోరుకునే దృష్ట్యానా? ఆమధ్య నిజాం కళాశాలలో జరిగిన ఒక సదస్సులో కలిగిన ఆలోచనలు ఇవి. రోజురోజుకీ ఇవి బలపడుతున్నాయి. అందుకే వీటిని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిజానికి ‘చరిత్ర’ రచన సమగ్రం కాకుండా సాహిత్య చరిత్రలో సమగ్రాలు సాధ్యం కాదు. రాజకీయ చరిత్ర రాయడం సులభం. చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలు, గ్రంథాలు, చరిత్ర రచనలు, వ్యాసాలు చాలా లభిస్తాయి. ఐతే సమగ్రతని సాధ్యం చేయడానికి చరిత్రకారునికి స్పష్టమైన దృక్పథం కావాలి. అవసరం ప్రేరేపించాలి. ప్రయోజనం స్పష్టం కావాలి. అప్పుడే ఉబుసుపోక విషయాలు, తాలు మైనస్ అవుతాయి. అప్పుడు అది సరైన చరిత్ర కాగలదు.
ఇవ్వాళ చరిత్ర ఒక పాత సాంప్రదాయక భావన ఎంతమాత్రం కాదు. పాత చరిత్ర రచనకి కేవలం రాజులు, కొన్ని శాసనాలు, లభ్యమైన నాణాలు, కోటలు, గోడలు చాలు. కాని ఆ విధానం మారిపోయింది. చరిత్ర నిర్వచనం పరిధి విస్తరించబడింది. అనేక ధోరణుల రాపిడితో మొనదేలింది. మత దృక్పథం, యుగ దృక్పథం, రాజవంశ పాలనా కోణాలు, జాతీయ ఆలోచన, ప్రజా ఉద్యమం మార్క్సిస్టు, ప్రజాదృక్పథం, ప్రజాస్వామిక ఆలోచనలు, ఉదారవాద ప్రభావాలు పెరిగాయి. జాతీయవాదం కూడా ప్రభావం చూపింది. మార్క్సిస్టుతత్వ శాస్త్రం శ్రామిక ప్రజాదృక్పథమై రాటుదేలింది. ప్రజాస్వామ్య ఆలోచనల అడుగువర్గాల చరిత్ర (్దజఒఆ్యక చ్యిౄ ఇళ్యతీ, డఖఇ్ఘఆళూశ దజఒఆ్యక) స్ర్తివాదోద్యమం, దళితవాదం, ఆదివాసీ దృక్పథం ఎజెండాపైకి స్పష్టంగా వచ్చాయి. దాంతో ఏది చరిత్ర అనే వింగడింపు ఏర్పడింది. ఏది అనే కంటే ఎందుకు చరిత్ర అనే మీమాంస పెరిగింది. లోగడ వలె చరిత్రకారుల కలం నల్లేరుపై బండి ప్రయాణం కాదు. అందుకే చారిత్రక అంశాలపై, వెలుగు ప్రసరించని కొన్ని కోణాలపై కొన్ని పరిశోధనలు జరుగుతున్నాయి. కొందరు వ్యాసాలు రాస్తున్నారే తప్ప చరిత్ర రచనని సమగ్రభావనతో రాయలేకపోవడం గమనించాలి. ఇప్పుడున్న వాతావరణం సాహిత్య చరిత్రకి కూడా వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగిన సదస్సు చరిత్రల రచనకు ప్రేరణ కావాలని ఆశించాను.
గత ఉద్యమ అనుభవాలను, వాస్తవాలతో సంవాదింపచేస్తూ, అప్పటి గుణపాఠాలు తీసుకుని, ఇప్పటి ఉద్యమాలను మనసులో పెట్టుకుని సాహిత్య సమీక్ష స్థాయికన్నా, తులనాత్మక, విమర్శనాత్మక దృష్టితో నాలుగు విషయాలు మీముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ సదస్సులో నాకు ఇవ్వబడిన అంశం ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- సాహిత్యం’ (తెరైపో). ఈ సాహిత్యాన్ని గురించి 1986లోనే పరిశోధించాను. ఎన్నో వ్యాసాలు రాశాను. కాని 2016లో మరోసారి సమీక్షించాలంటే రాజకీయ సామాజిక సాంస్కృతిక రంగాలలో సంభవించిన మార్పుల్ని పరిగణనలోకి తీసుకోవలసి ఉంది. ఇది అనివార్యం. లేని పక్షంలో సాహిత్య సామాజిక గతి తార్కతకి అర్థం ఉండదు. ఈ అంశానికి ఒక ప్రత్యేక విభాగం సాహిత్యంలో గుర్తింపు ఉంది. దానికదే ఒక సంక్షిప్త సాహిత్య చరిత్రగా పరిశోధించినవారున్నారు. అందులోని వివిధ ప్రక్రియలపై విడివిడిగా కూడా పరిశోధించారు. ఐతే చరిత్ర రచన సంబంధమైన ప్రశ్నలు ఇవ్వాళ ఈ అంశానికి కూడా వర్తిస్తాయి. సాహిత్య వ్యవస్థ ఎంత గుంభనంగా ఉంటుందో అంత తెలివైంది. సమాజం నుండి వెలువడిన ప్రశ్నలకు జవాబు ఇవ్వకతప్పదని తెలుసు. వాటిని పక్కన పెట్టడం సరికాదని తెలుసు. కాబట్టి అలాంటి కొన్ని ఆలోచనలను సైతం ఇక్కడ చర్చించక తప్పదు. ఉద్యమ కాలంలోనే, ఉద్యమ సాహిత్యాన్ని, ఉద్యమ ఫలితాలను అంచనా వేసుకోక తప్పదు. ఆ విజ్ఞత లేకపోయినప్పుడు తదనంతరం విశే్లషించుకోవడం ఒక సామాజిక, రాజకీయ, సాహిత్య బాధ్యత. దాని నుండి తప్పించుకునే ప్రయత్నమే మితవాద స్వభావం. నిజమైన పోరాట, విప్లవ స్ఫూర్తి మాత్రం తక్షణం ప్రజాదృక్పథంతో సమీక్షించుకుంటుంది. అది అనివార్యం.
తెరైపో సాహిత్యాన్ని పోరాటానంతరం తెలంగాణలోను, సీమాంధ్రలోను పెద్దగా పట్టించుకోలేదు. అప్పటి సాహిత్య కళాసంస్థలు ఆ వెంటనే వ్యాపారాలకు, వ్యాపార ధోరణులకు దగ్గరయ్యాయి. ఇతర ప్రాంత కళాకారులు, రచయితలు తొంభై శాతం సినిమాకి తరలిపోయి, సినిమా రంగాన్ని ప్రభావితం చేయలేకపోగా అందులో విలీనమయ్యారు. మార్కెట్ సంస్కృతి వలలో చిక్కినప్పటికీ వారు కళారంగంలో పులులగానే చెలామణిఅయ్యారు. ఐనా కొందరు శిష్ట సాహిత్యకారులు, సంస్థలు ఆ పులుల్ని విప్లవ పులులుగానే భావించడంలో తరించిపోయారు. సీమాంధ్ర ఆకర్షణలో తెలంగాణ సాహిత్య సంస్థలు, రచయితలు ఎంతగా పడిపోయాయంటే తమ కవులు, కళాకారులు ఎవరో గుర్తించకలేకపోయారు. శ్రమ క్షేత్రాలతో, ఏ ఆకర్షణ వలలకు చిక్కకుండా జీవన పోరాటం చేస్తున్న వారిని సైతం గుర్తించలేదు. వారు ప్రదర్శించిన తేలిక భావానే్న వీరూ ప్రదర్శించారు. ఎందుకంటే తెలంగాణ పోరాట కవులు, కళాకారులు అత్యధిక శాతం శ్రమజీవి వర్గాలవారే. శ్రమజీవి తత్త్వశాస్త్రాన్ని కింది స్థాయిలో అన్వయించడంలో వైఫల్యం ఇంతా అంతా కాదు.
ఈ కారణం చేత ప్రజలు- శ్రమ- సంస్కృతి, కళ, సంగీతం, సాహిత్యం (పేరు ఏదైతేనేం) అన్నీ పేజీలు తిప్పేసే తత్వానికి గురయ్యాయి. జన సాహిత్య కళాశాస్త్రం గురించి చాలా వ్యాసాలు మార్క్సిస్టు మహామహోపాధ్యాయులు రాస్తే కొన్నింటిని లఘు పుస్తకాలుగా అచ్చేశారు. కాని వాటిని ఆనాడు ప్రజాకోణం లోంచి అన్వయించలేదు. మార్క్సిస్టు తత్వశాస్త్రానికీ దాదాపు అదే పరిస్థితి ఏర్పడింది. ఒక శాస్త్రాన్ని నిర్ద్వంద్వంగా ఆమోదించడం వేరు. దానిని ప్రజాక్షేత్రాలకు, స్వభావాలకు అన్వయించడం వేరు. ఆ పని రాజకీయ, ఉద్యమ రంగంలో కొంత తునకలు తునకలుగా జరిగింది. కాని దేశీ/ జన సాహిత్య కళా సాంస్కృతిక రంగాలలో ఆనాడు చాలా తక్కువగా జరిగింది. ఐతే తెరైపో మొత్తం ప్రజాసాహిత్యం కళారంగంపైనే ఆధారపడిందనేది వాస్తవం. జనంలో ప్రచారం పొందిందనేది నిజం. ఆనాటి సాహిత్య కళారూపాలు మైనస్ చేసి రాజకీయ పోరాటాన్ని చూస్తే దాని స్వభావం ఇట్టే తెలియవస్తుంది. ఐతే ఇందుకు కారణాలు ఏమై ఉంటాయన్నది ముఖ్యం. ఈ ముఖ్యమైన ప్రశ్నని, ఆలోచనని బయటపడకుండా చేయడం కూడా జరిగింది. ఆ ప్రశ్న నేరుగా నాయకత్వానికి తగులుతుంది. అంటే వారు జవాబు ఇచ్చుకొనే పరిస్థితి ఏర్పడుతుంది. దానిని పార్టీ నాయకత్వ గ్రూపులు, నిర్మాణాలు అడ్డుకుంటాయి. ఇంకా కచ్చితంగా, స్పష్టంగా చెప్పాలంటే ఇది ‘రాజ్యం’ చేసే పని- ఎక్కడైనా, ఎప్పుడైనా. కార్మిక శ్రామిక వర్గ నియంతృత్వ స్థాపనలో తెలిసీ తెలసి అగ్ర స్వభావ నియంతృత్వం పనిచేసిందనేది వాస్తవం. దీనిని ఈ కోణంలోంచి తదుపరి అయినా చూడవలసిన శక్తులు ఏమాత్రం పట్టించుకోలేదు.
ఐతే మితవాదం, రివిజనిజం అనే పడికట్టు మాటలతో ఈ ధోరణిని రాజకీయంగా సూత్రీకరించామే తప్ప, అగ్ర నాయకత్వం వారి కులం, బలగం, వర్గం వంటి వాటిలో దాగిన ఆధిపత్య మనస్తత్వం ఎలా పనిచేసిందో వివరంగా విప్పిచెప్పుకోలేకపోయాం. అందువల్ల దానిని పరిహరించడానికి, సవరించుకోవడానికి సాధ్యం కాలేదు. రాశిలో వాసిలో తదనంతర కొన్ని పోరాటాలు జరిగాయి. కాదనలేం. శ్రామిక జన త్యాగాలవల్ల తమ విభాగం కృషి ఎవరూ కాదనలేరు. కాని పై వర్గ స్వభావం నాయకత్వ కేంద్రంగానే ఉద్యమాలను చూశాయి. వ్యక్తిపరంగా విప్లవ పోరాటాలకు పేర్లుపెట్టుకున్నారు. వ్యక్తివాదం దృక్పథం వ్యక్తి పూజ కిందకే వస్తుందన్న ఆలోచన చర్చల వరకైనా తీసుకురాలేకపోయాం. యూరోపు ఆధునిక, పెట్టుబడి, మార్కెట్ లేకుండా ఫ్యూయర్‌బా, మోర్గాన్, ఏంగెల్స్ తదితర ఆలోచనా ధారలు లేకుండా మార్క్స్ రచనలు లేవు. రష్యా విప్లవ కాలం, ఆ కాలంలో ప్రజల పాత్ర, పార్టీ లేకుండా లెనిన్, అలాగే చైనాలో మావో. కాని మొత్తం కీర్తి ఒక్కొక్కరికే ధారపోసి మంచి చెడులకి వారినే విగ్రహం చేయడం మార్క్సిస్టు మూల సూత్రాలకి వ్యతిరేకం. ఇక్కడ ఈ విషయాలు కొంతమందికి అప్రస్తుతం అనిపించినా తదుపరి చర్చించబోయే విషయాలకు సంబంధం ఉన్నదని గుర్తించ మనవి. ఇదే క్రమం ఇక్కడి విప్లవ పోరాటాల నాయకులకి ఆర్.ఎన్,పి.ఎస్, చండ్ర, (సిపి) దేవులపల్లి (డివి) వంటి పేర్లతో పిలిచి ప్రజల పాత్రని పోరాటాల పార్టీలను, అద్భుత విప్లవాలను వ్యక్తి నామాలకి అంకితం చేశాం. కుదించి వేశాం. ఇది వ్యక్తి కేంద్రక వాదం. ఇది పక్కా భూస్వామ్య భావజాలం. ఈ విషయంలో, నాయకత్వ విషయంలో పార్టీలన్నీ ఒకే వర్గ స్వభావం పాటించడం ఎలా సాధ్యమైంది? కారణాలు వెదికితే తప్ప అర్థం కాదు. దైవం, అవతారం వంటి సాంస్కృతిక వర్గ స్వభావంపై మతపు మత్తు మనకి తెలియకుండానే ఉంటుందని గమనించాలి.
తెరైపో సాహిత్యంలో కూడా ఇదే స్వభావ క్రమం కొనసాగింది. పర ప్రాంతాల రచయితలు, ప్రజానాట్యమండలి వంటి సంస్థలు, కళాకారులకు వచ్చిన పేరుప్రఖ్యాతులు ఇక్కడివారికి రాలేదు. నిజానికి పోరాటం నిలిపివేసాక ఇక్కడి ఉద్యమంలో పనిచేసిన, నాయకత్వం వహించిన పాలక కుల వర్గాలు కూడా వీరిని గుర్తించలేదు. తమ తమ కుల వర్గాలకు సంబంధించిన వారిని, వారికి ఏమాత్రం పోరాటంతో సంబంధం లేకపోయినా, కేవలం తెలంగాణ వారు అని చెప్పి వారిని చాలా ప్రమోట్ చేయడం జరిగింది. తెలంగాణ సాహిత్య చరిత్ర రచనలో ఇలాంటి విషయాలను ప్రస్తావించకపోతే అది సమగ్రం అనిపించుకోదు. అంతేకాదు. దానికి ప్రజా వ్యతిరేక సాహిత్య చరిత్రగా కూడా పరిగణింపబడే ఆస్కారం ఏర్పడుతుంది. ఇది కేవలం సాహిత్య చరిత్రకే పరిమితం కాదు. ఈ కోణాలు తెలంగాణ చరిత్ర రచనలో కూడా చోటుచేసుకోవాలి. చర్చింపబడాలి. అంతేకాదు. కళారంగ చరిత్ర, జానపద/ప్రజాసాహిత్య చరిత్ర, సంగీత, నాటక రంగ చరిత్రలో అనేక విస్మరణలు ఉన్నాయి. వాటిని పూరిస్తూ కొత్త చరిత్రని నిర్మించుకోవాలి
. *

-జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242