సబ్ ఫీచర్

పొందూరు ఖాదీకి మంచి రోజులు వచ్చేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేవలం దేశంలోనే కాకుండా విదేశాల్లో సయితం ఎనలేని గుర్తింపు పొందిన పొందూరు సన్నఖాదీ పరిశ్రమ నేడు క్లిష్ట దశలో ఉంది. కార్మికులకు గిట్టుబాటు ధరలు లభించక పోవడంతో పలువురు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళ్తున్నారు. మరికొందరు పొట్టకూటికోసం సుదూర ప్రాంతాలకు తరలిపోతున్నారు. తన మనుగడను నిలుపుకొనేందుకు పరిశ్రమ అష్టకష్టాలు పడుతోంది. ఎంతో ప్రాచీనమైన ఈ పరిశ్రమ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. జాతీయ వారసత్వ సంపదకు చిహ్నంగా ఉన్న ఈ పరిశ్రమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. ఖాదీ వస్త్రాలు వేసవి కాలంలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటాయి. వీటిని ధరించేవారు హుందాగా కన్పిస్తారు.
సత్యం, అహింసలపై నిర్మితమైన ఆర్థిక సామాజిక వ్యవస్థ నిర్మాణానికి కుటీర పరిశ్రమలు పునాది వంటివి. అందులోను ఖాదీ పరిశ్రమ గ్రహ మండలంలో సూర్యుని వంటిదని గాంధీజీ అనేవారు. రాజనీతిలో అహింసకు ఎంతటి ఉన్నత స్థానం ఉందో, అర్థశాస్త్రంలో ఖాదీకి అంతే ప్రముఖ స్థానం ఉంది. కదురు, కవ్వం ఆడేచోట కరువు, కాటకాలు ఉండవు. అయితే పరిస్థితి మారింది. గతంలో ఈ పరిశ్రమలో మొత్తం 40 గ్రామాల్లో 1500 మంది వడుకు పనివారలుండగా ఆ సంఖ్య 950 మందికి పడిపోయింది. నేత పనిచేసే కార్మికులు 200 మందికి పైగా ఉండేవారు. ప్రస్తుతం 95 మంది మాత్రమే ఉన్నారంటే పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏడాదికి 2000 మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వస్త్రాలకు గిరాకీ బాగానే ఉంది. తగినంత వస్త్రాన్ని వాడకం దార్లకు అందజేయలేకపోతున్నారు. ఏటా రూ.1.8 కోట్ల విలువచేసే వస్త్రాలను ఇక్కడ తయారుచేస్తున్నారు. రూ.3 కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వస్త్రాలను మన రాష్ట్రంలో హెచ్చుగా గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కడప, హైదరాబాద్, బెంగుళూరులకు ఎగుమతి చేస్తున్నారు. ఎన్.ఆర్.ఐలు ఇక్కడి నుంచి పెద్దఎత్తున ఖాదీ వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా షర్టింగ్ వస్త్రానికి మంచి డిమాండు ఉంది. ఆ తరువాతి స్థానం ధోవతీలదే (పంచెలు). అక్కినేని నాగేశ్వరరావు అంచు పంచెకయితే తిరుగులేని గిరాకీ ఉంది. కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో అవసరమైన వస్త్రాలను ఉత్పత్తిచేయలేకపోతున్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి రాష్టప్రతి ప్రతిభాపాటిల్ కోరిక మేరకు అద్భుతమైన చీరను నేసి ఇక్కడి కార్మికులు ప్రశంసలు పొందారు. అయితే గత నాలుగేళ్ల నుంచి కనీసం ఒక్క చీరను కూడా నేసే పరిస్థితి ఇక్కడ లేదు. కార్మికులు పరిమితంగా ఉన్నందున చీరల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కొత్తగా ఈ రంగంలోకి ఎవ్వరూ రాకపోవడంతో స్థానిక ఆంధ్ర సన్నఖాదీ కార్మికాభివృద్ధి సంస్థ తల పట్టుకొంటోంది. కార్మికులు ఇంటిల్లిపాది రోజంతా కష్టపడి పనిచేస్తున్నా తగు ఆదాయం లభించకపోవడంవల్ల ఈ దుస్థితి దాపురించింది. రోజుకు 100వ కౌంటు చిలపను తయారుచేస్తే రూ.64కి మించి రావడం లేదు. నేత కార్మికుడు మీటరు వస్త్రాన్ని తయారుచేస్తేరోజుకు రూ.200కి మించి రావడం లేదు. దీంతో ఈ పరిశ్రమను అంటిపెట్టుకొని జీవనం సాగిస్తున్న కార్మికులు అర్థాకలితో అలమటిస్తున్నారు.
ఇక ఈ పరిశ్రమకి ఎంతో అవసరమైన ఎర్రపత్తి, కొండపత్తి, పునాస పత్తి లభ్యంకావడం కష్టమవుతోంది. ఏటా 20వేల కిలోల పత్తిని వినియోగిస్తున్నారు. రైతులకు ఖాదీ సంస్థ ఉచితంగానే విత్తనాలు అందజేస్తున్నారు. ఈ పంట తమకు గిట్టుబాటు కావడం లేదని కిలోకు కనీసం రూ.250 చెల్లించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. ఏవో తంటాలుపడి అతి కష్టంమీద ఎంతో కొంత మొత్తాన్ని రైతులకు చెల్లిస్తున్నారు. అఖిల భారత ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ రైతులకు నీటిపారుదల సౌకర్యం, ఎరువులను, సశ్యరక్షణ మందులను ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చేస్తే తప్ప ముడిసరకు సమస్య తీరడం కష్టమవుతుంది.దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు తమవంతుగా 10 నుంచి 20 శాతం మేరకు రిబేటు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయ. అయితే మన రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. గతంలో 5 శాతం రిబేటు ఇచ్చేవారు. ఇందుకు సంబంధించి 1994-95 ఆర్థిక సంవత్సరం వరకు రావలసిన రిబేటు బకాయిలు రూ.8.75 లక్షల మొత్తాన్ని నేటికీ చెల్లించలేదు. స్థానిక ఖాదీ సంస్థ ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇవ్వడమే తప్ప జరిగింది శూన్యం. ఇక అఖిల భారత ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ (కె.వి.ఐ.సి.) మార్కెటింగ్ డెవలప్‌మెంటు అసిస్టెన్స్ (ఎం.డి.ఏ) కింద ఇవ్వాల్సిన 15 శాతం బకాయిలను సకాలంలో చెల్లించడం లేదు. దాంతో సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
ఇక ఖాదీ పరిశ్రమకు నకిలీ ఖాదీ సమస్య సవాల్‌గా మారింది. పొందూరు ఖాదీ వస్త్ర వ్యాపారం ఏటా రూ.3 కోట్లు కాగా, నకిలీ ఖాదీ రూ.15 కోట్ల మేరకు ఉత్పత్తి అవుతోంది. నకిలీ ఖాదీ వస్త్రాల తయారీదారులపై ఎలాంటి చర్యలు లేవు. దీంతో నకిలీ ఖాదీ వ్యాపారులు పొందూరు ఖాదీ పేరుతోనే తమ వస్త్ర సామ్రాజ్యాన్ని విస్తరింప జేస్తున్నారు. చేతితో వడికిన నూలును కాకుండా, మిల్లు దారాన్ని ఉపయోగించి తేనీటి కషాయంలో ముంచి నకిలీ వస్త్రాలను తయారుచేస్తున్నారు. నకిలీ ఖాదీని పూర్తిగా నిర్మూలించాలి. కార్మికులకు గిట్టుబాటు మజూరీలను కల్పించాలి. గృహ నిర్మాణ పథకాలను అందుబాటులోకి తీసుకొని రావాలి. అన్నింటికి మించి కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరుచేసిన ‘స్ఫూర్తి’ పథకాన్ని పూర్తిగా అందుబాటులోకి తేవాలి. ఈ పథకంలో కేటాయించిన యంత్ర సామగ్రిని వినియోగించుకుంటే కార్మికులకు పనిభారం తగ్గుతుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎన్.ఆర్.ఇ.జి.ఎస్)ను ఖాదీ పరిశ్రమకు వర్తింపజేయాలి. చేనేత పరిశ్రమకు కల్పిస్తున్న రుణ మాఫీ వంటి రాయితీలను ఖాదీ పరిశ్రమకు కల్పించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ పక్షాన ఈ పరిశ్రమకు కనీసం 10 శాతం రిబేటును కల్పించాలి. ఈ పరిశ్రమ అంతరించిపోకుండా యువతీ యువకులకు కొత్తగా శిక్షణనిప్పించి ఉపాధి కల్పించడం ఎంతయినా అవసరమని ఇక్కడి పరిస్థితులు నొక్కిచెబుతున్నాయి. ప్రభుత్వపరంగా ఈ పరిశ్రమను ప్రోత్సహించాలని కోరుతూ ఈ ఏడాది ఫిబ్రవరి 4న పొందూరు విచ్చేసిన అఖిల భారత ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ ఛైర్మన్ వినయ్‌కుమార్ సక్సేనాకు ఖాదీ సంస్థ పాలక వర్గం విజ్ఞాపన పత్రాన్ని అందజేసింది కూడా. స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

చిత్రం రాట్నంపై దారం తీస్తున్న కార్మికులు

- వాండ్రంగి కొండలరావు