మిర్చిమసాలా

ఎలుకలను పడితేనే ఓట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చే నేతలకు తమ ప్రాంతంలో రోడ్డు వేయించాలనో, విద్యుత్తు దీపాలు వేయించాలనో, పార్కు, లైబ్రరీ, కమ్యూనిటీ హాలు కావాలనో ప్రజలు కోరుతుంటారు. కాగా పశ్చిమ్ బంగాలోని సుందర్బన్ ప్రాంతానికి చెందిన ఓటర్లు మాత్రం ‘ఎలుకలను పట్టగలరా?, కొట్టగలరా?’ అని ప్రశ్నిస్తున్నారు. సుందర్బన్‌లో ప్రజల కంటే ఎలుకల సంఖ్యే ఎక్కువ ఉందట. పంటలను, ఇంట్లో వస్తువులను తినేస్తున్నాయి. ఎన్ని చంపినా, అంతకు రెట్టింపు పుట్టుకొస్తున్నాయట. దీంతో ప్రచారానికి వస్తున్న నాయకులను స్థానికులు ఈ ప్రశ్నలు వేయడంతో వారి గుభేలుమంటున్నాయట. ఎలుకలను కొట్టి ఓట్లు పొందాలంటే మామూలు విషయం కాదు. ఎవరెవరు ఎన్ని ఎలుకలను కొడతారో? ఎన్ని ఓట్లు పొందుతారో చూద్దాం.
- వి. ఈశ్వర్ రెడ్డి

పదవులు ఊరికే వస్తాయా..!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం రెండోదఫా.. అందునా సొంత బలంతో అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ముప్పవరపు వెంకయ్య నాయుడు వైఖరిలో మార్పు వచ్చిందంటున్నారు. ఇంతకీ ఏమిటయ్యా ఆ మార్పు అంటే.. పదవులు ఆశించి తన వద్దకు వచ్చేవారిని ముందుగానే గమనించే మేధస్సు కలిగిన నాయుడు గారు ఆ వచ్చినవారు నోరెత్తకుండానే చిన్నగా క్లాస్ పీకుతుంటే ఇక వారు గుట్టుచప్పుడు కాకుండా వెనక్కు ఉడాయిస్తున్నారు. ఇక ఈవిధమైన క్లాస్ ప్రతిసారీ పీకటం ఎందుకులే అనుకున్నారేమో కాని.. తాజాగా విజయవాడలో కెబిఎన్ కళాశాలలో జరిగిన విద్యార్థుల సమావేశంలో తాను చెప్పాల్సింది చెప్పేశారాయన. అడిగితే పదవులు రావు.. వాటంతటవే తమను వెతుక్కు రావాలంటే ముందుగా ఎలా కష్టపడాలో కూడా నాయుడుగారు చెప్పేస్తున్నారు. ‘నేను ఓ కుగ్రామంలో అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా స్తంభాలు, చెట్లకు జెండాలు కట్టాను. గోడలపై నినాదాలు రాశాను. సీనియర్ నేతలు అద్వానీ, వాజపేయి నెల్లూరు వస్తున్నారంటే గుర్రపు బండిలో మైక్ పట్టుకుని ప్రచారం చేశాను. ఇలా కష్టపడబట్టే ముఖ్యంగా పార్టీలో అన్ని పదవులు చేపట్టి జాతీయ అధ్యక్షునిగా అదే వాజపేయి, అద్వానీల మధ్య కూర్చోగలిగాను. ఇదీ నా విజయ రహస్యం!’. ఇలా పరోక్షంగా పదవులనాశించే కార్యకర్తలు, నాయకులకు వెంకయ్య కుండబద్దలు కొట్టినట్లు చెబుతుంటే ఎవరైనా ఆయన వద్దకు వెళ్లి పదవులు అడగగలరా..?
- నిమ్మరాజు చలపతిరావు

సికిందరాబాద్‌కు నిరాశ.?
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రంగావున్న సికిందరాబాద్ నుంచి ప్రతి రోజూ 230 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. 120 ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లతోపాటు 110 ఎంఎంటిఎస్ సర్వీసులు లక్షా 50వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అంతే కాకుండా నగర ట్రాఫిక్ సమస్యకు దోహదపడుతున్నాయి. దేశంలోని ఇతర రైల్వే స్టేషన్లతో పోలిస్తే..సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌కు మొదటి నుంచి దక్షిణ మధ్య రైల్వే ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తోంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రులు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సహా ఉన్నతాధికారులు, అధికారులు సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛత గురించి మాట్లాడని సమావేశమంటూ, ప్రస్తావించని వేదికంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సికిందరాబాద్‌లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిసరాల శుభ్రత, ప్రయాణికులకు భద్రత, మెరుగైన సౌకర్యాలు వంటి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది. అయినా సికిందరాబాద్‌కు ఏ కేటగిరిలో స్థానం దక్కకపోవడం గమనార్హం.
-సయ్యద్ గౌస్‌పాషా

నిండామునిగిన పడవ!
తెలంగాణలో టిడిపి రోజు రోజుకు అదృశ్యం అవుతోంది. ఒకప్పుడు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ఐదవ స్థానానికి పడిపోయింది. టిఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బిజెపిల తరువాత ముగ్గురు సభ్యులతో టిడిపిది ఐదవ స్థానం. 15 ఎమ్మెల్యేలు గెలిస్తే, మిగిలింది ముగ్గురు. ముగ్గురిది ఎవరి దారి వారిదే. పార్టీ పరిస్థితి రోజు రోజుకు ఇలా మారిపోతున్నా మాటల్లో వేడి మాత్రం తగ్గలేదు. టిఆర్‌ఎస్ మునిగిపోతున్న పడవ అంటూ పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. నిండామునిగిపోయిన టిడిపికి అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ మునిగిపోతున్ననావలా కనిపించడం ఏమిటో అని విన్నవాళ్లు విస్తుపోయారు.
- మురళి

చెప్పేవాడికి...!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల లండన్ పర్యటన గురించి శాసనసభలో వివరించారు. అంతా చాలా ఆసక్తిగా ఆయన సందర్శించిన ప్రదేశాలు, స్థలాలు, వ్యక్తులు గురించి వింటున్నారు. తనదైన శైలిలో చంద్రబాబునాయుడు తాను లండన్ ఆర్టు గ్యాలరీలోని అమరావతి ఎన్‌క్లోజర్‌కు వెళ్లానని చెప్పారు. అంత వరకూ బాగానే ఉంది. అమరావతి ఎన్‌క్లోజర్‌లో ఆనాటి పరిస్థితులు కళ్లకుకట్టినట్టు ఉన్నాయని అంటూనే ఆ రాజుల కాలంలోనే పాకిస్తాన్‌కు, బంగ్లాదేశ్‌కు, భారత్‌కు ఉన్న సంబంధాలు చాలా ప్రస్ఫుటంగా వివరించారు అని కూడా ఉటంకించారు. అంతే ప్రెస్ గ్యాలరీ నుండి రాజుల కాలంలో పాకిస్తాన్ ఎక్కడా? బంగ్లాదేశ్ ఎక్కడా అంటూ ప్రశ్నలు రావడటమే తరువాయి...చెప్పేవారికి వినేవాడు...అంటారు కదా..అంతే!
- బి వి ప్రసాద్