సంపాదకీయం

స్వచ్ఛగంగ స్వప్నమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టణీకరణ, పారిశ్రామిక ప్రాంగణాల విస్తరణ పర్యావరణ పరిశుభ్రతను పాడుచేస్తోందన్నది సర్వోన్నత న్యాయస్థానానికి 2015 మార్చిలో కేంద్ర ప్రభుత్వం నివేదించిన వాస్తవం. ఈ మహా విషయం కొత్తది కాదు, దశాబ్దుల తరబడి మాన్యులు మొదలుకొని సామాన్యుల వరకూ దీని గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. సర్వోన్నత న్యాయస్థానం జనవరి పదిహేడవ తేదీన మరోసారి పర్యావరణ కాలుష్యం గురించి, ప్రధానంగా గంగానదీ కాలుష్యం గురించి కేంద్ర ప్రభుత్వానికి గుర్తుచేసింది. గంగానది స్వచ్ఛతను పునరుద్ధరించే కార్యక్రమం ‘ప్రగతి’ గురించి ఇరవై నాలుగవ తేదీలోగా నివేదికను తమకు సమర్పించాలని సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ అధ్యక్షతన ఏర్పడిన ధర్మాసనం వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ‘నమామి గంగే’ పథకాన్ని గత రెండేళ్లకు పైగా అమలుజరుపుతోంది. గంగానదీ జలాల స్వచ్ఛతను, పవిత్రతను పునరుద్ధరించడం ఈ ప థకం లక్ష్యం. దీన్ని అమలుజరపడానికి వీలుగా ‘గంగానదీ పరీవాహ ప్రాం త నిర్వహణ వ్యవస్థ’- గంగా రివర్ బేసిన్ మేనేజ్‌మెంట్ ప్లాన్- జిఆర్‌బిఎంపి-కు 2015 జనవరి, మార్చి నెలల మధ్య రూపకల్పన జరిగింది. స్వచ్ఛ గంగాజల పునరుద్ధరణ లో భాగంగా 2016 జూలైలో ఐదు రాష్ట్రాలలోని గంగానదీ తీరం వెంబడి రెండు వందల ముప్పయి ఒక్క పునరుద్ధరణ విభాగాల- రివైవల్ ప్రాజెక్ట్సు- ను కేంద్ర ప్రభుత్వం ఆరంభించింది. రెండువేల కోట్ల రూపాయల ఖర్చు కాగల ఈ ‘నమామి గంగే’- (గంగకు నమస్కరిస్తున్నాను) అనే పథకం అభూత పూర్వమైన కేంద్ర ప్రభుత్వ కృషికి, చిత్తశుద్ధికి, గంగానదీ స్వచ్ఛతా నిష్ఠకు, పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతకు నిదర్శనం. అయినా ఈ గంగా ప్రక్షాళన కార్యక్రమం అనుకున్నంత వేగంగా జరుగకపోవడం సర్వోన్నత న్యాయస్థానం పదే పదే అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ప్రాతిపదిక.
పట్టణీకరణ భయంకరమైన వేగంతో విస్తరించడంతో ఉత్తరఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ ప్రవహిస్తున్న గంగానదీ జలాలు కాలుష్యగ్రస్తం అవుతున్నాయన్నది 2015 మార్చిలో ‘జిఆర్‌బిఎంపి’ రూపొందించిన నివేదికలోని ప్రధానాంశం. పట్టణీకరణను, ప్రధానంగా కోట్ల జనాభాను కేంద్రీకరించే అంతర్జాతీయ స్థాయి నగరాలను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని ప్రోత్సహిస్తోంది? ఎందుకు నియంత్రించడం లేదు?? గంగానది ఈ దేశానికి ప్రతీక, ఈ దేశచరిత్రకు ప్రతీక, సనాతన సంస్కృతికి ప్రతీక, ఈ దేశపు ఉత్థాన పతనాలకు, విజయాలకు అపజయాలకు ప్రాభవానికి పతనానికి నిరంతరం ప్రత్యక్ష సాక్షి.. అందువల్ల ‘గంగ’ కాలుష్యం సమస్త నదుల కాలుష్యానికి నిదర్శనం. గంగానదీ స్వచ్ఛత భారతదేశపు స్వచ్ఛతకు నిదర్శనం. గంగను కాలుష్యగ్రస్తం చేస్తున్న మితిమీరిన పట్టణీకరణ అనేక నదులను మురికినీటి ప్రవాహాలుగా మార్చింది. హైదరాబాద్‌లోని స్వచ్ఛజలాల ‘ముచికుంద’ నది మురుగునీటి ‘మూసీ’గా మారడం అక్రమ పట్టణీకరణ ఫలితం! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరాన్ని, వందల అంతస్థుల గృహ సముదాయాలను నిర్మించినట్లయితే కృష్ణా నదీ జలాలు కాలుష్యగ్రస్తం కావన్న నమ్మకం ఏమిటి? ఉత్తరఖండ్ ఒకప్పుడు స్వచ్ఛతకు మారుపేరు. కానీ నదుల తీరంలో విచ్చలవిడిగా నిర్మాణాలను సాగించడం వల్లనే జలాలు కాలుష్యమయం అవుతున్నాయి. హరిద్వార్ గంగాజలాన్ని కలశాలకెత్తి మూత బిగించి ఏళ్ల తరబడి దేశ విదేశాలలో ఇళ్లలో ఉంచుకోవడం సంప్రదాయం. హరిద్వార్ వద్ద కూడా ‘గంగ’ను కాలుష్యం కాటు వేయడానికి కారణం అక్రమ పట్టణీకరణ! మూడేళ్ల క్రితం కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర దివ్యక్షేత్ర ప్రాంతాలు ‘బురద’ వరదలో కూరుకొనిపోయి విపరీతమైన ప్రాణనష్టం సంభవించడానికి అక్రమ నిర్మాణాలే కారణం.
కేంద్ర ప్రభుత్వం నగరాలలో, పట్టణాలలో అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి వీలుగా ‘నమూనా నిర్మాణ నిబంధన’ల- మోడల్ బిల్డింగ్ రూల్స్-ను రూపొందించిదట! పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ వారు రూపొందించిన ఈ నియమావళిని అన్ని రాష్ట్రాల వారు అమలుచేయాల్సి ఉంది. అంతస్థుల భవనాలకు అనుమతునిచ్చే విషయంలో అత్యంత జాగరూకత వహించాలన్నది నియమావళి ఇతివృత్తం. అంతస్థుల భవనాలు నిర్మించడంలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏళ్ల తరబడి అమలులో ఉన్నాయి. అయినప్పటికీ రెండంతస్థుల భవనానికి అనుమతి తీసుకున్నవారు నాలుగు, ఆరు అంతస్థులను నిర్మిస్తునే ఉన్నారు. జనావాసాలలోను, వాణిజ్య వాటికలలోను రెండు అంతస్థులకు మించి నిర్మించరాదన్న నిబంధనను విధిస్తే తప్ప నీటి కాలుష్యం, భూగర్భ జలాలు ఎండిపోవడం వంటి దుష్పరిణామాలు అంతరించబోవు. మన నిర్మాణ నైపుణ్యాన్ని చాటడానికి ప్రభుత్వం వా రు ప్రతి నగరంలో ఒకటి రెండు చోట్ల ఆకాశ హ ర్మ్యాలను నిర్మించవచ్చు. ‘గంగ’ కాలుష్యానికి అక్రమ నగరీకరణ, మితిమీరిన పట్టణీకరణ కారణాలన్నది కేంద్రం చిత్తశుద్ధితో గుర్తించినట్టయితే గంగ ఒడ్డున మాత్రమే కాదు దేశంలో ఎక్కడా అంతస్థుల భవన నిర్మాణాలను అనుమతించరాదు. ప్రభుత్వం విచక్షణ యుతంగా కేవలం కార్యాలయాల కోసం అంతస్థుల భవనాలను నిర్మించుకోవచ్చు. ప్రతి అంతస్థుల భవనం చుట్టూ విశాలమైన తోటలను పెంచాలి. పట్టణీకరణను నియంత్రించడంతో పాటు పారిశ్రామిక వాటికలను కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు వికేంద్రీకరించాలి. వాణిజ్య ప్రపంచీకరణ మొదలైనప్పటి నుంచి ‘ప్రత్యేక ఆర్థిక మండలుల’ పేరుతో పారిశ్రామిక కేంద్రీకరణ జరుగుతోంది. ఈ ప్రత్యేక ఆర్థిక మండలుల- స్పెషల్ ఎకనమిక్ జోన్స్- కారణంగా ‘ప్రగతి’ మాత్రమే కాదు, భయంకరమైన కాలుష్యం కూడా కేంద్రీకృతవౌతోంది. ‘దీపం పెట్టిన తర్వాత దిగనేసిన’ చందంగా గంగానదీ ప్రక్షాళన కోసం ఒకవైపున రెండువందల ముప్పయి ఒక్క ‘శుద్ధి’ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మరోవైపున వేలాది పరిశ్రమల నుంచి కాలుష్య విషరసాయనాలు గంగలో కలుస్తున్నాయి. ‘రెండువందల ఏళ్ల వరకూ కూడా గంగానది కాలుష్య రహితం కాబోదు..’ అని సర్వోన్నత న్యాయస్థానం 2014లో వ్యాఖ్యానించడానికి ఇదీ నేపథ్యం.
నదుల పరిశుభ్రత, పట్టణీకరణ, పరిశ్రమల విచక్షణారహిత విస్తరణ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గోవంశ రక్షణ వంటివి పరస్పరం ముడివడి ఉన్న సమస్యలు. ‘అంతర్గత వైరుధ్యాలు’ ఏర్పడుతున్న రీతిలో కొనసాగుతున్న ప్రపంచీకరణ విధానాలకు ప్రభుత్వాలు స్వస్తి చెప్పినపుడు మాత్రమే గంగానది కాని ఇతర నదులు కాని క్షాళితం అవుతాయి. గంగానదీ జలాలను పరిశుభ్ర పరచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థిస్తూ ముప్పయి రెండేళ్ల క్రితం 1985లో ఎంసి మెహతా అనే న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు దాఖలు చేసిన న్యాయయాచికను సర్వోన్నత న్యాయస్థానం ఇంతవరకూ పరిష్కరించలేక పోవడానికి ఇదీ నేపథ్యం. గంగానదీ జలాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను సర్వోన్నత న్యాయస్థానం జాతీయ హరిత న్యాయ మండలి- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి-కి అప్పగించింది. 2014 నుంచి హరిత న్యాయమండలి కూడా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందట! గంగానదిని విష రసాయన పూరితం చేస్తున్న పరిశ్రమలకు నీరు, విద్యుత్ సరఫరాలను ఆపివేయడానికి సైతం ‘మండలి’కి సర్వోన్నత న్యాయస్థానం అధికారాన్ని అప్పగించింది. ఇలా న్యాయస్థానాలు, ప్రభుత్వాలు కలసికట్టుగా పోరాడుతున్నప్పటికీ కాలుష్య కబంధం నుంచి ‘గంగ’కు విముక్తి లభించకపోవడానికి కారణం ఏమిటి? సమాధానం.. ‘ప్రపంచీకరణ’!