తొవ్వ ముచ్చట్లు - జయ ధీర్

రంగుల ముంగిలి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశం జిల్లా కొరిటిపాడు మండలం రావినూతలలో మా శిష్యుడి పెళ్లి. ఎండలు రావద్దంటున్నాయి. ‘రండి సార్! అదే రోజు మా ఇరవై ఎనిమిదవ పెళ్లిరోజు. మీరొస్తే బాగుంటుంద’ని నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ పిలుపు. అంతదూరం పోయినప్పుడు అదే ప్రాంతంలోని వేటపాలెం లైబ్రరీకి వెళ్లాల్సిందే. ఆ ఊరిలో మిత్రుడు సజ్జాని కలవకమానను. పైగా మనసు మూలన ఎక్కడో, తెనాలి పక్కనే ఉన్న గురువుపాలెం అనే చిన్న గ్రామంలో ఉంటున్న రాయల గిరిధర్ గౌడ్ వేసిన చిత్రాల జ్ఞాపకాలు.
చిత్రకారుడు గిరిధర్ దశాబ్దం కిందే ‘గ్రీష్మ గణపతి’ చిత్రం వేశాడు. ఆరు రుతువుల్లో ఆరుగురు వినాయకుల సీరీస్ చిత్రాలు పర్యావరణ కేంద్రకంగా చేసిన రంగుల ఆలోచన. గ్రీష్మ గణపతి చిత్రం గుర్తొచ్చి నా తెనాలి ప్రయాణంలో మరింత తాపం పెంచింది. బంగారు, బ్రౌన్, నలుపురంగు మిశ్రమ నేపథ్యంలో ఎండవేడికి తాళలేని గణపతి. ఉష్ణోగ్రత తాపతప్త గణపతి చిత్రం గుర్తొస్తున్నది. కవి క్రాంతిదర్శి అంటారు. వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రకారుడు కూడా అంతే. అందుకే గ్రీష్మ గణపతి బొమ్మ. గణపతి ఒక సంప్రదాయం. గ్రీష్మం మానవ జీవన యాత్రలో ఒక విడదీయలేని భాగం. సాంప్రదాయం, వాస్తవికతల జోడింపే గిరిధర్ కుంచె. సంప్రదాయం- గతం, పాతది అని కొందరు అంటారు. సంప్రదాయంలో కొన్ని మారనివి ఉంటాయి. మారేవీ ఉంటాయి. పౌరాణిక మూర్తులు, వారిని ఆవరించుకున్న భావన మారకపోవచ్చు. మార్చడానికి మానవ సృజనకు గట్స్ కావాలి. చిత్రకళా సాంప్రదాయిక భావన దానిని ఆమోదింపజేసుకోగలగాలి. ఎండ వేడికి గణపతి గొడుగు పట్టుకున్నట్టు చూపడం సమ్మతం అవుతుందా?
కాని, గ్రీష్మతాపం వల్ల అంటే ప్రకృతి విలయం వల్ల ఏర్పడిన సంకట స్థితిని చిత్రించడానికి సంప్రదాయం అంగీకరిస్తుంది. గొడుగు, కూలర్, ఏసి, ఐస్‌క్రీం వంటి ఆధునిక రూపాలను గణపతి చిత్రం నిరాకరిస్తుంది. దీని గురించి ఎవరూ ఎక్కడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సామాజికులకు అర్థమయ్యే రీతి రివాజు ఇది. దీనిని శక్తిమంతంగా ఉపయోగించుకుంటున్న కొద్దిమంది చిత్రకారులలో గిరిధర్ ఒకరు. ఐతే కొన్ని చిత్రాలతో మైమరపించి అబ్బో అనిపించేట్లుగా అన్ని చిత్రాలు అలానే ఉండాలని అనుకోవడం సరికాదు. రుతువులను కోల్పోతున్న కాలం ఇది. రుతువుల స్వభావంలో వస్తున్న మార్పులు గిరిధర్‌ని చాలాకాలంగా ఆలోచింపజేస్తున్నట్లున్నది. అందుకే ఆయా మారిన రుతువులలో సామాన్యుడి పరిస్థితిని చిత్రాలలో చిత్రిక పట్టాలని రంగుల వామనగుంటిని సిద్ధం చేస్తున్నానన్నాడు. రకరకాల కుంచెలను సిద్ధపరుస్తున్నాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘బారమాస’ రుతు సంహారాలను ఒడిసి పట్టాలనే తపనతో ఉన్నాడు. పల్లె తావులలో మనిషి బతుకులు, జీవన శైలులను బ్రష్షుల్లోంచి చూ సే పనిలో పడ్డాడు.
ఓ వైపు తనకోసం తనింట్లో ఆర్ట్ స్టూడియో నిర్మాణం. అందులో తనకి నచ్చిన ఇరవై తైలవర్ణ చిత్రాలతో మనకు ఓ రకంగా ప్రదర్శన శాల కడుతున్నాడు. చిత్రాలు వేయడం తప్ప మరే పనీ పెట్టుకోలేదు. తన చిత్రాలతో డబ్బులు సంపాదించడానికి మాత్రం సిద్ధంగా లేడు. అట్లని ఎవరైనా కొనడానికి ముందుకొస్తే కాదనడు. పెయింటింగుల్ని అంగటి సరుకు చేయడం ఇష్టం లేదు. గిరిధర్ ఆ రకంగా లోకం తెలియనివాడి కిందే జమ. మరెలా? అని ప్రశ్నిస్తే- నేను ఆర్టిస్ట్-కం-అగ్రికల్చరిస్టుని అంటాడు. వ్యవసాయంతో వచ్చే కొంత డబ్బు బతుకు అవసరాలు తీరుస్తుంది. దానివల్ల బతకడానికి భృతి లభిస్తుంది. కాని నాలోని కళాతృష్ణని ఆర్టిస్టు తీరుస్తాడు. ఇదే ముఖ్యం. ఇదే నా బతుకు అసలు ఆసరా అంటాడు. ఒకప్పుడు తెనాలిలో పద్య నాటకకర్తలు, రచయితలు, సినీ నటులే ఎక్కువ. ఇప్పుడైతే ఆధునిక చిత్రకారులు అక్కడ చాలా తక్కువ. గిరిధర్ వంటి వారు మరీ తక్కువ. ఆయన ఏ పని చేసినా దీక్షతో చేస్తాడు. అప్పుడప్పుడు సంజీవ్‌దేవ్‌ను గుర్తుతెచ్చుకుంటాడు గిరిధర్. తమ పుస్తకాలకు ముఖచిత్రాలు వేయించుకోవడానికి పెద్ద పెద్ద రచయితలు ఉవ్విళ్లూరుతుంటారు. పుస్తకం చదివి అర్థం చేసుకుని వేయడం గిరిధర్ ప్రత్యేకత. రేఖల్లో సంప్రదాయం, రంగుల్లో ఆధునికం. బొమ్మలో స్వచ్ఛత. మొత్తం ఫ్రేం విలక్షణ సృజనాత్మకత. ఈ లక్షణాలు గిరిధర్‌ని ఆర్టిస్టుగా నిలుపుతున్న శక్తులు. కాసుల కోసం ఆలోచనలు, ప్రచారం కోసం ఆర్భాటం ఏ రూపంలో కానరానితనమే. అతడంటే, ఆర్టిస్టుగా కంటే మనిషిగా నాకు అభిమానం.
ఎండిన పొలాలు, పారడం ఆగిన కాలువలు, ఎండకి దుమ్ము రేగే వీధులు దాటి గిరిధర్ ఇంటి గేటు లోనికి ప్రవేశించగానే పక్షుల పలకరింపులు. గత వైభవ ప్రతీకలుగా షెడ్డుల్లో పాత కార్లు. ఆ చిన్న సందులోంచి తలెత్తి చూస్తే పాత ఇల్లు. భార్య, పిల్లలు. పనిచేస్తూ ముసలి తల్లి రండని ఆహ్వానం. కాస్త ఆ పక్కకి చూస్తే కొత్తగా తయారవుతున్న స్టూడియో- కం- గేలరీ. పల్లెతనపు మిలమిలలు అతని కళ్ళలో. చిత్రకారుడినన్న అహంభావం లేని స్వభావం. వస్తారా మాతో పెళ్లికి అని అడిగాడు దుర్గాప్రసాద్. అంత ఎండని లెక్కచేయకుండా చేతిలోని పనిని వదిలేసి చెప్పులేసుకున్నాడు. ఓ నాలుగు గంటలు రంగులూ, కుంచెలూ, కొన్ని ఫ్రేముల గురించి కాలక్షేపం.
లోగడ దశావతారాల సీరీస్, కృష్ణావతారం సీరీస్, బుద్ధుడి బొమ్మల ప్రదర్శనల వరసలు, అమ్మ పేరుతో సోలో ప్రదర్శనలు. కర్నాటకలో డిగ్రీ, బరోడా (గుజరాత్)లో ఎం.ఎ., అక్కడ చేస్తున్న అధ్యాపక ఉద్యోగానికి బైబై చెప్పి పల్లెకి తిరుగుముఖం.
ప్రతిదీ మార్కెట్ అవుతున్న కాలంలో మార్కెట్‌కి అనువైన చిత్రకళని సరుకుగా మార్చడానికి గిరిధర్ సిద్ధపడితే రాజధానుల్లో అత్యాధునిక వసతులతో జీవించేవాడు. కళకి ఒక అస్తిత్వం, ఆత్మగౌరవం ఉంది. దానిని ఆర్టిస్టే కాపాడాలనే అతని భావన. అది ఎంతో ఉదాత్తమైనది. ఆకర్షణీయమైనది. చెప్పడం సరిగా రావడం లేదు. కానీ, గిరిధర్ బతుకులో ఒక అనిర్వచనీయ ఆకర్షణ. ఎం.ఎఫ్.హుస్సేన్, తోట వైకుంఠం, లక్ష్మీగౌడ్ వంటివారిలో దాగిన బోళాతనం. కళా సౌందర్య పిపాస ఆర్టిస్ట్‌కు ఒక వరం. అందుకే చిత్రకళామతల్లికి ఆ లేలేత వర్ణ సమ్మేళనం అంటే ఇష్టం.
గిరిధర్ రంగుల ముంగిలి ఇంకా చిన్నదే. దానిలోకి చేరవలసిన కొత్త అలలు అనేకం. అవి ప్రయోగాలు కావచ్చు. సంప్రదాయాలు కావచ్చు. కొత్త చిత్రకళకి ఆక్సిజన్ కావచ్చు. కొత్తగా విభజింపబడిన రాష్ట్రంలో చిత్రకళా రంగానికి అతని చేయూత అవసరం. ఆ ప్రాంతంలో లలితకళా విశ్వవిద్యాలయం ఏర్పడాలి. మొదట ఆ ప్రాంతంలో లలితకళల కోసం ప్రత్యేక కళాశాల ఏర్పాటు కావాలి. గిరిధర్ ఆలోచనలు అటువైపుగా మరలాలని కూడా అనిపిస్తుంది.

* -జయధీర్ తిరుమలరావు సెల్ : 99519 42242