సంపాదకీయం

శ్రమజీవన యోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంతర్జాతీయ యోగ దినోత్సవం’ భారత జా తీయ విజయం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం సాధించగలిగిన సాంస్కృతిక విజయం. బుధవారం నాడు మన దేశంలోను దాదాపు అన్ని విదేశాలలోను కోట్లాదిమంది జరిపే యోగ విద్యా విన్యాసాలు మానవీయ సంస్కారానికి మాసిపోని ప్రతీకలు! ‘యోగం’ సాంస్కృతిక ప్రపంచీకరణ- కల్చరల్ గ్లోబలైజేషన్-కు చిహ్నం. ‘వాణిజ్య ప్రపంచీకరణ’- కమర్షియల్ గ్లోబలైజేషన్- వైరుధ్యాలను విస్తరింప చేస్తోంది. ‘యోగం’ ద్వారా విస్తరిస్తున్న ‘సంస్కార ప్రపంచీకరణ’ వైరుధ్యాలను తొలగించి వైవిధ్య దేశాల మధ్య, జాతుల మధ్య సమన్వయం ఏర్పడడానికి దోహదం చేస్తోంది. రెండున్నరేళ్ల క్రితం మన ప్రభుత్వం ‘అంతర్జాతీయ సమాజం యోగాభ్యాసం చేయాల’ని ప్రతిపాదించినప్పుడు ఐక్యరాజ్య సమితిలో నూట డెబ్బయి ఏడు దేశాల ప్రతినిధులు ‘సహ ప్రతిపాదకులు’- కోస్పాన్సర్స్- కావడం సమన్వయ సంస్కారానికి చారిత్రక సాక్ష్యం. ‘చైనాను చూసి నేర్చుకోవాలి’ అనడం నడుస్తున్న చరిత్ర. ‘ఇంగ్లాండ్‌ను చూసి నేర్చుకోవాలి’ అని ‘బారిస్టర్ పార్వతీశం’ వంటివారు ప్రకటించడం గతం. ‘్భరత్‌ను చూసి నేర్చుకోవాలి’ అని ప్రపంచదేశాలు భావిస్తుండడం రూపొందుతున్న అంతర్జాతీయ జీవనం! సుదూర గతంలో ప్రపంచ దేశాల వారు భారత్ నుంచి ‘మానవ సంస్కారం’ నేర్చుకున్నారు. శతాబ్దుల త రబడి ఈ సంప్రదా యం అంతరించిం ది. ఇప్పుడు మళ్లీ ఇలా అంకురించడం ‘యోగం’!
ఇలా అంతర్జాతీయ యోగ దినోత్సవం భారతీయ సంస్కార ప్రభావ విస్తరణకు చారిత్రక పునరావృత్తం. ‘యోగం’ అంటే కలయిక, సంయోగం మంచి కలయిక. యోగం సృష్టి నిహితమైన నిరంతర శ్రమ జీవనం. నియతంగా నిర్నిరోధంగా అవిశ్రాంతంగా సాగిపోతున్న శ్రమ జీవనం సృష్టిని సృష్టిగా కలిపి ఉంచుతోంది. ఈ సృష్టిగత సత్యాన్ని అనాదిగా సమాజ స్థితం చేసుకున్న సంస్కారం పేరు సనాతనం, అజనాభం, భరత వర్షం, హిందుత్వం. సృష్టికి సహజమైన యోగం ఇలా భారతీయ వౌలిక సంస్కారమైంది. కర్మయోగం విచక్షణతో కూడ భారతీయ జీవన స్వభావమైంది. యోగం శ్రమజీవనం. క్షణమాగకుండా యుగయుగాలుగా తిరుగుతున్న, పరిగెత్తుతున్న భూమి శ్రమ జీవన స్వేద జలాలను సృష్టించి మానవాళికి, జీవజాలానికి ప్రాణం పోస్తోంది, అన్నం ప్రసాదిస్తోంది. భూమాత ఆత్మ ప్రదక్షణం వల్ల ‘కాలం’ కదలుతోంది, రాత్రింబవళ్లు ఏర్పడుతున్నాయి. భూమి సూర్యునికి చేస్తున్న ప్రదక్షణం వల్ల రుతువులు ఏర్పడుతున్నాయి. ‘రుతం’ విశ్వవ్యవస్థను నడిపిస్తున్న, పరుగులు తీయిస్తున్న చోదకశక్తి. స్వకుటుంబంతో కలసి సూర్యుడన్న నక్షత్రం కూడ అంతరిక్షంలో నిర్ణీత కక్యలో నిరంతరం పరిభ్రమిస్తున్నాడు. అసంఖ్యాక ‘తారలు’ అనంతకోటి బ్రహ్మాండాలు నిరంతరం తిరుగుతున్నాయి. చోదకశక్తి ‘రుతం’. ఇలా తిరగడం వల్లనే నిరంతరం విశ్వవ్యవస్థ నిలిచి ఉంది, కలసి ఉంది. ‘కలయిక’కు ప్రాతిపదిక నిరంతర శ్రమ, తిరగడం, పరిగెత్తడం, పరిక్రమించడం.. ఇదీ సృష్టిగత శ్రమజీవన యోగం. ఈ సృష్టిగత యోగం సమాజ స్థితంగా మారి కర్మయోగమైంది. ఇదీ మానవ జీవన స్వభావం. శాశ్వతమైన అంటే సనాతనమైన- ఎటర్నల్- సహజ సంస్కారం.
జీవన క్రియాశీలతలో నైపుణ్యం సాధించడం ‘యోగం’.. ‘యోగః కర్మ సుకౌశలమ్’- అన్న సంస్కారం మానవుడిని కర్మయోగం చేస్తోంది. ఈ కుశలత్వం బౌధికమైనది, మానసికమైనది, శారీరకమైనది. భౌతిక ప్రగతి, బౌద్ధిక సుగతి ఈ శ్రమజీవన ఫలితం. యోగసాధన శరీర శ్రమ బౌద్ధిక శ్రమ. అంతకుమించి సూర్యోదయానికి ముందు నిద్ర లేవడం గొప్ప మానసిక శ్రమ. తులసి మొక్కకు రోజూ కొంచెం నీరు పోస్తుండడం నిరంతర శ్రమకు సంకేతం. మొక్క క్రమంగా ఎదిగిపోతుంది, పరిమళ దళాలతో విస్తరిస్తుంది. ఐదారు రోజులు నీరు పోయకపోతే తులసిమొక్క వాడుతుంది, పది పదిహేను రోజులకు మొక్క మోడయిపోతుంది. నియమం తప్పని సమయం తప్పని శ్రమ- యోగం. ప్రతిరోజూ ప్రాణాయామం, వ్యాయా మం, సూర్య నమస్కారాలు, ఆసనాలు నియతంగా సూర్యోదయానికి పూర్వం లేదా ప్రభాత సమయంలో అభ్యసించడం యోగ స్వరూపం. మానసిక బౌద్ధిక శారీరక శ్రమ శక్తులు ఆత్మచైతన్యంతో అనుసంధానం కావడం స్వభావం. ఈ నిరంతర ప్రక్రియ వల్ల తులసి మొక్క క్రమంగా ఎదిగినట్టు శరీరం ఎదిగి గట్టిపడుతుంది, బౌద్ధిక పటిమ పెరుగుతుం ది. మానసిక స్థిర త్వం ఏర్పడి పురుషుడు ఉత్తమ పురుషుడు కాగలడు. ఈ క్రమం తప్పినవారు పొట్ట పెరిగి, జుట్టు నెరసి అడ్డంగా విస్తరిస్తారు, బుద్ధి దురాలోచనలకు నిలయంగా మారుతుంది. మనస్సు నిలకడ లేక మానవ జీవనం మోడువారిన తులసి మొక్క అవుతుంది. అందువల్ల అన్నం తినడం వలె యోగాభ్యాసం ఆజీవన వ్రతం కావాలి. ఇదంతా శ్రమజీవన సౌందర్య సుగంధం. ‘సాగిన శ్రమ సాధించిన భోగము సంస్కృతి యోగము, ఆగిన శ్రమ దుష్ఫలితం సంప్రాప్తించిన రోగము’ అన్నది ప్రాకృతిక వాస్తవం.
యోగం ఇలా సనాతన మానవ జీవన శాస్త్రం. ‘మంచి క్రియకు మంచి ఫలితం’ అన్నది ఈ శాస్త్రం. ఈ యోగ ప్రక్రియ విస్తృతి కర్మయోగం, మంచి పనికి మంచి లక్ష్యం. ఇది అనాదిగా భారతీయ మహర్షులు దర్శించిన వేదం. పతంజలి వంటి కలియుగ మహర్షులు సహస్రాబ్దులకు పూర్వం వివరించిన ఆరోగ్య మార్గం. ఆరోగ్యం మానసికం, శారీరకం.. యమము, నియమము, ఆసనాలు, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి- అన్నవి యోగాభ్యాసంలోని ఎనిమిది క్రమానుగత సమాంతర ప్రక్రియలు. ఈ ‘అష్టాంగ యోగా’న్ని విపులీకరించిన వాడు పతంజలి మహర్షి. అభినవ పతంజలి వంటి వివేకానంద స్వామి ఆకాంక్షించిన ‘ఇనుప కండరాల ఉక్కు నరాల వజ్ర సంకల్ప’ యువజనులు రూపొందడానికి మార్గం యోగం. మనిషిని మానవ సంస్కారాలతోను, జీవజాలాన్ని విశ్వవ్యవస్థలోను నిరంతరం అనుసంధానం చేస్తున్న చైతన్యం ‘యోగం’..