సంపాదకీయం

ఇది.. రాజకీయ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరచరితులు రాజకీయాల్లోకి చొరబడి పోతుండ డం వల్ల సంభవిస్తున్న విష పరిణామాలకు ఇవి సరికొత్త సాక్ష్యాలు. ‘ఎయిర్ ఇండియా’ సంస్థకు చెం దిన ప్రధాన విధి నిర్వాహకుడి- డ్యూటీ మేనేజర్-ను వారం రోజుల క్రితం ‘శివసేన’ రాజకీయ పక్షానికి చెం దిన రవీంద్ర గయిక్వాడ్ అనే నేత కొట్టడం మొదటి వైపరీత్యం! ఇలా కొట్టిన గయిక్వాడ్ మామూలు రాజకీయ వేత్త కాడు. మొత్తం దేశానికి చట్టాలను రూపొందించి పరిపాలనను వ్యవస్థీకరించి మార్గదర్శనం చేసే అత్యున్నత ప్రజాస్వామ్య రాజ్యాంగ విభాగమైన పార్లమెంటులో సభ్యుడు. ఇది రెండవ వైపరీత్యం. నేరస్థులు రాజకీయాల్లోకి మాత్రమే కాదు, చట్టసభల్లోకి చొరబడిన తరువాత దశాబ్దులు గడిచాయి. సరికొత్త సాక్ష్యం రవీంద్ర గయిక్వాడ్ రాజకీయ బీభత్సం. వీధి గూండాలను, తాగుబోతులను, తిరుగుబోతులను, హత్యా ప్రవృత్తి కలవారిని పోగేసుకొని ఆధిపత్యాన్ని చెలాయించేవారు ‘పంచాయతీ’ రాజకీయ స్థాయిలో మాత్రమే ఉండడం గత చరిత్ర. పెద్దగా ‘చదవని’ వారు, వేలిముద్ర వేయడం తప్ప సంతకాలు చేయనివారు ‘పంచ్’లు- మెంబర్లు-గా ‘సర్‌పంచ్’లుగా ఎన్నికయ్యేవారు. పాపం- చదువు, సంస్కారం లేని వారు ఇలా అట్టడుగు స్థాయిలో రాజకీయాలను చెలాయించడం చూసి మేధావులు, ఉన్నత ఉన్నతోన్నత స్థాయి రాజకీయ వేత్తలు బాధపడేవారు! పట్టణాల్లో ‘మెంబర్’ను ‘నంబర్’ అని పలికినవారు ‘వార్డు’ ప్రతినిధులు కావడం, నగరాల్లో ‘కార్పొరేటర్లు’ గూండాగిరీ చెలాయించడం తరువాతి పరిణామ క్రమం. ‘కానిస్టూయెన్సీ’-నియోజకవర్గం -కి, కానిస్టిట్యూషన్- రా జ్యాంగం-కూ తేడా తెలియని వారు సైతం శాసనసభ్యులై పోతున్నారని ఈ ‘తేడా’ తెలిసిన మేధావులు లెక్కించేవారట. ఇది కూడా గతం! కానీ అట్టడుగు స్థాయి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ‘ప్ర క్రియ’ మొదలైన తర్వాత కూడ దశాబ్దులు గడిచిపోయాయి. అందరినీ విద్యావంతులను చేయడం, సంస్కారవంతులను చేయడం ఈ ప్రక్రియలో భాగం. ఫలితంగా ఉన్నత, ఉన్నతోన్నత విద్యావంతులు అట్టడుగు స్థాయి రాజకీయాలను సైతం పరిపుష్టం చేశారు, పరిపుష్టం చేస్తున్నారు. ‘పంచ్’లుగాను, వార్డు మెంబర్లుగాను పట్ట్భద్రులు, ఇలా పైస్థాయి విద్యావంతులు ఎన్నికవుతుండడం నడుస్తున్న రాజకీయం..
శాసనసభ, కేంద్ర చట్టసభల స్థాయిలో ఉన్నత విద్యావంతులు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం గురించి చెప్పనవసరమే లేదు. పట్ట్భద్ర స్థాయి కంటె కిందిస్థాయి విద్యావంతులు బహుశా చట్టసభలకు ఎన్నిక కావడం లేదు. అందువల్ల ఈ విద్యావంతులు ‘గొప్ప సంస్కారవంతులు’ కాబట్టి రాజకీయాల్లో నైతికత, సౌశీల్య నిష్ఠ పెరిగి ఉండాలి. పెరగలేదని రవీంద్ర గయిక్వాడ్ జరిపిన దౌర్జన్యం వల్ల మరోసారి ధ్రువపడింది. ఈ నేరం జరిగి దాదాపువారం రోజులవుతున్నప్పటికీ ఈ ‘చట్టాల నిర్మాత’కు వ్యతిరేకంగా పోలీసులు చట్టాన్ని ప్రయోగించక పోవడం మరో వైపరీత్యం. చిన్న,చితక జనాలు ఇలాంటి నేరాలకు పాల్పడితే పోలీసులు ఈపాటికి అలాంటి నిందితులను అరెస్టు చేసి చితక్కొట్టి పారేసి ఉండేవారు. నిందితుడు, నేరచరితుడు ఇప్పుడు పార్లమెంటు సభ్యుడు కాబట్టి పోలీసులు మందకొడితనానికి గురయ్యారు. ఈ పోలీసులు కూడా విద్యావంతులే. దశాబ్దులుగా విద్యావంతుల సంఖ్య పెరగడం వల్ల నిష్పక్షపాత పరిపాలన వ్యవస్థీకృతమై ఉండాలి. కాలేదు. సామాన్య మానవులను దబాయించడం, వారిపై దౌర్జన్యం చేయడం పోలీసులకు మాత్రమే కాదు, అన్ని ప్రభుత్వ రంగాల్లోని అధిక విద్యావంతులకు ప్రవృత్తి కావడం మన దేశంలోని ఉన్నతుల సౌశీల్యానికి లేదా దుశ్శీలానికి ‘సూచిక’ వంటిది! ఇలాంటి దౌర్జన్యం విమాన సంస్థల నిర్వాహకులు కూడ సామాన్యులపై సాగిస్తారు. సామాన్యులు విమానాలు ఎక్కరనుకోండి.. మధ్య తరగతి వారే విమానాల ఉద్యోగుల పాలిట, విమానాశ్రయాల నిర్వాహకుల పాలిట సామాన్యులు. ఇలాంటి హుందాతనం అతిశయం కలిగిన విమానసంస్థల ఉన్నత ఉద్యోగిని సైతం కొట్టగలిగిన ఈ ‘శివసేన’ పార్లమెంటు సభ్యుడు సామాన్య మానవుల పట్ల ఎలా ప్రవర్తించగలడో ఊహించడం అసాధ్యం కాదు. ఇతరులు ఎవరైనా ఇలాంటి భౌతిక బీభత్సకాండకు పాల్పడి ఉంటే విమానంలోని సిబ్బంది నేరస్థుడిని చితక్కొట్టి ఉండేవారు. భద్రతాధికారులు నిందితుణ్ణి పోలీస్ స్టేషన్‌కు అప్పగించి ఉండేవారు.
ఇలా సిబ్బంది చేత ‘చితక్కొట్టుడు’కు ఈ ‘చట్టాల నిర్మాత’ గురికాకపోవడానికి కారణం అతగాడి ఘరానాతనం. ఇతగాడు చట్టాన్ని ఉల్లంఘించినప్పటికీ విమాన సంస్థ సిబ్బంది కాని, విమానాశ్రయం సిబ్బంది కాని చట్టాన్ని ఉల్లంఘించక పోవడానికి కారణం కూడ రవీంద్ర గయిక్వాడ్ ఘరానాతనం. ‘విమానం’ వారు, ‘విమానాశ్రయం’ వారు చట్టాన్ని ఉల్లంఘించక పోవడం అభినందనీయం. కానీ దిల్లీ విమానాశ్రయం భద్రతా సిబ్బంది ఈ ఎంపీని పట్టుకొని పోలీసుల నిర్బంధానికి తరలించి ఉండాలి. పోలీసులు ఇతగాడిని న్యాయస్థానంలో నిలబెట్టి ఉండాలి, నిర్బంధం సంగతిని ‘సభాపతి’కి తె లియజేసి ఉండాలి. ఇలా సహజ న్యాయ ప్రక్రియ కొనసాగకపోవడానికి కారణం కూడ రాజకీయ వేత్తల పట్ల అధికార యంత్రాంగానికి ఏర్పడి ఉన్న భయం! ఇది మన విద్యావంతమైన రాజకీయంలోని మరో వైపరీత్యం. ఈ రాజకీయం ఇంతటితో ఆగలేదు. లోక్‌సభలో గౌరవ సభ్యులు కొందరు గయిక్వాడ్‌కు మద్దతు పలకడమే రాజకీయ దౌర్జన్యకాండకు పరాకాష్ఠ. నేరచరితుని బీభత్స ప్రవర్తనను నిరసించవలసిన శివసేన సభ్యులు అతగాడికి మద్దతు తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నరేశ్ అగర్వాల్ అనే సభ్యుడు కూడ గయిక్వాడ్‌కు సానుభూతి ప్రకటించడం మరీ విచిత్రం! నేరం జరిగిన తర్వాత ఈ శివసేన సభ్యుడు గయిక్వాడ్‌ను తమ విమానాలలో ఎక్కించుకోరాదని దేశంలోని విమానయాన సంస్థలు నిర్ణయించడాన్ని ఈ గౌరవ పార్లమెంటేరియన్లు నిరసించడం ఈ విద్యావంతుల ‘ప్రమాణాల’ స్థాయికి మరో సూచిక మాత్రమే!
విద్యావంతులుగా ప్రతిష్ఠితులుగా చెలామణి అవుతున్న రాజకీయ వేత్తలలో ఇంతమందికి నైతిక నిష్ఠ లేదనడానికి గయిక్వాడ్‌ను ఇలా ఈ పార్లమెంటు సభ్యులు సమర్థించడం మరో ఉదాహరణ. తప్పుచేసిన గయిక్వాడ్ చేత నిర్ద్వంద్వంగా క్షమాపణ చెప్పించాలి లేదా అతడిని తక్షణం నిర్బంధింపవలసిందిగా ప్రభుత్వాన్ని కోరాలి. కానీ శివసేన సభ్యులు తదితర గయిక్వాడ్ సమర్ధకులు అతగాడిపై విమాన సంస్థలు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని మాత్రమే కోరుతున్నారు.. కర్తా కారయితా చైవ, ప్రేరకాశ్చ అనుమోదకాః సుకృతేః దుష్కృతేః చైవ చత్వారం సమభాగినః- మంచిపనిలో కాని చెడ్డపనిలో కాని.. చేసేవాడు, చేయించేవాడు, ప్రోత్సహించేవాడు, ఆమోదించేవాడు- నలుగురూ సమాన భాగస్థులు.. అది సహజ న్యాయసూత్రం! దీన్ని ఎవరు అమలు జరపాలి?