సంపాదకీయం

ఎదురులేని ‘ఉగ్ర మృగం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ రాజధాని లండన్‌లో పార్లమెంట్ భవనం సమీపంలో ఒక ఉగ్రవాది సృష్టించిన బీభత్సకాండ ప్రతీక మాత్రమే. బుధవారం నాడు కారును పైశాచిక వేగంతో దురుసుగా నడిపిన ఈ ఉగ్రవాది ముగ్గురిని హత్య చేయగలగడం నిరంతర నిర్నిద్రులైన స్కాట్‌లాండ్ యార్డ్-లండన్ పోలీసులకు దిగ్భ్రాంతిని కలిగించిన ఘటన. పోలీసులు దిగ్భ్రాంతి నుంచి తేరుకుని హంతక బీభత్సకారుడిని తుదముట్టించేలోగా అతగాడు కారుతో గుద్ది, కత్తితో పొడిచి దాదాపు ఇరవై మందిని గాయపరిచాడట! పార్లమెంటు భవనం ఉన్న ఆ ప్రాంతంలో భద్రత కట్టుదిట్టమై ఉండడం జగమెరిగిన సత్యం! ఇటీవలి కాలంలో బ్రిటన్‌లోను, ఐరోపాలోని ఇతర దేశాలలోను జిహాదీ హంతకులు దాడులు మొదలుపెట్టిన తరువాత పోలీసుల అప్రమత్తత మ రింత పెరిగింది. అయినప్పటికీ పార్లమెంటు భవనం సమీప ప్రాంతంలోనే బీభత్స పిశాచం మరోసారి చొరబడిపోవడం బ్రిటన్ ప్రజలను మాత్రమే కాక ప్రపంచ దేశాల ప్రభుత్వాలను కలవరపరచవలసిన దుష్పరిణామం. అమెరికాలోని న్యూయార్క్ నగరం పోలీసుల తరహా బ్రిటన్‌లోని స్కాట్‌లాండ్ యార్డ్ పోలీసుల భద్రతా వ్యవస్థ అత్యంత పటిష్ఠమైనది. వాటి తరహాలో మన దేశపునగరాలలో సైతం భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నది వివిధ రాష్టల్ర ప్రభుత్వాలు వ్యక్తం చేస్తున్న ఆకాంక్ష. అందువల్ల కారును నడిపిన ‘టెర్రరిస్ట్’ పార్లమెంటు సమీప ప్రాంత భద్రతా వలయంలోకి చొరబడగలగడం దిగ్భ్రాంతికరం. కారు నడిపిన బీభత్సకారుడే కారు దిగి పోలీసు అధికారిని పొడిచి హత్య చేశాడా? లేక కారు నడిపిన దుండగుడు, పోలీసు అధికారిని పొడిచి చంపిన హంతకుడు వేరు వేరు బీభత్సకారులా? అన్నది కూడ స్ప ష్టం కాలేదు. పార్లమెంటు భవనంలో ఉండిన బ్రిటన్ ప్రధాని థెరిసా మాయ్‌ను బీభత్స ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తరలించుకుని వెళ్లి ఆమె అధికార నివాసానికి చేర్చడం తీవ్రమైన ఆందోళనకు నిదర్శనం. మరి కొందరు దుండగులు పార్లమెంటు భవనంలోకి చొరబడినట్టు లేదా చొరబడనున్నట్టు పోలీసులు భయపడడం ఇందుకు కారణం! పోలీసు అధికారిని పొడిచి ఆ తరువాత హతుడైన దుండగుడు పార్లమెంటు భవనం వైపుగా దూసుకని రావడానికి యత్నించాడట! కారు బీభత్సం నుండి తప్పించుకొనడానికై అనేకమంది పాదచారులు సమీపంలోని నదిలోకి దూకడం కూడ భయంకర భయ విభ్రాంతికి నిదర్శనం! బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో సరిగ్గా సంవత్సరం క్రితం 2016 మార్చి ఇరవై రెండవ తేదీన ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం-ఐఎస్‌ఐఎస్-ఐసిస్-జిహాదీలు భయంకర హత్యాకాండ జరిపారు. ముప్పయి నలుగురు హతులు కాగా రెండు వందల మంది క్షతగాత్రులయ్యారు.
బ్రస్సెల్స్ నగరం ఐరోపా సమాఖ్య ప్రధాన కేంద్రం కూడ. ఈ బీభత్సకాండ జరిగి సంవత్సరం నిండిన సందర్భంగా ఉగ్రమృగాలు మరోసారి దూకవచ్చునన్న భయాందోళనలు కూడ ముందుగానే ప్రచారమయ్యాయి. అయినప్పటికీ బ్రస్సెల్స్ ఘటనకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ‘తోడేళ్లు’ మరోసారి దూకగలిగాయి! ఒకసారి దాడి జరిగిన తరువాత అమెరికా భద్రతా దళాలవారు, ఐరోపా దేశాల నిఘా విభాగాలవారు మరోసారి ఉగ్రవాదులు చొరబడకుండా దాడులు చేయకుండా నిరోధించగలరన్నది విశ్వాసం. 2001లో న్యూయార్కులోని ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖాయిదా మూకలు దాడి చేసిన తరువాత పదేళ్ల పాటు ఈ విశ్వాసం కొనసాగింది. కానీ ఇటీవలి కాలంలో ఈ విశ్వాసం సడలిపోయింది. అభేద్యమైన అమెరికా ఐరోపా దేశాల భద్రతా కుడ్యాలకు జిహాదీలు భయంకరమైన రంధ్రాలను వేయగలుగుతున్నారు. గత ఏడు బ్రస్సెల్స్‌లో జరిగిన భయంకర రక్తపాతం ఇందుకు కేవలం ఒక నిదర్శనం! బ్రిటన్ సహా ఐరోపా దేశాలన్నీ బీభత్స మృగాల విహార వాటికలుగా మారి ఉండడం వర్తమాన వైపరీత్యం! దాదాపు ముప్పయి ఏళ్ల క్రితం డగ్లస్ హర్ట్ బ్రిటన్ దేశ వ్యవహారాల మంత్రిగా ఉండేవాడు. మనదేశపు దౌత్యవేత్త పిసి అలెగ్జాండర్‌ను లండన్‌లోని తన నివాసానికి ఆయన ఒకసారి ఆహ్వానించాడట! అలెగ్జాండెర్ వెళ్లేసరికి రాత్రి ఎనిమిది గంటలు దాటింది. అందువల్ల దేశ వ్యవహారాల మంత్రి ఇంటిలోని అటెండర్లు విధులు ముగించుకుని వెళ్లిపోయారు! డగ్లస్ హార్ట్ స్వయంగా వచ్చి ఇంటి ప్రాంగణపు ద్వారాన్ని తెరిచి అలెగ్జాండర్ కారును లోపలికి తీసుకెళ్లాడట! అలెగ్జాండర్ ఆ తరువాత ఈ సంగతిని వెల్లడించాడు. వంట మనిషి అప్పటికి వెళ్లిపోవడం వల్ల వారిద్దరికీ దేశ వ్యవహారాలమంత్రి భార్య భోజనం పెట్టిందట! డగ్లస్ హర్ట్ స్వయంగా కారు నడపుకుంటూ వెళ్లి తన పిల్లలను కళాశాలలో దింపి వచ్చేవాడట! అప్పుడంత ప్రశాంతత లండన్‌లో నెలకొని ఉండేది..
ఇప్పుడు లండన్ మాత్రమే, బ్రిటన్ మాత్రమే కాదు మొత్తం ఐరోపా ఖండం పోలీసుల వలయంగా మారి ఉంది! విమానాశ్రయాలలో, రైలు స్టేషన్లలోను, బస్ స్టేషన్లలోను ఇతర ప్రధాన స్థలాలలో అడుగడుగునా తనిఖీల వ్యవస్థ ఏర్పడి ఉంది! అనవసర అనుమానాలతో శాసన నిబద్ధ పౌరులను, విదేశీయులను బస్సుల నుండి రైళ్ల నుండి విమానాల నుండి అర్ధాంతరం గా దింపివేయడం, నిర్బంధించడం ఐరోపాలో, అమెరికాలో సర్వసాధారణ మైంది. ఐరోపా దేశాలు భద్రత పేరుతో అతిగా వ్యవహరిస్తున్నాయన్న ప్ర చారం కూడ మొదలైంది. అయినప్పటికీ టెర్రరిస్టులు దాడులు చేయగలడం వారి పైఎత్తులు పెరిగాయన్నదానికి నిదర్శనం. బ్రిటన్‌లో టెర్రరిస్టుల దాడులు చే యడం ఇది మొదటిసారి కాదు! 2005 జూలైలో లండన్‌లోని మూడు రైళ్లలోను, ఒక బస్సులో జిహాదీ అల్‌ఖాయిదా ముఠావారు ఒకేసారి పేలుళ్లు జరిపి యాబయి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. అప్పటినుంచి 2015 డిసెంబర్ వరకు బ్రిటన్‌లో అనేక బీభత్స ఘటనలు జరిగాయి. గత నాలుగేళ్లలో దాడులు జరపడానికి జిహాదీ మతోన్మాద హంతకులు విఫలయత్నాలు చేయడం నిరంతరం పొంచి ఉన్న ముప్పునకు నిదర్శనం. జిహాదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమరం మాత్రం ఇప్పటికీ ఆరంభం కాలేదు!!
ఇందుకు ప్రధాన కారణం అగ్రరాజ్యాల మధ్య ఆగని ఆధిపత్య సమరం! తమ దాకా వచ్చే వరకు అమెరికా, రష్యా, చైనా ఐరోపా దేశాలు జిహాదీ బీభత్సకాండను పట్టించుకొనకపోవడం మరో కారణం. మన దేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వం 1947 నుంచి జిహాదీ తోడేళ్లను ఉసిగొల్పుతునే ఉంది. ఇదే సమయంలో అ మెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు భారీ ఎత్తున ఆర్థిక, ఆయుధ సహాయం అందించింది. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికి దశాబ్దులుగా బీభత్సకారులను ఉసిగొల్పుతున్న పశ్చిమ ఆసియా దేశాలకు అమెరికా ఇప్పటికీ ఆయుధాలను అమ్ముతోంది. మన దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న జిహాదీ బీభత్సకాండను ఇప్పటికీ చైనా బాహాటంగానే సమర్ధిస్తోంది. 2001లో అమెరికాపై అల్‌ఖాయిదా దాడి చేసిన తరువాత మాత్రమే అమెరికాకు, ఐరోపాకు బీభత్సకాండ ప్ర మాదం గురించి తెలిసి వచ్చింది. ఇప్పటికైనా అగ్రరాజ్యాలు ఉగ్రవాదాన్ని వదిలించగలవా?