మెయన్ ఫీచర్

నిధుల యాత్రలా? కలల మాత్రలా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అభివృద్ధిలో మనం దేశానికే ఆదర్శం, కొన్నాళ్లకు ప్ర పంచానికే ఆదర్శం, మన రాజధాని అమరావతి- సింగపూర్‌లా.. కాకపోతే ఇస్తాంబుల్‌లా.. అదీ కాదంటే షాంఘైలా మెరిసిపోతుంది. రాష్ట్రం నిండా బుల్లెట్ రైళ్లు, కేబుల్ కార్లు, ప్రతి జిల్లాకు ఓ విమానాశ్రయం, ఇక మనకు లోటేముంది?’ ..ఈ ప్రకటనలు వింటేనే మనకు కడుపు నిండిపోతుంది, కళ్లు చెదిరిపోతాయి, ఏ పాల పుంతలోకో వెళ్లిపోతాం. ఎపి సిఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా లేక ఏ విదేశీ ప్రముఖుడో నవ్యాంధ్రకు వచ్చినప్పుడల్లా మనల్ని అద్భుతమైన రంగుల ప్రపంచంలోకి తీసుకువెడుతుంటారు. వాస్తవంలోకి వచ్చేసరికి మనకు మళ్లీ ‘నలుపు-తెలుపు’ చిత్రమే కనిపిస్తుంటుంది. ఎన్నాళ్లిలా? కలలతోనే కాలక్షేపం చేస్తే ఎలా? గతంలో సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు తానే తొలి సిఇఓనని చంద్రబాబు ప్రచారం చేసుకున్నారు. విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ భారీగా పెట్టుబడులు సాధించినట్టుగా చెప్పుకొచ్చారు. ఆ కథ ముగిసింది. ఎపి ఇప్పుడు 13 జిల్లాలకే పరిమితమైనా, ఆయన చేసే ప్రకటనలకు ఎలాంటి పరిమితి కనిపించడం లేదు. రాష్ట్ర విభజన జరిగాక గత మూడేళ్లలో సాధించిన వాస్తవ అభివృద్ధి ఎంత అన్నది పెద్ద ప్రశ్నార్థకం. ప్రకటనల్లో కనిపించే అంకెలు వేరు, వాస్తవాలను ప్రతిబింబించే లెక్కలు వేరని ఏలిన వారికి తెలిసిందే.
విదేశాలకు వెళ్లవలసిందే. అక్కడి పారిశ్రామిక వేత్తలను, బహుళ జాతి కంపెనీలను ఆకర్షించవలసిందే. కానీ, వెళ్లిన ప్రతిసారీ పెట్టిన ఖర్చుకు తగిన ఫలితం వస్తోందా? చంద్రబాబు వెంట వెళ్లే బృందానికి విదేశీ యాత్రలు ‘విహార యాత్రలు’గా మిగిలిపోతే రాష్ట్రానికి అంతకు మించిన నష్టం ఏముంటుంది? గత మూడేళ్లలో ఎన్ని బహుళ జాతి కంపెనీలు వచ్చి రాష్ట్రంలోని ఎన్ని జిల్లాల్లో తమ శాఖలు తెరిచాయి? ఎన్ని కంపెనీల్లో రాష్ట్ర యువతకు ఎన్ని వేల ఉద్యోగాలు లభించాయి? ఉత్పాదకత ఎంత శాతం పెరిగింది? అభివృద్ధి రేటు వాస్తవంగా ఏ మేరకు ఎదిగింది? పేదరికం ఎంత శాతం దిగింది? చంద్రబాబు విదేశీ పర్యటనలన్నీ నిజంగా సక్సెస్ అయి ఉంటే ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పవలసి ఉంది. ఏ ముఖ్యమంత్రీ ఇంత తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లిన దాఖలాలు లేవు. ఈ విషయంలో ప్రధాని మోదీ తర్వాత చంద్రబాబుదే రికార్డు. దిల్లీ వెళ్లినా, విదేశీ పర్యటనలకైనా ఇతర సిఎంలు సాధారణంగా రెగ్యులర్ విమానాలనే ఉపయోగిస్తుంటారు. కానీ చంద్రబాబు, ఆయన బృందం మాత్రం ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు చంద్రబాబు వరసగా మూడోసారి వెళ్లివచ్చారు. నిజానికి ఆ సదస్సుకు సంబంధించి ఆయనకు అధికారిక ఆహ్వానం అందలేదని, ప్రభుత్వ డబ్బు వెచ్చించి తన ప్రైవేట్ పర్యటనలు అధికారికంగా చేసి వచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అందులో వాస్తవాలేమిటో చెప్పడం ప్రభుత్వ విధి కాదా? తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదా?
నవ్యాంధ్రకు తొలి సిఎం అయిన తర్వాత చంద్రబాబు 2014 నవంబర్‌లో సింగపూర్ వెళ్లారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన ప్రకారం రాజధాని మాస్టర్ ప్లాన్ ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందించాల్సి ఉంటుంది. కానీ ఏం జరిగింది? సింగపూర్ ప్రభుత్వం సుర్బానా అనే కంపెనీకి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యత అప్పగించడంతో రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. చంద్రబాబు చేసిన ప్రకటన వేరు, వాస్తవంగా జరిగింది వేరు. ఆ తర్వాత చంద్రబాబు బృందం జపాన్‌లో పర్యటించి అక్కడి ప్రైవేట్ కంపెనీలతో 6 కీలక ఒప్పందాలు చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. వాటిలో ఏది అమలులోకి వచ్చిందో, ఏది రాలేదో ఇప్పటిదాకా తెలియదు. మూడో విదేశీ పర్యటనగా చంద్రబాబు బృందం 2015 మార్చిలో లండన్ వెళ్లగా, నవ్యాంధ్రలో స్మార్ట్ సిటీల నిర్మాణానికి 22 కంపెనీలు ముందుకు వచ్చినట్టుగా చెప్పారు. పెట్టుబడులు రాబట్టడానికి వీలుగా లండన్‌లో ‘అమరావతి కార్యాలయం’ తెరుస్తున్నట్లు కూడా ప్రకటించారు. స్మార్ట్ సిటీల నిర్మాణానికి ఏ కంపెనీ ముందుకు వచ్చిందో, ఎన్ని కోట్ల పెట్టుబడులకు రంగం సిద్ధమైందో, ఏవి కార్యరూపం దాల్చాయో- ఇప్పటికీ ఒక బ్రహ్మ రహస్యం!
చంద్రబాబు బృందం 2015 సెప్టెంబర్‌లో మళ్లీ సింగపూర్‌లో పర్యటించింది. రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి తీసుకున్న భూములను సింగపూర్ కంపెనీలకు ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో అప్పగించేందుకు జరిపిన పర్యటన అది. ఆ తర్వాత ‘స్విస్ ఛాలెంజ్’ విధానం ఎంతగా వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. 2016 జనవరిలో మళ్లీ దావోస్, జూన్‌లో చైనా, జూలైలో రష్యా పర్యటనలు చేసారు. చైనా పర్యటనలో రూ. 53వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయట. వాటిలో ఒక్కటైనా కార్యరూపం దాల్చినట్టు వార్తలే రాలేదు. రష్యా పర్యటన సందర్భంగా కజకిస్థాన్‌లో రెండు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అయితే వాటి ఆచరణ కూడా అక్కడే నిలిచిపోయిందని సమాచారం.
ఇలా ఇప్పటిదాకా విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాల ఖర్చు, విలాసాల ఖర్చు అన్నీ కలిపి దాదాపు రూ. 150 కోట్లు అని అధికారుల అంచనా. ఆ ఖర్చులకు తగ్గట్లుగానైనా పెట్టుబడులు వచ్చాయా? 5 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు చైనా,జపాన్ సంస్థలు ఆసక్తి ప్రదర్శించినట్టుగా ప్రచారం జరిగినా, శంకుస్థాపన అయినా ఇప్పటి దాకా జరగలేదు. ‘ఏపిని మీ రెండో ఇల్లు అనుకోండి’ అని చైనీయుల చెవుల్లో చంద్రబాబు హోరెత్తినా వారు వినిపించుకున్నట్టే కనిపించదు. బీజింగ్ మాదిరి రైల్వే స్టేషన్లు, షాంఘై తరహాలో షాపింగ్ మాల్స్ అన్నారు. ఏ విదేశానికి వెళ్తే ఆ తరహాగా రాష్ట్రాన్ని మార్చేస్తామన్నారు. అక్కడి పెట్టుబడులన్నీ ఒక్క ఎపీలోనే ప్రవహించబోతున్నాయని హామీ ఇచ్చారు. జపాన్‌లోని ప్యూజీ ఎలక్ట్రిల్స్, జైక, మిత్సుబిషి, సుమిటోమి వంటి దిగ్గజ సంస్థలన్నీ ఏపీకి వచ్చేస్తున్నాయని, ఇక నవ్యాంధ్ర ప్రపంచంలోనే అగ్రస్థానంలోకి వెళ్తుందని అరచేతిలో స్వర్గం చూపించారు. చంద్రబాబు చెప్పిన ఆ విదేశీ సంస్థలలో ఒక్కటైనా ఇక్కడ కాలుమోపిందా? కాలు పెట్టాలనే ఆలోచనతోనైనా ఉందా? మూడేళ్లలో పనె్నండు విదేశీ యాత్రలే కాదు, విశాఖలో 2016, 2017 జనవరిలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించి కొన్ని కోట్లు ఖర్చు చేసారు. వాటివల్ల లభించిన ప్రయోజనం అంతంత మాత్రమే. 2016 జనవరిలో జరిగిన మొదటి భాగస్వామ్య సదస్సు ద్వారా 361 ఒప్పందాలు జరిగినా, ప్రభుత్వం చెప్పినట్టు నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు రానేలేదు. 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయన్నా, అదీ భ్రమే. ఈ ఏడాది జనవరిలో జరిగిన రెండో భాగస్వామ్య సదస్సులో 665 ఒప్పందాలు కుదిరాయని, 22 లక్షల ఉద్యోగాలు ఖాయమని చెప్పారు. మొదటి సదస్సు ద్వారా చెప్పినవే జరగనప్పుడు రెండో సదస్సు ద్వారా ఎన్ని జరుగుతాయో ఎవరు చెప్పగలరు?
అమరావతి డిజైన్ల కోసమంటూ ప్రత్యేక అధికార బృందాలు తరచూ విదేశీ పర్యటనలు జరపడం ఈ మూడేళ్లలో మామూలైపోయింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా- సిఎం, ఆయన అనుగ్రహం పొందిన అధికార బృందాలు విదేశీ పర్యటనలు జరపడం వివాదాస్పదంగా మారుతోంది. సీనియర్ అధికారులు ఇప్పటికి దాదాపు 30 దేశాల్లో పర్యటించారట. వనరులను సమర్ధంగా ఉపయోగించుకుని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడానికి ఎన్ని ప్రణాళికలైనా రూపొందించవచ్చు. కానీ- వస్తాయో, రావో తెలియని పెట్టుబడుల కోసం విదేశీ యాత్రలంటూ తరచుగా విహార యాత్రలు చేయడం సబబేనా? తాజాగా అమెరికా పర్యటనలో కూడా అనేకానేక ఒప్పందాలు ముఖ్యమంత్రి బృందం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఫిన్‌టెక్, డేటా సెంటర్లే కాదు, ప్రాసెసింగ్ రంగాల్లో విస్తరించడానికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను కోరినట్టు వార్తలు వచ్చాయి. సిస్కో తదితర సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ సంస్థలతో సిఎం చర్చలు జరిపారు. ఆయా సంస్థలతో చేసుకున్న ఒప్పందాలలో ఎప్పట్లోగా ఎన్ని కార్యరూపం దాల్చుతాయో? ఈలోగా ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చయిపోతూ ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం చివరిలో అప్పటి దాకా జరిపిన విదేశీ పర్యటనలు, వాటివల్ల లభించిన ప్రయోజనంపై చంద్రబాబు ప్రభుత్వం ఒక శే్వతపత్రం విడుదల చేస్తే వాస్తవాలేమిటో ప్రజలకు అర్థమవుతుంది.

- అడుసుమిల్లి జయప్రకాష్ సెల్: 98481 28844