సంపాదకీయం

ఆడిస్తున్న మెహబూబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్ రెండున్నర నెలలుగా పాలనా రాహిత్యస్థితి నెలకొని ఉండడం మరో ప్రత్యేకత. జమ్మూకశ్మీర్‌కు భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం ప్రకారం లభించిన ప్రత్యేక ప్రతిపత్తి స్థానిక రాజకీయ కుటుంబాల ప్రత్యేక ప్రతిపత్తిగా పరిణితి చెందడం దశాబ్దుల ప్రహసనం. షేక్ అబ్దుల్లా కుటుంబం ‘నేషనల్ కాన్ఫరెన్స్’పేరుతో కశ్మీర్‌ను నియంత్రించడానికి ప్రయత్నించడం ఈ చరిత్ర. పోటీగా అవతరించిన ముఫ్తి మహమ్మద్ సరుూద్ కుటుంబం వారు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-పిడిపి- పేరుతో రాజకీయ గతిని నిర్దేశించడానికి యత్నిస్తుండడం నడుస్తున్న ప్రహసనం. ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన ముఫ్తిమహమ్మద్ సరుూద్ జనవరి ఏడవ తేదీన మరణించినప్పటి నుంచి కూడ ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తి, ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వాస్తవం కావడానకి భారతీయ జనతాపార్టీ వారి మద్దతు అనివార్యం. భాజపా-పిడిపి కూటమి ఏర్పడిన కారణంగానే ముఫ్తిమహమ్మద్ సరుూద్ 2015 మార్చి ఒకటవ తేదీన ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆయన మరణించిన వెంటనే మెహబూబా ముఫ్తి ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయనున్నట్టు భారీయెత్తున ప్రచారమైంది. అయితే ఇందుకు భాజపా అంగీకరిస్తుందా? అన్నది ప్రచారకులు వ్యక్తం చేసిన సందేహం. భాజపావారు తక్షణం సందేహ నివృత్తి చేశారు.్భజపా పిడిపి కూటమి యధావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. మెహబూబా ముఫ్తి లాంఛనంగా అడగక పూర్వమే భాజపా అధిష్ఠానం వారు ఆత్యుత్యాహంగా ఆమెకు మద్దతును ప్రకటించి సంభ్రమాశ్చర్య రాజకీయ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఇదంతా జనవరిలోనే జరిగిపోయింది. జమ్మూకశ్మీర్‌లో తాము భాగస్వామ్యం వహిస్తున్న ప్రభుత్వం ఎలాగైనా కొనసాగాలన్న భాజపా వారి తహతహకు ఈ అత్యుత్సాహం కారణం. కోరకముందే భాజపావారు తన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని ఆమోదించడం ముఫ్తి మెహబూబాకు ఆనంద దాయకం. కానీ అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె అయిష్టతను అభినయిస్తూ ఉండడం విచిత్రమైన వ్యవహారం. మెహబూబమ్మకు భాజపాతో కలవడం ఇష్టం లేదని, భాజపా వారు ఆమెను కాళ్లావేళ్లా పడి బతిమిలాడుకుంటున్నారని వ్యాఖ్యాతలు కథకులు ప్రచారం చేస్తున్నారు. భాజపా వారు చొరవ తీసుకొని చర్చలు జరపడం, చర్చలు విఫలం కావడం, ముఫ్తి మెహబూబా ఆగ్రహంతో ఉండడం, మళ్లీ భాజపా వారే చర్చలకోసం ఆమెను దేబిరించడం పదేపదే పునరావృత్తికి గురవుతున్న రాజకీయ రాద్ధాంతం!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపితే తప్ప భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ఇష్టపడని స్థాయికి మెహబూబా ముఫ్తి ఎదిగిపోవడం ప్రాధాన్యం పెరగడానికి చిహ్నం. మోదీ స్థాయి కంటె తక్కువ హోదాకు చెందిన భాజపా నాయకులు తన అంతస్థునకు సాటిరారన్న అతిశయం మెహబూబాకు ఏర్పడి పోవడం సరికొత్త ఘట్టం. కానీ న్యూఢిల్లీలో మోదీకి మెహబూబాకు మధ్య జరుగవలసి ఉండిన శిఖర సమావేశం ఆకస్మికంగా రద్దయింది. ఎందుకు రద్దయిందన్న విషయమై మళ్లీ ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ చర్చలు రద్దయిపోయిన తర్వాత రెండు రోజులు గడువకముందే మళ్లీ భాజపా వారు మెహబూబాను బుజ్జగిండానికి యత్నిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రత్యేక దూతలు హుటాహుటిన రంగంలోకి దిగి మెహబూబాను చర్చలు జరపడానికి ఒప్పించారట. అందువల్ల ముఫ్తి ప్రత్యేక దూత హసీబ్ ద్రాబు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో బుధవారం చర్చలు జరుపనున్నాడట. ప్రధానమంత్రితో ముఫ్తి మెహబూబా చర్చలు జరపడానికి ఉభయ పార్టీల వారు మళ్లీ రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రధానమంత్రితో చర్చలు జరుపవలసి ఉండిన మెహబూబా ఆ ప్రయత్నం మానుకోవడం ఎందుకు? మళ్లీ చర్చలకోసం ప్రయత్నం ఎందుకు? ఉభయ పార్టీల విధానాలలో ఈ రెండు రోజులలో వచ్చిన విప్లవాత్మకమైన పరివర్తనలు ఏమిటి? గవర్నర్ పాలన నుండి జమ్మూకశ్మీర్‌కు విముక్తి కలిగించాలన్న ఆసక్తి పిడిపికి లేనప్పుడు భాజపాకు మాత్రం ఆ తహతహ ఎందుకు? ఆధికారం పట్ల ఆసక్తి లేనట్టు అభినయించడం ద్వారా మెహబూబా ముఫ్తి ప్రజలలో తన పలుకుబడిని తనపట్ల సానుభూతిని పెంచుకుంటోంది. ఇలా పెరగడానికి భాజపా ఎందుకని సహకరిస్తోంది?
మన సైనిక దళాల ఉనికిని జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులు సహించడం లేదు. ఎందుకంటె జమ్మూకశ్మీర్‌లో నెలకొన్ని ఉన్న సైనికుల సంఖ్య తగ్గిపోయినట్లయితే తాము మళ్లీ విజృంభించవచ్చునన్నది ఉగ్రవాదుల వ్యూహం. వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం వారి వ్యూహం. కశ్మీర్‌ను మనదేశం నుండి విడగొట్టడానికి పాకిస్తాన్ ప్రేరణతో జిహాదీ ఉద్యమాలను నిర్వహిస్తున్న హురియత్ వంటి దేశద్రోహపు ముఠాలకు కూడ సైనిక దళాలు ఉనికి సహించరాని వ్యవహారం. కానీ ముఫ్తి మెహబూబా నాయకత్వంలోని పిడిపి వారు కూడ జమ్మూ కశ్మీర్‌లో మన సైనికులు ఉండరాదని కోరుతున్నారు. జమ్మూకశ్మీర్ నుంచి సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించాలని కనీసం సంఖ్యను తగ్గించాలని నేషనల్ కాన్ఫరెన్స్ ఒకవైపున, పిడిపి మరోవైపున కోరుతుండడం, ఏళ్ల తరబడి సాగుతున్న ప్రహసనం. ఇలాంటి పిడిపితో జట్టుకట్టి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జాతీయ వైపరీత్యం. భాజపా, పిడిపి విధాన పరంగా పరస్పర వైరుధ్యాలు. సైనిక దళాల ఉనికిని దేశద్రోహులు పాకిస్తానీ తొత్తులు వ్యతిరేకించవచ్చు. కాని భారత రాజ్యాంగ వ్యవస్థ పట్ల, దేశ ప్రాదేశిక సమగ్రత పట్ల నిబద్ధతను ప్రకటించి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములై ఉన్న రాజకీయ పార్టీల వారు సైనికుల ఉనికిని ఎందుకు వ్యతిరేకించాలి? ప్రాదేశిక సమగ్రతకు దేశ అఖండత్వాన్ని రక్షించగల వారు సైనికులు. ఈ రక్షణ పట్ల నిబద్ధతను ప్రకటించిన తరువాతనే రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటున్నాయి. మరి ప్రభుత్వాన్ని కూడ ఏర్పాటు చేసిన పిడిపి సైనిక దళాల ఉపసంహరణను ఎందుకు కోరుతోంది? ఈ కోరికను భాజపా అంగీకరించినట్టు కూడా ప్రచారమైంది. పూర్తిగా ఉపసంహరించకపోయినప్పటికీ సైనికులను ఉన్నచోట నుంచి మరోచోటుకి తరలిస్తారట. నిజంగా ఇది జరిగినట్టయితే పిడిపి వారి దేశవ్యతిరేక విధానం ముందు భాజపా కేంద్ర ప్రభుత్వం మోకరిల్లినట్టు మాత్రమే కాగలదు. భాజపా రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని కోరుతోంది. కానీ రద్దు చేయడానికి ప్రయత్నించబోమని భాజపా ప్రభుత్వం 2015 ఫిబ్రవరి 25న రాజ్యాంగ సభలో ప్రకటించింది. ఈ స్పష్టీకరణ తరువాతనే భాజపా, పిడిపిల సంకీర్ణ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో 2015, మార్చి 1న ఏర్పడింది. ఇలా పిడిపి ముందు భాజపా ఇది వరకే ఒకసారి మోకరిల్లింది. పిడిపి జమ్ముకశ్మీర్‌కు ప్రస్తుతం లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తితో సంతృప్తి చెందడం లేదు. స్వయం పాలనను కోరుతోంది. భాజపా వారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని, పిడిపితో తెగతెంపులు చేసుకోవడం మేలు..దానివల్ల దేశానికి దీర్ఘకాల ప్రయోజనం సిద్ధిస్తుంది.