సంపాదకీయం

ప్లాస్టిక్‌నుంచి విముక్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కఠినమైన ఉత్తరువులు కథ మళ్లీ మొదటి వచ్చిందనడానికి నిదర్శనం, గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలవారు, తిరుమల తిరుపతి దేవస్థానాలవంటి ధార్మిక సంస్థలు ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేధించాయి, నియంత్రించాయి! ఆయా ఉత్తరువులు ప్రభుత్వాలకే గుర్తులేకపోవడం కథ మొదటికి వచ్చిందనడానికి వర్తమాన సాక్ష్యం! ఏమయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడిలా మళ్లీ నడుం బిగించడం హర్షణీయం. యాబయి మైక్రాన్ల కంటె తక్కువ మందం గల ప్లాస్టిక్ చేతి సంచులను, తిత్తులను వాడరాదన్నది కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిదవ తేదీన జారీ చేసిన నియమావళిలోని ప్రధాన అంశం! ఈ నియమావళిని ఉల్లంఘించే ఉత్పత్తిదారులను, పంపిణీ దారులను, దుకాణాల యజమానులను, సంచార వర్తకులను, వీధి వ్యాపారులను, వినియోగదారులను కఠినంగా శిక్షించాలన్నది నియమావళి లక్ష్యం! ప్లాస్టిక్ చెత్తను తొలగించడంలోను, నియంత్రించడంలోను రాష్ట్ర ప్రభుత్వాలు , స్థానిక సంస్థలు అనుసరించవలసిన విధి నిషేధాల -డూస్ అండ్ డోన్‌ట్స్-ను ఈ కొత్త నియమావళిలో పొందుపరిచారట! రాజకీయ సభలు, సమావేశాలు, ప్రదర్శనలు, సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు వంటి శుభ కార్యాల నిర్వహణ సమయంలో ప్లాస్టిక్ చెత్త పేరుకొనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నది కొత్త నియమావళిలోని నిర్దేశం...నిర్దిష్ట పద్ధతిలో ప్లాస్టిక్ చెత్తను ఎత్తిపారేయని వారినుండి భారీ జరిమానాను వసూలు చేయాలని కూడ నూతన నియమావళిలో నిర్దేశించారట! కానీ ఈ నియమావళిని అమలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ఆరునెలల గరిష్ఠ కాల వ్యవధిని నిర్దేశించింది. ఈ ఆరు నెలలలోగా రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు నియమావళిని మరిచిపోతాయా లేక అమలు జరుపుతాయా అన్నది వేచి చూడదగిన మహా విషయం. ఎందుకంటే గతంలో ఇలా అనేకమార్లు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ప్లాస్టిక్‌ను నిషేధించాయి, ఆ తరువాత నిషేధాన్ని అమలు జరపడం మరిచిపోయాయి! ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో ఏళ్ల క్రితమే ప్లాస్టిక్ సంచులను నిషేధించారు! అయితే ఇరవై మైక్రాన్ల మందం కంటె తక్కువ పలచని ప్లాస్టిక్ తిత్తులను మాత్రమే వాడరాదన్నది నిబంధన! ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం నలబయి మైక్రాన్ల వరకు మందమున్న ప్లాస్టిక్ సంచులను కూడ నిషేధించినట్టు ప్రచారమైంది! ఇప్పుడు యాబయి మైక్రాన్ల వరకూ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను కూడ వాడరాదన్నది కొత్త నిబంధన! జంటనగరాల వాసులకు కాని ప్రభుత్వాలకు కాని గతంలో జరిగిన నిషిద్ధ నిర్ణయం ఇప్పుడు గుర్తులేదు!
ఇప్పుడు గ్రీష్మ తాపం భయంకరంగా పెరిగిపోతుండడం కేంద్ర ప్రభుత్వం వారి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమానికి నేపథ్య వైపరీత్యం! చలికాలంలో చలి తగ్గిపోతుండడం మరింత ముందుగానే ఎండల కాలం మొదలు కావడం ఈ వైపరీత్య స్వభావం! ఈ ఏడు శిశిర ఋతువు ఇంకా ముగియలేదు, వసంతం ఆరంభం కాలేదు. కానీ అప్పుడే గ్రీష్మ ఋతువు దాపురించిన సూచనలు ప్రస్ఫుటిస్తున్నాయి. ఇలా ఎండలు మండిపోవడానికి కారణం కాలుష్యం వల్ల భూమి ప్రకృతిపరంగా వేడెక్కిపోతుండడం! ఈ వేడివల్ల హిమాలయాలు కరిగిపోతున్నాయి, బండలు, శిలాశకల సమూహాలు దర్శనమిస్తున్నాయి, సముద్రాలు పొంగుతున్నాయి, తీర ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. సముద్రాలలో నెలకొని ఉన్న చిన్న చిన్న దీవులు మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది! ప్రశాంత మహా సాగరంలో నెలకొని ఉన్న కిటివటి అన్న చిట్టిదేశం పూర్తిగా మునిగిపోవడం ఖాయమన్నది అంతర్జాతీయ సమాజానికి వినపడిన ప్రమాద ఘంటిక, గత ఏడు పారిస్‌లో జరిగిన పర్యావరణ పరిరక్షణ సదస్సులో ఈ ఘంటికా ధ్వనులు ప్రతిధ్వనించాయి! గత శతాబ్దిలో సగటు ఉష్ణోగ్రత ఒకటిన్నర డిగ్రీల సెంటిగ్రేడ్ చొప్పున పెరిగిన ఫలితం ఇది. కానీ 2100నాటికి ప్రపంచ ఉష్ణోగ్రత మరో ఎనిమిది డిగ్రీలు పెరిగిపోతుందన్నది భయానక భవిష్యత్ ద్రష్టలు చేస్తున్న హెచ్చరిక! అందువల్ల సముద్ర జలాలు మరింతగా పొంగుతాయట! అంటార్కిటిక్ వలయంలో మంచు కరిగి అట్లాంటిక్ సముద్రం, ప్రశాంత సముద్రం మరో రెండు వందల మీటర్ల ఎత్తునకు పెరిగి లండన్, పారిస్, న్యూయార్క్, టోకియో, హాంకాంగ్ నగరాలు జలసమాధి అయ్యే ప్రమాదం ఉందట! ఈ విలయాన్ని సృష్టించగల వేడిని పెంచుతున్న కాలుష్య కారకాలలో అతి నికృష్టమైనది ప్లాస్టిక్ వ్యర్ధాల సమూహం! వాయుకాలుష్యం వల్ల ప్రతి ఏటా ప్రపంచంలో ఎనబయి లక్షల మంది ఊపిరాడక ఉసురు పోగొట్టుకుంటున్నారు! అయినప్పటికీ ఇంతవరకు ప్లాస్టిక్ నిర్మూలనం జరగలేద్నది కేంద్ర ప్రభుత్వం వారి ఉత్తరువుల ద్వారా వెల్లడైన వాస్తవం...
జంటనగరాలలో ప్లాస్టిక్ సంచులను నిషేధించిన తరువాత కొన్నాళ్లపాటు వినియోగదారులకు దుకాణాలవారు ఆ సంచులనివ్వలేదు. సంచీలు తెచ్చుకోండి అన్నది వినియోగదారులకు లభించిన ఉచిత సలహా. ఇలా బట్ట సంచులను, జనపనార సంచులను, నలబయి మైక్రాన్ల కంటె ఎక్కువ మందం ఉన్న పెద్ద ప్లాస్టిక్ సంచులను తెచ్చుకున్న వినియోగదారుల సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్న నిబద్ధత పర్యావరణాన్ని పరిరక్షించాలన్న నిష్ఠ కలిగిన ఉత్తమ పౌరులు వారు. కానీ ఈ ఉత్తముల సంఖ్య వినియోగదారులలో అతి తక్కువ స్థాయిలో ఉంది! మిగిలిన వినియోగదారులు యథావిధిగా చేతులను ఊపుకుంటూ దుకాణాలకు, కూరగాయల సంతలకు, రైతు బజారులకు వెళ్లడం దృశ్యమానమైంది...అందువల్ల ప్లాస్టిక్ సంచులను వాడని దుకాణదారులు వినియోగదారులవద్ద అదనంగా రెండునుంచి ఐదు రూపాయల వరకు వసూలు చేసి నలబయి మైక్రాన్ల కంటె ఎక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ సంచులను అమ్ముకున్నారు! ఇలా కొనుగోలు చేసిన ప్లాస్టిక్ సంచులలో వినియోగదారులు సరుకులను పట్టుకుని రావడం ఆరంభమైంది! రెండు మూడు నెలల వరకు వినియోగదారులకు లభించిన ప్రయోజనం అది. ఆ తరువాత నిషేధం సంగతి ఎవ్వరికీ గుర్తు లేదు! అంతకు ముందు ఎంతోమంది ప్రముఖులు హైదరాబాద్‌లో పెద్దఎత్తున ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాలు నిర్వహించడం చరిత్ర! మేధావులు, చలనచిత్ర కళాకారులు, రచయితలు, రాజనీతిజ్ఞులు, ఆచార్యులు, విద్యార్థులు, పర్యావరణ పరిరక్షణ నిష్ఠతో ప్లాస్టిక్‌ను నిరసిస్తూ ఊరేగింపులు కూడ జరిపారు. కాగితం సంచులను, బట్ట సంచులను, జనుపనార సంచులను, గాజు సీసాలను, మట్టి కుండలను వారు ప్రదర్శించి ఔత్సాహికులకు విక్రయించారు కూడ! భాగ్యనగర వాసులకు గాని తెలుగు ప్రజలకు కాని ఇప్పుడు గుర్తులేని వివరాలు ఇవి..
హైదరాబాద్‌లో కంటె పదేళ్లకు పూర్వమే ముంబయి వంటి చోట్ల ప్లాస్టిక్‌ను నిషేధించారు! అక్కడక్కడ కూడ ఇదే కథ పునరావృత్తికి గురి అయినది. లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్లాస్టిక్ పాత్రల వాడకాన్ని రైళ్లలో నిషేధించినట్టు ఆర్భాటంగా ప్రకటించారు...అమలు మాత్రం జరగలేదు! తిరుమలను ప్లాస్టిక్ నుండి విముక్తం చేయాలన్న నిర్ణయం మాత్రమే 2010నుంచి కొంతమేరకు అమలు జరిగింది! వినియోగాన్ని కాక ప్లాస్టిక్ ఉత్పత్తిని ప్రభుత్వాలు ఎందుకని నిషేధించవు?