సంపాదకీయం

హేమలంబ శుభవేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంత వేళల ప్రశాంత సుందర
నిశాంత దృశ్యం నెలకొంటున్నది..
రసాల పల్లవ పరిమళ సీమల
మరో ‘వత్సరము’ ఉదయిస్తున్నది!
ఈ వత్సరం ‘హేమలంబ’ నామ విరాజితం, ఈ దృశ్యం సనాతన చారిత్రక పునరావృత్తం.. పునరావృత్తం కావడం విశ్వ వ్యవస్థ.. నిన్నటి సూర్యుడు నేడు సరికొత్తగా ఉదయించడం పునరావృత్తం! గత ఏడాది పలికిన వెలకోయిల మంగళవారం మళ్లీ గొంతెత్తి శుభంకర నూతన సంవత్సరానికి స్వాగతం పలకడం పునరావృత్తి! అరవై ఏళ్ల క్రితం అరుదెంచి అలరించిన ‘హేమలంబ’ మళ్లీ అవతరించడం పునరావృత్తికి మరో సంకేతం. పునరావృత్తిలో వినూతన ఆరంభం నిహితమై ఉంది. వినూతన ఆరంభంలో పునరావృత్తి ప్రస్ఫుటిస్తోంది! శిథిల శకలాల శిశిరం ముగిసిన వెంటనే సకల హరిత శోభల వసంతం సభలు తీరడం తెలుగు వారి ప్రతి సంవత్సరాది సమయంలో పునరావృత్తం అవుతున్న శుభంకర దృశ్యం! ఈ దృశ్యం సనాతన విశ్వ వ్యవస్థకు మరోప్రతీక, క్షణమాగని సమయ రథానికి పతాక! ‘సనాతనం’ అని అంటే ‘శాశ్వతం’ అని అర్థం. సనాతనం అని అంటే మొదలు లేనిది, తుది లేనిది! ఇలా ఆద్యంత రహితమైన ‘మహాకాల’ ప్రస్థానంలో క్షణాలు, దినాలు, నెలలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు, యుగాలు, మహాయుగాలు, మన్యంతరాలు, కల్పాలు అసంఖ్యాకంగా గడిచిపోయాయి, అసంఖ్యాకంగా గడిచిపోనున్నాయి. అందువల్ల ప్రతిక్షణం గత క్షణానికి పునరావృత్తి.. ప్రతి క్షణం వినూతనం! ప్రతి ఉదయం మొ లకెత్తుతున్న వెలుగుల వృక్షం, ప్రతి వసంతం ఆహ్లాదకర శోభల హరిత వలయం, ప్రతి చైత్రం గత చైత్రానికి ప్రతిబింబం, రా నున్న మరో చైత్రానికి అద్దం.. వత్సరాది. వసంతా ది శుభకరమైన ప్రారంభ సమయాలు! చైత్ర వైశాఖ మాసాలు చాంద్రమాన పద్ధతిలో వసంత ఋతువు! మీన, మేషమాసాలు సౌరమాన పద్ధతి వసంత ఋతువు.. ఎలా పరిగణించినప్పటికీ సమయం ఒ క్కటే, ఈ సమయంలో సృష్టి మధుమయంగా మారుతుంది. అందుకే చైత్ర మాసానికి ‘మధు’మాసం అని పేరు. మధువు-తేనె-కు సంబంధించిన మరో మాసం ‘మాధవ’ మాసం వైశాఖం.. ప్రకృతి పువ్వుల పరిమళాలతో నవ వధువుగా మారడం ‘వసంతుడు’ వరుడు కావడం ‘ఉగాది’ వేదిక కావడం సృష్టిగత వాస్తవం! ఉగాది ఉదయించగానే పువ్వులలో ‘మధువు’-తేనె-లు ఉప్పొంగుతాయి, ఉప్పొంగిన తేనెల పరిమళాలతో నిండిన పవనాలు పుడమిని మధుమయం చేస్తాయి! పుడమి బిడ్డల బతుకులను మధుర భావమయం చేస్తాయి! ఉగాది ఇలాంటి మధుర మానవ జీవనానికి మరో శుభారంభం..
భారతీయుల ‘కాలగణనం’ భారతీయులు సృష్టించలేదు. సృష్టిలో నిహితమై ఉన్న కాలగమనాన్ని భారతీయులు అనాదిగా నిర్దిష్టంగా నిర్దుష్టంగా గుర్తించారు. ఈ సృష్టిగత కాల పరివర్తన మానవ నిర్మితం కాదు, ఏదో ఒక మతానికో మత ప్రవక్తకో పరిమితమైనది కాదు.. ఇది సహజం, సృష్టిగత సత్యం. అయితే ప్రపంచంలోని మిగిలిన జాతులవారు ఈ సత్యాన్ని గుర్తించలేదు. గుర్తించిన వారు భారత జాతి వారు, హిందూ జాతివారు. అందుకే మన కాలగణనం నూట తొంబయి ఐదు కోట్ల సంవత్సరాలకు పైగా నిర్దిష్టంగా, నిర్దుష్టంగా సాగుతోంది! సృష్టిగత వాస్తవాలను సమాజ స్థితంగా మార్చుకొని జీవన వ్యవహారంగా దిద్దుకున్న జాతి మనది.. ఉగాది ఈ ‘కాలగణన’కు కొలమానం. ఇది శే్వత వరాహకల్పం.. ప్రతి ‘కల్పం’లోను పదునాలుగు మన్యంతరాలున్నాయి. ప్రతి ‘మన్యంతరం’లోను డెబ్బయి ఒక్క మహాయుగాలున్నాయి. ‘కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు’ కలిసి ఒక ‘మహాయుగం’.. ఈ ‘కల్పం’లో ఆరు మన్యంతరాలు గడిచాయి, ఏడవదైన వర్తమాన వైవస్వత మన్యంతరంలో ఇప్పటికి ఇరవై ఏడు మహాయుగాలు గడిచాయి, ఇరవై ఎనిమిదవ మహాయుగంలోని కలియుగం ప్రస్తుతం నడుస్తోంది. ఈ కలియుగంలో ఐదు వేల నూట పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ఉగాదితో మొదలయ్యే ‘హేమలంబి’ ఐదువేల నూట పంతొమ్మిదవ సంవత్సరం. ‘హేమలంబ’ నామం కలది హేమలంబి. ప్రభవ నుంచి అక్షయ వరకు గల అరవై సంవత్సరాలలో ‘హేమలంబి’ ముప్పయి ఒకటవది.
చాంద్రమానం ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మొదలు కావడం తెలుగు, కన్నడ, మరాఠీ, త్రివిష్టప-టిబెట్- భాషా జన సముదాయాలు పాటిస్తున్న సంప్రదాయం! తమిళులు, మరికొన్ని భాషా ప్రాంతీయులు ‘సౌరమానం’ పాటిస్తున్నారు. సూర్యుడు ‘మేషరాశి’లో ప్రవేశించిన రోజున ‘మేష సంక్రాంతి’.. అదే తమిళుల సంత్సరాది. పనె్నండు సంక్రాంతులు పనె్నండు నెలలు.. ఇదీ సౌరమాన సంవత్సరం. సాంప్రదాయకంగా మన దేశంలో ‘నిరయన’ సౌరమానం పాటిస్తున్నారు. మన ప్రభుత్వం వారు క్రీస్తు శకం 1957 నుంచి ‘సాయన’ పద్ధతిలో ‘సౌరమాన’ పంచాంగాన్ని ఏర్పాటు చేశారు. ఈ ‘శాలివాహన’ శకం ప్రస్తుతం మన జాతీయ శకం. శాలివాహన శకం ప్రకారం ఉగాది నుంచి 1939వ సంవత్సరం. ఉత్తర భారతంలో ను, నేపాల్‌లోను ‘విక్రమ శకం’ పాటిస్తున్నారు! ‘బృ హస్పతి’ ప్రతి ‘రాశి’లో కలసి సంవత్సరం ఉదయిస్తాడు. ‘బృహస్పతి’ గ్ర హం ‘రాశి’ మారినప్పుడు ఉత్తరాదిన కొన్ని ప్రాంతాలలో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఇది ‘బృహస్పతి’ మానం.. ‘చాంద్రమానం’ పాటిస్తున్న తెలుగు, కన్నడ, మరాఠీలు ‘అమావాస్య’తో ‘నెల’ను పూర్తి చేస్తారు. ‘బృహస్పతి’ మానం పాటించేవారు ‘పౌర్ణమి’తో నెలను ముగిస్తారు. ఇలా వివిధ పద్ధతుల ‘కాలపరిణామం’ కూడ సృష్టిలోని ‘వైవిధ్యాలకు సాక్ష్యం! సృష్టతో అనుసంధానం సాధించిన భారతీయులు కూడ వైవిధ్యాలను స్వీకరించారు. వైవిధ్యాల మధ్య ‘సమన్వయం’ సాధించుకున్నారు.. ఈ సమన్వయం వసంతం, మత వైవిధ్యాల మధ్య, భాషా వైవిధ్యాల మధ్య సమన్వయం ఏర్పడి ఉండడం భారతీయ సంస్కార వసంతం.. కోకిలలు, చిలుకలు, గోరువంకల వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు. సమన్వయ గళం హాయిని కలిగిస్తోంది! వైవిధ్య భాషా, మత, కాలగణన, ఆహార ఆహార్యాల మధ్య ఇంకా అసంఖ్యాక వైవిధ్యాల మధ్య సమన్వయం భారతీయుల సంస్కార వసంతం!! భిన్న సుమాల పరిమళం ‘వసంతం’గా ప్రస్ఫుటిస్తోంది.. వైవిధ్య సంస్కారాల సమాహారం హిందుత్వంగా భారతీయతగా జాతీయ జీవన వసంతమైంది..
‘స్వచ్ఛ భారతం’ కేవలం భౌతికం కాదు! అది సాంస్కృతికం కూడ! వేపపువ్వులతో మామిడి పిందెలు, స్వచ్ఛమైన తేనె మొదలైన రుచులు సమన్వయం చెందడం సమన్వయ సంస్కృతికి ‘ఉగాది’ చెపుతున్న సాక్ష్యం! ఈ సంస్కారం సర్వలోక హితకరం.. సర్వ వైవిధ్య పరిరక్షక తత్త్వం. ఉగాది నాడు తెలుగువారు ఈ మంగళకర లక్ష్యానికి పునరంకితులు. భారతీయులు విశ్వకల్యాణ కారకులు!