సంపాదకీయం

కదలిక లేని కశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-పిడిపి-అధినేత్రి ముఫ్తీమెహబూబా చేపట్టడానికి భారతీయ జనతాపార్టీ వారు అంగీకరిస్తారా? అన్నది ఊహాగానాలకు శ్రీకారం. ‘‘తమరు తప్ప ఆ పదవిని నిభాయించడానికి మరెవ్వరూ అర్హులు కారు...తమంత వారు తమరే!’’ అని ముఫ్తీ మెహబూబాను భాజపా వారు బతిమాలుకొంటున్నారన్నది ఈ ఊహాగానాలలో ప్రస్తుత ఘట్టం. పరాకాష్ఠ స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయన్నది రాజకీయ కుతూహలగ్రస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఉత్కంఠ! ఇదంతా కూడ పిడిపి వారు తమ ప్రాబల్యం పెంచుకొనడానికై సాగిస్తున్న ప్రహసనం. వ్రతం చెడివున్న భాజపా వారికి ఫలితం దక్కదేమోనన్నది మరో వైపున సాగిపోతున్న ప్రచారం. జాతీయ సమైక్య పరిరక్షణ పట్ల సడలని నిష్ఠ గల భాజపా వారు జమ్మూకశ్మీర్‌కు స్వయం పాలన కోరుతున్న పిడిపితో జట్టుకట్టడం ‘వ్రతం చెడడం..’ గత ఏడాది మార్చి ఒకటవ తేదీన పిడిపి అధినేత ముఫ్తిమహమ్మద్ సరుూద్ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని మరోసారి అధిరోహించడానికి ఈ జట్టు కట్టడం దోహదం చేసింది. ఈ నెల ఏడవ తేదీన 79 ఏళ్ల ముఫ్తి మరణించడంతో ఆయన కుమార్తె ముఫ్తీ మెహబూబా ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడం ఖాయమని ప్రచారమైంది. కానీ మెహబూబా పదవిని స్వీకరించలేదు. 23 రోజులుగా ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉండడం పాలనా శూన్య స్థితికి నిదర్శనం. ఇటీవల మెహబూబా ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేసిందన్న వార్తలు కూడ వెలువడినాయి. భారతీయ జనతాపార్టీతో పిడిపి తెగతెంపులు చేసుకుంటున్నదని ప్రస్తుతం ఊపందుకుంటున్న ఊహాగానం. అదే జరిగినట్లయితే జమ్మూకశ్మీర్‌లో రాజకీయ ప్రత్యామ్నాయాలు ఏవన్న విషయంపై కూడ విశే్లషణలు కొనసాగుతున్నాయి. గవర్నర్ పాలన విధించిన తరువాత రాష్ట్ర శాసనసభకు మధ్యంతరంగా ఎన్నికలు జరిగిపోనున్నాయన్నది కొందరు విశే్లషకుల వాదం. దేశమంతటా అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు ఐదేళ్లకోమారు జరుగుతుండగా జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఆరేళ్లకోమారు జరుగుతున్నాయి. రాజ్యాంగంలోని 370వ అధికరణం ప్రకారం జమ్మూకశ్మీర్‌కు లభిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి ఫలితం ఇది. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తరువాత, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యాంగానికి అనేక సవరణలు చేయించింది. రాష్ట్రాల శాసనసభల కాల వ్యవధిని, లోక్‌సభ కాల వ్యవధిని ఐదు నుంచి ఆరు సంవత్సరాలకు పెంచడం ఆ సవరణల్లో ఒకటి. ఈ స్ఫూర్తితో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం వారు కూడ తమ ప్రత్యేక రాజ్యాంగంలోని యాబయి రెండవ నిబంధనను సవరించారు. తమ శాసనసభ కాల వ్యవధిని కూడ ఆరేళ్లుగా నిర్ధారించారు. అత్యవసర పరిస్థితి ముగిసిన తరువాత మురార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఏర్పడిన జనతా ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మళ్లీ సవరించి లోక్‌సభ కాలవ్యవధిని శాసనసభల కాల వ్యవధిని యథాపూర్వకంగా ఐదేళ్లకు పరిమితం చేశారు. కానీ జమ్మూకశ్మీర్ రాజ్యాంగానికి మళ్లీ ఇలాంటి సవరణ జరగలేదు. అందువల్ల జమ్మూకశ్మీర్ శాసనభ కాల వ్యవధి ఆరేళ్లు...ఇదీ ప్రత్యేకత.
ఈ ప్రత్యేకతను విపరీతంగా విస్తరించడానికి ఫరూక్ అబ్దుల్లా, ఉమర్ అబ్దుల్లా అనే మాజీ ముఖ్యమంత్రుల నాయకత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా నేతృత్వంలోని పిడిపి వారు ఏళ్ల తరబడి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం భాజపా-పిడిపి కూటమి కూలబడి ఉండటానికి పిడిపి వారు కోరుతున్న విస్తృత ప్రతిపత్తి కూడ ఒక కారణం కావచ్చు. అనేక ఇతర విభేదాలు, వైరుధ్యాలు కూడ ప్రచారం అవుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణం ప్రసాదిస్తున్న ప్రత్యేక ప్రతిపత్తి కారణంగానే జమ్మూకశ్మీర్‌కు మరో ప్రత్యేక రాజ్యాంగం, మరో ప్రత్యేక పతాకం ఏర్పడి ఉన్నాయి. గత ఏడాది మార్చిలో భాజపాతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుంచి పిడిపి వారు ఈ ప్రాంతీయ పతాకానికి, జాతీయ పతాకంతో సమాన స్థాయిని కల్పించడానికి యత్నిస్తున్నారు. ఈ వివాదం న్యాయస్థానాలకెక్కింది. వ్రతం చెడిన భాజపా వారు పరమశివుడు హాలాహలాన్ని మింగినట్టు ఈ వివాదాన్ని మింగలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదంతా ప్రత్యేక ప్రతిపత్తి ఫలితం. కానీ నేషనల్ కాన్ఫరెన్స్ వారు 1990వ దశకం నుంచీ జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కోరుతున్నారు. విచ్ఛిన్న ప్రస్థానంలో ముందుండాలన్న తపనతో పిడిపి వారు జమ్మూకశ్మీర్‌కు స్వయం పాలనను కోరుతున్నారు. ఈ స్వయం పాలనను మొదట ప్రస్తావించింది పాకిస్తాన్ మాజీ నియంత పర్వెజ్ ముషార్రఫ్. 2008 నుంచి ఆయన మాటలు పిడిపి వారి నోట ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ స్వయంపాలన సిద్ధాంత పత్రంలో పిడిపి వారు పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్-పిఒకె-ను పాకిస్తాన్ పాలిత కశ్మీర్-పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్-గా పేర్కొన్నారు. ఇది పాకిస్తాన్ పట్ల పిడిపికి గల భక్తికి నిదర్శనం. పోటీలో మరింత ముందుకెళ్లిన ఫరూక్ అబ్దుల్లా పార్టీ వారు పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌కే వదలిపెట్టాలని కోరుతున్నారు. ఇదంతా జమ్మూకశ్మీర్‌లోని వర్తమాన వైపరీత్యం..పిడిపి, భాజపా కూట మి కూలమబడి ఉండడానికి ఇదంతా నేపథ్యం...
పిడిపితో భాజపా జట్టు కట్టడం జాతీయ సమైక్యానికి భంగకరమైన విపరిణామం. అయితే భాజపా సాహచర్యంతో ప్రభావితమైన పిడిపి తన స్వయంపాలన తదితర విచ్ఛిన్న విధానాలను విడనాడగలదని జాతీయతా ప్రధాన స్రవంతిలో కలిసిపోతుందని కూడా గత ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రచారమైంది. పిడిపిలో అలాంటి పరివర్తన వచ్చిన సూచనలు మాత్రం ప్రస్ఫుటించలేదు. సంకీర్ణ ప్రభుత్వం అధికార బాధ్యతను స్వీకరించిన తొలి రోజుననే ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ పాకిస్తాన్ అనుకూల ప్రకటనలు చేశాడు. ఆ తరువాత భాజపా, పిడిపి నాయకుల మంత్రులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తూనే ఉండడం ముఫ్తి మహమ్మద్ సరుూద్ మరణం వరకు కొనసాగిన కథ. భారత రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయబోమని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరి 25న రాజ్యసభలో ప్రకటించడంతో, పిడిపి ఒత్తడికి ఆదిలోనే లొంగిపోయిందన్న అపకీర్తిని మాత్రమే భాజపా మూటకట్టుకుంది. 2008లో ఆవిష్కరించిన స్వయంపాలన విధానాన్ని మాత్రం పిడిపి రద్దు చేసుకోలేదు. భాజపా ప్రభావితం చేయగలిగిందా? ప్రభావితమైపోయిందా? గత ఏడాది కుదిరిన ఒప్పందంలోని అంశాలకు విరుద్ధంగా ముఫ్తీ మెహబూబా కొత్త కోరికలు కోరుతుండడం వల్ల మాత్రమే కూటమి కూలబడింది. రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది.
కేంద్ర ప్రభుత్వం మొదటి విడతగా ఈ ఏడాది అభివృద్ధి చేయనున్న ఇరవై లావణ్య నగరాల జాబితాలో జమ్మూకశ్మీర్‌కు చోటు లభించలేదు. హేమంత రాజధాని జమ్మును, వసంత రాజధాని శ్రీనగర్‌ను లావణ్య నగరాల జాబితాలో చేర్చాలన్న పిడిపి కోరికను కేంద్రం అంగీకరించలేదన్న ప్రచారం జరుగుతోంది. కాని కూటమిలో కలతలకు ఇలాంటివి కారణాలు కాదు. కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి వదలిపెట్టాలని పిడిపి కోరుతోందట. అంటే కశ్మీర్ నుంచి సైనిక దళాలను అనుబంధ సైనిక దళాలను ఉపసంహరించుకోవాలన్న మాట...్భజపా అంగీకరించదు.